అదాని విద్యుత్‌ను రాజస్థాన్ నుండి సెకి ద్వారా కొనుగోలు చేసే ఒప్పందాన్ని, ధరను సమర్ధించుకునేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, డిస్కాంలు, ఎపిఈఆర్‌సి చేసిన వాదనలలో రాజస్థాన్ నుండి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు జరిగే సరఫరాకు పిజిసిఐఎల్‌కు చెల్లించాల్సిన అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలను (ఐఎస్‌టిఎస్) చెల్లించనవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందనేది ఒకటి. అదేవిధంగా, ఆ క్రమంలో వాటిల్లే ప్రసార నష్టాల నుండి కూడా మినహాయింపు ఇచ్చిందనేది మరో వాదన. అంటే, ప్రసార నష్టాలను తగ్గించకుండా రాష్ట్రానికి పూర్తిగా అదాని విద్యుత్ సరఫరా జరుగుతుందని దీని అర్ధం. అందువల్ల అదాని విద్యుత్ కొనుగోలు లాభదాయకమని వాదించారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులతో పేర్కొన్న గడువులో నెలకొల్పే సౌర, పవన, మరికొన్ని ప్రాజెక్టులకు ఇలాంటి మినహాయింపులను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 25 ఏళ్ళ పాటు ఈ మినహాయింపు ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే, ఆ ఉత్తర్వులలో ఈ ప్రసార చార్జీలు, నష్టాలకయ్యే వ్యయాన్ని ఎవరు భరించాలనేది స్పష్టం చేయలేదు. మోడి ప్రభుత్వం అలాంటి వ్యయాన్ని పిజిసిఐఎల్‌కు సర్దుబాటు చేయటం లేదు.
పిజిసిఐఎల్‌కు చెల్లించాల్సిన చార్జీలను కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (సిఇఆర్‌సి) నిర్ణయిస్తుంది. ఆ యా రాష్ట్రాలలోని డిస్కాంలు ఇతర రాష్ట్రాలలోని విద్యుత్ ప్రాజెక్టుల నుండి కొనుగోలు చేసే విద్యుత్‌ను ప్రసారం చేసేందుకు అవసరమైన ప్రసార సామర్ధ్యానికి పిజిసిఐఎల్‌తో కాంట్రాక్టు చేసుకుంటాయి. ఆ సామర్ధ్యం మేరకే అవి సిఇఆర్‌సి నిర్ణయించిన ఐఎస్‌టిఎస్ చార్జీలను చెల్లిస్తాయి. అయితే, సిఇఆర్‌సి ఈ విధానాన్ని మార్చి, ఒక ప్రసార ప్రాజెక్టును నెలకొల్పిన ప్రాంతంలోని రాష్ట్రాల డిస్కాములు అవి పిజిసిఐఎల్‌తో కాంట్రాక్టు చేసుకున్న ప్రసార సామర్ధ్యానికే గాకుండా, ఆ ప్రాంతంలోని ప్రసార ప్రాజెక్టు సామర్ధ్యానికి అవసరమైన ఐఎస్‌టిఎస్ చార్జీలను చెల్లించాలని రెగ్యులేషన్ తెచ్చింది. గత సంవత్సరాలలో సంబంధిత డిస్కాం ఎక్చేంజిల ద్వారా, మార్కెట్‌లో కొనుగోలు చేసిన విద్యుత్‌ను కూడా పరిగణనలోకి తీసుకుని ఐఎస్‌టిఎస్ చార్జీలను నిర్ణయించే జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్ (జిఎన్‌ఎ) రెగ్యులేషన్ జారీ చేసి, దాని ప్రకారం చార్జీలను నిర్ణయిస్తున్నది. అయితే, మోడి ప్రభుత్వం పైన పేర్కొన్న ఐఎస్‌టిఎస్ చార్జీలు, ప్రసార నష్టాల మినహాయింపులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశాన్ని రెగ్యులేషన్‌లో, తన చార్జీల ఉత్తర్వులలో సిఇఆర్‌సి దాటవేసింది. వాటికయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ఎక్కడా పేర్కొనలేదు. సిఇఆర్‌సి అడ్డగోలు విధానాన్ని సవాలు చేస్తూ పలు రాష్ట్రాల డిస్కాంలు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయపరమైన వివాదాలు నడుస్తున్నాయి.
మోడి ప్రభుత్వం, సిఇఆర్‌సి ఇలాంటి మోసపూరిత వైఖరులతో వ్యవహరించటం వల్ల, ప్రకటించిన ఐఎస్‌టిఎస్ చార్జీల, ప్రసార నష్టాల మినహాయింపుల ప్రయోజనాలు వినియోగదారులకు దక్కకుండా పోతున్నాయి. ఆ మినహాయింపులకయ్యే వ్యయం కూడా సిఇఆర్‌సి కనీసపాటి నిజాయితీ లేకుండా అనుసరిస్తున్న అడ్డగోలు విధానంతో విద్యుత్ వినియోగదారులపై పడుతున్నది. అంటే, మోడి ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులు మిధ్యగా మారాయి. ఇలాంటి మినహాయింపులను ఇస్తున్నట్లు ప్రకటించిన మోడి ప్రభుత్వం అవి అమలు జరగకుండా చేసి వినియోగదారులకు ప్రయోజనం కల్పించినట్లు ప్రచారం చేసుకుంటూ టోకరా వేస్తున్నది. అదాని ప్రాజెక్టుల, అలాంటి ఇతర ప్రాజెక్టుల సౌర విద్యుత్ చార్జీలు ఇలాంటి మినహాయింపులతో చవకగా ఉంటాయని మభ్యపెట్టడానికి మోడి ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తున్నది.
అదాని సౌర విద్యుత్ ప్రసారానికి ఐఎస్‌టిఎస్ చార్జీలు, ప్రసార నష్టాలకు యూనిట్‌కు కనీసం రూ.2.20 అవుతుందని కన్సల్టెంట్లు, ఇంజనీర్ల అంచనా. దాని ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత జులై తొమ్మిదిన రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిపై విడుదల చేసిన శ్వేత పత్రంలో సెకి ద్వారా కొనే సౌర విద్యుత్‌కు జిఎన్‌ఎ (ఐఎస్‌టిఎస్) చార్జీల నిమిత్తం ఏడాదికి రూ.3000-3500 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని అంచనా చూపారు. అంటే, 25 ఏళ్ళలో ఈ అదనపు భారం రూ.75,000-87,500 కోట్ల మేరకు ఉంటుంది. ఇదిగాక, అదాని సౌర విద్యుత్ కొనుగోలు వల్ల, అధిక రేటు, సెకి కమిషన్, ధర్మల్ విద్యుత్ బ్యాకింగ్ డౌన్‌కు చెల్లించాల్సిన స్థిర చార్జీలు, మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు అయ్యే అదనపు వ్యయం, రాష్ట్ర సరిహద్దు నుండి రాష్ట్రమంతటా ఆ విద్యుత్ సరఫరాకు అదనంగా అయ్యే ప్రసార, పంపిణీ నష్టాలు, తదితరాలను కలుపుకుంటే, 25 ఏళ్ళలో అదనపు భారం ఇంకా చాలా అధికంగా ఉంటుంది. మోడి ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులు అమలు కావు గనకే చంద్రబాబు నాయుడు ఈ అదనపు భారాల అంచనాలను శ్వేత పత్రంలో చూపారు. అదాని సౌర విద్యుత్ కొనుగోలుకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని యూనిట్‌కు రూ.5కు పైగా భారం వినియోగదారులపై పడుతుంది.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించిన పునరుత్పత్తి అయ్యే విద్యుత్ విధానంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులకు అనేక రాయితీలను, మినహాయింపులను, ప్రోత్సాహకాలను ప్రకటించారు. అయితే, వాటికయ్యే వ్యయాన్ని ఎవరు భరించాలనేది పేర్కొనకుండా దాటవేశారు. అప్పటి ఎపిఈఆర్‌సి కూడా వాటికి సంబంధించి జారీ చేసిన రెగ్యులేషన్‌లలో ఆ వ్యయాన్ని ఎవరు భరించాలనేది పేర్కొనకుండా దాటవేసింది. ఆచరణలో ఆ భారాలన్నిటిని వినియోగదారులపై మోపుతూ వస్తున్నారు. ఆవిధంగా మోడి, చంద్రబాబు ఒక తానులోని ముక్కలే. శ్వేత పత్రంలోను, దానిని విడుదల చేస్తూ మీడియాతో మాట్లాడినపుడు చంద్రబాబు అదాని పేరును, మోడి ప్రభుత్వ టోకరాను ప్రస్తావించకపోవటం గమనార్హం.
– వ్యాసకర్త విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాలరావు