బిఆర్‌ఐపై మోడీ దాడి

Aug 22,2024 05:20 #Articles, #BRI, #edit page, #Modi attack

ఈ నెల 17వ తేదీన జరిగిన దక్షిణాది దేశాల సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన మోడీ చైనా అమలు చేస్తున్న ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌’ (బి.ఆర్‌.ఐ) కార్యక్రమంపై దాడి చేశారు. నిలకడ లేని ప్రాజెక్టులకు చైనా వేల కోట్ల రూపాయల రుణాలను ఇవ్వటం ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలను అప్పులలో మునిగిపోయేలా చేస్తున్నదని విమర్శించారు. బి.ఆర్‌.ఐకి ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయటానికంటూ ‘గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ కంపాక్ట్‌’ (జి.డి.సి)ను మోడీ ప్రతిపాదించారు. ఇది పేద వర్థమాన దేశాలు ప్రతిపాదించిన అభివృద్ధి నమూనాపై దృష్టి పెడుతుందని, అప్పులు చేస్తున్న దేశాలపై కూడా ఎలాంటి భారం మోపదని ఆయన చెప్పారు. జి.డి.సి లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా వాణిజ్యం అభివృద్ధి చెందుతుందని, సుస్థిరాభివృద్ధిని సాధించటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతుందని, ప్రాజెక్టులకు రాయితీ రుణాలు, గ్రాంట్లను పొందవచ్చునని ఆయన చెప్పారు. చైనా వేల కోట్ల డాలర్ల పెట్టుబడులతో బిఆర్‌ఐని అమలు చేస్తుండగా, ఎటువంటి పెట్టుబడులు, సన్నాహాలు లేకుండా జి.డి.సి ని ప్రతిపాదించటం ఊహాజనితం మాత్రమే. ఈ సందర్భంలో మోడీ చేసిన వ్యాఖ్యలు చైనా వ్యతిరేకతను పెంచటానికి దోహదం చేస్తాయి.
బి.ఆర్‌.ఐ లో మొత్తం 152 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలోని 52, యూరప్‌, సెంట్రల్‌ ఆసియాలో 34, తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో-చైనాతో కలిపి-25, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలు 22, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికా లోని 19 దేశాలు, ఆసియా దక్షిణ, తూర్పు ప్రాంతంలోని 6 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వీటితో పాటు యూరోపియన్‌ యూనియన్‌ లోని 17 దేశాలు, జి 20లోని 8 దేశాలు, 30కి పైగా అంతర్జాతీయ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయంటేనే దీని ప్రాముఖ్యత ఏమిటో అర్ధం అవుతుంది.
ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ ఒక్క దేశం ఇంత భారీ పథకాన్ని రూపొందించి అమలు చేయటానికి పూనుకోలేదు. ఈ పథకంలో భాగస్వాములైన దేశాలలో సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడిన ప్రాజెక్టులను చైనా నిర్మిస్తున్నది. ఆ యా ప్రాజెక్టులను నిర్మించటం కోసం ఆ దేశాలకు ద్రవ్య రూపంలో కూడా సహకారాన్ని అందిస్తున్నది. ఈ పథకంలో భాగంగా నిర్మిస్తున్న వాటిలో రైల్వేల నుండి ఉపగ్రహాల వరకు ఉన్నాయి. ఇతర అనేక పథకాలతో పాటు జల విద్యుత్‌ ప్రాజెక్టులు, రవాణా, ఓడరేవులు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం తదితర పథకాలను అమలు చేస్తున్నది. వివిధ దేశాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలను అమలు చేయటం వలన భాగస్వామ్య దేశాల మధ్య సరుకులు, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి పుచ్చుకోవటం పెరిగింది.
బి.ఆర్‌.ఐ అమలు తీరుపై 2019లో జరిగిన సమీక్షలో దానిలో సభ్యులుగా చేరిన దేశాలు పొందుతున్న ప్రయోజనాలను పేర్కొన్నారు. అప్పటికి ఈ పథకాన్ని ప్రారంభించి ఆరు సంవత్సరాలు అవుతున్నది. ఈ పథకంలో భాగస్వాములైన దేశాలు ఉమ్మడి నిర్మాణాల వలన ప్రయోజనం పొందు తున్నాయని, ఆ ప్రాంతాలలో అభివృద్ధి వేగం పుంజుకున్నదని, ప్రపంచ స్థాయిలో సహకారం పెరగటానికి దోహదం చేసిందని స్పష్టం చేశారు. ఉదాహరణకు బి.ఆర్‌.ఐకి ముందు చైనా నుండి యూరప్‌ దేశాలకు సరుకులను పంపటానికి ఒంటెలపై నెలల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇపుడు నిర్మిస్తున్న హై స్పీడ్‌ రైలు మార్గాల ద్వారా ఒక్కరోజు లోనే సరుకులను చైనా నుండి యూరప్‌కు, యూరప్‌ నుండి చైనాకు చేర్చవచ్చు. ఫలితంగా సరుకులు త్వరగా చేరటం, వాణిజ్యం విస్తరించటమే కాక, సమాచార సంబంధాలు కూడా విస్తరిస్తాయి.
నిబంధనలు, పన్నులు, మేధో సంపద హక్కులు, వివాద పరిష్కార పద్ధతులు తదితరాలపై బి.ఆర్‌.ఐ లో భాగస్వాములైన దేశాలతో చైనా ఒప్పందాలు చేసుకున్నది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెద్ద ముందడుగును సాధించారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌, అమెరికా ఖండాలలోని ప్రజలను సన్నిహితం చేయటంలో ఈ ప్రాజెక్టు ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నది. 2013-18 మధ్య కాలంలో చైనా, బి.ఆర్‌.ఐ దేశాల మధ్య ఆరు లక్షల కోట్ల డాలర్ల విలువైన సరుకుల వాణిజ్యం జరిగింది. ఈ కాలంలో చైనా 9,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆ దేశాలలో 2.50 లక్షలకు పైగా నూతన ఉద్యోగాలు కల్పించబడ్డాయి. 15 యూరప్‌ దేశాలలోని 50 నగరాలను చైనాతో అనుసంధానం చేసి సరుకులను రవాణా చేసే రైళ్ళు 2019 నాటికే 14,000 ట్రిప్పులను పూర్తి చేశాయి. 2018 నాటికి గ్రీస్‌ లోని పైరియస్‌ ఓడరేవు కార్యకలాపాలు ఐదు రెట్లు పెరిగాయి. ఇపుడు ప్రపంచం లోని 100 అతి పెద్ద ఓడరేవులలో 36వ స్థానంలో ఉన్నది. 2019 తర్వాత గడిచిన ఐదు సంవత్సరాలలో ఈ కార్యకలాపాలు అనేక రెట్లు అదనంగా పెరిగాయన్నది స్పష్టమే.

అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతున్న చైనా
ప్రపంచ దేశాలపై పెత్తనం చేస్తూ, కోట్లాది మందిని దారిద్య్రంలో ముంచే విధానాలను అనుసరించాలని ఆ యా దేశాలను ఒత్తిడి చేస్తూ, యుద్ధాలను ప్రోత్సహిస్తూ, యుద్ధాలలో ప్రత్యక్ష పాత్ర వహిస్తూ లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న అమెరికా ఆధిపత్యాన్ని అన్ని రంగాలలోనూ చైనా సవాలు చేస్తున్నది. ఆర్థికంగా ప్రపంచ దేశాలను ఆదుకోవటంతో పాటు రాజకీయ, సైనిక, దౌత్య రంగాలలో అమెరికా విసురుతున్న సవాళ్ళను తిప్పికొడుతున్నది.
ప్రపంచంలో వివిధ దేశాలకు అవసరమైన సమయాలలో రుణాలు, సహాయాన్ని అందించే సంస్థలు కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు, చైనాకు చెందిన బి.ఆర్‌.ఐ, మరికొన్ని సంస్థలు ఉన్నాయి. వీటిలో బి.ఆర్‌.ఐ మినహా మిగిలిన సంస్థలు రుణాలు తీసుకొనే దేశాలపై కఠినమైన షరతులు పెట్టి, ఆంక్షలు విధించి, రుణాలు ఇస్తాయి. రుణాలు తీసుకున్న దేశాలు ఆ సంస్థలు విధించిన ఆంక్షలతో ప్రజలపై తీవ్రమైన భారాలను మోపాల్సి వస్తుంది. ప్రభుత్వ విధానాలు ప్రజల కొనుగోలు శక్తిని హరించి వేయటంతో కొద్ది కాలంలోనే ఆ దేశాలు సంక్షోభంలో కూరుకుపోతాయి. ఐ.ఎం.ఎఫ్‌, ప్రపంచ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న తూర్పు ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు అనేకం సంక్షోభంలో కూరుకుపోయి, దివాళా తీయటాన్ని చూశాం. 1977 నుండి సరళీకరణ విధానాలను అనుసరించిన ఫలితంగా మన పొరుగు దేశమైన శ్రీలంక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఆగ్రహించిన ప్రజలు లక్షలాదిగా ఆందోళనలలో పాల్గొనటంతో ఎన్నికైన ప్రభుత్వం పతనం అయింది. బెయిలవుట్‌ పేరుతో మరింత సంక్షోభంలోకి నెట్టే ఆంక్షలను విధించటంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ సంస్థల షరతులను అంగీకరించకుండా స్వతంత్రంగా వ్యవహరించిన దేశాలు సంక్షోభం నుండి త్వరగా కోలుకున్నాయి. ఆంక్షలను అంగీకరించిన దేశాలు మరింత సంక్షోభంలో చిక్కుకున్నాయి. శ్రీలంకపై విధించిన ఆంక్షలు ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెడతాయి.
దీనికి భిన్నంగా బి.ఆర్‌.ఐ ద్వారా చైనా అందిస్తున్న రుణాలకు కఠినమైన షరతులను విధించటం లేదు. రుణాలు తీసుకున్న దేశాలలో సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతున్నది. చైనా ప్రధాన భాగస్వామిగా ఉన్న బ్రిక్స్‌ బ్యాంక్‌ కూడా రుణాలు తీసుకున్న దేశాల ప్రజలపై భారాలు విధించే, ఆ దేశాలను దివాళా తీయించే షరతులను విధించటం లేదు. ఫలితంగా చైనా దగ్గర రుణాలు తీసుకుంటున్న దేశాలు స్వేచ్ఛగా తమ దేశాలను అభివృద్ధి చేసుకోనే అవకాశం లభించింది.
పేద దేశాలు దివాళా తీయటానికి కారణమౌతున్న ఐ.ఎం.ఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తదితరాల జోలికి పోకుండా…బి.ఆర్‌.ఐ సరళంగా ఇస్తున్న రుణాలను మోడీ తెగనాడుతున్నారు. బి.ఆర్‌.ఐ ఇస్తున్న రుణాలు, ఈ సంస్థలు కఠినమైన షరతులతో ఇస్తున్న రుణాలకు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. దీన్ని మోడీ సహించలేక పోతున్నారు. ఈ ప్రత్యామ్నాయాన్ని పక్కన పెట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలు… అమెరికా, సామ్రాజ్యవాద దేశాల ఉచ్చులో చిక్కుకోవాలని మోడీ భావిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా అమెరికా, దాని ఆధ్వర్యంలోని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఇటువంటి సమయంలో చైనా, చైనా ఆధ్వర్యంలోని సంస్థలు ఇస్తున్న రుణాలు, రాజకీయ సహకారాన్ని ప్రపంచ దేశాలు మరింత ఎక్కువగా వినియోగించుకోవాలి.

ఎ. కోటిరెడ్డి

➡️