మెడికో హత్యాచారం – నేర్వాల్సిన పాఠం

కోల్‌కతా ఆర్‌.జి.కర్‌ మెడికల్‌ కాలేజ్‌లో జరిగిన జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. ప్రతీ ఒక్క డాక్టర్‌ ఈ ఘటన పట్ల తమ నిరసన తెలిపారు. నిర్భయ (2012) ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇంత కలకలం రేగడం మళ్ళీ ఇదే. రోడ్లపైన, బహిరంగ స్థలాల్లో మహిళకి సరైన రక్షణ లేదని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పని చేసే చోటు కూడా మహిళలకి సురక్షితం కాదని తేలిపోయింది. ఒక ప్రొఫెషనల్‌ సంస్థగా చెప్పుకునే వైద్య కళాశాలకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలోనే ఇలాంటి ఘటన జరిగితే, ఇంక మామూలు పని ప్రదేశాల్లో మహిళలకు ఎటువంటి రక్షణ ఉంటుందనేది అందరిలోనూ తలెత్తిన ప్రశ్న.
ఈ లైంగిక దాడి, హత్య ఒక జూనియర్‌ డాక్టర్‌ పైన జరిగింది. ఆవిడ ఛాతీ వైద్యానికి సంబంధించిన పీజీ కోర్స్‌ రెండవ సంవత్సరం చదువు తున్నారు. హత్య జరిగిన రోజు ఆమె 36 గంటల షిఫ్ట్‌లో ఉన్నారు. అంటే నైట్‌ డ్యూటీలో ఉన్నారని అర్థం. చాలా మందికి వైద్యులు చేసే డ్యూటీ షిఫ్ట్‌ల గురించి అవగాహన ఉండదు. స్పెషాలిటీ వైద్య విద్యలో విద్యార్థులకు వంతులవారీగా నైట్‌ డ్యూటీలు వేస్తారు. ఆ డ్యూటీ ఈ రోజు పొద్దున్న ఎనిమిది గంటలకి మొదలైతే, రేపు సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల మధ్యలో ముగుస్తుంది. ఒక్కో ఆసుపత్రిని బట్టి అది నలభై ఎనిమిది గంటల వరకు కూడా సాగుతుంది. ఈ ముప్పై ఆరు గంటల-నలభై ఎనిమిది గంటల షిఫ్టులు ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తున్నాయి. అయితే సీనియర్‌ డాక్టర్లు ఈ డ్యూటీలు చేయరు. ఇంటర్న్‌షిప్‌ చేసే వాళ్ళు (హౌస్‌ సర్జన్లు), పీజీ వైద్య విద్యలో ఉన్నవాళ్ళు (జూనియర్‌ డాక్టర్లు), అప్పుడే పీజీ అయిపోయి హాస్పిటల్‌లో అసిస్టెంట్‌ కన్సల్టెంట్‌గా చేరినవాళ్లే ఈ నైట్‌ డ్యూటీలు చేస్తారు. సీనియర్‌ డాక్టర్లు, కన్సల్టెంట్లు అత్యవసరంగా పిలిస్తే మాత్రమే వస్తారు. ఏ రోగి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీక, నిద్ర లేక, చాలా మానసిక ఒత్తిడితో ఉంటారు.
అయితే మన భారత దేశంలో వైద్య వృత్తిని ఎంచుకునే వారిలో అధిక భాగం మహిళలే ఉంటున్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని మనం సేవా రంగం కింద గుర్తిస్తాము. ఏ సేవా రంగం తీసుకున్నా అధిక భాగం మహిళలే కనబడతారు. అయితే వైద్య రంగంలో ఉండే ఆడవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఆసుపత్రిలో పని చేసే డాక్టర్లు, నర్సులు, ఆయమ్మలు అధిక భాగం ఆడవారే ఉంటారు. ఆరోగ్య రంగంలో ఉండే ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, నర్సులు, ఎ.ఎన్‌.ఎమ్‌ లు చాలా వరకు మహిళలే. వీళ్ళందరూ వారి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా తమపై అధికారులైన మగవారి నుండి లేదా రోగుల నుండి లైంగిక దాడులు ఎదుర్కొనే ఉంటారు. అయితే ఆసుపత్రుల్లో ఈ నైట్‌ డ్యూటీలు చేసే సమయాల్లో మహిళా ఉద్యోగులకు, విద్యార్థినులకు విశ్రాంతి తీసుకోవడానికి సరైన స్థలాలు ఉండవు. కోల్‌కతాలో ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పవచ్చు. నైట్‌ డ్యూటీ చేస్తున్న సమయంలో హత్యకి గురైన జూనియర్‌ డాక్టర్‌ విశ్రాంతి గది లేనందువల్ల, ఆసుపత్రి బిల్డింగ్‌లోనే వేరే అంతస్థులో ఉన్న సెమినార్‌ గదిలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళింది. అక్కడ నేలపైన బెడ్‌ వేసుకొని నిద్రిస్తున్న సమయంలో ఆగంతకులు వచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపైన హత్య కూడా చేశారు. ఈ సంఘటనతో దేశంలో వైద్యులకు సరైన రక్షణ లేదని వైద్యులు ఉవ్వెత్తున లేచారు. వాళ్ళకే కాదు, ఆసుపత్రిలో పని చేసే ఏ మహిళకూ రక్షణ లేదని ఆవేదన పడ్డారు. యాభై సంవత్సరాల క్రితం అరుణా షాన్‌బాగ్‌ అనే నర్సు డ్యూటీకి వచ్చి యూనిఫామ్‌ వేసుకోవడానికి సరైన గది లేక, ఆసుపత్రిలోని బేస్‌మెంట్‌లోకి వెళ్లేది. ఆ సమయంలో ఒక రోజు ఓ దుండగుడు తనని బలాత్కారం చేసి భౌతిక దాడి చేయగా, ఆమె కోమాలోకి వెళ్లారు. అలా అదే స్థితిలో నలభై ఒక్క సంవత్సరాలున్నారు. తను చనిపోయి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు. ఈ యాభై ఏళ్ళల్లో ఆసుపత్రుల్లో వచ్చిన తేడా ఏమీ లేదు! బిల్డింగులు పెరిగినా, మెషిన్లు పెరిగినా అందులో వైద్యులకు, నర్సులకు వసతులు ఏ మాత్రం పెరగకపోగా ఇంకా అధ్వానంగా తయారయ్యాయి. వారికంటూ విశ్రాంతి గది లేకపోవడం, బట్టలు మార్చుకునే గది, టాయిలెట్లు లేకపోవడం, కనీసం చేతులు కడుక్కోవడానికి ఒక వాష్‌ బేసిన్‌ లేకపోవడం చాలా విమర్శలకు దారి తీస్తున్నది. ఎంతో ఇష్టంగా వైద్య వృత్తిని ఎంచుకొని, అందులోకి ప్రవేశించడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి, చివరికి అందులోకి చేరాక, ఏ మాత్రం ప్రశాంతత ఉండటం లేదు. రాత్రుళ్ళు పడుకోవడానికి కనీస సౌకర్యాలు లేకపోవడం, ఎన్ని సంవత్సరాలైనా అయిపోని చదువులు, ఆర్థికంగా తల్లిదండ్రులపైన ఆధారపడాల్సి రావడం, సరైన సమయాల్లో స్టైపెండ్‌/జీతం రాకపోవడం వాళ్ళని మరింత కుంగదీస్తోంది.
ఒక మనిషిగా కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా వారికి అందడం లేదు. వారు పని చేసే ఆసుపత్రుల్లో సరైన తిండి, తాగే నీరు, పడుకోవడానికి కాసింత చోటు కూడా లేకుండా పోతున్నది. ఇవన్నీ తట్టుకొని, ఎలాగో ఒక లాగా డ్యూటీ చేస్తుంటే, అర్థరాత్రుళ్లు ఆసుపత్రుల్లోకి జొరబడి అక్కడ మహిళలపై లైంగిక దాడులు చేసే తాగుబోతులు! అందుకే డాక్టర్లు ఈ విషయంలో చాలా అసహనంగా ఉన్నారు. కనీస రక్షణ లేని చోట మేం వైద్యం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ప్రాణాలను కాపాడే డాక్టర్‌ని అత్యంత కిరాతకంగా చంపిన వాళ్ళకి సరైన శిక్ష వేయాల్సిందే అని రోడ్లెక్కారు. అయితే ఈ ఘటన తర్వాత ఆసుపత్రి యాజమాన్యం, బెంగాల్‌ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి/అలసత్వం డాక్టర్లని మరింత ఆగ్రహానికి గురి చేసింది.
పని చేసే చోట ఏ కార్మికులకైనా సరైన వసతులు కల్పించడం యాజమాన్యం కనీస బాధ్యత. మన సమాజంలో ఎంతో ఉన్నతంగా పిలవబడే వైద్య వృత్తిలోనే వసతులు ఇంత అధ్వానంగా ఉంటే, మిగిలిన వృత్తుల్లోని మహిళా కార్మికుల పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. వైద్యులకు విశ్రాంతి తీసుకోవడానికి సరైన వసతి లేకపోవడం, రెండు రోజుల వరకు కూడా సాగే పని దినం ఈ ఘటనకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అందులోనా మహిళల పరిస్థితి ఇంకా దారుణం. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వారికి అనువైన చోటు ఉండదు. ఏదైనా ఒక వసతి ఉన్నా, తలుపు సందుల్లో నుండి, కిటికీల్లో నుండి చూసేవారికి కొదువ ఉండదు.

మూల కారణాలు…
మన దేశంలో హత్రాస్‌, కథువా, ఉన్నావో అత్యాచారాలు, మహిళా రెజ్లర్లపై జరిగిన లైంగిక దాడులు, కోల్‌కతా ఘటన తర్వాత ఉత్తరాఖండ్‌లో నర్సు అత్యాచారం, హత్య, బీహార్‌ లో పద్నాలుగేళ్ల దళిత బాలికపై అగ్రవర్ణ మగవారు చేసిన సామూహిక అత్యాచారం, హత్య, ముంబైలో నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, సిద్దిపేటలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి వంటివి మనం ప్రతీ రోజూ చూస్తునే వున్నాం. వయసుతో సంబంధం లేకుండా, పుట్టిన బిడ్డ దగ్గరి నుండి వయసుడిగిన బామ్మ వరకు ఎవరినీ వదలకుండా లైంగిక దాడులు జరిగే సమాజంలో వున్నాం. మనలో వేళ్లూనుకుని ఉన్న పితృస్వామ్య భావజాలం, సాంకేతికత దుర్వినియోగం, జీవితంలో ప్రతి దాన్నీ సరుకుగా మార్చే పెట్టుబడిదారీ వ్యవస్థ…ఈ లైంగిక దాడులకు మూల కారణాలు.
మనలో వేళ్లూనుకున్న పితృస్వామ్య భావజాలానికి పరాకాష్ట ఆడవాళ్లపైన ఈరోజు జరుగుతున్న లెక్కలేనన్ని లైంగిక దాడులని చెప్పుకోవచ్చు. ఈ భావజాలానికి తగ్గట్టుగానే మనం ఈరోజు చూస్తున్న అశ్లీల వీడియోలు, సీరియళ్లు, సినిమాలు. స్త్రీ పురుష సమానత్వం గురించి మనం రోజువారీ జీవితాల్లో చర్చించడం అటుంచి, అసమానతను బలపరిచే భావజాలాన్ని సినిమా, సీరియళ్ల ద్వారా మెదళ్లలోకి ఎక్కించు కుంటున్నాం. విద్యావ్యవస్థలో ఎక్కడా కూడా సమానత్వానికి సంబంధించిన అంశాలు బోధించకుండా, సమాజం పట్ల వ్యక్తికి ఉండాల్సిన బాధ్యతను చెప్పకుండా, స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉండాలో బోధించకుండా ఈనాడు మనం మగవారు ఆడవారి పట్ల గౌరవంగా మాట్లాడాలని, ప్రవర్తించాలని ఆశించడం, మహిళలు పురుషులతో సమానంగా చర్చల్లో పాల్గొనాలని, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందడుగు వేయాలని ఆశించడం దుస్సాహసం.
ఈ సమాజంలో స్త్రీ ఏ రకంగా పెళ్లిలో, సినిమాల్లో, సామజిక మాధ్యమాల్లో సరుకుగా మారిందో, అదే రకంగా ఈ రోజు లైంగిక చర్య కూడా ఒక సరుకుగా మారింది. ఆ సరుకుని మనం మన అరచేతుల్లోని ఫోన్లలో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. దానికి మన శ్రమ అక్కర్లేదు. మానవ సంబంధాలు అక్కర్లేదు. ప్రేమ అక్కర్లేదు. కేవలం ఒక ఆండ్రాయిడ్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ డేటా కొనగలిగే ఆర్థిక స్థోమత ఉంటే చాలు. మనుషుల మధ్యలో దూరాలను పెంచి, వాళ్ళని రోజు రోజుకి ఒంటరి వాళ్ళని చేసి ఒక నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తుంది పెట్టుబడిదారీ సమాజం. ఇది వరకు పని చేసే చోట మాత్రమే వుండే ఒంటరితనం, ఇప్పుడు ఇళ్లల్లోకి కూడా ప్రవేశించింది. ఆ ఒంటరితనాన్ని పోగొట్టు కోవడానికి చేసే రకరకాల ప్రయత్నాలలో కొన్ని-మందు, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకు అలవాటుపడటం, అశ్లీల చిత్రాలకు బానిస అవడం. మనుషులను ప్రేమతో కూడుకున్న సంబంధాల నుండి దూరం చేసి, ఒంటరి వాళ్ళని చేసి, అశ్లీల నీలి చిత్రాలకు బానిసలయ్యేలా చేసి, లైంగిక చర్యను కూడా చాలా అసహజంగా (భౌతికంగా ఇద్దరు వ్యక్తులు ఒకే చోట ఉండాల్సిన అవసరం లేని ఒక స్థితిని తీసుకువచ్చి) ఒక సరుకుగా మార్చేసింది ఈ సమాజం.
ఏ రోజైతే మన సమాజం ఈరోజు లాగా డబ్బుతో కాకుండా కేవలం ప్రేమతో మాత్రమే సంభోగ సుఖం అనుభవించే దిశగా ఎదుగుతుందో ఆ రోజే మన సమాజంలో లైంగిక దాడులు జరగబోవని ఆశించవచ్చు. అందుకే ఈ రోజు మనం మన విద్యా వ్యవస్థని లైంగిక సమానత్వ దిశగా పునరుద్ధరించుకోవాల్సి ఉంది. విద్య/వైద్యం ప్రజల ప్రాథమిక హక్కుగా పరిగణించి ప్రతీ ఒక్కరికీ నాణ్యత గల విద్యను/వైద్యాన్ని అందించడం, ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి, సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించాలి. అంతవరకూ లైంగిక దాడులకు ఎన్ని కఠినమైన శిక్షలు అమలు చేసినా అవి అన్ని చట్టాల లాగే సమాజంలో ఎందుకూ పనికిరాని చట్టాల్లాగే వుండిపోతాయి.

/ వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డా|| దేశం
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, సిద్ధిపేట./

➡️