నయా ఉదారవాద విధానాలు కార్మిక హక్కులపైనే కాదు, వారి భద్రతపైనా తీవ్ర దాడి చేస్తున్నాయి. నలుగురి ప్రాణాలను బలిగొని, ఇంకా అనేక మంది తీవ్ర గాయాల పాల్జేసిన అల్ట్రా టెక్ ప్రమాదమే ఇందుకు తాజా ఉదాహరణ. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా మోడీ ప్రభుత్వం నిరుడు తీసుకొచ్చిన మూడు లేబర్ కోడ్‌లు కార్మికులకు ఉన్న అన్ని రక్షణలను తొలగించేశాయి. చివరికి వారి భద్రతను కూడా ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ప్రైవేట్ రంగ పరిశ్రమలు అధిక లాభాల కోసం తక్కువ సిబ్బందితో ఎక్కువ గంటలు పనిచేయించడం, భద్రతా నిబంధనలను గాలికొదిలేసినా పట్టించుకునే నాథుడే లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఫైనాన్స్ పెట్టుబడికి, బడా పెట్టుబడిదారులకు దాస్యం చేయడంపై ఉన్న శ్రద్ధ, కార్మికుల భద్రతపై పాలకులకు లేదని ఈ పారిశ్రామిక ప్రమాదాల పరంపర తెలియజేస్తోంది. ఎలాంటి రక్షణ చర్యలు, తనిఖీలు లేకపోవడంతో ఫార్మా, సిమెంట్, రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్ ఫ్యాక్టరీలోని కిలన్ విభాగంలో లైమ్‌స్టోన్, ఐరన్ ఓర్, రెడ్ సాయిడ్‌ల మిశ్రమం లీకవుతోందని, రక్షణ చర్యలు చేపట్టాలని రెండు నెలలుగా కార్మికులు మొత్తుకుంటున్నా యాజమాన్యం పట్టించుకోలేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రమాదం గురించి ముందస్తు హెచ్చరికలను సైతం యాజమాన్యం బేఖాతరు చేసిందంటే ఏమనుకోవాలి? బాయిలర్ పేలి, 1300 డిగ్రీల ఉష్ణాన్ని పుట్టించే కెమికల్ మిశ్రమం శరీరంపై పడి కార్మికులు పడుతున్న నరకయాతన మాటలకందనిది! తీవ్రంగా గాయపడిన 16 మందిలో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రమాదానికి గురైన కార్మికుల కుటుంబాలకు వెంటనే సమాచారం ఇవ్వడంలోనూ అదే నిర్లక్ష్యం. ఫ్యాక్టరీలో ప్రమాదం దగ్గర నుంచి తాళాలు వేసి యాజమాన్యం పరారయ్యే దాకా ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు. యాజమాన్యాన్ని విడిచిపెట్టి బాధితులపై తప్పుడు సెక్షన్లతో కేసులు పెడుతున్నారు.
పారిశ్రామిక కేంద్రంగా పిలవబడే విశాఖ జిల్లాలో… గత ఐదేళ్లలో 119 ప్రమాదాల్లో 120 మంది కార్మికులు మరణించారు. 2022లోనే 20 మంది మరణించగా, 18 మంది క్షతగాత్రులై మంచంపట్టారు. అనకాపల్లి జిల్లాలో 2021-23 మధ్య 27 పారిశ్రామిక ప్రమాదాల్లో 28 మంది బలయ్యారు. పరవాడ ఫార్మాసిటీలోనే పదేళ్లలో 40 మంది మరణించగా, 152 మంది క్షతగాత్రులయ్యారు. 2020 నాటి ఎల్‌జి పాలిమర్స్ ప్రమాదం 12 మందిని బలిగొనగా, 600 మంది ఆసుపత్రుల పాలయ్యారు. అదే ఏడాది షిప్‌యార్డ్ క్రేన్ కూలి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లో కాకినాడ జిల్లాలోని ఆయిల్ ప్యాకేజి పరిశ్రమలో 24 అడుగుల ఎత్తున్న నూనె ట్యాంకులో దిగిన ఏడుగురు కార్మికులు బలయ్యారు. అంతకుముందు ఏడాది ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ కర్మాగారంలో ప్రమాదం ఏడుగురి ప్రాణాలు తీసింది.
దేశంలో 2017-20 మధ్య జరిగిన ప్రమాదాల లెక్కల ప్రకారం.. ఏటా 1109 మంది మరణిస్తుండగా, నాలుగు వేల మందికిపైగా క్షతగాత్రులవుతున్నారు. రోజూ కనీసం ముగ్గురు కార్మికులు మరణిస్తున్నా… కార్పొరేట్ల సేవలో తరిస్తున్న పాలకుల్లో చలనం లేదు. తనిఖీలను తగ్గించి, స్వీయ ధ్రువీకరణలను అనుమతించడం ద్వారా భద్రతాపరమైన నియంత్రణలను బలహీనపరచడం అన్ని అనర్థాలకూ కారణమని అంతర్జాతీయ కార్మిక సమాఖ్య పదేపదే హెచ్చరిస్తున్నా.పాలకుల చెవికెక్కడం లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, కార్మికుల భద్రతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా గాలికొదిలేశాయి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ రసాయనాల శుద్ధి, పర్యావరణ పరిరక్షణకు, వాతావరణంలో విషవాయువుల మోతాదు తగ్గించడానికి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాల్సిన డెవలపర్ అది తన బాధ్యత కాదన్నట్టు వ్యవహరించారు. ఇప్పటికైనా భారీ పరిశ్రమలన్నింటిలో సేఫ్టీ ఆడిట్ చేయించాలి. పని పరిస్థితులను మెరుగుపరచాలి. పారిశ్రామిక ప్రమాదాలు తరచూ జరిగే జగ్గయ్యపేట, విశాఖ తదితర ప్రాంతాల్లో వంద పడకల బర్న్స్ వార్డుతో కూడిన ఆసుపత్రులు నిర్మించాలి. ప్రతి పరిశ్రమలో ప్రతి నెలా తనిఖీలు జరిపి, భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలి. ఎల్‌జి పాలిమర్స్ ప్రమాద సమయంలో ఇచ్చినట్లే కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇచ్చి మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. సకల ప్రమాదాలకు మూలమైన కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టేందుకు కార్మిక వర్గం కలసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరముంది.
