”ది జాయ్ ఆఫ్ రీడింగ్: సెలబ్రేటింగ్ ది మ్యాజిక్ ఆఫ్ బుక్స్”…పుస్తక మహోత్సవానికి ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఇచ్చిన క్యాప్షన్ ఇది. చదవడంలోని ఆనందాన్ని, పుస్తకంలోని మ్యాజిక్‌ని సంబరం చేసుకోమంటున్నది ఏఐ. పుస్తకం…పఠనం మానవ వికాసానికి, విజ్ఞానానికి ఆధారం. ‘చదవడం ఒక సంభాషణ. అన్ని పుస్తకాలు మనతో మాట్లాడతాయి. కాని, మంచి పుస్తకం వింటుంది కూడా’ అంటారో రచయిత. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మనసుకు చదవడం అంత అవసరం. ‘సంస్కృతిని నాశనం చేయడానికి మీరు పుస్తకాలను కాల్చాల్సిన అవసరంలేదు. వాటిని చదవడం మానేయండి’ అంటాడు రచయిత రే బ్రాడ్‌బరీ. సంస్కృతి వికాసంలో పుస్తకం నిర్వహించే భూమిక ఎంత కీలకమైనదో దీన్నిబట్టే అర్థమౌతుంది. గతంలో ప్రయాణాల్లో, తీరిక సమయాల్లో చదువొచ్చిన ఎవరి చేతిలో చూసినా పుస్తకం కనిపించేది. నట్టింటిలోకి నడిచొచ్చిన టీవీ… పుస్తకం పట్టుకోకుండా చేస్తే, ఆ తర్వాత వచ్చిన మొబైల్… పుస్తక పఠనాన్ని దూరం చేసింది.
ప్రతిరోజూ కనీసం ఆరు నిమిషాల పాటు పుస్తకం చదివితే చాలు, హృదయ స్పందనతో పాటు కండరాలపై ఒత్తిడి 60శాతం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒత్తిడిని ఎదుర్కోవడానికి టీ, కాఫీ తాగడం, నడక వంటివి చేస్తుంటారు. వీటన్నింటికంటే శ్రేష్టమైనది, ఆరోగ్యకరమైనది పుస్తకపఠనం అని యుకెలోని ‘ససెక్స్’ యూనివర్శిటీ గతంలో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. రక్తపోటు, హృదయ స్పందనరేటు, మనోవేదన, ఒత్తిడి వంటివి పుస్తక పఠనం ద్వారా తగ్గుతాయని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధన వెల్లడించింది. పుస్తకం ఏదైనా కావొచ్చు. పఠనం మెదడుకు ఔషధం అని మానసికవేత్తలు చెబుతున్నారు. ‘పుస్తకం దీపంలా వెలుగునిచ్చి, మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది” అంటారు అంబేద్కర్. అంతేకాదు… పుస్తకాలు చదవని వారితో పోల్చితే… చదివేవారు మెరుగైన ప్రతిభ కలిగివుంటారని బ్రిటన్‌లోని నేషనల్ లిటరసీ ట్రస్ట్ సర్వే తేల్చింది. అమెరికా, న్యూజిలాండ్, ఫిన్లాండ్, ఇంగ్లాండ్, కెనడా, సింగపూర్ వంటి దేశాలలో ఎన్ని పుస్తకాలు చదివామో చెప్పుకోవడం గొప్పతనంగా భావిస్తారు. వారి స్కూళ్లలో బోధనతోపాటు పుస్తక పఠనం ఒక పాఠ్యాంశంగా వుంటుంది. తల్లిదండ్రులు రోజూ కొంత సమయం పుస్తకాలు చదవడానికి కేటాయిస్తే… పిల్లలు వారిని అనుసరిస్తారు. ఖాళీ సమయాల్లో పిల్లలను పుస్తకాల షాపులకు, పుస్తక ప్రదర్శనలకు, గ్రంథాలయాలకు, పుస్తక ఆవిష్కరణ సభలకు తీసుకెళుతుండటం వలన, పిల్లల్లోనూ పుస్తకాలు చదవాలన్న జిజ్ఞాస పెరుగుతుంది.
‘చదువని వాడజ్ఞుండగు/ చదివిన సదసద్వివేక చతురత గలుగున్!’ అంటాడు పోతన. పుస్తక పఠనం పెంచుకోవాలన్న నిర్ణయం తీసుకోడానికి ఇదొక సందర్భం. 35వ పుస్తక మహోత్సవం విజయవాడ వేదికగా జనవరి 2 నుంచి 12 వరకూ జరగనుంది. సంక్రాంతికి ముందొచ్చే అతి పెద్ద పండుగ ఈ పుస్తక మహోత్సవం. 11రోజుల పాటు 200 స్టాళ్లకు పైగా ఏర్పాటు చేసిన ఈ మహోత్సవంలో 10లక్షల మందికి పైగా పుస్తక ప్రియులు పాల్గొంటారని అంచనా. పుస్తక సాంగత్యం పెంచుకోవడం ద్వారా విజ్ఞానం, మానసిక వికాసం అలవడుతుంది. ‘పుస్తకాలు లేని ఇల్లు, ఆత్మలేని శరీరం లాంటిది’ అంటాడు సిసిరో. డిజిటల్ పుస్తకాలొచ్చిన తర్వాత మామూలు పుస్తకాలకు కాలం చెల్లింది అనుకునే వారూ లేకపోలేదు. సాంకేతికత ఉచ్ఛస్థితిలో వున్న దేశాల్లో సైతం పుస్తక అమ్మకాలు పెరుగుతుండడం, ప్రపంచవ్యాప్తంగా బుక్ ఫెయిర్‌లు జరుగుతుండట పుస్తకాదరణకు నిదర్శనం. డిజిటల్ కంటే పుస్తక స్పర్శలోని అనుభవం గొప్పగా వుంటుంది. పుస్తకంలోని మ్యాజిక్ అదే. పుస్తకాలు, అక్షరాలు లేకుంటే మానవ విజ్ఞానం ఎలా వుండేది? అందుకే… నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం కొనుక్కోవాలి. ఈ కొత్త సంవత్సరాన్ని పుస్తక పఠనంతో ప్రారంభించేందుకు పూనిక తీసుకోవాలి. పిల్లల్ని ఈ పుస్తక మహోత్సవానికి తీసుకురావడం అంటే… వారిలో పుస్తకాల పట్ల, పఠనం పట్ల ఆసక్తిని పాదుకొలిపే ఒక సదవకాశంగా భావించాలి. పుస్తకాల అడుగుజాడల్లో పిల్లల్ని అక్షరాలా నడపాలి. ఈ అడుగులే వారి భవితకు సోపానంగా మారతాయి.
