మణిపూర్‌ మళ్లీ ఉద్రిక్తం

నివురు గప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌ మళ్లీ రాజుకుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలు ఆ రాష్ట్ర ప్రజలను వెన్నాడుతున్నాయి. ఆది, సోమవారాల్లో కొన్ని గ్రామాలపై డ్రోన్లతో దాడులు జరగటంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుకీ, మెయితీ తెగల పోటాపోటీ ప్రదర్శనలు, తమ తమ డిమాండ్ల పునరుద్ఘాటన మళ్లీ తెర మీదికి వచ్చి, పరిస్థితిని ఉద్రిక్తభరితం చేస్తున్నాయి.
డబుల్‌ ఇంజను ప్రభుత్వాలు ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధితో ఆకాశానికి చేరుస్తామని డాంబికాలు పలికే బిజెపి … మణిపూర్‌లో 2022 నుంచీ ఏలుబడిలో ఉంది. అప్పుడూ ఇప్పుడూ కూడా కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీఎనే అధికారంలో ఉంది. కానీ, ఈ డబుల్‌ ఇంజను పాలకులు మణిపూర్‌కి ఏ మేలూ చేయకపోగా, తెగల మధ్య ఉన్న విబేధాలను విద్వేష విధ్వంస స్థాయికి తీసుకెళ్లారు. కొండల్లో నివాసం ఉంటూ అభివృద్ధికి దూరంగా ఉన్న కుకీల ప్రయోజనాలకు భంగం కలిగించే విధానాలకు, నినాదాలకు కాషాయ పార్టీ బహిరంగంగానే కొమ్ము కాచింది. రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన బీరేన్‌ సింగ్‌ మెయితీల ప్రతినిధిగానే అనేక సందర్భాల్లోనూ వ్యాఖ్యానించి, కుకీల్లో అభద్రతను పెంచాడు. మొయితీలకు గిరిజన గుర్తింపు ఇవ్వొద్దన్న డిమాండుతో ప్రదర్శనలు జరిపిన కుకీలపై రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యహరించింది. సరిగ్గా 16 నెలల క్రితం కుకీ గ్రామాలపైనా, కుకీ తెగ మహిళల పైనా అల్లరిమూకలు సభ్యసమాజం తలదించుకునేంత అమానవీయంగా హత్యలకు, అత్యాచారాలకు, మూకుమ్మడి దాడులకు, దహనాలకు పాల్పడినా, బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధిత మహిళలు, పురుషులూ పోలీసుల శరణు కోరినా రక్షణ దొరకలేదు. ముష్కర మూకల దాడులూ, దౌర్జన్యాలను రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా నివారించే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌, రాష్ట్ర ప్రభుత్వమూ ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శలు అప్పట్లోనే పెద్దఎత్తున వచ్చాయి. ఈ అనుమానాలను బలపరుస్తూ, ఇటీవల ముఖ్యమంత్రి సంభాషణల ఆడియో టేపులు వెలుగు చూసి, కలకలం సృష్టించాయి. మెయితీయులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు వార్తలు వెలువడి, కుకీల్లో ఆందోళన పెరగటానికి కారణమయ్యాయి.
ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందిన అమానవీయ సంఘటనలు మణిపూర్‌లో జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తగిన విధంగా స్పందించలేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ, వివిధ దేశాల్లోనూ విస్తృతంగా పర్యటించే ప్రధాని మోడీ ఇంతవరకూ మణిపూర్‌ని సందర్శించలేదు. బాధితులను పరామర్శించలేదు. ప్రతిపక్షాలు పెద్దపెట్టున పార్లమెంటులో నినదించినా, నిరసన వ్యక్తం చేసినా మణిపూర్‌ పరిస్థితులను మెరుగుపర్చటానికి నిర్దిష్ట కార్యాచరణకు పూనుకోలేదు. గతేడాది మే నాటి దమనకాండ కారణంగా సర్వం కోల్పోయిన వేలాదిమంది ఇప్పటికీ సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. చాలామంది రాష్ట్రాన్ని విడిచిపెట్టి, ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. విద్వేష మూకల దాడుల కారణంగా చదువులను సగంలోనే వదిలేసి, పారిపోయిన యూనివర్సిటీ విద్యార్థులు తిరిగి చేరలేదు. అల్లర్లలో ఆచూకీ లేకుండా పోయిన అనేకమంది గురించి వారి కుటుంబ సభ్యులకు ఇంతవరకూ ఏ సమాచారమూ లేదు. ”మా బిడ్డ ప్రాణాలతో లేదని మాకు తెలుసు. కనీసం ఆ విషయాన్ని నిర్ధారించండి. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునే అవకాశం కల్పించండి.” అని ఉమన్‌ అనే ఓ తండ్రి ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతుండడం పాలకుల నిర్పూచీతనానికి ఒక నిదర్శనం.
కలిసి జీవించాల్సిన ప్రజల మధ్య ఏ కారణం చేత విబేధాలు ఏర్పడ్డా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని, సయోధ్య కుదిర్చే చర్యలను చేపట్టాలి. శాంతి, సామరస్యం నెలకొనేలా కృషి చేయాలి. మైనార్టీ – మెజార్టీ అనే సంకుచిత ఆలోచనలతో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పనిచేస్తే అది దేశ ప్రయోజనాలకు తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. ఈశాన్యాన సరిహద్దు రాష్ట్రంగా ఉన్న మణిపూర్‌లో శాంతిభద్రతలు, ప్రజల సమైక్య జీవనం చాలా అవసరం. అల్లర్లకు ఆజ్యం పోసేలా కాక శాంతి సామరస్యాలు నెలకొల్పేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తక్షణ చర్యలు చేపట్టాలి.

➡️