ప్రధాని మోడీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గాంధీ గురించి కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రపంచానికి చాటి చెప్పలేదు. ఆయనపై సినిమా వచ్చేవరకూ ప్రపంచానికి తెలియలేదు’ అన్నారని వార్త. ఆ వ్యాఖ్య సత్యదూరం. అయినా ప్రభుత్వాలు ప్రచారం చేస్తే తప్ప, ప్రపంచానికి తెలియని పేరా ఆయనది? నోబెల్ శాంతి పురస్కారం విషయమై ఆయన పేరు పలుమార్లు పరిశీలనకు వచ్చిందన్నది చరిత్ర. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో కీలక భూమిక ఆయనదే అన్న విషయమే కాకుండా, అంతదాకా ఎవరూ ఊహించని రీతిలో సత్యాగ్రహ దీక్ష, అహింస ద్వారా పోరాటం అన్నది ప్రపంచాన్ని అప్పుడే ఆకర్షించిన విషయం. ఆయన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తే ఆ ‘అర్ధనగ ఫకీరు’ని చూడడానికి, మాట్లాడడానికి అక్కడి సామాన్య ప్రజలు, మీడియా తండోపతండాలుగా చేరారంటారు. ఆయన సమకాలికులైన ప్రపంచ స్థాయి మేధావులు టాల్ స్టారు, ఐన్‌స్టీన్, చార్లీ చాప్లిన్ లతో మంచి సంబంధాలు. ఆయన విధానాల పట్ల ప్రపంచానికి అప్పుడే ఆసక్తి. ‘అక్షరాస్యత, సాంకేతికత తక్కువగా ఉన్న రోజుల్లో ఆయన పిలుపుకి దేశమంతా స్పందన ఎలా సాధ్యమయ్యేది’ అని. మార్టిన్ లూథర్ కింగ్, మండేలా లాంటి ప్రపంచ దేశాల ముందు తరం నేతలకు ఆయన అహింసా విధానమే స్ఫూర్తి. ఆ విషయాన్ని వారే చెప్పారు. కాబట్టి ఏరకంగా చూసినా ప్రధాని చెప్పిన విషయం – అదే, సినిమా వచ్చాక తెలిసింది – అన్నది అతిశయోక్తి. మహాత్ముడికి మార్కెటింగ్ అవసరం పడలేదు. ఆయన జీవించి వుండగానే ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. గాంధీ సినిమా, మున్నా భారు సినిమా లాంటివి ఆయన్ని మరోసారి గుర్తు చేస్తాయి. అంతే.
– డా.డి.వి.జి. శంకరరావు,మాజీ ఎంపీ, విజయనగరం.