నూరు శాతం అక్షరాస్యత, 77 ఏళ్ళ ఆయు: ప్రమాణం సాధించిన, మహిళా సాధికారత, విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన, స్ధానిక సంస్థలకు విధులు, నిధులు వికేంద్రీకరించి సుపరిపాలన అందించడంలో దేశంలో అగ్ర స్థానంలో పయనిస్తున్న రాష్ట్రం కేరళ. సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం ప్రజానుకూల విధానాలను అమలు చేస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్ అండదండలతో వివిధ రాష్ట్రాలపై మతోన్మాదాన్ని రుద్ది రాజకీయ పబ్బం గడపుకొనేందుకు పూనుకుంటున్న మనువాదులకు కేరళ వామపక్ష ప్రభుత్వం కొరకరాని కొయ్యగా ఉంది. అందుకే ఆ రాష్ట్రంపై కేంద్ర బిజెపి ప్రభుత్వం కక్షగట్టి లక్ష కోట్లకు పైగా రావాల్సిన న్యాయమైన వాటా ఇవ్వకుండా ఆ రాష్ట్ర అభివృద్ధిని అస్థిర పరిచేందుకు కుయుక్తులు పన్నుతున్నది. దేశాన్నే కలిచివేసిన వయనాడ్ వరదల్లో మరణించిన వారికి కేంద్రం పైసా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ 11వ తేదీన దేశ వ్యాప్తంగా వివిధ ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదుల నాయకత్వంలో జరుగుతున్న కేరళ సంఘీభావ కార్యక్రమానికి అన్ని తరగతుల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.
1957లో భారతదేశంలోనే మొట్టమొదట కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్రం కేరళ. ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో భూసంస్కరణలు అమలు చేసి 36 లక్షల మంది పేదలకు, కౌలురైతులకు భూమిని పంచిన చరిత్ర కమ్యూనిస్టు ప్రభుత్వానిది. కమ్యూనిస్టు పాలనను ఓర్వలేని, భూస్వాముల తొత్తుగా ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళు తిరగక ముందే వామపక్ష ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అయినా ప్రజలు తిప్పికొట్టి వామపక్ష ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకున్నారు. అందుకే నాటి నుండి నేటి వరకు కేరళలో కమ్యూనిస్టులు ఓడినా, గెలిచినా ప్రజల కోసం పనిచేస్తున్నారు. కేరళ గత 7 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో పురోగమిస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోంది.
స్థానిక సంస్థలకు అధికారాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో 28 శాతం స్థానిక సంస్థల నిధులు కేటాయిస్తుంది. ఇవిగాక సాధారణ పరిపాలన కోసం రెవెన్యూ ఆదాయంలో 6.5 శాతం వాటా పంచాయతీలకు ఇస్తుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా స్థానిక సంస్థలకు విధులు, నిధులు కేటాయించి గ్రామ పంచాయతీలను స్థానిక ప్రభుత్వ సచివాలయాలుగా మార్చివేసింది. అన్ని రాష్ట్రాలలో కనీసం తాగునీటికి, విద్యుత్ బల్బులకు నిధులు లేక కునారిల్లుతుంటే కేరళలో ప్రతి పంచాయతీకి కోట్లలో రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు సమకూరుతున్నాయి. ప్రతి పంచాయతీ ఆఫీస్‌లో 18 నుండి 20 మంది వరకు ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. మన రాష్ట్రంలోని ఆర్డీవో ఆఫీస్ స్థాయిలో అక్కడి పంచాయతీ కార్యాలయం ఉంటుంది. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ మహిళలకు కేటాయించి సర్వ అధికారాలు ఇస్తున్నారు. అందుకే ఎక్కడా లేనంతగా మహిళా సాధికారత కేరళలో కన్పిస్తుంది.
ఒకనాడు ఆహార ధాన్యాల కొరత ఎదుర్కొన్న రాష్ట్రం కేరళ. పరిమితమైన భూమి, కొండకోనల్లో సుగంధ ద్రవ్యాలు, వాణిజ్య పంటలకే పరిమితమైన రాష్ట్రం నేడు ఆ రాష్ట్ర ప్రజలకు ఆహార ధాన్యాలు, కూరగాయలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నది. 2019లో ఎకరాకు 2,547 కేజీల వరి పండిస్తే నేడు 3,073కు పెరిగింది. కూరగాయలు 7.25 మెట్రిక్ టన్నుల నుండి 14.9 మెట్రిక్ టన్నులకు పెరిగింది. రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీ సహాయం వల్లనే ఇది సాధ్యమైంది. నేడు వరికి రూ.2800 మద్దతు ధర ఇస్తుందంటే రైతుల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల వామపక్ష ప్రభత్వానికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. 2020-21లో ప్రపంచాన్నే వణికించిన కరోనా సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 2013లో ఆహార భద్రతా చట్టం అమలు చేసిన రాష్ట్రం కేరళ. ‘అతిజీవనం కేరళీయం’ పథకాన్ని ప్రవేశ పెట్టి 80 లక్షల కుటుంబాలకు 17 రకాల నిత్యావసర సరుకులు అందించి ప్రజల ప్రాణాలను కాపాడింది. ఆ రాష్ట్ర ప్రజలనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వెళ్ళిన వారిని వలస కార్మికులు అనకుండా గెస్ట్ వర్కర్లుగా నామకరణం చేసి అందరికీ తమ ప్రజల మాదిరిగానే నిత్యావసర సరుకులు అందించి ఆదర్శంగా నిలిచింది.
ప్రజాసంక్షేమం
వ్యవసాయ కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తున్నది. గుజరాత్ మోడల్ అని చెప్తున్న బిజెపి పాలిత రాష్ట్రంలో సగటు వేతనం రూ.300 ఉంటే కేరళలో రూ.720 ఉంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా రైతు, కూలీల మధ్య సుహృద్భావ సంబంధాలు ఏర్పరించింది. కూలీలు పని చేసిన రోజే రైతు దగ్గర డబ్బులు లేకపోతే పంచాయతీలే కూలీలకు వేతనాలు చెల్లిస్తాయి. రైతు తమ దగ్గర ఉన్నప్పుడు పంచాయతీకి చెల్లిస్తాడు. ప్రతి రైతు సంక్షేమ బోర్డుకి 10 నుంచి 15 రూపాయలు నిధి చెల్లించాలి. కూలీ రూ.2 చెల్లించాలి. ప్రభుత్వం తమ వాటా చెల్లిస్తుంది. ఈ డబ్బుతో వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం, 60 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ సంక్షేమ బోర్డు ద్వారా అందిస్తారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమ పాళ్లలో అమలు జరపడానికి 83 వేల కోట్లతో నవ కేరళ నిర్మాణాన్ని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం చేపట్టింది. సహకార రంగానికి పెట్టింది పేరైన కేరళలో స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించే ఉద్దేశంతో సహకార రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. లక్ష కోట్లతో కేరళ కోఆపరేటివ్ బ్యాంక్‌ను ప్రారంభించింది. గ్రామీణ పేదలకు వేల కోట్లు అప్పులు ఇస్తున్నారు. కాని ఈ వ్యవస్ధను దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దేశంలో గుజరాత్ మోడల్ అని చెప్తున్న మోడీ ఆ రాష్ట్రంలో 10 వేల లోపు ఉద్యోగాలు ఇస్తే కేరళలో విజయన్ ప్రభుత్వం 3 లక్షల ఉద్యోగాలు కల్పించింది. మన దేశానికి కావాల్సింది కేరళ మోడల్.
లౌకికతత్వానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కేరళ మార్గదర్శకంగా నిలుస్తున్నది. కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే కేరళ ప్రజల మధ్య కలహాలు సృష్టించడానికి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ఎన్ని కుట్రలు పన్నినా వారి ఆటలు సాగడం లేదు. గ్రామీణ భారతంలో అంటరానితనం విలయ తాండవం చేస్తుంటే కేరళ అందుకు భిన్నంగా దళితులను దేవాలయ పూజారులుగా నియమించి చరిత్ర సృష్టించింది. దళిత వ్యక్తిని దేవాదాయ శాఖ మంత్రిగా నియమించింది. ఇటువంటి రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో నడుచుకునే కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
ప్రజలకు అంకితమై పని చేస్తున్న కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపైనా ఉంది. ఆ రాష్ట్రానికి సంఘీభావం తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రతిఘటనకు పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
వ్యాసకర్త : వి. వెంకటేశ్వర్లు
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్ : 9490098980 /