కనీస ‘మద్దతు’ అవసరం

మాటల్లో ఊరేగించి, చేతల్లో ఉరి బిగించే మోసకారి విధానాలతో అన్నదాతల ఉసురు పోసుకోవటం పాలకులకు పరిపాటిగా మారింది. రైతు దేశానికి వెన్నెముక అంటూ ఉపన్యాసాలు ఊదరగొట్టే ప్రభుత్వాలు ఆ వెన్నెముకను కర్కశంగా విరిచేసే చేతలకు తెగిస్తున్నాయి. చేసిన శ్రమకు, ఉత్పత్తికి కనీసంలో కనీసంగా ఖరీదు కట్టటం అనేది ఒక సాధారణ న్యాయం. కానీ, ఈ సాధారణ న్యాయం దశాబ్దాల తరబడి రైతులకు అందటం లేదు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న అంశానికి చట్టబద్ధత కల్పించటం ఇంకా ఎండమావిగానే ఉంది. కేంద్రంలోని బిజెపి తాను అమలు చేస్తామని అనేకసార్లు వల్లించిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి తదితర 11 డిమాండ్లతో ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతు నాయకుడు జగ్జిత్‌సింగ్‌ దల్లేవాల్‌ నవంబరు 26వ తేదీన నిరాహార దీక్ష చేపట్టి నెలరోజులు గడిచిపోయినా కేంద్రప్రభుత్వ పెద్దల్లో కనీస చలనం లేకపోవటం శోచనీయం.
ఎండనక వాననక ఆరుగాలం చెమటోడ్చి కష్టించే అన్నదాతలకు ప్రకృతి వైపరీత్యాలతో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వాటికి అదనంగా దళారుల మోసాలు, మార్కెట్‌ ధర పతనాలు, రవాణా భారాలూ చేరి, కష్టాలూ కన్నీళ్లే దిగుబడులుగా వ్యవసాయాన్ని వ్యయభరితంగా మార్చేశాయి. ఈ దుర్భర స్థితి నుంచి రైతును రక్షించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కష్టాలను మరింత పెంచుతున్నాయి తప్ప, భరోసాగా నిలవటం లేదు. దరిమిలా దేశంలో గత మూడు దశాబ్దాల్లో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఇటీవల సుప్రీంకోర్టు తనకందిన అధికారిక నివేదిక నుంచి పేర్కొంది. నివేదికలకెక్కని చావులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆత్మహత్యల లెక్క ఏడు లక్షలకు పైబడే ఉంటుందని పరిశీలకుల అంచనా. వ్యవసాయమొక ప్రధాన జీవన రంగంగా సాగుతున్న దేశంలో రైతుల పరిస్థితి ఇంత దుర్భరంగా ఉండడం చాలా బాధాకరం. కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చకపోగా ఎరువుల ధరలను పెంచి, సహకార వ్యవస్థలను, మార్కెట్టు యార్డులను నిర్వీర్యపర్చి మరిన్ని ఇక్కట్లను జోడించింది.
వ్యవసాయరంగం సంక్షోభం నుంచి బయటపడటానికి గతంలో స్వామినాథన్‌ కమిషన్‌ కొన్ని సిఫార్సులు చేసింది. పంటలకు మద్దతు ధర (సి2 + 50 శాతం)ను ఇవ్వాలని, సింగిల్‌ యూనిట్‌ ప్రాతిపదికన పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని, రైతులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని, మార్కెట్‌ సదుపాయాలు పెంచాలని సూచనలు చేసింది. దశాబ్దం క్రితం వరకూ అధికారంలోకి రాక ముందు బిజెపి బలంగా వినిపించిన ఎన్నికల వాగ్దానాల్లో ఇవన్నీ ఉన్నాయి. గద్దెనెక్కాక ఆ హామీలను ఆవలకు విసిరేసి, రైతులకు పంగనామాలు పెట్టే పనికి సమాయత్తమైంది! ఉన్న రాయితీలను తీసేసి, మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే దుస్సాహసానికి ఒడిగట్టింది. వాటిని వెనక్కి కొట్టటానికి లక్షలాదిమంది రైతులు నెలల తరబడి, ఢిల్లీ సరిహద్దుల్లో చారిత్రాత్మక పోరాటం చేశారు. తప్పని పరిస్థితుల్లో మోడీ క్షమాపణలు చెప్పి, ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ, ఆ తరువాత ఈ మూడేళ్లలో రైతులను ఉద్ధరించే చర్య ఒక్కటంటే ఒక్కటీ చేపట్టలేదు. ఏడాదికి మూడు విడతలుగా విదిల్చే రూ.6 వేల సహాయాన్నే గొప్ప ఉపకారంగా మోడీ పరివారం చెప్పుకుంటోంది.
ఇలాంటి అరకొర విదిలింపులతో దేశ వ్యవసాయ రంగానికి ఒరిగేది ఏమీ ఉండదు. రైతు సమస్యలపై అధ్యయనం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల విడుదల నివేదిక కూడా దీనినే స్పష్టం చేస్తోంది. కనీస మద్దతు ధరకు గ్యారంటీ, రుణమాఫీ, పిఎం కిసాన్‌ నిధుల రెట్టింపు, బడ్జెట్లో వ్యవసాయరంగ వాటా పెంపు వంటి ప్రతిపాదనలు చేసింది. మోడీ ప్రభుత్వం తాను చెప్పుకుంటున్నట్టు రైతులకు ఇప్పటికే చాలా మేళ్లు చేసివుంటే- కొత్తగా ఈ ప్రతిపాదనలు ఎందుకు? రైతాంగం పట్ల కత్తి కట్టినట్టు వ్యవహరించే ధోరణికి బిజెపి ప్రభుత్వం ఇకనైనా స్వస్తి పలకాలి. రైతుల న్యాయమైన డిమాండ్లను తక్షణం నెరవేర్చాలి. భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే ఉదారవాద ఆర్థిక విధానాలను విడనాడాలి. రైతు నిశ్చింతగా ఉండటానికి, వ్యవసాయరంగం నిలబడటానికి ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలి.

➡️