ఈ సంవత్సరానికి లెనిన్ అమరుడై నూరేళ్లు అవుతున్నది. లెనిన్‌ను స్మరించుకోవడం అంటే సోవియట్ యూనియన్ గురించి, బోల్షివిక్ విప్లవం గురించి, ఒక కొత్త సామాజిక క్రమం గురించి, వలస పాలనల విముక్తి గురించి, శ్రామికులకు ఉత్పత్తి సాధనాల మీద ఆధిపత్యం గురించి మాట్లాడుకోవడం. అయితే ఇప్పుడు ఆ విషయాలు ప్రస్తావించడం లేదు. లెనిన్ చేసిన కృషిలో చాలా మందికి అంతగా తెలియని రెండు విభిన్న అంశాలున్నాయి. అవి 1. విద్యుత్ రంగం, దాని సామాజిక పాత్ర 2. సైన్స్ తాత్వికత. ఈ రెండు విషయాలలో లెనిన్ సొంత అభిప్రాయాలను కలిగి ఉండటమే కాదు, నాటి తరాల అభిప్రాయాలను మలచడంలో కీలక పాత్ర వహించాడు. ఇప్పటికీ, లెనిన్ అభిప్రాయాలకు ఒక ప్రాసంగికత ఉంది.
సోవియట్ యూనియన్‌లో జరగాల్సిన పారిశ్రామిక అభివృద్ధిని, వ్యవసాయక అభివృద్ధినీ ఆయన విద్యుత్‌తో ముడిపెట్టి చూశాడు. సోవియట్టూ, విద్యుదీకరణా జత కలిస్తే, అది సోషలిజమే అని ఆయన ప్రకటించాడు. ఇదొక నినాదం కాదు. ఆర్థిక వ్యవస్థకు, ఉత్పత్తి శక్తులకు, విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉండే ఒక లోతైన సంబంధంగా ఆయన దీన్ని చూశాడు. శాస్త్ర సాంకేతికాలకు, ప్రజా సంఘాలకు (సోవియట్లు) మధ్య సంబంధంగా కూడా చూశాడు. ఇది మొదటిది.
ఇక రెండవది క్వాంటం, సాపేక్షతా సిద్ధాంతాలు. అప్పుడప్పుడే ముందుకు వచ్చిన నూతన భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు ఇవి. అప్పటి సాంప్రదాయక భౌతిక శాస్త్రానికే కాక, తత్వ శాస్త్రాలకు కూడా ఇవి సవాలు విసిరాయి. దీంతో అప్పటి తత్వవేత్తలలో చీలికలు వచ్చాయి. చాలామంది మార్క్సిస్టులు కూడా సాపేక్ష సిద్ధాంతాలను, క్వాంటం యాంత్రిక శాస్త్రాన్ని బూర్జువా పెడ ధోరణిగా చూశారు. అయితే లెనిన్ గతితార్కిక భౌతిక వాద చట్రం లోకి వీటిని ఏ విధంగా తేవాలి అనేది ఆలోచించడమే కాక, అసలు ఈ చట్రాన్ని కూడా ఏ విధంగా విస్తరించవచ్చో ఆలోచించాడు. ‘భౌతిక వాదము-అనుభవవాద విమర్శ’ అనే ప్రఖ్యాత పుస్తకంలో కానీ, సొంత నోట్స్‌గా రాసుకున్న ‘ఫిలసాఫికల్ నోట్‌బుక్’లో గాని ఇవి కనిపిస్తాయి. కానీ లెనిన్ 53 ఏళ్ళ వయసుకే చనిపోవడంతో, ఆ ఆలోచనలు అసంపూర్ణంగా ఆగిపోయాయి.
ఇప్పుడు విద్యుదీకరణ కథ గురించి రేఖామాత్రంగా పరిశీలిద్దాం. 1918లో బోల్షివిక్ విప్లవం జరిగినప్పుడు, రష్యాలో ఉత్పత్తి అయిన విద్యుత్ శక్తి 4.5 మెగావాట్లే. అది మహా అంటే కొన్ని నగరాలకు సరిపోయేది. అయితే, విద్యుదీకరణ జరగకుండా పరిశ్రమలు గానీ, వ్యవసాయం కానీ ముందుకు పోలేవు. నీటిపారుదల వ్యవస్థలు ముందుకు పోవాలన్నా, వ్యవసాయానికి పనిముట్లు తయారు కావాలన్నా విద్యుత్ శక్తి ఉండాల్సిందే. వీటన్నింటికీ అవసరమైన యంత్రాలను దిగుమతి చేసుకోవడం కాదు, వాటిని ఉత్పత్తి చేసుకోవాలి. అందుకే సోవియట్ల శక్తికి తోడుగా విద్యుదీకరణ జరిగితేనే సోషలిజమైనా, కమ్యూనిజమైనా అని లెనిన్ భావించాడు. పారిశ్రామికీకరణ మొదట జరగాల్సింది విద్యుత్ రంగంలోనే. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ముందుకు తెచ్చిన దేశవ్యాప్త విద్యుదీకరణ పథకాలకు కమ్యూనిస్టు పార్టీ ఆమోద ముద్ర వేసింది. కొమిన్‌టన్ మూడో కాంగ్రెస్ (జులై 19-21)లో బోల్షివిక్ విప్లవానికి, దేశ విద్యుదీకరణ ఎంతో ముఖ్యం అన్న అవగాహనను లెనిన్ పునరుద్ఘాటించాడు. అలాగే, వ్యవసాయాన్ని పునర్వ్యవస్థీకరించగలిగిన ఒక విస్తృతమైన యంత్ర పరిశ్రమ ఉండాలని, సోషలిజానికి అవసరమైన ఒక భౌతిక ప్రాతిపదికను అది సమకూరుస్తుందని ఆయన భావించాడు. రష్యాలో ఉన్న, 200 మంది ఉద్దండ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వ్యవసాయ శాస్త్రవేత్తల వైజ్ఞానిక కృషితో విద్యుదీకరణ ప్రణాళికకు పూనుకున్నాడు. ఇందుకోసం 1921లో ‘ఆల్ రష్యా ఇంజనీర్స్ కాంగ్రెస్’ను నిర్వహించాడు. అందులో ఈ ప్రణాళిక సంపూర్ణంగా చర్చించబడిన తర్వాతే, ప్రభుత్వ ఆమోదానికి వెళ్ళింది.
కానీ, బూర్జువా పండితులు, ఆధునికానంతర వాదులు (పోస్ట్ మాడ్రనిస్టులు), లెనిన్‌ను ఒక యాంత్రిక భౌతికవాదిగా చిత్రించే ప్రయత్నం చేశారు. సైన్సును సాంకేతిక వినియో గాలకే లెనిన్ కుదిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ సాంకేతిక పనివారికి, రైతులకు మధ్య ఒక గట్టి సంబంధాన్ని లెనిన్ స్థిరపరిచాడు. రష్యా సత్వర పారిశ్రామికీకరణకు, వ్యవసాయ విస్తరణకూ సైన్సును ఒక కీలక అంశంగా లెనిన్ వాడాడు.
విప్లవ శక్తులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కలసిమెలసి పని చేసిన సందర్భం అది. విద్యుదీకరణ కోసం హైడ్రో టర్బైన్‌లను ఉత్పత్తి చేయాలి. అంటే, అది పారిశ్రామిక శక్తిని సంతరించుకోవడం కూడా. ప్రజలకు విద్యుత్తును అందించడమే కాదు. డ్యాములు వ్యవసాయానికి అవసరమైన నీళ్లనూ ఇస్తాయి. అంటే ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల చుట్టూ కార్మికుల, రైతుల ఐక్యత నిర్మింప బడుతుంది. పెద్ద పారిశ్రామిక పురోగమనానికి పునాదిగా విద్యుదీకరణ ఉపయోగపడింది. వర్కర్ల, సాంకేతిక నిపుణుల కేడర్‌ను ఇది సృష్టించింది. సోవియట్లు, విద్యుత్తు అనే రెండు మాటలు లెనిన్ రాజకీయ నినాదాలుగా వాడాడు. అవి ఆయనకు సాంకేతిక, ఆర్థిక అంశాలు మాత్రమే కాదు.
స్వాతంత్య్రానంతర భారత దేశంలో కూడా దీనికి ఒక పోలిక కనిపిస్తుంది. విద్యుత్ రంగంలో నెహ్రూ ఆలోచనలు, సోషలిస్టుల, కమ్యూనిస్టుల ఆలోచనలు, అలాగే అంబేద్కర్ దార్శనికత కలవడం చూస్తాం. నెహ్రూ, అంబేద్కర్‌లు విద్యుత్ రంగాన్ని, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులను దేశాభివృద్ధికి కీలకమైనవిగా చూశారు. బృహత్తర ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయంగా అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు, చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఉండాలని తర్వాత నెహ్రూ భావించాడు. కానీ పెద్ద ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలన్నాడు. 1948 లోనే అంబేద్కర్ భారత విద్యుత్ చట్టానికి రూపకల్పన చేశాడని చాలామందికి తెలియదు.
విద్యుత్ అందరికీ తప్పనిసరి అవసరమని, అది ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, అందులో లాభాపేక్ష తగదని ఆయన భావించాడు. అంబేద్కర్ తనను తాను సోషలిస్టుగా (మార్క్సిస్టుగా కాకున్నా) అభివర్ణించుకున్న విషయం గమనార్హం.
లెనిన్ రాజకీయ కార్యాచరణలకు, విప్లవ పార్టీ నిర్మాణానికి చేసిన బహుముఖ కృషి ఒక ఎత్తు అయితే, తత్వ శాస్త్రానికి, విజ్ఞాన శాస్త్ర తాత్వికతలకు చేసిన కృషి మరొక ఎత్తు. భౌతిక వాదం అనుభవవాద విమర్శ అనే ప్రఖ్యాత గ్రంథంలో క్వాంటం మెకానిక్స్‌ను, ఎటువంటి విమర్శ లేకుండా స్వీకరించిన కోపెన్‌హెగెన్ వ్యాఖ్యానాన్ని ఆయన విమర్శించాడు. క్వాంటం, సాపేక్ష సిద్ధాంతాలు అన్ని తత్వశాస్త్ర సిద్ధాంతాలకు గట్టి సవాళ్లను విసిరాయి. నిజానికి, విజ్ఞాన శాస్త్రంలో ఏ కీలకమైన ముందడుగు పడినా జరిగేది ఇదే. అప్పటి వరకు ప్రకృతి గురించి మనకున్న విజ్ఞానాన్ని మాత్రమే కాదు, ఆ విజ్ఞానం ఆధారంగా తయారైన తత్వ శాస్త్రాలను కూడా ఈ నూతన విజ్ఞానం సవాలు చేస్తుంది. ఒకప్పటి సూర్యకేంద్రక సిద్ధాంతం లాగే క్వాంటం సాపేక్ష సిద్ధాంతాలు తాత్విక ప్రపంచాలను ఒక కుదుపు కుదిపాయి. కాలానికి ఉన్న తాత్విక స్వభావాన్ని, ఐన్‌స్టీన్ అర్థం చేసుకోలేక పోయాడంటూ, ఆయన సాపేక్ష సిద్ధాంతాన్ని తిరస్కరించ చూశారు. కాలాన్ని కొలవటానికి వీలైనదిగా, వస్తుగతమైనదిగా ఐన్‌స్టీన్ భావించాడు. దాని మార్మికతల గురించి హెన్రీ బెర్గ్‌సన్ లాంటి శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రభావం నోబెల్ కమిటీ మీద కూడా పడింది. కాబట్టే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాపేక్ష సిద్ధాంతానికి కాకుండా, ఫోటో ఎలక్ట్రిక్ సిద్ధాంతానికి ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి ఇచ్చారు. లెనిన్‌ను నాజుకైన భౌతిక వాది కాదనే వాళ్ళు (ఏంగెల్స్‌ను అన్నట్టే) ఉన్నారు. కానీ సైన్స్ సూత్రాలలో ఉండే పాక్షికతను, వైఫల్య అవకాశాలను సరిగా గుర్తించినవాడు లెనినే. పదార్థ చలనాలకుండే ద్వంద్వ స్వభావాన్ని, గతి తార్కిక దృష్టి నుంచి అర్థం చేసుకున్నవాడు లెనిన్. ఒకందుకు మనందరం సంతోషపడాలి. లెనిన్ చాలా సమస్యలకు పరిష్కారం చూపాడు. కానీ పరిష్కరించాల్సిన ఎన్నో సమస్యలు (విప్లవ కార్యాచరణలో, చరిత్రలో, ఆర్థిక శాస్త్రంలో, తత్వశాస్త్రంలో కూడా) ఇంకా మిగిలే ఉన్నాయి.
/ స్వేచ్ఛానువాదం/
ప్రబీర్ పుర్కాయస్థ