మెరీనా విషాదం

Oct 10,2024 05:53 #Articles, #edite page

చెన్నైలోని మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్‌షోలో ఐదుగురు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వైమానిక దళపు 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆరవ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌షోకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించడంతో లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు. దాదాపుగా 15 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరై ఉంటారని అంచనా! ఇంత భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేటప్పుడు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలో, ఎంత అప్రమత్తంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తరహా చర్యలన్నీ తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక లోపం బయటపడుతూనే ఉంటుంది! ముఖ్యంగా ప్రకృతి నుండి అనూహ్యంగా వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఎయిర్‌ షో జరిగిన రోజు కూడా అటువంటి పరిస్థితే. 34 నుండి 35 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు ఆ రోజు వాతావరణం వేడెక్కింది. విపరీతంగా వేడి గాలులు వీచాయి. తీవ్రమైన ఎండ ధాటికి తట్టుకోలేక ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా స్పృహ కోల్పోయారు. 102 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తమకు తల తిరుగుతున్నట్లు ఫిర్యాదులు చేశారు. వడదెబ్బతోపాటు, డీ హైడ్రేషన్‌, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు కూడా ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు.
అయితే, ఈ స్థాయి ఉష్ణతాపం గురించి ముందుగా హెచ్చరికలు లేవా అంటే ఉన్నాయి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్సు ఈ స్థాయి ఉష్ణొగ్రతలుంటే ఏం చర్యలు తీసుకోవాలో వివరిస్తూ కొన్ని సలహాలు, సూచనలు చేసింది. అయితే, నిర్దిష్టంగా ఎటువంటి హెచ్చరికలు లేవని అంటున్నారు. పైగా చెన్నై నగరానికి ఆ స్థాయి ఉష్ణొగ్రతలు కొత్త కూడా కాదు. దీంతో తాగునీరు ఏర్పాటు వంటి చర్యలను తీసుకున్నారు. అయితే, ఎయిర్‌ షో సజావుగా సాగిన తరువాత కార్యక్రమం ముగింపు సమయంలో ఒక్కసారిగా ఈ విపత్తు ముంచుకొచ్చింది. అందరూ ఒక్కసారిగా తిరిగి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఏర్పడిన తీవ్రమైన ఉక్కపోత పరిస్థితులకు తోడు అధిక ఉష్ణోగ్రత ప్రజానీకంపై ప్రభావం చూపింది. మెరీనా బీచ్‌ లోపలికి వెళ్లడానికి అనుమతించిన గేట్లను మూసివేశారు. వెళ్లడానికి ఉద్దేశించిన గేట్ల నుండే బయటకు పంపడానికి చాలాసేపు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. పరిస్థితి చేయి దాటిన తరువాత ఆ గేట్లను కూడా తెరిచినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు మెట్రో, మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ వంటి రవాణా వ్యవస్థలు విఫలమైనాయి. రోడ్లు కిక్కిరిసి పోవడంతో బాధితులను ఆస్పత్రులకు తరలించడమే కష్టంగా మారింది. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ వివిధ శాఖలు సమన్వయంతో పని చేసినా, ప్రజలు అంచనాకు మించి తరలిరావడంతో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడిందని అన్నారు.
ఈ స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం చెన్నైకి కొత్తేమీ కాదు. 2003 సెప్టెంబర్‌ ఆరున నిర్వహించిన భారత వైమానిక దళ ప్రదర్శనను వీక్షించడానికి 13 లక్షల మంది తరలివచ్చినట్లు అధికారిక సమాచారం. దానితో పోల్చుకుంటే ఈ ఏడాది అదనంగా వచ్చింది రెండు లక్షల మంది మాత్రమే! అప్పట్లో పిల్లలు తప్పిపోవడం వంటి సంఘటనలు మినహా ఈ తరహా మరణాలు లేవు. అప్పట్లో కూడా ట్రాఫిక్‌ రద్దీ కారణంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితే ఏర్పడటంతో ఆ కార్యక్రమం నుండి నేర్చుకున్న పాఠాలు ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సాంకేతికంగా మౌలిక వసతులు, రవాణా వంటివి ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిధే అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ బాధ్యతనూ విస్మరించలేం. మెట్రోతో పాటు ఇతర రైళ్లను అందుబాటులో ఉంచడంలో రైల్వే శాఖ విఫలమైంది. వాతావరణ శాఖ వేడిగాలులు గురించి స్పష్టమైన హెచ్చరికలు చేయలేదు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కోరిన అన్ని సౌకర్యాలు కల్పించామని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. దీన్నిబట్టి ఎయిర్‌ఫోర్సే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

➡️