మీడియాలో సృజన స్వేచ్ఛ, సభ్యతా విలువలు

Mar 9,2025 05:35 #Articles, #edite page

ఎ.పి, తెలంగాణ రాష్ట్రాలలో సోషల్‌ మీడియా ద్వారా వివిధ పార్టీల ప్రతినిధులు, నాయకులు చేసిన వ్యాఖ్యానాలు, ప్రయోగించిన బూతు పురాణాలపై ఎడతెగని వివాదాలు నడుస్తున్నాయి. కేసులూ అరెస్టులూ ఎలా వున్నా ఆ ధోరణులు మాత్రం మారడం లేదు. సినీ మీడియా రంగాల్లో ఎప్పుడూ ముందుండే వాళ్లు సోషల్‌ మీడియాను కూడా వ్యాపార మార్గంలో మళ్లించి అనేక అవాంఛనీయ ధోరణులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు మీడియా, సోషల్‌ మీడియా ప్రయోజనాలు ప్రజా కోణం మరుగున పడిపోతున్నాయి. జాతీయ స్థాయిలో మీడియా స్వేచ్ఛ గురించిన పోరాటంతో సంబంధం లేని రాజకీయ తగాదాగా ఇది మారిపోయినట్టు కనిపిస్తుంది గానీ నిజానికి అదే కీలకమైన కోణం. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా మీకు ప్రాథమిక హక్కులంటే ఏమిటో తలకెక్కలేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఓకా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ఇదెంత తీవ్రమైన పోరాటంగా వుందో అర్థమవుతుంది.

ఇమ్రాన్‌ ప్రతాప్‌ గర్హి రాజ్యసభ సభ్యుడు. కాంగ్రెస్‌ తరపున ఎన్నికైన ఈయన ఉర్దూ భాషా కవి, అవార్డు గ్రహీత కూడా. కాంగ్రెస్‌లో చేరిన కొద్ది కాలంలోనే ఆయనను ప్రమోట్‌ చేసి ఎంపీగానూ మైనార్టీ సెల్‌ చైర్మన్‌గానూ నియమించారు. కవి సమ్మేళనాల్లో ఆయన కవితలు బాగా ఆకర్షిస్తుంటాయట. ఇటీవల ఆయన జామ్‌ నగర్‌లో సామూహిక వివాహాలకు హాజరైన సందర్భంలో చదివిన కవిత వీడియో పోస్ట్‌ చేశాడు. ‘ఏ ఖూన్‌కే ప్యాసే బాత్‌ సునో..’ అంటూ. రక్త పిపాసులారా ఈ మాట వినండి అని దాని అర్థం. ఈ 46 సెకండ్ల పోస్టుకు బాగా స్పందన రావడమే గాక కింద ఇది మత రాజకీయాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్య అన్నట్టు స్పందనలు కనిపించాయి. వెంటనే జామ్‌నగర్‌ పోలీసులు ఇది భిన్న మతాల మధ్య విద్వేషాలు పెంచేవిధంగా వుందంటూ కిషన్‌ నందా అనే వ్యక్తి నుంచి ఫిర్యాదు వచ్చిందని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రతాప్‌ గర్హి ఇది నిజానికి ప్రేమను పెంచేందుకు ఉద్దేశించిందని వివరిస్తూ తనపై కేసు కొట్టేయాలని అహ్మదాబాద్‌ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ప్రఖ్యాత కవి ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌దో లేక హమీబ్‌ జలీద్‌తో కావచ్చని చాట్‌ జిపిటతో సహా చెబుతున్నాయని సమాధానంలో తెలియజేశారు (వాస్తవానికి ఇది ఫైజ్‌ పాటగా సినిమాల్లో కూడా వాడారు). ఈ పాట ద్వారా తాను ప్రేమ, అహింస సందేశం ఇవ్వడానికి ప్రయత్నించానని కూడా పేర్కొన్నారు. తాను ఏదో నేరం చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌ కూడా చెప్పడం లేదని ఆయన వాదించారు. అయితే ఈ పాటలో పదాలు వింటే రాజ్యాన్ని ఎదుర్కోమని చెప్పడం స్పష్టంగా అర్థమవుతుందని ప్రాసిక్యూషన్‌ వాదించింది. విచారణకు నిందితుడు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు వంత పలికింది. మొత్తానికి అహ్మదాబాద్‌ హైకోర్టు ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయడానికి తిరస్కరించింది. సోషల్‌ మీడియా పోస్టుల ప్రభావం ఎంతటిదో తెలుసుగనక ఒక ఎంపీగా ప్రతాప్‌ గర్హి బాధ్యతగా వ్యవహరించాలని ఆయనకే సలహాలు ఇచ్చింది.

ఈ దశలో తనపై పోలీసులు చర్య తీసుకోకుండా ఆపాలంటూ ప్రతాప్‌ గర్హి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కపిల్‌ సిబాల్‌ ఆయన తరపున వాదించగా జస్టిస్‌ అభరు ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం ఆయనపై కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గుజరాత్‌ పోలీసులను ఆదేశించింది. అంతకంటే కీలకంగా జస్టిస్‌ ఓకా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఈ పాట మతానికి గానీ జాతికి గానీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి ఇది అహింసను బోధిస్తున్నది. మతంతో ఏ సంబంధం లేదు. ఏ విధంగానూ జాతి వ్యతిరేక చర్య కానేరదని పేర్కొంది. జస్టిస్‌ ఓకా మరో అడుగు ముందుకేసి కవిత్వాన్ని అర్థం చేసుకోలేకపోవడం పట్ల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ”ఇదే సమస్య. ఎవరికీ సృజనాత్మకత పట్ల గౌరవం లేదు. మీరు అన్యాయానికి గురైనా ప్రేమతో తట్టుకోండని ఆ పాట చెబుతుంది. రక్తదాహం తీరని వారు మా మాట వినాలని అంటున్నది. మేము న్యాయం కోసం చేసే పోరాటంపై మీరు అన్యాయంగా దాడి చేసినా మేము ప్రేమతోనే ఎదర్కొంటామని ప్రకటిస్తున్నది” అని ఆయన వివరించారు. హైకోర్టు ఈ అంశాలను గమనంలోకి తీసుకోకపోవడం బట్టి చూస్తే దేశం ఎటు పోతుందో తెలియడం లేదని కపిల్‌ సిబాల్‌ వ్యాఖ్యానించారు. దీనిపై కోపగించుకున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మనం హైకోర్టు మీద వ్యాఖ్యలు చేయొద్దని అడ్డుతగిలారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు హైకోర్టుపై స్పందించకుండానే పోలీసులకు మాత్రం చురకలు వేశారు. ‘పోలీసులు కూడా కొంతైనా సున్నితత్వం చూపించాలి, చదివి అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం ఆమోదించిన 75 ఏళ్ల తర్వాత కూడా మీ పోలీసులు భావప్రకటనా రీతులు, వ్యక్తీకరణలు తెలుసుకోవాలని హితం చెప్పారు. ఇది కూడా తుషార్‌ మెహతాకు నచ్చలేదు. పోలీసులు కవిత్వం ఆస్వాదించాలనడం మరీ అతిశయంగా వుంటుందని వ్యాఖ్యానించారు. ఇది ఫైజ్‌ది కాదు రోడ్డు పక్క చెట్టు కింద కవిత లాంటిదేనని దెప్పి పొడిచారు. అంతకుముందు న్యాయమూర్తి మాటల్లో మహాత్మా గాంధీ కూడా అన్యాయాన్ని ప్రేమతో ఎదుర్కోవాలన్నారని చెప్పినప్పుడు ఈ కవితను మరీ మహాత్ముడితో పోల్చవద్దని అభ్యంతరం చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసింది గానీ పోలీసులు పెట్టిన కేసు, హైకోర్టు సమర్థన, తుషార్‌ మెహతా అదే వాదించడం పరిస్థితికి అద్దం పడుతుంది.

సెన్సార్‌ కాదు, క్రమబద్ధీకరణ

సరిగ్గా ఈ కేసు విచారణ రోజునే సుప్రీంకోర్టులో యూట్యూబర్‌ రణవీర్‌ అల్హాబాదియా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక సూచనలు చేశారు. ఇవి నాణేనికి మరో వైపును కూడా చూపించాయి. అనేక సామాజిక అంశాలు చర్చకు పెట్టే అల్హాబాదియా ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. మీ తల్లిదండ్రుల శృంగారం పిల్లలు చూడటం దానిపై వారి భావనల గురించి రణవీర్‌ ఇటీవల ఒక షో లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన తర్వాత ఆయన కార్యక్రమాలను నిలిపేస్తూ ఫిబ్రవరి 18న సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. దానిపై రణవీర్‌ అరెస్టు చేయొద్దంటూనే ఆయన కార్యక్రమాలను నిలిపేసింది. ఈ నిలిపివేతను తొలగించాలంటూ ఆయన తరపున న్యాయవాది అభినవ్‌ చంద్రచూడ్‌ పిటిషన్‌ వేశారు. తన క్లయింట్‌ పైన 280 మంది ఆధారపడి వున్నారనీ, అతనేదో అపహాస్యం కోసం కావాలని అలా మాట్లాడలేదని సంజాయిషీ ఇచ్చారు. దానిపై జస్టిస్‌ సూర్యకాంత్‌ నిలిపివేత ఉత్తర్వులను సవరిస్తూ రణవీర్‌ షో కొనసాగించడానికి అనుమతించారు. అదే సమయంలో నైతికత హుందాతనం పాటించాలనీ, భారతీయ సమాజంలో సువ్యవస్థితమైన నైతిక ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవలని హితవు పలికారు. దారి తప్పి వ్యవహరించి ప్రాథమిక వాక్‌ స్వాతంత్య్రంపై సెన్సార్‌షిప్‌ను కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఇంటిల్లిపాదినీ నవ్వించగలిగేదే మంచి హాస్యమని, దుర్భాషలతో ఎవరికీ ఎబ్బెట్టు అనిపించకూడదనీ ఆదేశించిన జస్టిస్‌ సూర్యకాంత్‌ బాలివుడ్‌లో మనకు గొప్ప హాస్యనటులున్నారని ప్రశంసించారు. హాస్యం, అసభ్యత, వికృతానందం వీటి మధ్య తేడా పాటించాలన్నారు. ఇలాంటి వాటిని క్రమబద్ధం చేసేందుకు ఏదైనా యంత్రాంగాన్ని సూచించాలని తుషార్‌ మెహతాను కోరారు.

‘ఆనంద వికటన్‌’కూ అనుమతి

ఇక నూరేళ్లుగా నడుస్తున్న ప్రసిద్ధ తమిళ వార పత్రిక ‘ఆనంద వికటన్‌’కూ ఈ ఆంక్షల సెగ తప్పలేదు. అది రాజకీయ కోణంతో కూడినది కావడం మరింత విశేషం. ఇటీవల డోనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టాక ప్రధానమంత్రి మోడీ ఆదరాబాదరాగా వెళ్లి కలసి రావడం అనేక వ్యాఖ్యలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ విపరీత పోకడలనూ భారతీయ నిపుణుల, వ్యాపార వర్గాల ప్రయోజనాలపై వేటు వేసి తమ దేశానికి లాభం చేకూరే విధంగా ఆయన అనేక హుకుందారీ చర్యలకు పాల్పడ్డారు. అయితే మోడీ వాటిలో దేన్నీ ప్రశ్నించలేకపోయారు. పైగా అవేవో మనకు మేలు చేసేవన్నట్టుగా విదేశాంగ మంత్రి జైశంకర్‌ సమర్థిస్తున్నారు. అదలా వుంచితే ‘ఆనంద వికటన్‌’ ఆయన పర్యటన నేపథ్యంలో ఫిబ్రవరి 15న ఒక కేరికేచర్‌ ప్రచురించింది. ట్రంప్‌ ముందు మోడీ సంకెళ్లతో బందీగా వున్నట్టు అంటే స్వేచ్ఛ లేనట్టు అందులో చిత్రించింది. ఈ కార్టూన్‌ అమెరికాతో సంబంధాలకు హానికరమంటూ ఆనంద వికటన్‌ వెబ్‌సైట్‌ను అమాతం నిలిపేసింది కేంద్రం. ఎందుకంటే మెటా వంటి ప్లాట్‌ఫాంల నిర్వాహకులు కేంద్రం ఆదేశాలు చాలా వరకూ అమలు చేస్తుంటారు. దీనిపై ఆ పత్రిక న్యాయ పోరాటం చేసింది. ఆ కార్టూన్‌ తప్పనుకుంటే అది తొలగించమని ఆదేశాలివ్వాలి గానీ ఇంత చరిత్ర గల తమ సంస్థ సైట్‌నే మూసేయడం ఏంటని ప్రశ్నించింది. దానిపై చివరకు మద్రాసు హైకోర్టు మోడీ కేరికేచర్‌ లేకుండా దాన్ని పున:ప్రారంభించుకోవచ్చని అనుమతినిచ్చింది.

ఆర్ణబ్‌ కేసే వేరు!

మొత్తంగా తమకు నచ్చని మీడియా, సోషల్‌ మీడియాలపై కేంద్రం రాష్ట్రాల పాలకులు వివిధ రకాలుగా సాగించే వేధింపులూ, ఆంక్షలపై అనేక ఉదాహరణలున్నాయి. అసలు యూట్యూబ్‌ కంటెంటును మొత్తంగా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం 69ఎ ఇందుకు సాధనంగా వుంది. దానిపై అభ్యంతరాలొచ్చాయి కూడా. అదే సమయంలో తమకు నచ్చినవారి పట్ల మాత్రం కేంద్రం ద్వంద్వ నీతిని పాటించడం పరిపాటి. ఆ జాబితాలో అగ్రగణ్యుడు ఆర్ణబ్‌ గోస్వామి. ఇంతకూ కేసేమిటంటే 2022లో రాజస్థాన్‌లోని అల్వాల్‌లో ఒక దేవాలయ విధ్వంసం జరిగిందంటూ రిపబ్లిక్‌ టీవీ హిందీ ఛానల్‌ కథనం ప్రసారం చేసింది. అప్పుడు అక్కడ కాంగ్రెస్‌ సర్కారుంది. ఈ కథనం ప్రసారం చేయడంతో ఆగక దానికి ‘జహంగీర్‌పూర్‌కు ప్రతీకారమా?’ అని ట్యాగ్‌ తగిలించింది రిపబ్లిక్‌ టీవీ. దానిపై కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ఈలోగా అక్కడ బిజెపి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో జరిగిన ఘటనపై ఆరోపణల నేపథ్యంలో తాము ఈ ట్యాగ్‌ తగిలించామేగానీ వేరే దురుద్దేశం లేదనీ, తమ కథనం వల్ల ఎలాంటి గొడవలు జరగలేదని ఆర్ణబ్‌ సమర్థించుకున్నారు. రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఫర్జానంద్‌ అలీ ఈ వాదనలతో ఏకీభవిస్తూ పూర్తి కేసు తేలేవరకూ ఆర్ణబ్‌పై ఎలాంటి చర్య తీసుకోవద్దని తాజాగా ఆదేశించారు. ఇన్ని రోజుల్లో పోలీసులు ఏ సాక్ష్యాలు సేకరించారని ప్రశ్నించారు. కరోనా రోజుల్లోనే అనేక అవాస్తవాలు ప్రసారం చేసిన ఆయనను ఆదుకున్న తీరు చూశాం. హత్రాస్‌ ఘటన తర్వాత అక్కడకు వెళ్లిన కేరళ జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌ను మూడేళ్లపాటు జైలులో పెట్టిన కేంద్రం అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్ణబ్‌ను అరెస్టు చేస్తే స్వయంగా హోంమంత్రిని రంగంలోకి దింపి విడుదలయ్యేందుకు కృషి చేసింది. ఈ కేసు మరోసారి ఆ సన్నివేశాన్ని కళ్ల ముందు నిలబెట్టడంలేదా? ఏమైనా మీడియా కథనాలు స్వేచ్ఛ, సభ్యత బూతులు, అసత్యాలు, విద్వేష ప్రచారాలు పార్టీలను వ్యక్తులను బట్టి కులమతాలను బట్టిగాక ప్రజాస్వామిక విలువలు, ప్రజా జీవిత ప్రమాణాలను బట్టి నడవాలని కోరుకోవాలి.

తెలకపల్లి రవి

➡️