ఒలింపిక్స్‌ పాఠాలు

విశ్వ క్రీడల మహా సంరంభం 33వ ఒలింపిక్స్‌ పారిస్‌లో ఆదివారం రాత్రి ముగిశాయి. జులై 26న అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఒలింపిక్స్‌ 17 రోజులపాటు జరిగాయి. చారిత్రాత్మక పారిస్‌ నగరం ఈ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. సీస్‌ నదిలో ఆరంభం నుంచి ప్రధాన స్టేడియంలో ముగింపు వరకు సంబరాలు అంబరాన్నంటాయి. ఫ్రెంచ్‌ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వం క్రీడలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈసారి రెండొందలకుపైగా దేశాల నుంచి పది వేల మందికిపైగా అథ్లెట్లు 329 క్రీడాంశాల్లో పాల్గొని అద్భుతమైన క్రీడా కౌశలాన్ని ప్రదర్శించి అభిమానులను ఎంతగానో అలరించారు. అమెరికా 40 స్వర్ణాలతో సహా మొత్తం 126 పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలవగా, చైనా 40 స్వర్ణాలతో మొత్తం 91 పతకాలు సాధించి రెండవ స్థానం దక్కించుకుంది. మొదటి స్థానం కోసం అమెరికాతో చైనా హోరా హోరీగా పోరాడింది. స్వర్ణాలలో అమెరికాను సమం చేసి గట్టి సవాల్‌ విసిరింది. మొత్తం 205 దేశాలు పాల్గొంటే ఒక్క పతకమైనా సాధించిన దేశాలు కేవలం 84 మాత్రమే. టోక్యోలో 2021లో జరిగిన ఒలింపిక్స్‌ కరోనా మహమ్మారి వలన కళ తప్పాయి. మూడేళ్ల తర్వాత పారిస్‌లో నిర్వహించిన ఈవెంట్‌ మేటిగా నిలిచింది. తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా నిర్వహించి, భవిష్యత్తులో ఒలింపిక్స్‌ నిర్వహించాలనుకునే ఇండియా వంటి దేశాలకు మార్గదర్శిగా నిలిచింది.
రెండంకెల పతకాల లక్ష్యంతో పారిస్‌లో దిగిన ఇండియా పేలవమైన ప్రదర్శన చేసి అభిమానులను నిరాశ పరిచింది. ఒక రజతం, ఐదు కాంస్యాలే సాధించింది. గత క్రీడల్లో ఏడు పతకాలతో 48వ స్థానంలో నిలవగా, ఈసారి ఆరు పతకాలతో 71వ స్థానానికే పరిమితమైంది. సుమారు 26 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు పాల్గొనగా పతకాలు సాధించిన వారు పోను 15 మంది క్వార్టర్‌ ఫైనల్‌కు (నాల్గవ స్థానం) చేరారు. గతంలో ఏడు పతకాలు వచ్చినప్పుడు క్వార్టర్‌ ఫైనల్‌కు ఇద్దరే చేరగా ఈ తడవ ఆ సంఖ్య పెరగడం స్వల్ప ఊరట. కానీ ఒలింపిక్స్‌లో నాల్గవ స్థానానికి విలువ లేదు. వచ్చే ఈవెంట్‌కు సన్నద్ధం కావడానికి అదొక ఉత్ప్రేరకంగా పనికొస్తుందంతే. ఫైనల్‌కు ముందు వంద గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు యావత్‌ దేశాన్నీ ఆవేదనకు గురి చేసింది. కాగా ఫొగాట్‌ అనర్హత దేశ ప్రజల్లో కలకలం రేపింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలెదుర్కొన్న రెజ్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌పై చర్యల కోసం జరిగిన ఆందోళనలలో ఫొగాట్‌ కీలకంగా నిలిచారు. అనర్హత వేటు వెనుక ఆ ప్రభావం ఉందన్న భావన అందరిలోనూ ఉంది. అందుకు తగ్గట్టే కేంద్ర ప్రభుత్వ తీరు ఉంది.
పోయిన చోటే వెతుక్కోవాలన్నది మను బాకర్‌లో చూడాలి. గత ఒలింపిక్స్‌లో విఫలమైన ఆమె, షూటింగ్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్యంతో పాటు, సరబ్‌ జోత్‌సింగ్‌తో కలసి మిక్స్‌డ్‌ ఈవెంట్‌లోనూ కాంస్యం కొట్టింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పి తానేంటో నిరూపించుకుంది. మిక్స్‌డ్‌లో ఆమె భాగస్వామిగా సరబ్‌ జోత్‌సింగ్‌ కూడా కాంస్యాన్ని అందుకున్నారు. స్వప్నిక్‌ కుసాలే రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో అనూహ్యంగా మూడవ స్థానంలో నిలవడంతో భారత్‌ ఖాతాలో మూడవ కాంస్యం చేరింది. భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండవ ఒలింపిక్స్‌లోనూ కాంస్యం సాధించడం మన అభిమానులకు ఊరట. యువ రెజ్లర్‌ సెహ్రావత్‌ కూడా కాంస్యం అందుకున్నారు. అయితే పతకాల పట్టికలో భారత్‌ స్థానాన్ని పైకి చేర్చగల స్వర్ణం మాత్రం మనకు రాలేదు. క్రీడాకారుల ప్రదర్శనను అంచనా వేయడానికి పతకాలే ప్రామాణికం కాదు. చాలా మంది తృటిలో పతకాలు కోల్పోయారు. ఆ స్థాయికి రావడానికి వారు పడ్డ శ్రమ వర్ణనాతీతం. హాకీ జట్టులోని 16 మంది సభ్యులతో పాటు మొత్తం 21 మంది అథ్లెట్లు పారిస్‌ నుంచి పతకాలతో తిరిగి వస్తున్నారు. ఆ స్ఫూర్తితో ‘2028-లాస్‌ ఏంజెల్స్‌’ ఒలింపిక్స్‌కు మన క్రీడాకారులు సంసిద్ధం కావాలి. విజేతలకు శుభాకాంక్షలు. వాగాడంబరం, ప్రచారార్భాటాలతో సరిపెట్టకుండా మోడీ ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి గ్రామ స్థాయి నుంచి అన్ని చర్యలూ చేపట్టాలి. పతకాలు తెస్తే ప్రభుత్వ ఘనత, తేలేకపోతే క్రీడాకారుల వైఫల్యం అనే విధానాన్ని విడనాడాలి.

➡️