మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మరో మార్గం లేక ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తమకు విశ్వాసపాత్రుడైన బీరెన్ సింగ్‌ను అన్ని విధాలుగా రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. బిజెపిలో బీరెన్ సింగ్‌పై తిరుగుబాటు పెరగడంతో, కేంద్ర నాయకత్వం మిన్నకుండిపోయింది. బీరెన్ పదవి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. మణిపూర్‌లో పరిస్థితి జాతి-మత ఘర్షణలతో దిగజారుతున్న తరుణంలో కేంద్ర నాయకత్వం ఆయన రాజీనామాను ఆమోదించి ఉంటే…బహుశా అక్కడ జరిగిన ఊచకోతను నివారించగలిగేది.
కేంద్రంలో 2014లో మొదటిసారిగా మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, ఈశాన్య ప్రాంతం సంఫ్‌ు పరివార్‌కు ప్రయోగశాలగా మారింది. ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆర్‌ఎస్‌ఎస్, సంఫ్‌ు పరివార్‌లకు ఎప్పుడూ నచ్చలేదు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కార్యకర్తలను తీసుకురావడం ద్వారా ఈశాన్య ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఫలించలేదు. అయితే, 2014లో కేంద్రంలో అధికార మార్పు ఈశాన్య ప్రాంతంలో సంఫ్‌ు పరివార్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో బిజెపి ఈశాన్య రాష్ట్రాల్లో మెల్లగా అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్‌ను చీల్చడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్‌లలో బిజెపి అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ వరుసగా 15 సంవత్సరాలు పాలించిన మణిపూర్‌లో బిజెపి పట్టు సాధించింది బీరెన్ సింగ్ ద్వారానే. ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. అంతేగాక మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబి సింగ్‌కు అత్యంత సన్నిహితుడు. 2016లో, బిజెపి బీరెన్ సింగ్‌ను ‘ఆపరేషన్ కమల్’తో ఆకట్టుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లతో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, కేవలం 21 సీట్లు మాత్రమే ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ ఫ్రంట్, నాగా పీపుల్స్ ఫ్రంట్ మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఫుట్‌బాల్ ఆటగాడైన బీరెన్ మణిపూర్ రాష్ట్ర జట్టు సభ్యుడు. ఆ క్రమంలోనే బిఎస్‌ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)కు ఎంపికయ్యాడు. ఫుట్‌బాల్ మైదానంలో వింగ్ బ్యాక్ స్థానంలో ఆడిన ఆయన, రాజకీయాల్లో స్ట్రైకర్ పాత్రకు మారాడు.
బిజెపికి పూర్తి మెజారిటీ లేకపోవడంతో అప్పటి బీరెన్ సింగ్ ప్రభుత్వ పాలన ప్రశాంతంగా జరిగింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో, బిజెపి 32 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ‘ఆపరేషన్ ఆకర్ష్’ ద్వారా వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలతో, 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో బిజెపి బలం 37కి పెరిగింది. దీనితో, పాలనా శైలి కూడా మారిపోయింది. కేవలం 33 లక్షల మంది జనాభా కలిగిన చిన్న రాష్ట్రమైన మణిపూర్‌లో, మెయితీలు 53 శాతంగా ఆధిపత్య సమూహంగా ఉన్నారు. నాగాలు 20 శాతం, కుకీలు 16 శాతం ఉన్నారు. పంగల్, కోమ్ వంటి చిన్న సమూహాలు కూడా ఉన్నాయి. మెయితీలలో కేవలం 10 శాతం మంది మాత్రమే క్రైస్తవులు కాగా, కుకి-నాగా సమాజంలో ఎక్కువ మంది క్రైస్తవులు వున్నారు. 1864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇంఫాల్ లోయ, దాని చుట్టూ కొండలతో మణిపూర్ ప్రకృతి దృశ్యం ఆకట్టుకుంటుంది. మెయితీలు పూర్తిగా లోయలలోను, కుకీలు, నాగాలు ఎక్కువగా కొండలలోనూ నివసిస్తారు.
విద్వేష రాజకీయం
సంఘ్ పరివార్ క్రైస్తవ కుకీల పట్ల మెయితీలలో విద్వేషాన్ని రగిలించడం ద్వారా చీలిక రాజకీయాలకు పాల్పడుతోంది. బిజెపికి పూర్తి మెజారిటీ రావడంతో, విద్వేష రాజకీయాలు తీవ్రమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ నమూనాతో పనిచేసే అరంబై తెంకోల్, మెయితీ లీపున్ వంటి సంస్థలు సంఫ్‌ు పరివార్ సహాయంతో క్రియాశీలకంగా మారాయి. కుకీ వ్యతిరేక భావన ఈ సంస్థల పునాదిగా వుంది. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఈ తీవ్రవాద సంస్థలను నేరుగా ప్రోత్సహించారు. బీరెన్ ప్రభుత్వం కుకీలను తరిమికొట్టడంతో పాటుగా, అనేక అణచివేత చర్యలకు పాల్పడింది. ఇది పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. మెయితీ తెగకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించడాన్ని పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశం మెయితీ-కుకీల మధ్య విద్వేషాలను రగిల్చింది.
రెండు జాతుల మధ్య 2023 మే 3న ఘర్షణ ప్రారంభమైంది. తిరుగుబాటును ముందుగానే ప్లాన్ చేసుకున్న అరంబై తెంకోల్-మెయితీ లీపున్ సంస్థలు… లోయ లోని, కొండల మీది క్రైస్తవ చర్చిలు, పాఠశాలలు మొదలైన వాటిపై విచక్షణా రహితంగా దాడి చేశాయి. లోయలో క్రైస్తవులను వేటాడారు. కుకీలు కూడా ఆయుధాలు చేపట్టడంతో మణిపూర్‌లో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది. మెయితీ-కుకి ప్రాంతాలు రెండు శత్రు రాజ్యాల మాదిరిగా విడిపోయాయి. మెయితీ తీవ్రవాద సంస్థలకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన బీరెన్ సింగ్‌ను తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు సమిష్టిగా డిమాండ్ చేసినప్పటికీ…మోడీ, అమిత్ షా చెవికెక్కించుకోలేదు. నెలల తరబడి జరిగిన అల్లర్లలో దాదాపు 300 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆస్తులను కోల్పోయారు. మహిళలపై అత్యాచారాలు జరిగాయి.
లోక్‌సభ ఎన్నికలలో రెండు స్థానాల్లోనూ బిజెపిని ఓడించడం ద్వారా మణిపూర్ వాసులు ఒక హెచ్చరిక ఇచ్చారు. అయినప్పటికీ బీరెన్ సింగ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కాపాడుతూనే ఉన్నారు. స్పీకర్ తోక్‌చమ్ సత్యబ్రత సింగ్ సహా 18 మంది బిజెపి ఎమ్మెల్యేలు సింగ్‌ను వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తామని స్పీకర్ కేంద్ర నాయకత్వానికి తెలియజేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితిలో బీరెన్ రాజీనామా కోరారు అమిత్ షా. ఎనిమిదేళ్ల పాలన తర్వాత బీరెన్ సింగ్ రాజీనామా సమయానికి … సంఫ్‌ు పరివార్ విభజన రాజకీయాల కారణంగా ఏర్పడిన తీవ్ర గాయంతో మణిపూర్ అల్లాడుతోంది.
– ‘దేశాభిమాని’ సౌజన్యంతో ఎం. ప్రశాంత్