పేదలపై పెనుదాడి

mgnrega upadhi hami linked with adhaar editorial

 

కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు దోచిపెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్యుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. కష్టకాలంలో పేద ప్రజలకు ఎంతో కొంత అండగా ఉంటున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై పదేపదే చేస్తున్న దాడులే దీనికి నిదర్శనం. కొత్త సంవత్సరం తొలిరోజు నుండి అమలులోకి తీసుకువచ్చిన ఆధార్‌ ఆధారిత ఉపాధి హామీ వేతన చెల్లింపుల విధానం ఈ దాడుల పరంపరలో తాజాది! ఈ విధానం వల్ల నిరుపేదల పొట్ట కొట్టడమే తప్ప మరెటువంటి ప్రయోజనం ఉండదని దాదాపు ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిన తీరు దుర్మార్గం. వామపక్ష పోరాటాల ఫలితంగా యుపిఎ ప్రభుత్వ హయాంలో అమలులోకి వచ్చిన ఉపాధి హామీ చట్టం గొంతు నులమడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి మోడీ ప్రభ్వుత్వం వ్యవహరిస్తోంది. ఏటికేడాది నిధుల కేటాయింపును తగ్గిస్తూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ చట్టం కింద 60 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే, సవరించిన అంచనాల్లో 33శాతం కేటాయింపులు తగ్గించినట్లు తేలిందంటే ఏ స్థాయిలో నిధులు కోత పెట్టారో అర్ధం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా క్షిణీస్తోంది. ఫలితంగా ఉపాధి హామీ పనులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ చట్టం అమలుకు భారీ ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు, పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తే కష్టాల్లో ఉన్న ప్రజానీకానికి ఊరట దక్కి ఉండేది. కానీ, మోడీ ప్రభుత్వానికి సామాన్యుల కష్టాలు, కన్నీళ్లు పట్టవు. నూతన విధానం ప్రకారం ఉపాధి హామీ చట్టం కింద పనులు చేస్తున్న వారి జాబ్‌ కార్డు, బ్యాంకు ఖాతా, ఆధార్‌తో అనుసంధానమై ఉండితీరాలి. దీనితో పాటు బ్యాంకు ఖాతా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానమై ఉండాలి. అప్పుడే ఆధార్‌ సంఖ్య ఆర్థిక చిరునామాగా ఉపయోగపడుతుంది. మ్యాపింగ్‌ చేయడానికి వీలవుతుంది. మ్యాపింగ్‌ అయిన తరువాత మాత్రమే వేతనాలు చెల్లించడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ సజావుగా జరగాలంటే క్షేత్ర స్థాయి వరకు వెళ్లి పనిచేసే అధికార యంత్రాంగంతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాలు ఎంతో అవసరం. ఈ దిశలో అవసరమైన చర్యలు తీసుకోని కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో పెద్ద సంఖ్యలో కార్మికులను అనర్హులుగా ప్రకటించి చేతులు దులుపుకుంటోంది. అధికారిక లెక్కల ప్రకారమే దేశ వ్యాప్తంగా 25.25 కోట్ల మంది ఉపాధి హామీ పనుల కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో దాదాపు 10 కోట్ల మందిని అనర్హులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి యుపిఎ హయాంలో రూపొందించిన ఉపాధి హామీ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ 100 రోజులు పనులు చూపించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే! ఒక్కరిని కూడా అనర్హులుగా ప్రకటించడానికి కానీ, పనులు లేవని చెప్పడానికి కానీ వీలు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పనిని పొందడాన్ని ఒక హక్కుగా ఈ చట్టం మార్చింది. ఈ హక్కును కూడా మోడీ సర్కారు నీరుగార్చింది. రకరకాల నిబంధనలు చేర్చి పొట్టకొట్టడమే లక్ష్యంగా వ్యవహరించింది. అర్హులుగా గుర్తించిన మిగిలిన వారికైనా పనులు ఇస్తోందా అంటే అదీ లేదు. కేంద్ర ప్రభుత్వం అర్హులుగా ప్రకటించిన 14.35 కోట్ల మందిలో దాదాపుగా 12.7శాతం (దాదాపుగా 1.80 కోట్లు ) మంది బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. కాబట్టి వీరు కూడా నూతన విధానం కింద అనర్హులుగానే లెక్క! వీరికి పనులు చూపించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకోనుంది. వీరి జీవనం ఎలా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడటం లేదు. మానవ జీవనాన్ని సులభతరం చేయాల్సిన నూతన సాంకేతికతను పేదలపై దాడి చేయడానికి, జీవనోపాధిని హరించడానికి మోడీ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఈ విధానాలను మానుకోవాలి. ఉపాధి హామీని ఆధార్‌తో ముడిపెట్టి తప్పనిసరి చేయడాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి.

➡️