రాష్ట్రపతి భారత రాజ్యాంగ పరిరక్షకులు. ఈ విషయాన్ని రాజ్యాంగమే చెబుతుంది. రాజ్యాంగం అమల్లోకొచ్చిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రథమ పౌరులు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ఇచ్చిన సందేశంలోని కొన్ని అంశాలు రాజ్యాంగ పరిరక్షణ విద్యుక్త ధర్మం నుంచి పక్కకు మళ్లిన భావన కలిగిస్తాయి. గణతంత్ర రాజ్యానికి 75 ఏళ్లు పూర్తయిన వేళ ఈ పరిస్థితి ఎదురుకావడం ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ఏమి రాసిస్తే అది రాష్ట్రపతి చదవడం మామూలే. అయితే ఆ ప్రసంగం రాజ్యాంగానికి లోబడి ఉండేటట్లు విచక్షణతో వ్యవహరించడం రాష్ట్రపతి బాధ్యత. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అత్యుత్సాహపడుతోంది. జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టని, రాష్ట్రాల హక్కులకు విఘాతమని ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ ప్రేమికులు, ప్రతిపక్షాలు నెత్తీనోరు బాదుకుంటున్న పరిస్థితి. అయినా మోడీ సర్కారు ముందుకేనంది. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసి, తన ఎజెండాకనుగుణంగా నివేదిక తెప్పించుకొని, కేబినెట్‌లో గ్రీన్‌సిగల్ ఇచ్చి, ఆపై లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. విపక్షాల అభ్యంతరాలు, నిరసనలతో బిల్లును విస్తృత చర్చల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జెపిసి)కి పంపింది.
జెపిసి చర్చల్లో ఉన్న జమిలి అంశాన్ని రాష్ట్రపతి తన రిపబ్లిక్‌డే సందేశంలో గొప్పగా పేర్కొనడమే కాకుండా మద్దతుగా మాట్లాడటం విచిత్రం. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది పార్లమెంట్. పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపర్చేది రాష్ట్రపతే. అక్కడ పెండింగ్‌లో ఉన్న బిల్లుకు ఉద్దేశం ఆపాదించడం రాజ్యాంగం రీత్యా చూసినా ధర్మం కాదు. జమిలి సుపరిపాలన విధానాల్లో అనిశ్చితిని తగ్గిస్తుంది, వనరులు పక్కదారి పట్టకుండా రక్షించడానికి వీలుకల్పిస్తుంది, ప్రభుత్వంపై ఆర్థిక భారాలు తగ్గించడానికి దోహదపడుతుంది అని ముర్ము ఆకాశానికెత్తారు. రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య వ్యవస్థకు హాని తలపెట్టే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే జమిలి ప్రమాదాన్ని రాష్ట్రపతి విస్మరించడం ఆందోళనకరం. నిజానికి పార్లమెంట్ ఉభయసభల్లో ఇప్పుడు ‘జమిలి’ బిల్లు ఆమోదం పొందడం అసాధ్యం. రాజ్యాంగ సవరణలు చేయాలి. రెండు సభల్లో మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలి. దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలు అంగీకరించాలి. బిల్లు అసాధ్యమని తెలిసినా సరే, జమిలిపై చర్చకు, ఆర్‌ఎస్‌ఎస్ నిర్దేశిత ఎజెండాకు కట్టుబడి ఉన్నామని గట్టి సంకేతాలివ్వడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ టిడిపి కూటమి ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టును రిపబ్లిక్ డే సందేశంగా విపులీకరించారు. ‘స్వర్ణాంధ్ర-విజన్ 2047’ డాక్యుమెంట్‌ను పునశ్చరణ కావించి రాష్ట్రాన్ని ‘సంస్కరణ’ల బాట పట్టిస్తామని స్పష్టీకరించారు. గత రిపబ్లిక్‌డే సందేశంలో అప్పటి వైసిపి ప్రభుత్వాన్ని తన ప్రభుత్వంగా సంబోధించి భేష్ అన్న గవర్నరే, ఈసారి గత ఐదేళ్ల పాలనంతా విధ్వంసమని వల్లించారు. ఇక్కడ అర్థమయ్యేదేంటంటే ప్రభుత్వం రూపొందించిన మేటర్‌ను గవర్నర్లు ఒప్పజెపుతారని. మొన్నటి ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమన్న గవర్నర్ హామీ ప్రస్తుతానికైతే ప్రజల్లో ఆశలు రేపుతుంది. పథకాలు, వాగ్దానాలు కార్యరూపం దాల్చాకనే చిత్తశుద్ధి వెల్లడవుతుంది. ఈమారు ఆంధ్రప్రదేశ్‌కు ఆనందం కలిగించే విషయం ఢిల్లీలో గణతంత్ర పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మల కొలువు. మన సాంస్కృతిక ప్రతీకగా నిలిచింది. శకటాల ప్రదర్శనలో ఆకర్షణ అయింది. ఎ.పి. శకటం కొన్నేళ్లుగా తిరస్కరణకు గురవుతుండగా ఈ తడవ అనుమతి లభించడం గమనార్హం. రిపబ్లిక్‌డే వేదికల మీది నుంచి దేశాధినేతగా వ్యవహరించే రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ ఇచ్చే సందేశాలు ఆ యా ప్రభుత్వాల నడకను ప్రజలకు వెల్లడిస్తాయి. సందేశాలు వాస్తవికత సంతరించుకోవాలి. రాజ్యాంగానికి లోబడి ఉండాలి.
