అనకాపల్లి జిల్లా కైలాసపట్నం శివార్లలోని బాణసంచా పరిశ్రమలో రెండు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం దిగ్భ్రాంతికరం. ఈ దుర్ఘటనలో మరికొందరు తీవ్ర గాయాలపాలైనారు. మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవడం, గాయపడిన వారు పూర్తిగా కోలుకునేంత వరకు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్యసేవలు అందించడంతో పాటు, నష్టపరిహారం, ఇతరత్రా ఆర్థిక సాయాన్ని అందించడం ప్రభుత్వాల కనీస, తక్షణ బాధ్యత. భవిష్యత్తులో ఇటువంటి ఘోరాలు జరగకుండా చూడటం కూడా ప్రభుత్వాల కర్తవ్యం. ఈ దిశలో అవసరమైన చట్టాలను, నిబంధనలను రూపొందించి, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం వాటిని అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత నూటికి నూరుశాతం పాలకులదే! అయితే, ఆ దిశలో క్షేత్రస్థాయిలో కృషి జరుగుతోందా? గతంలో జరిగిన దుర్ఘటనల నుండి పాఠాలు నేరుస్తున్నామా అన్నదే అసలు ప్రశ్న! ఇటీవల కాలంలో ప్రతి సందర్భానికీ బాణసంచా కాల్చడమన్నది అలవాటుగా మారుతోంది. దానికి తగ్గట్టే బాణసంచా తయారీ పరిశ్రమ విస్తరణ కూడా పెరుగుతోంది. తాజాగా ప్రమాదం జరిగిన కైలాసపట్నం ప్రాంతం ఆంధ్రప్రదేశ్ శివకాశిగా స్థానికంగా ప్రసిద్ధి! మరి, ఆ స్థాయిలో నిఘా ఉంటోందా? ప్రాణాలకు తెగించి పని చేస్తున్న కార్మికులకు కనీస భద్రతలైనా ఉంటున్నాయా? యంత్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారా? మందుగుండు సామాగ్రిని గ్రైండింగ్ చేస్తున్న సమయంలో ‘స్పార్క్’ రావడంతో ఈ ఘోరం జరిగిందని చెబుతున్నారు. బాణాసంచా తయారీ కేంద్రంలో నిప్పురవ్వలు చెలరేగడమేమిటి? అసలా పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈ తరహా దుస్థితి ప్రమాదం జరిగిన యూనిట్‌లో మాత్రమే ఉందా? మిగిలిన యూనిట్లు కూడా ప్రమాద కూపాలేనా? అసలు రాష్ట్రంలో ఎన్ని బాణసంచా తయారీ కేంద్రాలున్నాయి? ఎందరు కార్మికులు పనిచేస్తున్నారు? వారి భద్రత కోసం చేపడుతున్న, చేపట్టాల్సిన చర్యలేమిటి? ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మోడ్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై కూడా దృష్టి సారించాల్సి ఉంది.
ఇటీవల కాలంలో వివిధ రకాల పరిశ్రమలు, గోడౌన్లు, చివరకు ఆస్పత్రుల్లో కూడా ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 21మందిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అతికష్టంమీద కాపాడగలిగాయి. సెల్లార్లో అక్రమంగా రసాయనాలు నిల్వచేయడమే కారణమని అధికారులు అప్పట్లో తేల్చారు. అయితే, తీసుకున్న చర్యలు నామమాత్రమే! 2023లో బెంగళూరు నగరం, పరిసర ప్రాంతాల్లోనే 7వేలకు పైగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అంతకు ముందుటి సంవత్సరంతో పోలిస్తే 15శాతానికన్నా అధికంగా ప్రమాదాలు జరిగినట్లు తేల్చారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 2023లో 16,500 అగ్నిప్రమాదాలు జరగగా 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబాయి, చెన్నై నగరాల్లో కూడా అత్యధిక ప్రమాదాలే చోటుచేసుకున్నాయి. వీటిలో జనావాస ప్రాంతాల్లో నడుస్తున్న పారిశ్రామిక యూనిట్లే కారణమని అగ్నిమాపకశాఖ అధికారులు విడుదల చేసిన నివేదికల్లో పేర్కొన్నారు. పెరుగుతున్న నగరీకరణతో పాటు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉదారవాద ఆర్థికవిధానాలు పేదల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయనడానికి ఆ నివేదికలే సాక్ష్యం.
గత ఏడాది ఆగస్టు 22వ తేదీన పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకున్న ఎసెన్షియా అడ్వాన్డ్స్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 2019వ సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల కాలంలో 119 పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయని, 120 మంది చనిపోయారని చెప్పారు. కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరాలని ఆ సందర్భంగా యాజమాన్యాలను ఆయన ఆదేశించారు. అయితే, ఆ దిశలో పురోగతి శూన్యం! స్వయంగా ముఖ్యమంత్రి అట్టహాసంగా విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047లోగానీ, దానికి అనుబంధంగా విడుదల చేసిన వివిధ పాలసీల్లోగాని కార్మికుల భద్రత, సంక్షేమం గురించి ఒక్క ముక్క కూడా లేకపోవడం బాబు ప్రభుత్వం గత ప్రమాదాల నుండి పాఠాలు నేర్వలేదనడానికి నిదర్శనం.
