‘మనల్ని ఈ దేశంలో ఉండనిచ్చారు. కనుక మనం ఈ దేశ రక్షణ కోసం పోరాడాలి.’ ఇదొక షార్ట్ ఫిలింలోని డైలాగ్. మృత్యుశయ్య పైనున్న ఓ తండ్రి…సైన్యంలో పనిచేసే తన కొడుక్కి ఇచ్చే సందేశమిది. హిందువులు భారత దేశంలో ఉండాలి. ముస్లింలు పాకిస్తాన్ వెళ్లాలన్న భావన లోంచి వచ్చిన డైలాగ్ అది. భారతదేశం కేవలం హిందువుల దేశం అన్న అవగాహన రాజ్యాంగ విరుద్ధమని ఆ షార్ట్ ఫిలిం తీసిన వారికి చెప్పినప్పుడు, అవునా ! మాకు తెలియదే అంటూ ఆశ్చర్యపోయారు. సంఫ్‌ుపరివార్ దుష్ప్రచారం వల్ల చాలామంది, ప్రత్యేకించి యువత ఈ తప్పుడు అవగాహనతో ఉన్నారు. పాకిస్తాన్ మాత్రమే మత ప్రాతిపదికన ఏర్పాటయిందనే విషయం వారికి తెలియదు. బ్రిటిష్ పాలకుల దుష్ట పన్నాగం వల్ల, వారి ప్రోద్బలంతో సాగిన మత విద్వేష ప్రచారం వల్ల జాతీయోద్యమ నాయకులు దేశ విభజనను ఆపలేకపోయారు. స్వాతంత్య్రమా? దేశ విభజనా అన్న ప్రశ్న వలస పాలకుల నుండి వచ్చిపడింది. సావర్కర్ గొల్వాల్కర్, మహ్మదాలీ జిన్నాల రెండు జాతుల వాదనను కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించపోయినా ఆ వాదనే దేశ విభజనకు కారణమైంది.
విభజన కోసం పట్టుపట్టిన జిన్నా ఒక రాజకీయ నాయకుడు, మతం పట్ల ఆసక్తి లేనివాడు. ఆహార్యంలో, ఆలోచనల్లో ఆంగ్లేయుడు. కాగా ఆనాటి కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లో ఒకరైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇస్లామిక్ పండితుడు. పాకిస్తాన్ ఏర్పాటును ఆయన గట్టిగా వ్యతిరేకించారు. మత ప్రాతిపదికపై దేశ సరిహద్దులు నిర్ణయించరాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అలా చేయడం ఖురాన్‌కు వ్యతిరేకం అన్నారు. మౌలానా నవంబర్ 11, 1888లో మక్కాలో పుట్టారు. ఆయన తండ్రి ప్రముఖ ఇస్లామిక్ పండితుడు, బెంగాల్ నుండి 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా మక్కా వెళ్లి స్థిరపడ్డారు. మౌలానాకు బాల్యంలో ఆయనే చదువు చెప్పారు. ఆ తర్వాత వివిధ సబ్జెక్టుల్లోని పండితులు చదువు చెప్పారు. మౌలానా ఇండియాకు వచ్చి స్వాతంత్య్ర పోరాటంలో చేరారు. అరబ్బీతో పాటు ఇంగ్లీషు, పారసీ, ఉర్దూ, బెంగాలీ భాషల్లో ప్రావీణ్యం గడించాడు. కలకత్తా నుండి ఉర్దూలో ‘అల్ హిలాల్’ వార పత్రిక నడిపారు. అది స్వాతంత్య్ర పోరాటానికి మద్దతునిస్తూ, హిందూ ముస్లిం ఐక్యతను ప్రబోధించేది. బ్రిటిష్ పాలకులు ఆయన పత్రికను మూయించారు. స్వాతంత్రం తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా ఉంటూ యుజిసి, ఐఐటి, ఐసిఎస్‌ఆర్ వంటి ఎన్నో గొప్ప సంస్థలను విశ్వవిద్యాలయాలను నెలకొల్పి దేశ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు. ఆధునిక విద్యావ్యాప్తికి కృషి చేశారు. పలుపుస్తకాలు రాశారు. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న బిరుదు ప్రకటించింది. మౌలానా అంటే పండితుడు కాగా, ఆజాద్ (స్వాతంత్య్రం) ఆయన కలం పేర్లు.
యునైటెడ్ ప్రావియెన్స్ నుండి రాజ్యాంగ సభకు ఎన్నికైన మౌలానా ….రౌండ్ టేబుల్ సమావేశంలోనూ, బ్రిటిష్ పాలకులతో పలుదశల్లో జరిగిన చర్చల్లోనూ పాకిస్తాన్ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించారు. పాకిస్తాన్ ఏర్పడటానికి ముందు 1946 లో లాహోర్ నుండి వెలువడే ఉర్దూ పత్రిక ‘చట్టాన్’ కు ఇంటర్వ్యూ ఇస్తూ పాకిస్తాన్ ఏర్పడితే అది ఎంతటి దుస్థితిలోకి దిగజారుతుందో చెప్పారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకొంటే ఆయన చెప్పిందే నిజమైంది. ”పాకిస్తాన్ ఏర్పడినా దాని తూర్పు భాగం (ప్రస్తుతం బంగ్లాదేశ్) దాని వెంట ఉండదు. అసమర్థ పాకిస్తాన్ పాలకులు దేశాన్ని సైనిక నియంతత్వం వైపు తీసుకెళ్తారు. పాకిస్తాన్ ఏర్పాటుతో ముస్లింలకు గాని, ఇస్లాంకు గానీ ఏ ప్రయోజనమూ ఉండదు. పాకిస్తాన్ డిమాండ్ రాజకీయపరమైందే తప్ప మతపరమైంది కాదు. మతం ఆధారంగా దేశాల సరిహద్దులు నిర్ణయించేట్లయితే ఇస్లాం ఇండియాలోకి ప్రవేశించేదే కాదు.” అని మౌలానా చెప్పారు.
మతం నమ్మకంపై తప్ప వంశపారంపర్యంగా రాకూడదని ఆయన అభిప్రాయం ”యూదులు, పార్సీలు, హిందువుల తరహాలో భారతీయ ముస్లింలు కూడా ఇస్లాంను వారసత్వంతో సక్రమించేదిగా మార్చారు. పాకిస్తాన్ ఏర్పడితే అది మత స్వభావం గల ఘర్షణలను నిరంతరం ఎదుర్కొంటుంది. ఈరోజు చాలా మంది ఉలేమాలు జిన్నా వెంట ఉన్నారు. అన్ని యుగాల్లో, అన్ని కాలాల్లో ఉలేమాలు ఇస్లాంకు తలవంపులే తెచ్చిపెట్టారు.” అని విమర్శించేవారు.
”పాకిస్తాన్ ఏర్పాటు ముస్లింలకు మంచి చేసేదైతే….. నేను కూడా పాకిస్తాన్ ఏర్పాటును సమర్థించే వాణ్ణి. నేను పాకిస్తాన్ డిమాండ్ వెనుక ఉన్న ప్రమాదాన్ని స్పష్టంగా చూస్తున్నాను. ఆ దుష్ట సంకల్పం పాకిస్తాన్నే కాదు, భారతదేశానికీ నష్టం చేస్తుంది. దేశంలోని ముస్లింలంతా పాకిస్తాన్ వెళ్తే అక్కడ చోటే ఉండదు. పశ్చిమ పాకిస్తాన్‌లో హిందువులు ఉండలేరు. వారిని బయటికి నెట్టేస్తారు. లేదా వారే బయటికొస్తారు. దాని దుష్పలితాలు ఇండియాలో కన్పిస్తాయి.” ఆయన చెప్పారు.
దేశ విభజన తర్వాత ఇండియాలో ఉండే ముస్లింలు ఇబ్బందుల పాలవుతారని మౌలానా అభిప్రాయ పడ్డారంటే అందుకు ఒక సెక్షన్ కాంగ్రెస్ నాయకులపై ఆయనకు నమ్మకం లేకపోవడమే కారణమని భావించవచ్చు. కాంగ్రెస్ నాయకత్వం అవకాశ వాదంతో, మత శక్తులతో పలు సందర్భాల్లో రాజీపడింది. మత సామరస్యం మీద పైపై మాటలు తప్ప నిర్ధిష్ట వైఖరి కాంగ్రెస్ దగ్గర లేకుండా పోయింది. బిజెపి బలపడగానే కాంగ్రెస్ చాటున ఉన్న మతతత్వ వాదులు బిజెపిలోకి జంప్ చేశారు. విడ్దూరమేమిటంటే.. వరుసకు మౌలానా మునిమనవరాలైన రాజ్యసభ మాజీ ఉపాధ్యక్షురాలు నజ్మా హెప్తుల్లా, కాంగ్రెస్ మాజీ ఎంపి ఎంజె అక్బర్, మరో నాయకుడు ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పదవుల కోసం బిజెపిలో చేరారు. ‘చట్టాన్’ ఇంటర్వ్యూను వెతికి పట్టుకొని నేటి తరం ముందుంచిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్… ఇప్పుడు గవర్నర్‌గా ఉంటూ బిజెపికి పనిముట్టుగా మారి కేరళ ప్రభుత్వానికి పదే పదే మోకాలడ్డుతున్నారు. వివిధ సందర్భాల్లో ఎస్‌పి, బిఎస్‌పి, జెడియు, జెడిఎస్, అకాలీదళ్, వైసిపి, తెలుగుదేశం, జనసేన, ఏఐడిఎంకె వంటి పార్టీలు కూడా అవకాశవాదంతో బిజెపి కొట్టం కింద చేరిన సందర్భాలున్నాయి.
ఇస్లాం విదేశీ మతమని, ముస్లింలు దేశం వదలి వెళ్లాలని లేదా రెండవ తరగతి పౌరులుగా జీవించాలని సంఫ్‌ు పరివార్ చెబుతోంది. భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వివిధ రాజకీయ పార్టీల వైఫల్యం ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ముస్లింల్లో అభ్యుదయ శాస్త్రీయ దక్పథాన్ని తీసుకెళ్లే ప్రయత్నం జరగపోవడం కూడా ఒక పెద్ద లోపం.
బ్రిటిష్ పాలకులు కాంగ్రెస్ నాయకులను దీర్ఘకాలం జైళ్లలో ఉంచారు. దానివల్ల ముస్లింలకు జిన్నా తిరుగులేని నాయకుడు అయ్యారు. ముస్లిం లీగ్‌తో పాటు హిందూ మహాసభపై బ్రిటిష్ పాలకులు నిర్బంధం అమలు చేయలేదు. రెండు సంస్థలు స్వాతంత్రోద్యమం నుండి దూరంగా ఉండి పోయాయి. తన పార్టీలోని సాంప్రదాయవాదుల ప్రమాదాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. మతశక్తులకు మద్దతు ఇచ్చేవారు కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానాల్లోనే ఉన్నారు.
1931లో ఉరిశిక్షకు గురైన స్వాతంత్య్ర వీరుడు భగత్‌సింగ్ మతశక్తుల పట్ల స్పష్టమైన హెచ్చరిక చేశారు. కాంగ్రెస్‌కు మాత్రం మహాత్మా గాంధీ హత్య తర్వాతే కొంత కనువిప్పు కలిగింది. సమాజాన్ని మతతత్వం విషతుల్యం చేసిన నేపథ్యంలో ఒక పిచ్చోడు చేసిన చర్యగా గాంధీజీ హత్యను నెహ్రూ పేర్కొన్నారు. అదే పటేల్ కూడా చెప్పారు. ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన మౌలానా మాతృదేశంలోనే ఉందామనుకున్న ముస్లింలకు స్ఫూర్తిదాత అయ్యారు. ముస్లింలను రాజకీయ పార్టీలు ఓటర్లుగా కాదు దేశ పౌరులుగా చూడాలి.
వ్యాస రచయిత -ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్. వినయ కుమార్