అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి. 125 సంవత్సరాల క్రితం నవ యవ్వనంలో రాజకీయాల్లోకి ప్రవేశించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్ర సాధనలో జాతిపితగా ప్రజల మన్ననలు పొంది, మతోన్మాద శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరజీవి గాంధీ. ఆయన జీవితం స్థూలంగా ఒకవైపు దేశ సంపదను లూటీ చేసిన పరాయి పాలనపై, మరోవైపు ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చుపెట్టే మతోన్మాదంపై పోరాడటంలో సాగింది. స్వాతంత్య్రం వస్తే ఈ రెండు ప్రమాదాల నుండి దేశ ప్రజలను కాపాడుకోగలమని ఆయన నమ్మాడు. అందుకోసం అహర్నిశలు శ్రమించాడు. గాంధీ కాలం నాటి ఆ రెండు ప్రమాదాలు ఈనాటికీ దేశ ప్రజలను మరింత తీవ్రంగా వెంటాడుతున్నాయి. ఆ రోజుల్లోలాగా సామ్రాజ్యవాదం నేడు ప్రత్యక్షంగా పాలించకపోవచ్చుకానీ, వారి విధానాల ఆదేశాలే (షరతులు) దేశ ఆర్థిక విధానాలుగా అమలవుతున్నాయి. అవి రాష్ట్రాలకు, మున్సిపాలిటీలకు, చివరకు పంచాయతీల వరకు విస్తరించాయి. సామ్రాజ్యవాద కంపెనీలతో దేశీయ కార్పొరేట్ కంపెనీలు మిలాఖత్ అయి గాంధీ కాలం నాటిలాగే దేశ సంపదను, సహజ వనరులను లూటీÄ చేస్తున్నాయి. అర్థిక అంతరాలను, సామాజిక వివక్షలను పెంచుతున్నాయి. దేశాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కుతున్నాయి. దేశ ప్రజల ఐక్యతను చీల్చి, సామ్రాజ్యవాదానికి తోడ్పడిన నాటి మతోన్మాద శక్తులు నేడు దేశ పాలకులుగా అవతరించి, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అర్పించే నివాళి ఒక తంతులాగా, యథాలాపంగా జరగరాదు. ఆయన ఎదిరించిన సామ్రాజ్యవాదం, మతోన్మాద వ్యతిరేక లక్ష్యాల దీక్షా దినంగా జరగాలి.
గాంధీ- జీవితం
గుజరాత్ లోని కథియవార్ సంస్థానంలోని పోర్‌బందర్‌లో 1869 అక్టోబర్ 2న కరంచంద్ గాంధీ, పుతిలీభాయి దంపతులకు గాంధీ జన్మించాడు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి, న్యాయశాస్త్రం పూర్తయిన తర్వాత ఒక కేసు విషయమై దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడి జాతి వివక్షపై సత్యాగ్రహం చేసి, భారత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. గుజరాత్‌కు చెందిన దాదా అబ్దుల్లా దక్షిణాఫ్రికాలో వ్యాపారం చేసేవాడు. ఆయనకు అక్కడ వ్యాపార సమస్య వచ్చి కోర్టులో వ్యాజ్యం వేశాడు. ఈ కేసు వాదించడానికి యువ న్యాయవాది, అందునా విదేశాల్లో చదివిన గాంధీని సంవత్సరం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఆ రకంగా గాంధీ దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వచ్చింది. అదే ఆయన జీవిత గమ్యాన్ని మార్చివేసింది. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే జాతీయోద్యమంలో చేరలేదు. దేశ పరిస్థితులను, జాతీయ కాంగ్రెసు కార్యకలాపాలను పరిశీలించాడు. 1917-18 మధ్య కాలంలో మూడు ముఖ్యమైన ఆందోళనలను నిర్వహించాడు. అందులో రెండు రైతాంగ సమస్యల మీద, ఒకటి కార్మిక సమస్యల మీద. బీహార్‌లోని చంపారన్‌లో బలవంతంగా బ్రిటిష్ అధికారులు రైతుల చేత నీలిమందు పండించేలా చేసుకున్న ఒప్పందంపై ఆయన ఆందోళన చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రభుత్వానికి శిస్తులు కట్టలేక రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆందోళన చేసి పన్నులు తగ్గించాడు. ఈ రెండూ బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక రైతాంగ ఉద్యమాలు. మూడోది, గుజరాత్‌లోని అలహాబాద్ మిల్లు కార్మికుల సమస్య. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారత పెట్టుబడిదారుల పరిశ్రమల ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్ వల్ల అదనపు పని చేయించుకోవడానికి కార్మికులకు కూలీలు పెంచారు. యుద్ధం ముగిసిన వెంటనే పెరిగిన వేతనాలను స్వదేశీ పెట్టుబడిదారులు తగ్గించివేశారు. దీనిపై కార్మికులు ఆందోళన చేబట్టారు. యజమానులకు, కార్మికులకు గాంధీ మధ్యవర్తిత్వం నడిపినా ఫలించలేదు. దీంతో కార్మికులను సమ్మె చేయమని పిలుపునిచ్చాడు. సమ్మెకు మద్దతుగా దేశంలో మొదటి సత్యాగ్రహ దీక్ష చేపట్టాడు. ఈ మూడు ఉద్యమాల తర్వాత జాతీయ కాంగ్రెస్‌లో చేరి 1921 సెప్టెంబర్ 21న తన వేషధారణ మార్చుకున్నాడు. దీనిపై తొలి రోజుల్లో అనేక అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నా చివరి శ్వాస విడిచేవరకు అదే వేషధారణతో జీవించాడు.
గాంధీ-మతం
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమాలను మరో సందర్భంలో చర్చిద్దాం. ప్రజల ఐక్యతను చీల్చే మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆయన చేసిన కృషిని స్మరించుకోవడం నేటి తక్షణావసరం. మన రాష్ట్ర రాజకీయాలు గత కొన్ని వారాల క్రితం తిరుపతి లడ్డుతో ప్రారంభమై, మత సామరస్యాన్ని దెబ్బ తీసేవిధంగా మారుతున్నాయి. పాలక ప్రతిపక్ష పార్టీల ప్రకటనలు రాష్ట్ర లౌకిక, ప్రజాస్వామిక శక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి, మతోన్మాద శక్తులకు కొత్త ఊపిరి పోసేవిధంగా వున్నాయి. ఈ సందర్భంలో గాంధీజీ మతం పట్ల అనుసరించిన వైఖరిని స్మరించుకోవడం అవసరం. ‘మతం’ అనే పదాన్ని రెండు అర్థాలలో వాడినట్లు ఆయన జీవిత ఆచరణ తెలుపుతుంది. ఒకటి, పైకి కనిపించే హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం ఇలా అనేక మతాల ఆచారాలు. రెండు, మతం అంటే దైవంలో, సత్యంలో, ధర్మంలో విశ్వాసం కలిగివుండటం. ఈ రెండో అర్థంలో మతమనేది ఏ ఒక్క మతానికి పరిమితమైంది కాదు, సర్వ మతాల సారం. అంటే మనిషి జీవిత నైతిక నియమావళి. ఈ నైతిక విలువలు అన్ని మతాలలోనూ ఒకే విధంగా వున్నాయని ఆయన చెప్పాడు. దేశవ్యాప్తంగా పర్యటించే క్రమంలో, భారత ప్రజల మధ్య వున్న మతాతీత సంబంధాన్ని గమనించడం పెరిగే కొద్దీ మతం పట్ల తన అభిప్రాయాలను మరింత లౌకికంగా మలచుకున్నాడు. మొదట్లో ఆయన చెప్పిన ‘దైవమే సత్యం’ అనే అభిప్రాయాన్ని ‘సత్యమే దైవం’ అని మార్చుకోవడం ఇందులో భాగమే. ”నిజమైన మతం, నిజమైన నైతికత ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి వున్నాయి. నేలలో నాటిన విత్తనానికి నీరు ఎంత అవసరమో మతానికి నైతికత అంత అవసరం” అని గాంధీ బోధించాడు. నైతికత అంటే ఏమిటో ఆయన రవీంద్రనాథ్ టాగూర్‌కు 24-11-2021న రాసిన లేఖలో ఇలా వివరించారు. ”అసత్యం, క్రూరత్వం, విద్వేషం, ఆపుకోలేని ఉద్రేకం వున్నవాడు నైతికత కోల్పోయిన వాడవుతాడు. వాడికి మతం గురించి ఉచ్ఛరించే హక్కు లేదు” అదే లేఖలో ”మన కోరికలు, ఉద్దేశాలను…స్వార్థం, నిస్వార్థం అనే రెండు రకాలుగా విభజించవచ్చు. స్వార్థపూరిత కోరికలన్నీ అనైతికమైనవి. అత్యున్నత నైతికత అంటే ఏమిటంటే మానవాళి మేలు కోసం నిరంతరం కృషి చేయడమే’ అన్నాడు.
గాంధీ బోధించిన నైతికత నేటి పాలక వర్గ రాజకీయ నాయకుల్లో లోపించింది. అందుకే వారు అబద్ధాలమీద, విద్వేషంమీద ఆధారపడి మానవాళికి విరుద్ధమైన స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు. వ్యక్తిగత విశ్వాసంగా ఉండాల్సిన మతాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఎలా వక్రీకరిస్తారో ఆయన ఆనాడే ప్రజలను హెచ్చరించాడు. ”మతం అనే చెట్టుకు ఒకే మొదలు ఉంటుంది. అయితే ఆ మొదలుకు అనేక కొమ్మలు ఉన్నాయి… కానీ అది మానవ సమాజం మీదగా వెళ్తున్నప్పుడు అసహ్యంగా మారుతుంది” అన్నాడు. వేషాలనుబట్టి, ఉచ్ఛరించే మాటలనుబట్టి మత విశ్వాసి అని అనుకోలేమని, వారు ఆచరించే మార్గం ప్రజా సంక్షేమానికి ప్రమాదమా, దోహదమా అనే వాటిని బట్టి నిర్ణయించాలన్నాడు. ప్రజలందరూ కలిసి జీవిస్తున్నప్పుడు వారి సమస్యలు ఉమ్మడిగానే ఉంటాయి. మతాన్ని బట్టి సామాజిక సమస్యలు ఉండవు” అంటూ ”మత కారణాలతో మనుషులను మనషుల నుంచి వేరు చేయడం పూర్తిగా తప్పు. రెవెన్యూ, పారిశుధ్యం, పోలీసు, న్యాయం లేదా ప్రజా ప్రయోజనాలపరంగా ప్రజల మధ్య ఏం వైరుధ్యం ఉంటుంది. తేడా అంతా మతాన్ని అవలంబించడంలో, ఆచారాలలో ఉంటుంది. వాటితో లౌకిక రాజ్యానికి సంబంధమే లేదు’ అని జీవిత సత్యాన్ని ఆయన బోధించాడు. తాను స్వయంగా నిర్వహించిన ‘హరిజన్’ పత్రికలో 24-8-1947న మతానికి, రాజ్యానికి ఉండాల్సిన తేడాను స్పష్టంగా ఇలా రాశాడు. ”నేనే గనుక నియంతనయితే మతం మరియు రాజ్యం వేరుగా ఉంచుతాను. నేను నా మతంపై ప్రమాణం చేస్తున్నాను. నేను దాని కోసం చనిపోతాను. అయితే అది నా వ్యక్తిగత వ్యవహారం. రాజ్యానికి (ప్రభుత్వానికి) దానికి సంబంధంలేదు” ”నాకే కనుక అధికారం ఉంటే, మతతత్వాన్ని ప్రోత్సహించే ఎత్తుగడతో రాసిన రచనలన్నిటినీ నిషేధిస్తా” అని హ్చెరించాడు. ‘మతతత్వం దేశ వ్యతిరేకమే కాదు, అది హిందూ మతతత్వమైతే హిందూ మత వ్యతిరేకం, ముస్లిం మతతత్వమైతే ముస్లిం మత వ్యతిరేకం అని’ ఆయన నిరంతంం ఘోషించాడు.
కానీ ఈ రోజు పాలక వర్గ పార్టీలు చేస్తున్నది ఏమిటి? తరాలుగా ఏర్పడి జీవనవిధానంగా కొనసాగుతున్న మత సామరస్యానికి తీవ్ర ప్రమాదం తెచ్చేటట్లు మాట్లాడటం, వ్యవహరించడం పెరిగిపోతున్నది. ఆరు నెలలు కలిసి తిరిగితే వారు వీరవుతారన్నట్లు బిజెపితో స్నేహం చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీహార్‌లో నితీష్ కుమార్‌లు మతతత్వం వైపు అడుగులు వేస్తున్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా మతతత్వ భావజాల వ్యాప్తి అత్యంత ప్రమాదకరం. రాజకీయంగా కూడా అది కమలం పార్టీకే బలం చేకూరుస్తుంది తప్ప ప్రాంతీయ పార్టీలు బావుకునేది ఏమీ వుండదు. శివసేన, అన్నా డిఎంకె వంటి పార్టీల అనుభవం అదే! గాంధీజీ చెప్పినట్లు ‘మత హింస లేకుండా మతతత్వ భావజాలం జీవిస్తుంది. కానీ ముందుగా మతతత్వ భావజాలం వ్యాప్తి జరగకుండా మత హింస వుండదు’. అందుకే 1939 చివరి నుండి ఆయన తుది శ్వాస వరకు ఈ మతతత్వాన్ని ఎదిరించాడు. 1945 నుండి దేశంలో పేట్రేగిన మతోన్మాద హింసపై ఆయన తీవ్రంగా కలత చెందాడు. 77 సంవత్సరాల వయసులో దాదాపు ఒంటరిగా మత హింస జరుగుతున్న బెంగాల్‌లోని నౌఖాలీ, బీహార్, కలకత్తా, ఢిల్లీలో మత సామరస్యం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడాడు. బీహార్ హిందువులు తమ పద్ధతులు మార్చుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని 1946 నవంబర్ 6న హెచ్చరించాడు. 1947 జనవరిలో నౌఖాలీలో హిందువులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా గ్రామ వీధుల్లో చెప్పులు లేకుండా పాదయాత్ర చేయడమే కాక, ఒక పేద ముస్లిం ఇంట కొన్ని రోజులపాటు నివసించాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమివేయడంలో విశేష కృషి చేసిన గాంధీజీ, హిందూ మతోన్మాది గాడ్సే చేతిలో బలికావడం మతోన్మాద వికృత చేష్టకు పరాకాష్ట. ఎవరు, ఏ రూపంలో మతోన్మాదాన్ని పెంచి పోషించినా ప్రతిఘటించడమే ఆ మహాత్ముడికి ఇచ్చే నిజమైన నివాళి.
వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్