ఉద్యమాల మార్గదర్శి, అక్షరాల రూపశిల్పి ఎం.హెచ్‌

మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు 23వ అవార్డు ప్రదానోత్సవ సభ ఆయన ఆదర్శ జీవితానికీ, అది మనకిచ్చే సందేశానికి సంబంధించిన అనేక అంశాలను కళ్ల ముందుంచుతుంది. ఎం.హెచ్‌ గా సుపరిచితులైన మోటూరు ఒక నిస్వార్థ ప్రజా నాయకుడు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. సమర్థుడైన సంపాదకుడుగా, శక్తివంతమైన రచయితగా, ఉర్రూతలూపే ఉపన్యాసకుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలి. సమిష్టి తత్వాన్ని అమలు జరిపిన క్రమశిక్షణా శీలి. అవగాహనలో, అనుభవంలో ఆరితేరినా తరాల అంతరం లేకుండా అందరితో ఆప్యాయంగా అభిమానంగా మెలిగిన అనురాగమూర్తి. సహచరులనూ, కార్యకర్తలనూ సామాన్య ప్రజలనూ సదా ఆదరిస్తూ సార్థక జీవితం గడిపిన సంయమనశీలి. రాజకీయ వ్యక్తిగత హుందాతనానికి అర్థం చెప్పిన సంస్కారి. ఆటుపోట్లకు, అవరోధాలకు తల వంచని ధీశాలి. తెలుగు నాట ఎందరో రాజకీయ నేతలూ, పాత్రికేయ ప్రముఖులూ ప్రసిద్ధులూ వున్నా ఇన్ని ప్రత్యేకతల కలబోత గనకే ఎం.హెచ్‌ అందరి గౌరవం పొందగలిగారు. ప్రగతిశీల కళాసాహిత్య ఉద్యమాలపై ఆయనది ప్రత్యేక ముద్ర. ఆయన స్మారకార్థం అవార్డును నెలకొల్పి క్రమం తప్పకుండా కొనసాగి స్తున్న ప్రజాశక్తి యాజమాన్యం అందుకు ఎంతైనా అభినందనీయురాలు. ఆయన కన్నుమూత తర్వాత గడచిన ఇరవై ఏళ్లకు పైగా కాలంలో ఈ కృషి కొనసాగుతున్నది.
గుంటూరు (ప్రస్తుతం బాపట్ల) జిల్లా వెల్లటూరులో 1917లో పుట్టిన మోటూరు బాల్యంలోనే స్వాతంత్య్ర పోరాటం సామ్యవాద ఆశయాల వైపు ఆకర్షితులై ఆఖరి శ్వాస వరకూ అచంచలంగా కొనసాగారు. ఎం.హెచ్‌. వ్యాసాలు రాయడం, అనువాదాలు చేయడం 1941-42 రహస్య కాలంలో ప్రారంభించారు. తొలి ప్రజాశక్తి 1948లో పాలక వర్గాల నిషేధానికి గురైన తర్వాత ఉద్యమావసరాల కోసం జనత అనే పత్రిక తీసుకువచ్చే ప్రయత్నం జరిగినప్పుడు దాని తొలి సంపాదకీయం రాశారు గానీ ఇంతలోనే అరెస్టయ్యారు. బొమ్మారెడ్డి, ప్రసిద్ధ రచయిత గంగినేని వెంకటేశ్వరరావు దాన్ని నిర్వహించారు. ఈ సంగతి కూడా చాలా దశాబ్దాలు గడిచాక అనుకోకుండా జనత తొలి పలుకు చదివి ఇది మీ శైలిలా వుందని అడిగితే ఆయనకు ఇదంతా గుర్తుకు వచ్చింది. 1952 ఏప్రిల్‌లో ప్రజాశక్తి స్థానంలో విశాలాంధ్ర ఏర్పడింది. అదే 1952లో మంత్రి కల్లూరి చంద్రమౌళిని ఓడించి రేపల్లె నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికైన ఎం.హెచ్‌ ఏడాదిలోనే విశాలాంధ్ర సంపాదకుడయ్యారు. సాహిత్య పత్రికా విషయాల్లో పేరెన్నిక గన్న అప్పటి సంపాదకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు (చంద్రం) ఉమ్మడి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కావడంతో ఎం.హెచ్‌ సంపాదక బాధ్యత స్వీకరించారు. తర్వాత దాదాపు అర్థ శతాబ్ది పాటు ఆయన వివిధ రూపాల్లో ఉద్యమ పత్రికల నిర్వహణ, రూపకల్పన, రచనల్లో కీలక పాత్ర వహించారు. 2001లో కన్ను మూసిన ఎం.హెచ్‌ జీవిత విశేషాలను జూన్‌ 18న వర్ధంతి సందర్భంగా ప్రజాశక్తి గుర్తు చేసింది. ఈ అవార్డు ప్రదానం సందర్భంగా పత్రికా రంగానికి సంబంధించిన కోణాలు చెప్పుకుందాం.

కలమే కరవాలంగా….
1953-55 తన సంపాదకత్వం మూడు పువ్వులూ ఆరు కాయలుగా సాగిందని ఎం.హెచ్‌ అనేవారు. తన చెణుకులూ వ్యాఖ్యలూ విమర్శలూ పదునుగా నడిచేవి. తెలుగు నుడికారంలో సహజ సిద్ధమైన పట్టు గల ఎం.హెచ్‌ కలాన్ని చాలా వాడిగా వాడేవారు. దాదాపు అధికారంలోకి వచ్చేంత బలంతో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌ను హోరాహోరీ సవాలు చేస్తున్న నిత్య రాజకీయ పోరాటం. తీవ్ర సంఘర్షణ. అలాంటి దశలో ఎం.హెచ్‌ సంపాదకీయాలతో పాటు కంచు కాగడా శీర్షిక, పలుకులూ ములుకులూ వంటి శీర్షికలు నిర్వహించేవారు. నార్ల వెంకటేశ్వరరావు నాటి ఆంధ్రప్రభతో సహా కమ్యూనిస్టులపై చేసే దాడిని ఎదుర్కోవలసిన దశ. ఇప్పటి వివాదాల కంటే సూటిగా కమ్యూనిస్టులను ఓడించమంటూ పిలుపునిచ్చేవారు. ఇతర కారణాలకు తోడు ఈ దుష్ట్రాచారాలూ పని చేసి 1955 ఎన్నికలలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాకపోయినా 35 శాతం ఓట్లు తెచ్చుకోగలి గారు. కొందరిలో ఆ నిరుత్సాహం, సైద్ధాంతిక విభేదాల మధ్య ఎం.హెచ్‌ సంపాదక బాధ్యతల నుంచి తప్పుకోవడం, ఉద్యమం కోసం మళ్లీ బాధ్యతలు తీసుకోవడం చేస్తూ వచ్చారు. ఏమైనా ఆయన రచనల పదును ఇంకా నిశితమవుతూ వచ్చింది. ఆ సమయంలోనే విశాలాంధ్ర నిర్వహణలో డివి సుబ్బారావు, గోళ్ల రాధాకృష్ణమూర్తి, ఎల్‌. జోగారావు వంటి వారు ముఖ్య పాత్ర వహించారు. భారత్‌ చైనా సరిహద్దు వివాదం, కమ్యూనిస్టు ఉద్యమ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎం.హెచ్‌ తో సహా నాయకులను నిర్బంధించింది. ఈ ఒడుదుడుకుల మధ్య డివి సుబ్బారావు కీలక కృషితో ఎబికె ప్రసాద్‌ సంపాదకుడుగా జనశక్తి వారపత్రిక ప్రారంభమైంది. కొద్ది కాలంలోనే డివిఎస్‌, ఎబికె కూడా అరెస్టవడంతో బయట వున్న నండూరి ప్రసాదరావు, బొమ్మారెడ్డి తదితరుల సాయంతో దాన్ని నిర్వహించారు. తీవ్ర క్యాన్సర్‌కు గురైన డివిఎస్‌ను ఎంతో ఒత్తిడి తర్వాత విడుదల చేసినా…1966లో డిటెన్యూగానే కన్నుమూసిన త్యాగజీవి డివిఎస్‌ను ఎం.హెచ్‌ ఎప్పుడూ గుర్తు చేసేవారు.

మళ్లీ ప్రజాశక్తికి స్వాగతం!
1967 ఎన్నికల నాటికి జనశక్తిని దినపత్రికగా నడపాలని ఎం.హెచ్‌, జోగారావు రాజ్‌కోట వెళ్లి ముద్రణ యంత్రాన్ని కొనుక్కొచ్చారు. ఈ లోగా ఉద్యమంలో మరోసారి వచ్చిన విభేదాలతో జనశక్తి యాజమాన్యం మారడంతో సిపిఎం ఆధ్వర్యంలో 1968 జనవరి 27 ప్రజాశక్తి వారపత్రికగా పున:ప్రారంభమైంది. 1966 నుంచి 1982 వరకూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఎం.హెచ్‌ ఈ సమయంలోనూ కీలకమైన రచనలు చేశారు. బొమ్మారెడ్డి సంపాదకుడుగా వెలువడిన ప్రజాశక్తి వారపత్రికలో తొలుత పాటూరు రామయ్య వుండగా కొంత కాలం వాసిరెడ్డి సత్యనారాయణ పనిచేశారు. తుమ్మల వెంకట సుబ్బయ్య మేనేజరుగా వుండేవారు. 1975లో ఎమర్జన్సీ సమయంలో ఆయన రవి, అంజి వంటి తన పాత కలం పేర్లతో చేసిన రచనలు ఎంతో ప్రభావ శీలంగా వుండేవి. వాటిలో రాజు వెడలె… అంటూ సంజయ్ గాంధీపై చేసిన వ్యంగ్య రచన వంటివి నాటి పాఠకులు మర్చిపోలేరు. 1977 తర్వాత నేనూ వారపత్రికలో చేరాను. అప్పటికి ఎం.హెచ్‌, బొమ్మారెడ్డి అరవైలలో వుంటే నేను అప్పుడే ఇరవై దాటుతున్న స్థితి. అయినా ఎంతగానో ఆదరించి ప్రోత్సహించారు. కాలమంతటా ఎడాపెడా సైద్ధాంతిక పెడ ధోరణులపై ఆయన గొప్ప పోరాటం చేశారు. 1981 ఆగష్టు 1న ప్రజాశక్తి దినపత్రికగా మారింది. ”వారపత్రికగా సెలవు, దినపత్రికగా మీ సేవకు సిద్ధం. సెలవివ్వవలసిన వారు మీరు, స్వాగతం పలకాల్సిన వారూ మీరే” అని ఎం.హెచ్‌ రాశారు. ఇందులోనే తన శైలీ విన్యాసం మనం చూడొచ్చు. ఈ కాలంలో శాసనమండలికీ రాజ్యసభకూ కూడా ఎన్నికై సవ్యసాచిగా బాధ్యతలు నిర్వహించారు. ”అవి వారపత్రికలయినా, దినపత్రికలయినా, నా పేరిటే అవి నడిచినా నడవకపోయినా నేను జైలులో వున్నా రహస్యంగా వున్నా శాసనసభ్యుడుగా వున్నా పార్టీ కార్యదర్శిగా వున్నా విశాలాంధ్రకూ జనశక్తికీ, ప్రజాశక్తికీ నా రచనలూ సంపాదకీయాలూ అందుబాటులో వుంటూ వచ్చాయి” అని తన జ్ఞాపకాల్లో రాశారు.

ఆయన చూపిన బాటలో..
ప్రజాశక్తి దినపత్రికగా పున:ప్రారంభమైనప్పుడు నడపడం కష్టమని చాలామంది వ్యాఖ్యానించారుగానీ ఎం.హెచ్‌ అనుభవం, నాయకత్వ సహకారం దాన్ని విజయవంతంగా విస్తరించేందుకు బాట వేశాయి. రాజకీయంగానూ లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణలో అది ముందు నిలిచింది. మారిన పరిస్థితుల్లో అనేక నూతన ప్రయోగాలు, చొరవల వల్లనే ఇది సాధ్యమైంది. ఉద్యమ పితామహుడైన సుందరయ్య గారు, లావు బాలగంగాధరరావు, కొరటాల సత్యనారాయణ, రాఘవులు వంటి నాటి కార్యదర్శులు ఈ కృషికి తోడు నిలిచారు. యాజమాన్యంలో మళ్లీ, గోళ్ల రాధాకృష్ణమూర్తి, తర్వాత వి.కృష్ణయ్య ఆ యా దశల్లో జనరల్‌ మేనేజర్లుగా ముఖ్య పాత్ర వహించారు. ఇలా ఎందరో సీనియర్లు, యువత, కొత్త వారు పాలుపంచుకున్నారు. గనకే ప్రజాశక్తి నిలదొక్కుకోగలిగింది. ఎన్నో పత్రికలు మూతపడ్డాయి గాని ప్రజాశక్తి నిర్విఘ్నంగా కొనసాగిందంటే ఇదే పునాది. 1990లలో ప్రజాశక్తి పురోగమనం వేగం పుంజుకుంది. ఉద్యమ కుటుంబం నుంచి వచ్చాను గనక చిన్నప్పటి నుంచి ఒక స్ఫూర్తిగా భావిస్తున్న ఎం.హెచ్‌ వంటి దిగ్గజంతో రెండు దశాబ్దాలు సన్నిహితంగా మెలగడం, కొన్నేళ్లు సహ సంపాదకుడుగా వుండటం నాకు లభించిన గొప్ప అవకాశం. ఆఫీసుకు రాగానే ఆయన గదికి వెళ్లగానే కాఫీ తాగి రాజకీయాలు, సాహిత్యం, చరిత్ర విషయాలు, అనుభవాలు తెలుసుకోవడం మరచిపోలేని అనుభవం. క్లిష్ట పరిస్థితులను, సమస్యలను సమన్వయం చేయగల వాస్తవికత ఆయన స్వంతం. తర్వాత కాలంలో నేను బుకహేౌస్‌ బాధ్యతలకు వెళ్లగా వి.శ్రీనివాసరావు మొదట ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా, 2001 తర్వాత పూర్తి స్థాయి సంపాదకుడుగా ప్రజాశక్తి బాధ్యతలు చేపట్టారు. శ్రీనివాసరావు ఢిల్లీ వెళ్లాక ఎస్‌.వినయ కుమార్‌ సంపాదకుడుగా పనిచేశారు. 2013లో మళ్లీ నేను పత్రిక సంపాదక బాధ్యతల్లో వుండగా రాష్ట్ర విభజనతో పాటూరు రామయ్య ఎడిటర్‌గా ఎస్‌.వెంకట్రావు ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా ప్రజాశక్తి విజయవాడకు మారింది. 2018 నుంచి ఎం.వి.ఎస్‌.శర్మ, ప్రస్తుతం తులసీదాస్‌ సంపాదకులుగా ఎం.హెచ్‌ ఒరవడిని కొనసాగిస్తూ వస్తున్నారు. మా అందరికీ ప్రేరణ ఎం.హెచ్‌ అన్నది నిజం. ఆయన కుటుంబం మొత్తం అదే బాటలో కొనసాగించడం మరింత విశేషం.
రాజకీయంగా రాజీ పడని సైద్ధాంతిక స్పష్టత పాటిస్తూనే భిన్నాభిప్రాయాలను గౌరవించడం, ప్రజాస్వామిక ప్రమా ణాలను అనుసరించడం ఇందుకు కారణమైంది. మీడియా విస్తరణ తర్వాత నిట్టనిలువునా చీలిపోయి అసత్యాలు అసభ్యతలు తాండవిస్తున్న నేటి తరుణంలో ఎం.హెచ్‌ పెట్టిన వరవడి ప్రజాశక్తిని విభిన్నంగా నిలబెట్టగలిగింది. అంతర్జా తీయంగా సోషలిస్టు శక్తులకు ఎదురుదెబ్బ తగిలినప్పుడు, జాతీయంగా మతతత్వ రాజకీయాల ముప్పు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ఇదే దీక్షా పటిమ ప్రత్యామ్నా యం చూపగలిగింది. రాజకీయంగా విభేదించేవారు కూడా ప్రజాశక్తి విశ్వసనీయతను ప్రశంసిస్తారు. మోటూరు స్మారక అవార్డు ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికీ, ప్రజా పాత్రికేయ విలువలు పెంపొందించడానికి మార్గం చూపు తుందని ఆశిద్దాం. పాలక వర్గాల పాచికలనూ ప్రపంచీకరణ తాకిడిని, మత మార్కెట్‌ తత్వాల సవాళ్లనూ ఎదుర్కొంటూ ప్రతి అక్షరం ప్రజల పక్షంగా ముందుకు సాగుదాం.

 నేడు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు 23వ అవార్డు ప్రదానోత్సవ సభ విజయవాడ లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా. 

-తెలకపల్లి రవి

➡️