వలస కూలీల నాట్లు-ఊళ్లో కూలీల అగచాట్లు

ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురవడంతో రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి, వాతావరణాన్ని బట్టి సకాలంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, కర్నూలు, ప్రకాశం ప్రాంతాలలో జులై, ఆగష్టు మాసాలలో, దక్షిణ ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, కడపలలో లేట్‌ ఖరీఫ్‌ అక్టోబర్‌, నవంబర్‌ నెలలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ప్రధానమైన పంట వరి. అలాగే మెట్ట ప్రాంతాలలో వివిధ రకాలైన పంటలు కూడా సాగవుతున్నాయి.
గ్రామాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నా స్ధానిక వ్యవసాయ కూలీలకు మాత్రం పనులు దొరకడం లేదు. సంవత్సరం మొత్తం మీద 30 రోజుల కూడా కూలీ పనులు వుండటం లేదు. కారణం ముఖ్యంగా వ్యవసాయంలో యంత్రాలు రావడం. పంటల సాగులో మార్పులు రావడం (ఉదా: డ్రమ్‌ సీడింగ్‌ చల్లటం లాంటి పనులు). ప్రస్తుతం ‘వలస కూలీలు’ మరో ముఖ్య కారణం. బయట రాష్ట్రాల నుండి (బెంగాల్‌, బీహార్‌) కూలీలు రావడంతో స్ధానిక కూలీలకు పనులు దొరకడం లేదు. కూలీలు గ్రామాల్లో పనులు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వ్యవసాయేతర పనులకు వెళుతున్నారు. ప్రధానంగా ఇటుకబట్టీ పనులు, భవన నిర్మాణ పనులు, హోటళ్ళలో క్లీనింగ్‌ పనులకు, అలాగే పట్టణాల్లో ఇళ్ళలో పాచి పనులకు (మహిళలు) వెళుతున్నారు. ఒక వేళ కూలి దొరికినా కనీస వేతనం వచ్చే పరిస్ధితి లేదు. నారువేతలు మొత్తం కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఎక్కువ శ్రమను ధారపోయాల్సిన పరిస్ధితి వస్తున్నది. ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఒళ్ళు హూనం అయ్యేలా పనిచేస్తే కేవలం రూ.500, రూ.600 వచ్చే పరిస్ధితి. ఇది ఊళ్ళో కూలీల పరిస్ధితి.

వలస కూలీల పరిస్ధితి

ఎక్కడో వేల కిలో మీటర్ల దూరం నుండి ప్రధానంగా బీహార్‌, బెంగాల్‌ ప్రాంతాల నుండి పేదలు పొట్ట చేత పట్టుకొని మహిళలను, పసిబిడ్డలను తీసుకొని ఇక్కడి గ్రామాలకు వస్తున్నారు. మధ్యవర్తులు, డీలర్లు చూపిన పశువుల కొట్టాలు, పాడుబడిన ఇళ్లు, బస్‌ షెల్టర్లు, మొండి గోడల మధ్య ప్లాస్టిక్‌ కవర్లు కప్పుకొని మురికి కూపాలలో, పురుగు, పుట్ర లెక్క చేయకుండా బిక్కు బిక్కుమంటూ దుర్భరంగా జీవిస్తూ కాయకష్టం చేస్తున్నారు. వీళ్ళు కూడా కాంట్రాక్టు పద్ధతులలోనే నాట్లు వేస్తున్నారు. ఒక ఎకరా నారు పెరికి నారు మోసుకొని నాట్లు వేస్తే మధ్యవర్తి రైతు దగ్గర రూ.4500 నుండి రూ.4600 తీసుకుంటారు. డిమాండ్‌ ఎక్కువైతే రూ.5000 వరకు తీసుకొని వీరికి మాత్రం కేవలం రూ.3200, రూ.3500 మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు వసతుల పేరు మీద (గ్యాస్‌, బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, ఆటో ట్రాన్స్‌పోర్టు) మధ్యవర్తులు, డీలర్లు కాజేస్తున్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఈ లేట్‌ ఖరీఫ్‌లో 9 లక్షల ఎకరాల వరి సాగు జరుగుతుంది. స్ధానిక కూలీలు 2 లక్షల ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. మిగిలిన పొలమంతా కూడా రైతాంగం బెంగాల్‌ కూలీల చేతనే నాట్లు వేయిస్తున్నారు. వీళ్ళ చేత నాట్లు వేయించుకుంటే రైతుకు ఎటువంటి కష్టం లేకుండా ఇబ్బందులు లేకుండా శనగలు తిని, చెయ్యి కడుక్కున్నట్లుగా అన్ని పనులు కూలీలే చూసుకుంటారు (నారు పీకడం, నారు మోసుకోవడం, సాళ్లు తీయడం లాంటి పనులు). రైతులు కూడా వ్యవసాయానికి నారుమళ్లు సిద్ధం చేసే సమయంలోనే బెంగాల్‌ కూలీలను దృష్టిలో పెట్టుకొని నార్లు పోసుకుంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం సుమారు 50 వేల మంది వరకు బెంగాల్‌ కూలీలు వున్నారంటే పరిస్ధితి ఏ స్ధితిలో వుందో ఒకసారి ఆలోచించాలి. వ్యవసాయ సీజన్‌ మధ్యలో వచ్చినా ఇప్పటికి కూడా నెల్లూరు, కావలి, గూడూరు రైల్వే స్టేషన్లలో వలస కూలీలు దిగుతూనే వున్నారు. ప్లాట్‌ఫారమ్‌ల మీద మూటలతో పనికి పిలిచే వారి కోసం స్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రం కాని రాష్ట్రం, జిల్లా కాని జిల్లా, ఊరు కాని ఊరు వచ్చిన కూలీలకు, మరీ ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు. వాళ్ళ అవసరాలకు చాటు మాటు లేదు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొన్ని చోట్ల పసిపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునే దిక్కు లేదు. ఈ మధ్యనే నెల్లూరు జిల్లాలో కూలీలు వెళుతున్న ఆటోలు, ట్రాక్టర్లు బోల్తా పడి ఇద్దరు వలస కూలీలు చనిపోయిన పరిస్ధితి. మరికొంత మందికి తీవ్రగాయాలై నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో, మరికొంతమంది ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం వారికి అండగా నిలిచి, చనిపోయిన కూలీలకు రైతుల చేత నష్టపరిహారం కట్టించి, వారి శవాలను వారి స్వగ్రామాలకు పంపించడానికి ప్రయత్నం చేసింది. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరింది. ఇంకా అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. ఇలాంటి పరిస్ధితులలో వలస కార్మికులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇన్ని కష్టాలు పడి చేసిన శ్రమకు తగిన ఫలితం దక్కుతుందా అంటే అదీ లేదు. ఉదయం 5.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు పని చేస్తే వచ్చిన కూలి డబ్బులు కూడా వీళ్ళకు పూర్తిగా దక్కే పరిస్ధితి లేదు.

వ్యవసాయ కార్మికుల పట్ల ప్రభుత్వాల చిన్నచూపు

దేశానికి అన్నం పెడుతున్న రైతాంగానికి వ్యవసాయ కార్మికులకు పాలకులు మొండి చేయి చూపిస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర చట్టం చేస్తానని చెప్పిన ప్రధానమంత్రి మాట తప్పి మోసం చేస్తున్నారు. అదే విధంగా వ్యవసాయాన్నే నమ్ముకున్న వ్యవసాయ కూలీలకు 6 గంటలు పని చేస్తే నారువేతల్లో జోన్ల ప్రకారం (మొదటి జోన్‌లో 443 రూపాయలు, రెండవ జోన్‌లో 438 రూపాయలు) కనీస వేతనం ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ చట్టం చేసి చెబుతున్నా… ఇక్కడ కూలీలకు మాత్రం రూ.200 మించి ఎక్కడా రావడం లేదు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికశాఖ జీవో విడుదల చేసినా…జిల్లా అధికారులు, మండల అధికారులు, గ్రామ అధికారులు ఎక్కడా ఆ జీవోని కూలీలకు, రైతులకు తెలియజేసి కూలీలకు జీవో ప్రకారం వచ్చే విధంగా చర్యలు చేపట్టడం లేదు. గ్రామాలలో వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ కార్మికుల కోసం 2005లో వామపక్షాలు పోరాడి తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ప్రస్తుత ఎన్‌.డి.ఏ. ప్రభుత్వం నిధులు తగ్గించడమేగాక, వాటిని కూడా విడుదల చేయకుండా నిర్వీర్యం చేసే కుట్ర పన్నింది. ఈ చట్టం సక్రమంగా గ్రామాలలో అమలు జరిగితే కూలీల వలసలు తగ్గి, వారి జీవన స్ధితి మెరుగుపడుతుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు చేయడం లేదు. మరోవైపు పేదలకు విద్య, వైద్యం, నిలువ నీడ కూడా లేని పరిస్ధితి గ్రామాల్లో ఉంది. రైతులకు మద్దతు ధరకు చట్టం, వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం రూపొందించాలి. దాన్ని సక్రమంగా అమలు చేయాలి. అందుకు గ్రామీణ ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలి.

వ్యాసకర్త – పుల్లయ్య మంగళ, ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి,

సెల్‌: 9440740555

 

➡️