మూడో అవతారంలో మోడీ సర్కార్‌

Jun 9,2024 05:35 #Articles, #edite page, #modi

అత్యంత శక్తివంతుడైన మోడీ 3.0గా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని సాగిన ప్రచారం విఫలమై బలహీనపడిన మూడో అవతారంగా ఆదివారం అధికారం స్వీకరించడం ఆసక్తికర పరిణామం. దీనికి మరో విశేషణం కూడా జోడించవలసి వుంటుంది. మారిన పరిస్థితుల్లో ప్రధాని పదవిని అందుకోగల పోటీదార్లుగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారం చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడుకు అవకాశం లభించిందన్న ప్రచారం కూడా వీగిపోయింది. నితీశ్‌కు మేమెప్పుడూ అలాంటి ప్రతిపాదన ఇచ్చింది లేదని ‘ఇండియా’ నాయకులు ప్రకటించేశారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన అలాంటి ఆలోచనేదీ సూచనగానైనా చెప్పకపోగా నరేంద్ర మోడీ నాయకత్వ పటిమను, దార్శనికతను ఆకాశానికెత్తి పొగిడారు. ఇంకా చెప్పాలంటే నితీశ్‌ మోడీకి పాదాభివందనం చేయబోగా పక్కనున్నవారు వారించాల్సి వచ్చింది. బీహార్‌లో ఎన్నికల ప్రచారం సమయంలో ఇలాగే నితీశ్‌ పాదాభివందనానికి విఫలయత్నం చేశారు. నితీశ్‌ లాంటి సీనియర్‌ నాయకుడు పదవి కోసం మోడీ కాళ్లు పట్టుకోవాలనుకోవడం బీహార్‌ ప్రజలకు మింగుడు పడటం లేదని మృత్యుంజయ తివారి అనే సీనియర్‌ నాయకుడు వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే దార్శనిక నేత మోడీ నాయకత్వంలో తాము ఎన్‌డిఎగా పోటీ చేస్తున్నట్టు ఒకటికి రెండు సార్లు వారు సంయుక్త ప్రకటనలే చేశారు. మోడీని ఎన్నుకునే తరుణంలోనే చంద్రబాబు మాట్లాడుతూ గతంలో అనేకమంది నాయకులు దేశాన్ని పాలించినా మోడీ హయాంలోనే మన దేశం అంతర్జాతీయ ఖ్యాతినార్జించిందని ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ, అమిత్‌ షా లతో సహా బిజెపి కేంద్ర నాయకులు వచ్చి ఉమ్మడి ప్రచారంలో పాల్గొన్న కారణంగానే ప్రజల్లో కేంద్రం మనతో వుందనే నమ్మకం కలిగిందని వ్యాఖ్యానించారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మోడీ వుంటే భారతదేశం ఎవరి ముందూ తల వంచే పరిస్థితి రాదని ప్రత్యేకంగా కీర్తించారు. మొత్తంపైన బిజెపి మనుగడ కోసం మిత్రపక్షాలపై ఆధారపడుతుంది గనక తమ కోర్కెలపై ఒత్తిడి చేసే అవకాశం పెరుగుతుందని వ్యాఖ్యాతలు వేసిన అంచనాలు విఫలమై వారు మరింతగా మోడీ ఘనతనే ఆకాశానికి ఎత్తేందుకు సిద్ధమైనారు.

చెంపలేసుకుంటే మారిపోయినట్టేనా?
ప్రభుత్వం ఏర్పడుతున్న ప్రారంభ ఘట్టంలోనే ఇలా వుంటే రేపు మోడీ కాస్త స్థిరపడ్డాక ఏం జరుగుతుందో ఊహించడం కష్టమేమీ కాదు. ఆ అసహనం, అహం మోడీ మాటల్లో తొంగి చూసింది. నిజానికి మోడీ నాయకుడుగా ఎన్నికైన సమయంలో వ్యవహరించిన తీరే ఆయన ఎలాంటి పాఠం నేర్చుకున్నారో తెలియజెప్పింది. రకరకాల వాక్య విన్యాసాలతో చప్పట్లు కొట్టించుకునే మోడీ ముందుగా రాజ్యాంగం దగ్గరకు వెళ్లి కళ్లకద్దుకున్నారు. తను, హోంమంత్రి అమిత్‌షా మాట్లాడిన తీరు వల్ల కొందరు నేతల వాచాలత వల్ల బిజెపి గెలుపు రాజ్యాంగానికి ముప్పు అని ప్రజలకు అర్థమైనందునే ఆమడ దూరంలో ఆపేశారని మోడీకి అర్థమైంది. అందుకే దాన్ని కాపాడతానని చెప్పడానికి ఈ ప్రహసనం తలపెట్టారన్నమాట. మాట్లాడితే ప్రతిదీ మార్చేయాలనీ తీసేయాలని చెప్పేవారు వున్న రాజ్యాంగాన్ని ఏదో గౌరవిస్తున్నట్టు చెప్పుకోవడం అందుకోసమే. అయితే ఇప్పుడు పదవీ స్వీకారం కోసం ఏం చెప్పినా రేపు వాస్తవంగా ఏం జరిగేది ప్రజలకు తెలుసు గనకే అలాంటి తీర్పునిచ్చారు. బిజెపి మొదట్లో చేసిన హడావుడితో పోలిస్తే ప్రస్తుత పరాధీనత తీవ్రమైన కుదుపు లాంటిదే. కానీ అదేదో చిన్న విషయమైనట్టు మోడీ తన ప్రసంగంలో ఎన్‌డిఎ తిరిగి వచ్చేసిందని గొప్పలు పోయారు. 30 ఏళ్లుగా ఎన్డీఎ అత్యంత విజయవంతమైన కూటమిగా పురోగమిస్తున్నదంటూ తన పదేళ్ల నిర్వాకాలను కప్పిపుచ్చే పాచిక వేశారు. ఎందుకంటే గత రెండు సార్లు పేరుకు ఎన్‌డిఎ ప్రభుత్వాలైనా బిజెపికి కూడా పెద్ద మాట లేకుండా కేవలం మోడీ ఏక వ్యక్తి ప్రాబల్యమే నడిచిన తీరు ఎవరు మర్చిపోతారు? వారు చాలా అపహాస్యం చేసిన ‘ఇండియా’ వేదిక వాస్తవ రూపం దాలుస్తుంటే ఉలిక్కిపడి అప్పుడే మళ్లీ ఫోటో సెషన్‌ లాంటి ఎన్డీఎ భేటీ నాటకం నడిపారు. అలాంటి మోడీ ఇప్పుడు ఫలితాల తర్వాత ‘సర్వ పంథ్‌ సమ భావ్‌’ అంటూ అన్ని పార్టీలనూ సమానంగా చూస్తామనే పాట ఎత్తుకున్నారు. వాస్తవానికి లౌకిక తత్వాన్ని ‘సర్వ ధర్మ సమ భావ్‌’ అంటూ అన్ని మతాలకు ప్రోత్సాహంగా మార్చింది పాలకులే. మెజారిటీ మత భావాలను సంతృప్తి పరుస్తూ మైనార్టీలను అభద్రత లోకి నెట్టింది ఈ పోకడలే. దాన్నే ఇప్పుడు భాగస్వామ్య పార్టీలకు అన్వయించి ‘సర్వ పంథ్‌ సమ భావ్‌’ అంటున్నారన్నమాట.

ఎన్టీఆర్‌, చంద్రబాబు భిన్న వైఖరులు
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఏం చెప్పినా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మాత్రం ఈ విషయంలో మరింత సూటిగా మాట్లాడారు. తాము ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్‌ కొనసాగిస్తామన్నారు. అదే సమయంలో మైనార్టీలకు సహాయపడటం తప్ప బుజ్జగింపు తమ వైఖరి కాదంటూ బిజెపి తరహా వాదన చేశారు. జాతీయ, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య సమతుల్యత వుండాలని ఆయన అనడం ఎ.పి ప్రత్యేక సమస్యల పరోక్ష ప్రస్తావనేనని కొందరు వ్యాఖ్యానించారు గాని వాస్తవానికి ఇంతవరకూ చంద్రబాబు నుంచి తమకు ఎలాంటి షరతుల సమస్యలు ఎదురవలేదని బిజెపి వర్గాలు చెబుతూనే వున్నాయి. మంత్రి పదవుల విషయంలోనూ ఏడు పదవులు, స్పీకర్‌ స్థానం వంటి మాటలు గతంలో వినిపించగా ఇప్పుడు రెండు మూడు పదవులు, డిప్యూటీ స్వీకర్‌ అంటున్నారు. నితీశ్‌ కుమార్‌గానీ చంద్రబాబు నాయుడు గానీ ఏకంగా ప్రధాని పదవి చేపట్టే అవకాశాలున్నాయనే ఊహాగానాలు కూడా నడిచాయి. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ (యు.ఎఫ్‌) కాలంలో ఆయనను ఈ పదవి చేపట్టవలసిందిగా కోరిన ఉదాహరణ గుర్తు చేస్తున్నారు. వాస్తవం ఏమంటే ఆ సమయంలో సిపిఎం నాయకుడు హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ లౌకిక పార్టీల ఐక్యతలో కీలక భూమిక పోషించేవారు. చంద్రబాబును ప్రోత్సహించిందీ యు.ఎఫ్‌ కన్వీనర్‌గా చేసిందీ ప్రధానంగా సూర్జిత్‌ చొరవే. ఆ బాధ్యతలో వుంటూనే ఎన్డీఎ వైపు వెళ్లిన రాజకీయం చంద్రబాబుదే. చక్రం తిప్పడం అనే పొగడ్తల వెనక ఈ సత్యాన్ని చాలామంది తరచూ మర్చిపోతుంటారు. ప్రాంతీయ పార్టీ అయినా తమ నాయకుడు ఎన్టీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారని కూడా తరచూ చెబుతుంటారు. వాస్తవం ఏమంటే ఎన్టీఆర్‌ లౌకిక పార్టీల కూటమిగా నేషనల్‌ ఫ్రంట్‌కు మాత్రమే చైర్మన్‌గా వున్నారు. ఆ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని బిజెపి రథయాత్రతో కూల్చివేసిన తర్వాత ఎన్టీఆర్‌ ఎన్నడూ మళ్లీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. 1994లో టిడిపి ఉమ్మడి రాష్ట్రంలో అసాధారణ విజయం సాధించినప్పుడు ఆయన కమ్యూనిస్టులతో మాత్రమే కలసి పోటీ చేశారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే. బిజెపి మిత్రుల పట్ల పెద్ద విశ్వాసంగా వుండదు. గతంలో దానితో కలసి పని చేసిన పార్టీలన్నీ టిడిపితో సహా మోసపోయిన చరిత్రే దీనికి నిదర్శనం. అవసరార్థం కలయిక అంటే అర్థం చేసుకోవచ్చుగానీ దానివల్ల మోడీ స్వభావం మారిపోతుందని, వాళ్లు అడిగినవి చేసి ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తారని నమ్మడం నిరాధారం.

మోడీ ప్రసంగమే నిదర్శనం
రాజ్యాంగాన్ని కళ్లకు అద్దుకోవడం వంటి నాటకీయ చర్యలను పక్కన పెడితే మోడీ ఈ సభలోనూ, రాష్ట్రపతిని కలిసి ఆహ్వానం అందుకున్న తర్వాత మాట్లాడిన తీరే ఆయనలో మార్పు లేదని చెబుతుంది. ‘సర్వ పంథ్‌ సమ భావ్‌’ అన్న ప్రధానమంత్రి ‘ఇండియా’ వేదికను విధ్వంసక శక్తిగా తిట్టిపోశారు. ఎన్డీఎ అఖండ విజయం అందుకుందని చెప్పుకుంటూ అనేక రాష్ట్రాలను పాలిస్తున్న ‘ఇండియా’ పార్టీలు ప్రజల మద్దతుతో గణనీయంగా బలం పెంచుకున్నాయనే సత్యాన్ని కాస్తకూడా ఆమోదించలేకపోవడం ఆయన అసహనాన్ని వెల్లడించింది. మరో వంక ఒడిషాలో విజయం ఘనమైనట్టు ఉత్తర ప్రదేశ్‌లో ఎదురుదెబ్బ లెక్కలోది కానట్టు చిత్రించి సంతోషించారు. అలాంటిది నాయకులను బలోపేతం చేస్తారని ఎవరైనా ఎలా నమ్మగలరు? కాంగ్రెస్‌ వంద స్థానాలకు చేరిన వాస్తవాన్ని కూడా హరాయించుకోలేని మోడీ ఆ పార్టీకి మూడు ఎన్నికల్లో కలిపినా తమకు ఈ ఒక్కసారి వచ్చినన్ని సీట్లు రాలేదని ఎద్దేవా చేయడం ప్రధానికి తగిన పనేనా? చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌ రాష్ట్రాలకు సహాయంపై ప్రత్యేకంగా ప్రస్తావనలు చేసినా మోడీ మాత్రం ఆ ముచ్చటే పెట్టుకోకపోవడం యాదృచ్ఛికం కాదు. ఇక ముస్లింలు, దళితులలో సృష్టించిన సందేహాలను తొలగించడం అవసరమనీ ఆయన అనుకోలేదు. ఎందుకంటే వాటిని కొనసాగించాలన్నదే బిజెపి, ఆర్‌.ఎస్‌.ఎస్‌ల వ్యూహం. దేశానికి బాగా ఉపయోగపడే నిర్ణయాలు చేస్తాము. మరింత కఠినంగా వేగంగా పనిచేస్తాము…అంటూ శ్లేష ప్రయోగించారు. ఈ ఎన్నికల ఫలితాలకు ముందే వచ్చే పదవీ కాలంలో చేయవలసిన పనులు చర్చించి ప్రచారంలో పెట్టిన మోడీ ఈ సభలోనూ తాము మరో పదేళ్లు పాలన చేస్తామన్నారు. అయిదేళ్లకు ఎన్నికైన సర్కారు పదేళ్ల గురించి చెప్పడమేంటి? అంటే ఇందులోని అతి తెలివిని గమనించాలి. పూర్తి మెజారిటీ లేని మోడీని ఎవరో ఒకరు ఎప్పుడైనా కూలదోయవచ్చునని కథనాలు వచ్చాయి గనక ఏకంగా తమ పాలనా కాలాన్ని రెట్టింపు చేసి చెప్పేస్తున్నారన్నమాట. ప్రచారక్‌ ప్రధానమంత్రి (పిపిఎం) మోడీకి బాగా అలవాటైన వాగాడంబరం ఇదే.

జాగ్‌తే రహో!
ప్రభుత్వ రంగంపైన లేదా ఉద్యోగ వర్గాల, రైతాంగ ఉద్యమాల కోర్కెలను నెరవేర్చే ప్రయత్నం చేస్తామని ఒక్క మాట కూడా అన్న దాఖలాలు లేవు. నిర్దిష్టంగా ఏ తరగతికి గానీ రాష్ట్రాలకు గానీ ఎలాంటి మాట ఇవ్వకుండా ఊకదంపుడుతో సరిపెట్టే వచోవిన్యాసం మోడీ స్వంతం. ఆయినా ఆయన వత్తాసుదార్లు మాత్రం దానికే పరవశించమని చెబుతుంటారు. ఈ ఎన్నికల తీర్పు ప్రధానంగా సమాఖ్య తత్వానికి, ఆర్థిక వనరుల బదలాయింపునకూ ప్రజలు ఇచ్చిన సందేశమని నిపుణులు అంటుంటే ప్రధాని ఆ మాటే చెవికిక్కించుకోలేదు. మరో వైపున నేను, బాబు, నితీశ్‌ అందరం సుపరిపాలన (గుడ్‌ గవర్నెన్స్‌) కు ప్రతినిధులమని చెప్పుకున్నారు. ఎవరైనా సరే నిధులు లేకుండా ఎలా సుపరిపాలన చేయగలరు? ఎ.పి లాంటి విభజిత రాష్ట్రం అప్పుల నుంచి ఎలా బయిటకు రాగలదు? ఎ.పి తో సహా చాలా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం గురించి వింటుంటాం గానీ మోడీజీ పాలిస్తున్న కేంద్రమే దాదాపు రెండు కోట్ల కోట్ల అప్పులో దిగబడిపోయిందనే నిజానికి సమాధానమేదీ? ఇలాంటి కఠిన ప్రశ్నలేవీ వేయకుండా విశ్వగురు, దార్శనికుడు అంటూ ఆయనను పొగిడి పరవశించడమేనా కర్తవ్యం? దీనంతటికీ పరాకాష్ట ప్రమాణ స్వీకారం సన్నివేశంలో చూడొచ్చు. ఏమైనా బిజెపి ఏకఛత్రాధిపత్యం, మోడీ ఏకపక్ష పాలనా ఘట్టం ముగిసింది కానీ కేంద్ర నిరంకుశత్వ మతతత్వ ప్రమాదం మిగిలే వుంది. రకరకాల అవకాశవాదాల మధ్య అననుకూలతల మధ్య లౌకిక శక్తులు దాన్ని అడ్డుకోవలసిన బాధ్యత మరింత పెరుగుతున్నది. కాగాపోగా మోడీ బలహీనపడిన కారణంగా కార్పొరేట్‌ ఒత్తిళ్లు, ఈ సర్కారు లొంగుబాట్లు ఇంకా పెరగొచ్చు కూడా. వాటన్నిటికీ మూల్యం చెల్లించవలసిన వారు ప్రజలే. మోడియా ప్రచారార్భాటాలకు లోబడిపోకుండా వాటి పట్ల అప్రమత్తత పెంచుకుందాం.

– తెలకపల్లి రవి

➡️