ఖనిజ సంపద ప్రజలదే!

కొన్ని రాష్ట్రాలలో అపారమైన ఖనిజ సంపద వుంది. అయినప్పటికీ ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలు కడు పేదరికంలో జీవిస్తున్నారు. ఖనిజ సంపద నుంచి వచ్చే ఆదాయం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు, దేశ విదేశాల్లో వున్న పెద్ద కంపెనీలకు చేరుతున్నది. ఒరిస్సాలో ఇనుప ఖనిజాలు ఉన్నాయి. చత్తీస్‌గఢ్‌లో బాక్సైట్‌ నిక్షేపాలు ఉన్నాయి. కేరళలో థోరియం లభిస్తుంది. ఈ ఖనిజాలను ముడి పదార్ధాలుగా జపాన్‌, చైనా లాంటి దేశాలు ఉపయోగించి తమ సంపదను పెంచుకుంటున్నాయి. ఆంధ్ర లోని గ్యాస్‌, చమురు నిక్షేపాలు రిలయన్స్‌ లాంటి కంపెనీలకు లాభాలను ఇస్తున్నాయి. ఈ ఖనిజ సంపద ఉన్నందు వలన స్థానిక ప్రజలకు ఉపయోగం ఏమీ లేకపోగా ఈ ఖనిజాలను వెలికి తీసినందువలన అనేక దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వత్తాసు వున్న బడా కంపెనీలు, దళారీలు ప్రజల కళ్ళలో దుమ్ము కొట్టి లాభాలు గుంజుకుంటున్నారు. ప్రజలకు కనీస వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. చదువు ఖరీదైంది. నిరుద్యోగం ఎక్కువవటం వలన యువత దారి తప్పుతున్నారు. పైగా ఖనిజ సంపదను కాపాడుతున్న ఆదివాసీలపై దాడుల ఉధృతి మరింత పెరుగుతోంది. పేదరికంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదపై పన్ను విధించడానికి హక్కు లేదన్నారు. అందుకనువైన చట్టాలను చేసుకుంటున్నారు. రాజ్యాంగం లోని ఫెడరల్‌ స్ఫూర్తిని పక్కన పెట్టారు. రాష్ట్రాలపై పెత్తనం చేస్తూ ఆర్థిక వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకొని బడా కంపెనీలకు ఊడిగం చేస్తూ ప్రజలను పేదరికంలోనే వుంచుతున్నారు. అదేమన్న వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారు. పాలక వర్గాలకు అనుకూలమైన చట్టాలను చేసుకుంటున్నారు.

పాలక వర్గ అనుకూల చట్టాలు
1) రాజ్యాంగంలోని 246 ఆర్టికల్‌ను ఉపయోగించి 1957లో మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ (ఎం.ఎం.డి.ఆర్‌) చట్టాన్ని చేశారు. ఈ చట్టం కింద సెక్షన్‌9 ద్వారా సంక్రమించిన అధికారాలను అడ్డు పెట్టుకుని, రాయల్టీని కేంద్ర ప్రభుత్వానికే చెల్లించాలన్నారు. ఫలితంగా ఖనిజ సంపద వున్న ప్రజలను, ప్రాంతాలను నిత్య పేదరికంలో వుంచారు. పాలక వర్గం, దళారీలు, దేశ విదేశీ కంపెనీలు లాభపడ్డాయి.
2) లైమ్‌స్టోన్‌ ఖనిజాన్ని వెలికి తీస్తున్న ఇండియా సిమెంట్స్‌పై తమిళనాడు ప్రభుత్వం… రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ లోని రాష్ట్ర జాబితాలోని 49, 50 ఎంట్రీల ప్రకారం భూమి పన్ను విధించింది. 1957లో చేసిన ఎం.ఎం.డి.ఆర్‌ చట్టాన్ని అడ్డం పెట్టుకుని రాయల్టీపై సెస్‌, పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఏడుగురు సభ్యులున్న సుప్రీంకోర్టు బెంచ్‌ తీర్పు ఇచ్చింది. రాయల్టీ అంటే పన్ను అన్నారు (ఇండియా సిమెంట్స్‌ వర్సెస్‌ తమిళనాడు గవర్నమెంట్‌ కేసు).
3) మరొక ప్రఖ్యాత కేసులో రాజ్యాంగ బెంచ్‌ పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు వుందన్నారు. రాయల్టీ అంటే పన్ను కాదన్నారు. అంతకు ముందు వున్న తీర్పులన్నిటికీ భిన్నమైన తీర్పు ఇచ్చారు. కేశోరామ్‌ ఇండిస్టీస్‌ వర్సెస్‌ వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రం మధ్య నడిచిన కేసులో, రాజ్యాంగ బెంచ్‌ అందుకు విరుద్ధమైన తీర్పు ఇచ్చింది.

చారిత్రాత్మక తీర్పు
జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 2024 సంవత్సరం జులై 25న ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాల అధికారాన్ని, ఫెడరలిజం స్ఫూర్తిని నిలబెట్టేదిగా ఉన్నది. ఖనిజాలను వెలికి తీసే భూమిపై పన్నులు, సెస్‌ వంటి లెవీలు విధించే అధికారం రాష్ట్రాలకే ఉందని, కేంద్రానికి ఆ హక్కు లేదని 8-1 మెజార్టీతో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో 1999 నుండి ఉన్న సివిల్‌ ఆప్పీల్‌ నెంబర్లు 4056…4064 నుండి ఇప్పటి వరకు వున్న అతి పురాతనమైన కేసులన్నీ పరిష్కరింపబడ్డాయి.

తీర్పులో ముఖ్యమైన అంశాలు
ఖనిజ హక్కులపై పన్ను విధించే శాసనాధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. కేంద్ర జాబితాలోని ఎంట్రీ 54 కింద ఖనిజ హక్కులపై పన్ను విధించే శాసనపరమైన సామర్థ్యం పార్లమెంటుకు లేదు. ఇది జనరల్‌ ఎంట్రీ. మినరల్‌ హక్కులపై పన్ను విధించే అధికారం రాష్ట్ర జాబితా2 లోని ఎంట్రీ 50లో పేర్కొనబడినందున, ఆ విషయానికి సంబంధించి పార్లమెంటు తన విశేష అధికారాలను ఉపయోగించజాలదు.
గనులు, క్వారీలతో కూడిన భూములపై పన్ను విధించేందుకు రాష్ట్ర జాబితా2 లోని ఎంట్రీ 49తో పాటు ఆర్టికల్‌ 246 ప్రకారం రాష్ట్ర శాసనసభలు శాసన సామర్థ్యాలను కలిగి ఉంటాయి. లిస్ట్‌ 2 లోని ఎంట్రీ 50కి సంబంధించి ఖనిజాభివద్ధికి సంబంధించిన చట్టంలో పార్లమెంటు విధించిన ‘పరిమితులు’ లిస్ట్‌ లోని ఎంట్రీ 49పై పని చేయవు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆ ప్రభావానికి ఎటువంటి నిర్దిష్ట నిబంధన లేదు.
అయితే కోర్టు విచారణలో ఆయిల్‌ ఫీల్డ్స్‌, మినరల్‌ ఆయిల్‌ రిసోర్సెస్‌, పెట్రోల్‌, పెట్రోలియం ఉత్పత్తుల గురించి లేకపోవడం విచారకరం. 438 మంది పిటిషన్‌దారులు గాని, ప్రభుత్వంగానీ పెట్రోలియం ఉత్పత్తుల గురించి అడగనందువలన సుప్రీంకోర్టు విచారణలో లేవని అత్యున్నత ధర్మాసనం తెలియజేసింది. ఇనుప ఖనిజం, బొగ్గు, మైకా, గ్రానైట్‌, బాక్సైట్‌, యురేనియం, లాంటివే కాకుండా భూమిలో లభించే శిలాజ ఇంధనాలను (చమురు, సహజ వాయువులను) అన్ని దేశాలలో ఖనిజ సంపదగా పరిగణిస్తారు. ఏ డిక్షనరీ చూసినా, పదవ తరగతి విద్యార్థిని అడిగినా ఖనిజ సంపద అంటే ఏమిటో చెప్తారు.
పెట్రోలియం ఉత్పత్తులు, గనులు లాంటి నిక్షేపాలు వున్న రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలుగా తక్కువ ఆదాయంతో ఉన్నాయి. సహజ వనరులు బాగా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా పేద రాష్ట్రాలుగా ఉన్నాయి. ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలు అపారంగా ఉన్న రష్యా, అమెరికా, ఇరాన్‌, సౌదీ దేశాలు సంపద్వంతంగా వున్నాయి. మనకు గ్యాస్‌, ఆయిల్‌ దండిగా వున్నా మన రాష్ట్ర సంపద పెరగలేదు. అంబానీ సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది. రాష్ట్రంలో లభించే ఖనిజ సంపదలన్నిటిపైనా ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గమైన అంబానీ లాంటి వారి ఆధిపత్యం కొనసాగుతున్నది.

స్వర్ణ సింహాసనాలు – రైతుల ఆత్మహత్యలు
సహజ వనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో 50 శాతం కేటాయించాలని 12వ ఫైనాన్స్‌ కమిషన్‌ కూడా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల వాదనలను పెడచెవిన పెట్టింది. 50 శాతం వాటా ఇవ్వలేదు. పన్ను విధించే హక్కు లేదన్నారు. కష్టాలు మనకు సంపద కార్పోరేట్‌ కంపెనీలకు వెళుతుంది.
భూమి లోపల కొన్ని లక్షల సంవత్సరాల పరిణామాల ఫలితంగా ఖనిజాలు, సహజ వాయువు, చమురు ఏర్పడుతుంది. అటువంటి విలువైన ఖనిజ సంపదను కొద్దిమంది ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గానికి కట్టబెడుతున్నారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రథమ స్థానం కోసం పోటీ పడుతున్నారు. రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మరోవైపు తాళిబొట్టు తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తున్న రైతుల ఆత్మహత్యల నివారణకు సహజ వనరులను ఉపయోగించాలనే కనీస బాధ్యత పాలకులకు లేనందున ప్రజలు కష్టాలతోనే జీవిస్తున్నారు.
ఖనిజాలు భూమి నుండి వెలికి తీసిన ఫలితంగా భూమిలో, పర్యావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. భూగర్భ జలాలు, చెరువులు, బావులు, గాలి కలుషితమై, వాతావరణ దుష్పరిణామాల వలన కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులు, క్యాన్సర్‌ బారిన పడ్డ ప్రజలు కనీస వైద్య సదుపాయాలు లేక నరకం చూస్తున్నారు. అపారమైన సహజ సంపదను బడా కార్పోరేట్‌ కంపెనీలకు అప్పచెప్పి ఆదివాసీలను గాలికి వదిలేశారు. సహజ సంపదను కాపాడుతున్న ఆదివాసీలకు కనీస జీవన సౌకర్యాలను కలగచేయటంలో విఫలమయ్యారు.
కె.జి బేసిన్‌లో లభ్యమయ్యే గ్యాస్‌, ఆయిల్‌తో సహా, పన్ను విధించే రాజ్యాంగ పరమైన హక్కు మనకున్నదని చెప్పాలి. అందుకు జులై 25 సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇతర ఖనిజాలతో పాటు గ్యాస్‌, చమురును చేర్చాలని సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలలో లభించే ఖనిజ వనరులపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను విధించాలి. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరూ సమైక్యంగా ముందుకు కదలాల్సిన తరుణం ఆసన్నమైంది.

వ్యాసకర్త : డా|| కొల్లా రాజమోహన్‌, కె.జి. బేసిన్‌ గ్యాస్‌, ఆయిల్‌ సాధన సమితి కన్వీనర్‌,
సెల్‌ : 9000657799 

➡️