‘మినిమమ్‌’ బ్యాలెన్స్‌..!

Aug 3,2024 04:49 #Editorial, #minimum fee, #SBI

కనీస నిల్వలు పాటించని సేవింగ్స్‌ అకౌంట్‌ ఖాతాదారుల నుండి బ్యాంక్‌లు జరిమానా పేరుతో భారీగా సొమ్ము వసూలు చేయడం దారుణం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మినహా పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాల్లో కనీస నిల్వను నిర్వహించడంలో విఫలమైనందుకు ఖాతాదారుల నుండి రూ.2,331 కోట్లు వసూలు చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటుకు నివేదించింది. అంతకు ముందు ఏడాది అంటే 2022-23లో రూ. 1,855 కోట్లు పిండుకోగా ఇప్పుడు 25.63 శాతం అదనంగా ఈ బ్యాంకులు గుంజుకున్నాయన్నమాట. గత మూడేళ్లలో కనీస నిల్వను నిర్వహించనందుకు ఖాతాదారుల నుండి రూ.5,614 కోట్లు వసూలు చేశాయి. ఈ విధంగా ఖాతాదారుల నుండి జరిమానా పేరిట డబ్బు అప్పనంగా కొట్టేయడం బ్యాంకులకు తగని పని. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలను ఉదారంగా మాఫీ చేస్తున్న బ్యాంకులు సామాన్యుల నుండి ఇలా గోళ్లూడగొట్టి వసూలు చేయడం అమానుషం. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐ మాత్రం 2019-20 నుంచి కనీస బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయని ఖాతాదారులపై జరిమానా విధించడాన్ని నిలిపివేయడం కొంత ఊరట కలిగించే విషయం. ప్రభుత్వ రంగ బ్యాంకుల సంగతిలా వుంటే రకరకాల రూపాల్లో జనం సొమ్ము కొల్లగొట్టే ప్రయివేటు బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వలు ఉంచడంలో విఫలమైతే ఖాతాదారుల నుంచి భారీ మొత్తాలను వసూలు చేస్తున్నాయి. ఆ విధంగా బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతాదారుల నుండి ఈ రూపంలో సొమ్ము లూటీ చేయడం అమానుషం.
బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతా తెరిచేది పేదలు, సామాన్య మధ్యతరగతి వారేనని వేరుగా చెప్పనక్కరలేదు. అంతే కాదు! వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు, రాయితీలు పొందడానికీ బ్యాంకు ఖాతా తప్పనిసరి అంటూ జనం చేత వాటిని తెరిపించేది ప్రభుత్వ అధికారులు లేదా వాటి ప్రమోటర్లే కదా! నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని అయిన సందర్భంలో విదేశాల్లోని నల్లధనాన్ని ప్రజల ఖాతాలో వేస్తామని సాగించిన భారీ ప్రచారాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ పాపంలో పాలకుల పాత్ర ఎంతుందో విదితమవుతుంది. ఆనాటి జన్‌ధన్‌ ఖాతాల హడావుడి కూడా ఎవరూ మర్చిపోలేరు. ఒకవైపున సర్కారువారే ఖాతాలు తెరిపించి వాటికి అనుసంధానంగా ఇన్సూరెన్స్‌ కూడా జత చేసి ఆ ప్రీమియంను ఖాతాదారుల నుండి వసూలు చేసిన విషయం చాలా మందికి అసలు తెలియనే తెలియదు. ఈ రూపంలో ఏటా ప్రీమియం కత్తిరింపు జరిగి కనీస నిల్వ తరిగిపోయిన ఖాతాదారులు కోకొల్లలు. ఇది కూడా బ్యాంకులు చేస్తున్న మరోవిధమైన లూటీయే కదా! పొదుపు ఖాతా నిర్వహణకు ఆ యా బ్యాంకులకు ఓవర్‌హెడ్స్‌ రూపంలో కొంత ఖర్చయ్యేమాట నిజమేకానీ వారు జరిమానా పేరిట గుంజుతున్నంత మొత్తమైతే అవ్వదన్నది నిర్వివాదాంశం.
అన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోతుండగా మరోవైపున ప్రజల ఆదాయాలు తరిగిపోతున్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ధరలు, నిరుద్యోగం అన్న రెండు ప్రధానాంశాలే ఇటీవలి సాధారణ ఎన్నికల్లో ప్రభావితం చేశాయని పలు సర్వేలు నిగ్గు తేల్చాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు బ్యాంకుల్లో పొదుపు చేయడం అనేది ఓ మిలియన్‌ డాలర్ల ప్రశ్న లాంటిది. ఏడాదికేడాది ప్రజల పొదుపు తరిగిపోతున్నదని కేంద్ర గణాంకాల సంస్థ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రజల్లో పొదుపు పట్ల అవగాహన కలిగించి, ఆసక్తి పెంచడం బ్యాంకులు, అంతకు మించి ప్రభుత్వమూ చేపట్టవలసి వుంది. ఆ పని మానేసి కనీస ఖాతా నిల్వ లేదనో ఇంకో పేరుతోనో ప్రజలపై భారాలు వేస్తూ పోతే అసలు బ్యాంకు గడపనెక్కడానికే జనం భయపడే స్థితి దాపురించే ప్రమాదముంది. 2008లో ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం భారతదేశాన్ని అంతలా దెబ్బ తీయకపోవడానికి మన బ్యాంకింగ్‌ రంగమూ, ద్రవ్య నిర్వహణా వ్యవస్థల పటిష్టత ఒక ముఖ్య కారణమని విశ్లేషకులు నిర్ధారించారు. మన బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింతగా పటిష్టపరుచుకోవాలి. ఇంకా ఎక్కువ మందిని వాటి పరిధిలోకి తేవడం ఎంతో అవసరం. ప్రజల్లో పొదుపు పట్ల ఆసక్తి పెంచేందుకు తగు ప్రోత్సాహకాలివ్వాలి తప్ప బ్యాంకులు రకరకాల పేర్లతో జరిమానాలు విధించడం ఇప్పటికైనా మానుకోవాలి.

➡️