నిరంకుశత్వంలోంచి, విద్వేష రాజకీయాల్లోంచి ఏ కళలు, ఏ సృజనా మొలకెత్తవు. కళలు, సంస్కృతి, సాహిత్యం వంటివి మానవత్వానికి ప్రతీకలు. ఈ మానవత్వాన్ని దెబ్బతీసేది, వేరుపురుగులా తొలిచేది… విద్వేష రాజకీయం. సృజనాత్మకత, కళాతృష్ణ మానవత్వ భావాల్లోనుంచి మాత్రమే వెల్లివిరుస్తాయి. .’నూరు పూవ్వులు వికసించనీ… వేయి భావాలు సంఘర్షించనీ’ అంటారు మావో. సృజన అనేది బహుముఖం. కళ సృజనాత్మకమైనది… రాగద్వేషాలకు అతీతమైనది. శాస్త్ర పరిశోధనలు సైతం సృజనాత్మకత నుంచి, భావ స్వేచ్ఛ నుంచి పుట్టుకొస్తాయే తప్ప విద్వేషం నుంచి కాదన్నది జగమెరిగిన సత్యం. . ప్రపంచంలో ఏ భాషవారైనా, ఏ ప్రాంతం వారైనా ప్రేమాభిమానాలు చవిచూసేది మొట్టమొదట తల్లి నుంచే. మొదటి మాట నేర్చుకునేదీ తల్లిభాష నుంచే. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా/ పొగడరా నీ తల్లి భూమి భారతిని/ నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అంటారు రాయప్రోలు. ‘జల్దుకొని కళలెల్ల నేర్చుకు, దేశి సరుకులు నింపవోరు’ అన్న గురజాడ ప్రబోధంలో కూడా మనకి ఏ హద్దులూ విధించలేదు. ఎవరి మాతృభాష వారు మాట్లాడాలి, ఎవరికి నచ్చిన భాష వారు నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవడంలో, మాట్లాడటంలో వుండాల్సింది… స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం.
1950ల నాటి ఫ్రెంచ్ సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా జరిగిన అల్జీరియన్ తిరుగుబాటు యొక్క అసాధారణ పునఃసృష్టి ‘ద బ్యాటిల్ ఆఫ్ అల్జీర్స్’. 1966లో వచ్చిన అల్జీర్స్ యుద్ధం అనే ఈ క్లాసిక్ చిత్రంలో ముస్లింల అణచివేత, తిరుగుబాటు వంటి అత్యంత ఉత్త్రేజభరితమైన సన్నివేశాలు అనేకం వుంటాయి. ఇలాంటి క్లాసిక్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఆస్వాదించగలుగుతున్నాం కదా? రాక్ మ్యూజిక్ నుంచి హిందూస్తానీ, జానపద సంగీతం వరకూ అన్నిరకాల సంగీతాలకూ మైమరచిపోతుంటాం. మలయాళం, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి ప్రాంతీయ భాషల్లో గొప్పగొప్ప క్లాసిక్ మూవీస్ వున్నాయి. వాటన్నింటినీ ఆస్వాదిస్తున్నాం కదా?
కళాకారుడిగా వచ్చిన గుర్తింపుతో రాజకీయాల్లోకి వచ్చిన ఎపి డిప్యూటీ ముఖ్యమంత్రి… భాషకీ భాషకీ మధ్య పోటీ పెట్టే రాజకీయాలు మాట్లాడటం శోచనీయం. ఈ తరహా రాజకీయం మొదలు పెట్టిందే… కేంద్ర బిజెపి ప్రభుత్వం. దేశం మొత్తానికి ఒకే విద్యావిధానం వుండాలని హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసింది. కాదంటే కేంద్రం నుండి రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులను ఇచ్చేది లేదని బెదిరిస్తోంది. ఇది ఆయా భాషలకు చెందిన ప్రజల స్వేచ్ఛను, రాజ్యాంగబద్ధమైన హక్కును కాలరాయడమే. దాదాపు నాలుగు కోట్ల జనాభా వున్న ఫ్రెంచ్ వారు, మూడు కోట్ల వరకూ వున్న జపనీస్… తమ తమ సొంతభాషలనే అన్ని వ్యవహారాలకూ వాడతారు. పలు ఆసియా, లాటిన్ అమెరికా దేశాలూ అంతే. సాహిత్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు… అన్నీ వారి వారి మాతృభాషలోనే రూపొందించుకున్నారు. ఇది వారి అస్తిత్వానికి సంకేతం. ఏ భాషనీ ఎవరిపైనా బలవంతంగా రుద్దకూడదు. ఇప్పుడు తమిళులు చేస్తున్న పోరాటం ఇదే. తమ అస్తిత్వం కోసం, తమ మాతృభాష కోసం పోరాటం చేస్తుంటే, రెండు భాషల మధ్య తగువుగా దీన్ని చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.
కాబట్టి తమిళులనో, తమిళ సినిమాలనో తప్పుబట్టడంలో విజ్ఞతలేదు. నిజానికి వారితో గొంతు కలిపి మన మాతృభాషను కాపాడుకునే ప్రయత్నం మనం చేయకుండా… ఆ పని చేస్తున్నవారిపై బిజెపి భావజాలాన్ని మీ గొంతు నుంచి వెదజల్లడం ఎంతవరకూ భావ్యం? రాష్ట్రంలో బోధనా భాషగా వున్న తెలుగును ఎల్‌కేజీ నుంచే ఎత్తేసే ప్రయత్నానికి మద్దతిస్తున్న మీరు… వారి హక్కునెలా ప్రశ్నిస్తారు? ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండీ’ అని చెప్పడం… ఇంకో భాషను ద్వేషించడం కాదు. నా తల్లిని నేను గౌరవిస్తాను అంటే, ఎదుటివారి తల్లిని అవమానిస్తున్నట్లు కాదన్న చిన్న లాజిక్‌ను ఎందుకు మిస్సవుతున్నారు? తమిళులను తప్పుబట్టకుండా, మీరూ మీ తల్లిభాషను వారిలా ప్రేమించడం మొదలుపెడితే… ఎక్కడ గాడితప్పామో మనకర్థమౌతుంది. పదికోట్ల తెలుగువాళ్లు ఒక జాతిగా ముందడుగేయడానికి ప్రేరణ ఇవ్వగల మాతృభాషను విస్మరించి, ఆత్మగౌరవాన్ని, మరిచి, ఎవరెవరి సేవలోనో తరించిపోవడం సిగ్గుచేటు. అదిచాలదన్నట్లు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నిలబడి పోరాడుతున్న సాటి రాష్ట్రం మీద విమర్శలకు దిగడం అంతకన్నా హేయం.
