కుల వివక్ష ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడంతా మారిపోయింది. అందరూ కలిసి తింటున్నారు, కలిసి తిరుగుతున్నారు, హోటళ్లలో, జాతరల్లో, ఉత్సవాల్లో అన్నింట్లో కలిసే ఉంటున్నారు. ఇంకా వివక్ష ఎక్కడుంది? ఈ మధ్య కాలంలో ఇలాంటి వాదనలు, మాటలు తరచూ మనువాదుల నుండి వినిపిస్తున్నాయి. మోడీ పాలనలో దేశం చాలా మారిందంటున్నారు. వివక్ష లేనే లేదంటున్నారు. కానీ…నేటికీ నిచ్చెన మెట్ల కులజాఢ్యం అణగారిన ప్రజల్ని పట్టి పీడిస్తూనే ఉంది.
మాల, మాదిగ పల్లెల్లో ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కనిపిస్తూనే ఉంది. అయితే గతంలో ఉన్నంత మొరటుగా ఇప్పుడు లేకపోవచ్చు కానీ, తీవ్రమైన కులవివక్ష రూపం మార్చుకుని మరో రూపంలో కొనసాగుతున్నది. శాస్త్ర, సాంకేతిక రంగం ఇంత అభివృద్ధి చెంది మంచి ఫలితాలు సాధిస్తుంటే ఇదేం కులవివక్ష అనుకోవచ్చు. స్వాతంత్య్రం రాకముందు, వచ్చిన తర్వాత కొనసాగడానికి అగ్రవర్ణాల ఆధిపత్యంతో నడిచే పాలక వర్గ ప్రభుత్వాలే కారణం అని చెప్పవచ్చు.
మన రాష్ట్రంలోనూ దళితులపై దుర్మార్గమైన దాడులు, దౌర్జన్యాలు, లైంగిక దాడులు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని జాతీయ నేర విభాగం నివేదికలు తెలుపుతున్నాయి.
వివిధ సందర్భాల్లో కుల వివక్ష బయట పడుతుంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామాల్లో నేటికీ రచ్చ బండల మీద కూర్చోనీయకపోవడం, రాయలసీమ ప్రాంతంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటలపై వివక్ష పాటించడం, ఎక్కువ ప్రాంతాల్లో గుడిలోకి రానీయకపోవడం, హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి వంటి అనేక పలు ఇతర రూపాల్లో కులవివక్ష కొనసాగుతున్నది. చదువుకున్న ఉద్యోగులపైనా కులవివక్ష ప్రభావం కనిపిస్తున్నది.
నగరాల్లో శాకాహారులకు మాత్రమే ఇళ్లు అద్దెకిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు అద్దెకు ఇవ్వరు. పైగా ‘శాకాహారులకు మాత్రమే ఇల్లు అద్దెకు ఇవ్వబడును’ అని తమ ఇంటి గోడలు, గేట్ లకు బోర్డులు పెడుతున్నారు.
అమలుకు నోచుకోని పున్నయ్య కమిషన్ నివేదిక
నేటికీ జస్టిస్ పున్నయ్య సిఫారసులు అమలు కావడంలేదు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె.వి.పి.ఎస్) ఉమ్మడి రాష్ట్రంలో వేలాది మంది కార్యకర్తలతో సుమారు మూడు వేల గ్రామాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలుపై సర్వే చేసింది. వచ్చిన అనేక సామాజిక సమస్యలు, అంటరానితనం, కులవివక్ష, రెండు గ్లాసుల పద్ధతిపై అనేక పోరాటాలను గ్రామాల్లో ప్రత్యక్షంగా నిర్వహించింది. దీనికి తోడు అసెంబ్లీ లోపల ఎమ్మెల్యేలు పట్టుబట్టడం వల్ల నాటి చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చి హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పున్నయ్యతో ఎస్సీ, ఎస్టీ ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది కె.వి.పి.ఎస్ సాధించిన మొదటి విజయం.
జస్టిస్ పున్నయ్య కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి 164 రకాల కులవివక్ష రూపాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పరిష్కారం కోసం సూచనలు చేసింది. కమిషన్ ఏర్పాటు చేసిన పాలకులు ఆ సూచనలను చిత్తశుద్ధితో అమలు చేయాలి కదా! నేటికీ పున్నయ్య సిఫారసు చేసిన నలభై అంశాల్ని సర్కార్ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇప్పటికీ కులవివక్ష రూపాలు కొనసాగుతున్నాయి.
వారంలో ఒకరోజు ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కుల వివక్షను గుర్తించి దాన్ని రూపుమాపడానికి ప్రయత్నించాలని పున్నయ్య కమిషన్ పధానంగా సిఫారసు చేసింది. కానీ ఎక్కడా ఆ సిఫారసు అమలుకు నోచుకోవటం లేదు. 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రతి నెలా చివరి రోజు కులవివక్ష, అంటరానితనంపై చైతన్య సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నది. కానీ దాన్ని కూడా ఎక్కడా అమలు జరపటం లేదు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరిగిన సందర్భంలో ఏకైక రక్షణ కవచంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పూర్తిగా నీరుగాస్తున్నది. 41 సి.ఆర్.పి.సి కింద స్టేషన్ బెయిలిస్తూ దాడులు మరింతగా పెంచడానికి ఊతమిచ్చే విధంగా వ్యవహరిస్తున్నది.
మనువాదంతో పెరుగుతున్న కులవివక్ష
ఆరెస్సెస్-బిజెపి మనువాద మతోన్మాద విధానాలు పల్లె వాతావరణాన్ని చెదరగొడుతున్నాయి. కులవివక్ష, అంటరానితనాన్ని మరింతగా పెంచి పోషిస్తున్నాయి. చిన్నజీయర్‌స్వామి లాంటి ఆధ్యాత్మికవేత్త ‘కులం ఉండాల్సిందే, కులం పోకూడదు. ఒక మనిషి శరీరానికి కాళ్లు చేతులు ఎంత అవసరమో, దేశానికి కులాలు అంత అవసరం’ అని ప్రబోధిస్తున్నారు. గ్రామ సీమల్లో దళితులు అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తే పోటీగా ఆరెస్సెస్ ఇతరులను రెచ్చగొట్టి, ఇతర నాయకుల విగ్రహాలను పెట్టి ప్రజల మధ్య ఘర్షణలను సృష్టించి కులాల కుంపటిని రగలించి రాజకీయాలు నడుపుతున్నది. ‘కుల వివక్షత, అంటరానితనం, నేరం. చట్ట విరుద్ధం’ అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 పేర్కొంటున్నాయి. కానీ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారు కుల వివక్ష రూపుమాపడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోగా పరోక్షంగా దాన్ని బలపరుస్తున్నారు.
కులవివక్షపై కె.వి.పి.ఎస్ ఉద్యమం
మహనీయులైన ఫూలే, అంబేద్కర్ జయంతి, వర్ధంతుల సందర్భంగా దండలేసి దండాలు పెట్టి వారి ఆశయాలు నెరవేర్చినట్టు భావిస్తుంటారు కొందరు. కానీ ఫూలే, అంబేద్కర్‌లు తమ వ్యక్తిగత జీవితంలో అనుభవించిన కుల వివక్షను పారదోలటానికి ప్రత్యక్ష ప్రతిఘటనా ఉద్యమాలను నిర్మించారు. వారి అడుగుజాడల్లో పయనిస్తున్న కె.వి.పి.ఎస్…మన సమాజంలో నేటికీ కొనసాగుతున్న కుల వివక్షపై ప్రత్యక్ష ప్రతిఘటనా ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 11 నుండి 14వ తేదీ వరకు మహనీయులు ఫూలే, అంబేద్కర్‌ల స్ఫూర్తితో…క్షేత్ర స్థాయిలో కుల వివక్షపై సమగ్ర సర్వేలు చేయాలని నిర్ణయించింది. ప్రత్యక్ష పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
సమాజ హితం కోరుకునే వ్యక్తులు, శక్తులు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఈ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కె.వి.పి.ఎస్ పిలుపునిస్తోంది. చాప కింద నీరులా సాగుతున్న మనువాద సంస్కృతి, కుల వివక్ష, అంటరానితనం పూర్తిగా రూపుమాపబడాలంటే ప్రజలు ఐక్యంగా పూనుకోవాలి. కులవివక్షను ప్రతిఘటించి పారదోలాలి.
వ్యాసకర్త : అండ్ర మాల్యాద్రి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె.వి.పి.ఎస్)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్ : 9490300366 /