ఎమ్‌ఎల్‌సి ఎన్నికలు-ప్రజాస్వామ్య విలువలు

Mar 6,2025 05:10 #Articles, #edit page, #MLC Election

ఆంధ్ర రాష్ట్రంలో మూడు శాసనమండలి స్థానాలకు ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికలు రెండు ప్రత్యేకమైన ప్రాధాన్యతలను సంతరించుకున్నాయి. ఒకటి రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ కూటమి కొంతమంది అభ్యర్థులను నిలపగా, వారికి ప్రత్యర్థులుగా రాజకీయాలకు అతీతంగా ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడిఎఫ్‌) అభ్యర్థులకు మధ్య పోటీ జరగడం. రెండోది ఈ పిడిఎఫ్‌ అభ్యర్ధులపై గెలవడానికి ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా టిడిపి అనేక అడ్డదారులు తొక్కడం.
టిడిపి వర్సెస్‌ పిడిఎఫ్‌ అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. ఇది ఒక రకంగా చూస్తే శుభ పరిణామమే. ఎందువల్లనంటే ఎటువంటి విలువలు పాటించని అభ్యర్థుల మధ్య పోటీ జరిగితే అందరూ ఒక్కటే, ఎవరు గెలిచినా ప్రజలకు న్యాయం జరగదు అనుకోవడం సహజం. అలాగే అటువంటి ఎన్నికలలో ప్రజా సమస్యలు చర్చకు కూడా రావు. కానీ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా టిడిపి, పిడిఎఫ్‌ అభ్యర్థులు వుండడంతో ప్రధాన అంశాలు చర్చకు వచ్చాయి. ఇది ఆహ్వానించవలసిన పరిణామం.
గుంటూరు, కృష్ణ స్థానానికి, గోదావరి జిల్లాల స్థానానికి తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు గెలవగా, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం, జనసేన బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. మూడు నియోజకవర్గాల్లోనూ ప్రధాన ప్రత్యర్థులుగా పిడిఎఫ్‌ అభ్యర్థులు నిలిచారు.
వాస్తవంగా పెద్దల సభకు ఎన్నుకోవాల్సిన ఈ స్థానాలలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకొని, వీటిని మరో సాధారణ ఎన్నికల లాగా చేయడం సమంజసం కాదు. ఈ ఎన్నికలలో రాష్ట్ర అధికార పార్టీ, ముఖ్యమంత్రితో సహా నేరుగా రంగంలోకి దిగారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. హుందాగా జరగవలసిన ఎన్నికల్లో చైతన్యం ప్రదర్శించవలసిన ఓటర్లకు నిస్సిగ్గుగా డబ్బులు పంచారు. కానుకలు అందజేశారు. సిగ్గు, బిడియం లేకుండా కులం పేరు చెప్పి కూడా ఓట్లు దండుకున్నారు. ఈ రకంగా సాధారణ ఎన్నికల స్థాయిని మరిపించి, పెద్దల సభకు కళంకం తెచ్చేలా కూటమి పార్టీలు దిగజారాయి.
ఎన్నికల్లో అందరూ గెలవరు కదా! అందువల్ల పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు, ఓటములు సహజమే. అలాగే ఎన్ని అడ్డదారులైన తొక్కి గెలిస్తే, అలాంటి గెలుపు నైతికంగా సరైనదేనా అన్నది పరిశీలించవలసిన విషయమే. దీనికి భిన్నంగా ప్రజలను చైతన్య పరుస్తూ, ప్రజా సమస్యల మీద నిరంతరం కృషి చేస్తూ, ఎన్నికల్లో ప్రచారానికి ఏ అడ్డదారులు తొక్కకుండా, ఆ యా తరగతుల ప్రజల సమస్యలే ఎజెండాగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోతే అప్పుడు గెలుపు ఓటములను ఎలా చూడాలి అన్నది ప్రధానమైన అంశం.
ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆలోచిస్తే, మన రాజ్యాంగంలో ఓటు పరమ పవిత్రమైన హక్కు. దీనిని బజార్లో సరుకుగా మార్చేసి నోటుతోనో, మందుతోనో, కులం పేరుతోనో ప్రభావితం చేసి ఓట్లు వేయించుకుంటే అంతకంటే నీచం మరొకటి ఉండదు. అందులోనూ విద్యావంతులు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికలలో మరింత ఘోరం. ఓటర్లను వాస్తవాలను ఆలోచించేలా, వారిని ఏ రకమైన ప్రలోభాలకు గురి చేయకుండా వదిలేసి, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగి గెలిస్తే అప్పుడు అసలైన ప్రజాస్వామ్య ఎన్నిక అని భావించవచ్చు. కానీ అధికారం, పదవులు రుచి మరిగిన రాజకీయ పార్టీలు అలా చేస్తాయనుకోవడం అవివేకమే.
అయితే అందరూ అలాగే ఉంటారని భావించలేం. ఎన్నికలలో ఓడిన ముగ్గురు పిడిఎఫ్‌ అభ్యర్థులు నీతి, నిజాయితీ, విలువలకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రత్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారని తెలిసినా, వీరు మాత్రం అడ్డదారులు కాదు కదా కనీసం ఒక్క తప్పటడుగు కూడా వేయలేదు. ఇటువంటి విలువలకు కట్టుబడి పోటీ చేయడం నేటి కలుషిత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా అరుదు. కానీ ఇది సాధ్యమేనని పిడిఎఫ్‌ అభ్యర్థులు నిరూపించారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ వాస్తవాన్ని ప్రత్యర్థులు బయటకు చెప్పలేకపోయినా, వీరికి మనసంటూ ఉంటే, మనసులోనైనా అభినందించి తీరాలి.
కృష్ణ, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అన్ని అఘాయిత్యాలకు పాల్పడింది. డబ్బులు, మందు, బిర్యానీ వంటివి పంచడమే కాకుండా, అవి కూడా తమను గెలిపించలేవనే అనుమానంతో అనేక బూతుల్లో పోలీసుల సహకారంతో పిడిఎఫ్‌ ఎన్నికల ఏజెంట్లను బయటకు తరిమేసింది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా లేనట్లుగా ఎన్నికల సిబ్బందిని లొంగదీసుకుని, కొన్ని ప్రాంతాలలో పోలింగ్‌ బూత్‌లను స్వాధీనం చేసుకుని, ఓట్లు గుద్దుకుంది. ఓటమి తప్పదనే భయంతోనే ఇటువంటి దిగజారుడు చర్యలకు పాల్పడింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసింది.
గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో అధికార కూటమి పూర్తిగా కులం కార్డును వాడుకుంది. దానితోపాటు డబ్బు, అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అయినా ఓడిపోతామనే భయంతో ఎన్నికల రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నేరుగా ఎన్నికల బూత్‌ల లోకి ప్రవేశించారు. ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తీసుకొచ్చి జిరాక్స్‌ ఐడి కార్డులు చూపించి దొంగ ఓట్లను యథేచ్ఛగా వేయించుకున్నారు.
ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. వీరి కేంద్ర మంత్రి, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు ఏకంగా వీడియో ద్వారానే ప్రచారానికి దిగారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల ప్రతినిధిగా పోటీ చేస్తున్న ఒక స్వతంత్ర అభ్యర్థిని బెదిరించి, ప్రలోభ పెట్టి వీరి అభ్యర్థికి మద్దతుగా ఉపసంహరించుకునేలా చేశారు. ఎమ్మెల్యే అయిన మాజీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కనీసమైన మర్యాద కూడా లేకుండా హైస్కూల్‌ హెడ్‌ మాస్టారి సీట్లో కూర్చుని ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అనేకమంది ఓటర్లకు దగ్గరుండి ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు దిగజారారు. అయినా ఓటర్లు వీరిని తిరస్కరించి ఓడించారు.
కానీ, విచిత్రం ఏంటంటే కింద పడినా తామే గెలిచామని చెప్పుకోవడం తెలుగుదేశం నాయకులకే చెల్లింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి, మాజీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు గెలిచిన శ్రీనివాసులు నాయుడు కూడా మా మద్దతుతోనే గెలిచారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా విచిత్రంగా పిడిఎఫ్‌ అభ్యర్థి వైసిపి మద్దతుతో పోటీ చేశారని ఆయన, ప్రస్తుత టిడిపి అధ్యక్షుడు అసత్యాలను, అవాస్తవాలను పేర్కొన్నారు. ఇది ఏ రకమైన సంస్కారమో వారికే తెలియాలి.
నిజాయతీగల ఒక సాధారణ పౌరుడుగా చూస్తే ఇటువంటి గెలుపు కూడా ఒక గెలుపేనా అనే సందేహం కలగక మానదు. దీని కంటే నిజాయితీగా పోరాడి, ఓడిపోయిన వారే గొప్పవారు కదా అనేది కూడా అనిపించక మానదు. అందుకే ఈ ఎన్నికలలో ‘గెలిచినవారు ఓడారు – ఓడిన వారు గెలిచారు’ అని చెప్పడం సముచితంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలలో ఓడిన పిడిఎఫ్‌ అభ్యర్థుల ఎన్నికల ఖర్చే తక్కువ కాగా, ఆ ఖర్చును కూడా వీరి సంఘ సభ్యులే భరించడం.
ఎన్నికలలో పోటీ చేసిన వారు గెలవడానికి అన్ని శక్తులు ఒడ్డడం సహజమే. అయితే గెలవడానికి అడ్డదారులు తొక్కడం మాత్రం రాజ్యాంగ విరుద్ధమే. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా తెలుగుదేశం కూటమి నాయకులు వ్యవహరించారు. దీనికి భిన్నంగా పిడిఎఫ్‌ అభ్యర్థులు ముగ్గురూ ఓడిన వెంటనే వారు ఇచ్చిన సందేశంలో పోరాటాల్లోనూ, సమస్యలు పరిష్కారాల్లోనూ మీతోనే ఉంటామని, మీ మధ్యనే ఉంటామని, పోరాటాల్లో ముందు వరసనే ఉంటామని ఓటర్లకు తెలియజేయడం వారి హుందాతనానికి నిదర్శనం. అటువంటి ఉన్నత విలువలను కలిగిన వారిని ఆదరించడం సమాజ ఉన్నతికి అత్యవసరం.

వ్యాసకర్త : ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఎ. అజ శర్మ

➡️