గెలుపు-పాఠాలు-సవాళ్లు

Jun 11,2024 05:40 #Articles, #edit page

ఎన్నికల్లో ఓడిపోయినవారు ఎందుకు తాము ఓటమి పాలయ్యామని మథనపడతారు, ఆ ఓటమిని జీర్ణించుకున్నాక అది నేర్పిన పాఠాలేమిటో తెలుసుకుంటారు. ఐతే, గెలిచినవారు ఆ గెలుపు నుండి నేర్చుకుంటారా అన్నది ప్రశ్న. ఓటమి మాదిరిగానే గెలుపు కూడా ఒక అనుభవమే. ప్రతీ అనుభవమూ పాఠాలను మన ముందుంచుతుంది. నేర్చుకోవడం, లేదా పట్టించుకోకపోవడం అనేది మన వంతు.
తెలుగుదేశం కూటమి సాధించినది నిస్సం దేహంగా ఘన విజయమే. రాజకీయ పండితుల అంచనాలను మించిపోయి 164 సీట్లు గెలుచు కున్నారు. దాదాపు ఇదే స్థాయిలో గత ఎన్నికలలో 151 సీట్లు ఒక్క వైసిపినే గెలుచుకుంది. ఐదేళ్ళూ పూర్తయ్యేసరికి అందులో మధ్యన ఉన్న ‘5’ అదృశ్యమై 11 సీట్లు మాత్రం మిగిలాయి. కాబట్టి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల వద్దకు పోయి తీర్పు కోరవలసి వుంటుంది అనేది పదవీ కాలం మొత్తంలో మరిచిపోకూడదని ఇప్పుడు గెలిచినవారు గుర్తుంచుకోవాలి.
తన నవ రత్నాలూ తమ పార్టీని గ్యారంటీగా గెలిపిస్తాయని జగన్‌ బలంగా నమ్మారు. దానినే పదే పదే చెప్తూ వచ్చారు. కాని ఆ నవరత్నాలు జగన్‌ పార్టీకి 40 శాతం ఓట్లను తెచ్చిపెట్టాయి తప్ప గెలుపును ఇవ్వడానికి సరిపోలేదు. ప్రజలకు ఏమిచ్చాం మనం అనేది మాత్రమే సరిపోదని, ఎలా పరిపాలించాం, వారితో పదవీ కాలమంతా ఎలా మెలిగాం అన్నది కూడా ప్రధానం అని ఫలితాలు చెప్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ వుండాలి అన్నది పాలకులు విస్మరించకూడదు. దానిని విస్మరించి ప్రజాసంఘాలతో గాని, ఉద్యమాల ప్రతినిధులతోగాని, తక్కిన రాజకీయ పక్షాలతోగాని జగన్‌ ఏనాడూ సంప్రదింపులు చేయలేదు. వారిచ్చిన సలహాలను గాని, వారి డిమాండ్లను గాని చెవిన పెట్టనూలేదు. పైగా నిరంకుశంగా ప్రజా ఉద్యమాలను అణచివేశారు. నిర్బంధాలకు పూనుకున్నారు. ఈ మారు గెలిచిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ తాను పూర్తిగా మారిపోయానని, మారిన చంద్రబాబును మీరంతా చూడబోతున్నారని ప్రకటించారు. అందరు చెప్పేవీ విని పని చేస్తానని కూడా చెప్పారు. మంచిదే. ఐతే ఇది ఆచరణలో తేలే విషయం. కనుక ఐదేళ్ళ పాటూ ప్రజాస్వామ్యయుతంగా పని చేయనున్నారా లేదా పాత, ఏకపక్ష పోకడలలోకే మళ్ళీ వెనుదిరుగుతారా అన్నది చూడాల్సిందే. ఏమైనా, జగన్‌ నిరంకుశ పాలనను తిరస్కరించాలనుకున్నారు గనుకనే ప్రజలు తమకు ఈ గెలుపునిచ్చారు అన్నది చంద్రబాబు మరిచిపోకూడని విషయం. అప్పటి నవరత్నాలు, లేదా ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ మాత్రమే సరిపోవు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది అని మోడీతో సహా చాలామంది చెబుతున్నారు. కాని కాస్తంత వివరాల్లోకి పోతే ఈ రాష్ట్ర ప్రజలు టిడిపి, జనసేనలకు ఇచ్చిన మోతాదులో బిజెపికి విజయాన్ని ఇవ్వలేదు అన్నది కనిపిస్తుంది. ముఖ్యంగా పార్లమెంటు సీట్లు పరిశీలిస్తే, 17 స్థానాలకు పోటీ చేసిన టిడిపి 16 స్థానాల్లో గెలిచింది. రెండింటికి పోటీ చేసి జనసేన రెండింటిలోనూ గెలిచింది. కాని 6 స్థానాల్లో పోటీ చేసిన బిజెపి ఇంత వెల్లువలో కూడా మూడింట్లోనే గెలిచింది. బిజెపి ఓడిపోయిన మూడింట్లోనూ వైసిపి గెలిచింది. అవి గాక తమ పునాది అయిన కడపలో మాత్రమే వైసిపి గెలిచింది. తిరుపతి పార్లమెంటు సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలనూ టిడిపి, జనసేనలు గెలుచుకున్నాయి. కాని ఆ పార్లమెంటు సీటును మాత్రం వైసిపి గెలుచుకుంది. తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నందున దానిని ఆధారం చేసుకుని తమ మత విద్వేష రాజకీయాలను నడపడానికి బిజెపి, దాని పరివారం ప్రయత్నిస్తూనే వున్నాయి. అక్కడ బిజెపిని తిరస్కరించి అసెంబ్లీ స్థానాల్లో టిడిపి, జనసేనలను గెలిపించిన ప్రజలు మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అరుకు పార్లమెంటు పరిధిలో టిడిపి, జనసేన ఐదు అసెంబ్లీ స్థానాలను గెలిచాయి. అరుకు అసెంబ్లీ స్థానంలో బిజెపి ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. పార్లమెంటు స్థానంలోనూ ఓడిపోయింది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాలను ప్రజలు తిరస్కరించా రన్నది స్పష్టంగా కనపడుతోంది. గిరిజన ప్రజల మనోగతం చంద్రబాబుకు బోధపడితే ఆ విధానాల నుండి విడగొట్టుకుని నిలబడాల్సి వుంటుంది. రాష్ట్ర ప్రజలు తమ ముందు ఉన్నవి ప్రధానంగా రెండే ఆప్షన్లు అని అనుకున్నారు. జగన్‌ నిరంకుశ పాలనకు, విపరీతంగా మోపిన భారాలకు వ్యతిరేకం గా స్పందించారు గనుక రెండో ఆప్షన్‌గా తాము గుర్తించిన టిడిపి కూటమిని గెలిపించారు. అదే సమయంలో కేంద్రం లోని మోడీ పాలనను కూడా తమకు అవకాశం ఉన్న మేరకు తిరస్కరించారు.
ఇప్పుడు చంద్రబాబు తాను మరోసారి కింగ్‌ మేకర్‌గా ఉన్నానని సంతోష పడవచ్చు. కాని తనను ఇక్కడ కింగ్‌ని చేసిన ప్రజలు అసలైన కింగ్‌ మేకర్లు. వాళ్ళకి మోడీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో కనిపిస్తూనే వుంది. అయినా, ఎన్డీయేలోనే కొనసాగుతాం అని టిడిపి, జనసేనలు ప్రకటించాయి. పొత్తు ధర్మం అని ఇప్పుడు సమర్ధించుకోవచ్చు. కాని మోడీ ప్రభుత్వం అనుసరించే విధానాలు దేశ లౌకిక స్వభావానికి విరుద్ధంగా ఉన్నప్పుడు టిడిపి, జనసేన భవిష్యత్తులోనైనా ప్రతిఘటిస్తాయా లేదా అన్నది ప్రజలు చూస్తారు. ఆ విషయాన్ని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ గుర్తుంచుకోవాలి.
బేషరతుగా ప్రతీసారీ మోడీ చట్టాలకి అనుకూలంగా చేతులెత్తి, కేంద్రం ఆదేశాలకు తలొగ్గి ప్రజలమీద భారాలను మోపిన జగన్‌ మాదిరిగానే రానున్న రోజుల్లో చంద్రబాబు వ్యవహరిస్తారా? అన్నది ప్రజలు తప్పకుండా నిశితంగా పరిశీలిస్తారు. లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, రాష్ట్రాల హక్కులు, సామాజిక న్యాయం, స్వావలంబన వంటి విషయాలు ప్రజలకు అర్ధం కాని విషయాలని, వాళ్ళకు ఏవో కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేస్తే సరిపోతుందని ప్రజా చైతన్యాన్ని తేలికగా తీసుకుంటే ఏమౌతుందో చంద్రబాబుకు తెలియాలి. 2019లో ఒకసారి ప్రజలు తెలియజెప్పారు కూడా. ఒకే పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తకు తగదు.
మరో ముఖ్యమైన విషయం విభజన హామీలు. బిజెపి చేసిన ద్రోహాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. మెజారిటీ ఇస్తే ఆ హామీలను సాధిస్తానని చెప్పి ఆ తర్వాత వాటి ఊసే ఎత్తని జగన్‌నూ క్షమించలేదు. ఇప్పుడు వాటి విషయంలో చంద్రబాబు, పవన్‌ ఏం చేయబోతున్నారో ప్రజలు నిశితంగా పరిశీలిస్తారు. ప్రత్యేక హోదా, పోలవరం నిర్వాసితుల పునరావాసం, తదితర విభజన చట్టపు హామీల అమలు కోసం చంద్రబాబు ఏం చేయబోతారనేది చూస్తారు. ”నాకు మెజారిటీ ఇచ్చినా, కేంద్రంలో మోడీకి కూడా మెజారిటీ ఇచ్చారు గనుక ఒత్తిడి చేయలేకపోతున్నాను” అని గతంలో జగన్‌ అన్నారు. ఇప్పుడు అటువంటి వాదన చంద్రబాబు చేయలేరు. ఎందుకంటే మోడీకి ఉన్న బలాన్ని ప్రజలు దిగ్గోశారు. ఇప్పుడు మోడీ పట్ల మిత్ర ధర్మం పాటించడం అనే పేరుతో మోడీ ఏం చేసినా తలూపాల్సిన అగత్యం ఏమీ లేదు. అదే మిత్ర ధర్మాన్ని మోడీ కూడా పాటించి మితృల డిమాండ్లను నెరవేర్చాలి. కాని బిజెపికి మిత్ర ధర్మం అనేది ఏనాడూ పడని మాట. ఒకప్పటి ఆ పార్టీ మితృలను ఎవరిని అడిగినా చెప్తారు. అంతెందుకు? 2014 లోనూ బిజెపి ఇక్కడ టిడిపి కి మితృడే కదా? మరి ఎందుకు 2018లో విడగొట్టుకుని మోడీతో తలపడవలసి వచ్చింది? అందుచేత అనివార్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా కేంద్రంతో తలపడాల్సి వుంటుంది. ఆ విధంగా తలపడతారా? లేక వన్‌ సైడ్‌ లవ్‌ మాదిరిగా ప్రతీసారీ మోడీకి అనుకూలంగా చేతులెత్తుతూ వుంటారా? ఇది చంద్రబాబు, పవన్‌ ల ముందున్న సవాలు.
మరో విషయం రాజధాని. మూడు రాజధానులంటూ జగన్‌ ముందుకు తెచ్చిన అర్ధంలేని ప్రతిపాదనను ప్రజలు ఎప్పుడూ ఆమోదించలేదు. రాయలసీమలోనూ, ఉత్తరాంధ్ర లోనూ ఆ ప్రతిపాదనకు ఆది నుంచీ సానుకూలత వ్యక్తం కానేలేదు. ఆ విషయమై తీర్పు ఇచ్చేటప్పుడు ప్రజలు జగన్‌ ది తప్పు అని తేల్చేశారు. మరి అమరావతి అనే రంగుల కలను ప్రజలకు, ముఖ్యంగా ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు చూపించిన చంద్రబాబు ఇప్పుడు ఆ కలను ఎంతమేరకు సాకారం చేస్తారో చూడాలి. దానినీ పోలవరం మాదిరిగానే దశాబ్దాల తరబడి సాగదీసి ఎటూ కాకుండా చేస్తారా లేక వేగంగా అడుగులు పడతాయా అన్నది ప్రజలు చూస్తారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని సాధించుకున్న ప్రతిష్టాత్మక కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని చంద్రబాబు-పవన్‌ కళ్యాణ్‌ కేంద్ర ప్రభుత్వం చేత ఉపసంహరింపచేయాలి. మూడేళ్లకు పైగా అక్కడి కార్మిక వర్గం, రాష్ట్ర ప్రజలూ ప్రతిఘటించడం వల్ల ఆగినా ఆ కుట్రకు ఇప్పటికైనా ముగింపు పలకాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత చంద్రబాబు ఐ.టి రంగంలో ఏవో మార్పులు చేయగలరు అని అనుకుంటున్నారు. హైదరాబాద్‌ లో ఐ.టి ని తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు పదే పదే చెప్తూ వస్తున్నారు. అదే వాస్తవం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లోనూ అభివృద్ధి చేస్తారు కదా అని సాఫ్ట్‌వేర్‌ నిరుద్యోగులంతా ఆశపడుతున్నారు. ఐదేళ్ళ తర్వాతనైనా వాళ్ళకి సమాధానం చెప్పవలసి వుంటుందని చంద్రబాబు మరిచిపోకూడదు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలోని ఉపాధి అవకాశాలను సవాలు చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ తరహాలోనో, బెంగళూరు తరహాలోనో మరో ఐ.టి కేంద్రం అభివృద్ధి కావడం అనేది ప్రశ్నార్ధకం. మరి చంద్రబాబు, లోకేశ్‌ ఏమైనా వినూత్న పద్ధతులను ఆవిష్కరిస్తారేమో చూడాలి.
గెలుపు నేర్పుతున్న పాఠాలను సక్రమంగా స్వీకరించి ముందడుగులు వేస్తే తీర్పిచ్చిన ప్రజలకు న్యాయం జరుగుతుంది.

ఎం.వి.ఎస్‌. శర్మ

➡️