ఇప్పటి వరకైతే భారత్, అమెరికా రెండూ పెద్ద ప్రజాస్వామిక దేశాలే. ఎవరూ కాదనటం లేదు. కానీ ఆచరణ చూస్తే నిరంకుశత్వానికి దారితీస్తున్నట్లుగా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తోంది. వ్యవస్థలను దిగజారుస్తున్నారు, కొత్త అర్ధాలు చెబుతున్నారు, పాలకులను విమర్శించటాన్ని దేశ ద్రోహంగా చిత్రిస్తూ బ్రిటీష్ వలస పాలకులను గుర్తుకు తెస్తున్నారు. మన గతం గురించి మరచిపోయిన వారికి దాన్ని గుర్తు చేయటం కూడా ఒకందుకు మంచిదేనేమో? ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా మన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఊరికే రాలేదని కొందరైనా తెలుసుకుంటారు. రెండు చోట్లా చట్టాలు, నిబంధనలకు వక్రభాష్యాలు చెప్పి భావ ప్రకటన, నిరసన తెలిపే హక్కును హరించే ఉదంతాల గురించి చెప్పుకోవటం దేశ వ్యతిరేకతగా పరిగణించినా ఆశ్చర్యం లేదు. రోజులిలా ఉన్నాయి. ఏం జరిగినా ఎదుర్కోక తప్పదు. గత ఏడాది ఏప్రిల్ నెలలో ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) అభివృద్ధి, అధ్యయనాల విభాగంలో పిహెచ్‌డి చేస్తున్న రామదాస్ ప్రిని శివానందన్ అనే పరిశోధకుడిని సంస్థ సస్పెండ్ చేసింది. ఎందుకటా! న్యూఢిల్లీలో విద్యార్థులు ‘భారత్‌ను రక్షించండి-బిజెపిని తిరస్కరించండి’ అనే నినాదంతో పార్లమెంట్ వద్దకు ప్రదర్శన నిర్వహించారని, దానిలో భాగస్వామి కావటం జాతి వ్యతిరేకత కిందకు వస్తుందని కారణం చెప్పింది. కేరళలో దళిత సామాజిక తరగతికి చెందిన ఈ యువకుడు ముంబైలో చదువుతూ మహారాష్ట్ర ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు.
టిస్ చెప్పిన సాకులు లేదా కారణాలను చూస్తే ఎవరూ కూడా ప్రభుత్వాల విధానాల మీద నిరసనలు, అసమ్మతి తెలపటానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద ఆర్థికంగానో, సేవా పరంగానో ప్రతివారూ లబ్ధిదారులే. అలాంటపుడు ఎవరూ ఏ ప్రభుత్వాన్నీ విమర్శించకూడదు, భజన మాత్రమే చేయాలి! కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానాన్ని ఢిల్లీలో జరిగిన ప్రదర్శనలో విమర్శించారు. దాన్లో పాల్గొన్నందున శివానందన్ జాతి వ్యతిరేకి అనటమే కాదు అతని మీద చర్యలు తీసుకొనేందుకు దర్యాప్తు సంస్థలు ముందుకు రావాలని కూడా టిస్ కోరింది. న్యాయ వ్యవస్థ ఇంకా ఉనికిలో ఉంది గనుక తన సస్పెన్షన్ చెల్లదని ప్రకటించాలని కోరుతూ అతను బోంబే హైకోర్టుకు వెళ్లాడు. ఎం.ఎం సత్తాయి, ఎ.ఎస్ చందూర్కర్ డివిజన్ బెంచ్ అతని పిటీషన్‌ను కొట్టివేస్తూ టిస్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నట్లు శివానందన్ చెప్పాడు. ఇది వ్యక్తిగత సమస్య కాదని మొత్తం విద్యార్థి సమాజం మీద ప్రభావితం చూపనుందని అన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫెలోషిప్ పొందుతున్న కారణంగా రాజకీయ పరమైన కార్యకలాపాల్లో పాల్గ్గొంటే చర్యలు తప్పవని, సంస్థలో ఉన్నపుడు రాజకీయ అభిప్రాయాలకు దూరంగా ఉండాలని కోర్టు పేర్కొన్నది. ఒక టెలికాం ఉద్యోగి యువకుడిగా ఉన్నపుడు ఒక యువజన సంఘ సమావేశంలో పాల్గొన్నందున ఉద్యోగం నుంచి తొలగించితే ఆ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అతను పాల్గొన్నది నిషేధిత సంస్థ కాదు, యువకులు యువజన సంఘాల సమావేశాల్లో గాక మరిదేనిలో పాలుపంచుకోవాలని ప్రశ్నిస్తూ ఉద్యోగం నుంచి తొలగించటాన్ని తప్పు పడుతూ జస్టిస్ ఓ చిన్నపరెడ్డి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. తరువాత ఉద్యోగిగా ఆ యువకుడు ఉద్యోగ విరమణ చేసేవరకు టెలికాం ఉద్యోగుల యూనియన్లో కూడా చురుకుగా పని చేశారు.
కోర్టు పేర్కొన్న అంశాలు సరైనవి కాదని, ఒక విద్యార్ధి అర్హత పరీక్షలో పాసైనపుడు ఫెలోషిప్ ఒక హక్కు తప్ప దయాధర్మం కాదని, పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్ ఇవ్వటం తనంతట తాను బతకటానికి అవసరమైన ఉద్యోగ సంపాదన కోసం కాదని, జాతి నిర్మాణ క్రమంలో తోడ్పడేందుకు ఇచ్చే మొత్తమని శివానందన్ చెప్పాడు. ఏ విద్యా సంస్థ అయినా జారీచేసే సర్క్యులర్ కంటే రాజ్యాంగం ఎంతో ముఖ్యమైనదని తాను భావిస్తున్నానని, రాజ్యాంగ హక్కును వినియోగించు కున్నందుకు తనను శిక్షించారని అన్నాడు. టిస్ లేదా ఏ విశ్వవిద్యాలయం జారీ చేసే నిబంధనలు, సర్క్యులర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదని, విద్యా సంస్థలు నిష్పాక్షికంగా ఉండాలని, ఒక తరహా రాజకీయాలకు ఒక విశ్వవిద్యాలయం తనను తాను ఎలా అనుబంధించు కుంటుందని ప్రశ్నించాడు.
‘భారత్‌ను రక్షించండి, బిజెపిని తిరస్కరించండి’ అనే నినాదంతో పార్లమెంట్‌కు ప్రదర్శనలో పాల్గొంటే…తాను పట్టుకున్న ప్లకార్డు మీద టిస్ పేరు ఉన్నట్లు అధికారులు ఆరోపించారని చెప్పాడు. ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరమ్ (పిఎస్‌ఎఫ్) ప్రధాన కార్యదర్శిగా ప్రదర్శనలో పాల్గొన్నాను తప్ప టిస్ ప్రతినిధిగా కాదని అన్నాడు. తనను సస్పెండ్ చేసిన టిస్ కమిటీ, హైకోర్టు ముందు కూడా ఇదే చెప్పానన్నాడు. శివానందన్ 2015లో టిస్ పోస్టు గ్రాడ్యుయేట్‌గా చేరి తరువాత అక్కడే ఎంఫిల్ పూర్తి చేసి పరిశోధక విద్యార్థిగా నమోదయ్యాడు. టిస్ గతంలో ఒక ప్రజాస్వామిక సంస్థగా కనీసం నటించేదని ఇటీవలి సంవత్సరాలలో విద్యార్థులు చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకు అనుమతించటం లేదని చెప్పాడు. అయోధ్యలో రామాలయ ప్రారంభాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా చేపట్టినపుడు జాతీయ అవార్డు పొందిన ఆనంద పట్వర్ధన్ డాక్యుమెంటరీ ‘రామ్ కె నామ్ (రాముడి పేరుతో)’ను అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రదర్శించారని తాను ఆ సమయంలో ప్రమాదంలో గాయపడి ప్రదర్శనకు రాలేకపోయానని, అయితే బాబ్రీ మసీదు విధ్వంసం సందర్భంగా జరిగిన దుర్మార్గమైన వాస్తవాలను తెలుసుకొనేందుకు అందరూ చూడాలని కోరుతూ తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమంలో వెల్లడించగా దాన్ని కూడా దేశ వ్యతిరేక చర్యగా టిస్ తన మీదకు మళ్లించిందని పేర్కొన్నాడు. కేంద్రం నుంచి 50 శాతం పైగా నిధులు పొందుతున్న సంస్థలన్నింటిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత టిస్‌లో అనేక పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ పది మంది విద్యార్థులు కూర్చుంటే, చివరకు తమ గ్రూపు ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ఒక చోట చేరినా సంస్థను అస్థిరపరిచేందుకు చూస్తున్నారంటూ చెదరగొట్టటం జరుగుతోందన్నాడు. శివానందన్‌ను హెచ్చరిస్తూ అనేక సార్లు తప్పుడు నోటీసులు జారీ చేసింది. భగత్ సింగ్ స్మారక ఉపన్యాసం చేసేందుకు పిలిచిన అతిథులను ‘వివాదాస్పద ప్రసంగీకులు’ అనే సాకుతో వారి పేర్లు లేకుండా ఇచ్చిన నోటీసు అలాంటి వాటిలో ఒకటి. సదరు వివాదాస్పద అతిథులు ఎవరంటే మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్, ప్రముఖ జర్నలిస్టు పి.శాయినాధ్, జెఎన్‌యు మాజీ ప్రొఫెసర్, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ మాజీ సంపాదకుడు గోపాల్ గురు. గతేడాది టిస్ విద్యార్థి సంఘ ఎన్నికలను రద్దు చేసింది. ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరమ్‌ను నిషేధించింది. విద్యార్థులు ఆందోళన చేయటంతో వెనక్కు తీసుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే టిస్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదు, కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్ తీసుకొనే వారు బిజెపి రాజకీయాలను విమర్శించకూడదంటే నేను అంగీకరించను, దేశంలో ఉండాలంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బిజెపి సభ్యత్వం తీసుకోవటానికి లేదా సానుభూతిపరునిగా ఉండటానికి నన్ను ఒత్తిడి చేయలేరని శివానందన్ చెప్పాడు.
అమెరికాలో ఏం జరుగుతోంది!
మహమ్మద్ ఖలీల్ అమెరికా పౌరసత్వం కలిగిన సిరియా దేశస్థుడు. అతని మీద చట్ట ఉల్లంఘనకు పాల్పడిన కేసులేవీ లేవు. అతన్ని బలవంతంగా సిరియా పంపేందుకు ట్రంప్ యంత్రాంగం చూస్తోంది. ఖలీల్ చేసిన నేరం ఏమిటో తెలుసా? గాజాలో పాలస్తీనియన్లపై మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ దుశ్చర్యలను ఖండిస్తూ కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్ధుల నిరసనకు నాయకత్వం వహించటమే. వాక్, సభా స్వాతంత్య్రాలు విలసిల్లుతుంటాయని భావించే దేశంలో ఇది జరిగింది. అతని భార్య ఎనిమిది నెలల గర్భవతి, అరెస్టు చేసిన ఖలీల్ గ్రీన్‌కార్డును రద్దు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం అతనుండే న్యూయార్క్ రాష్ట్రం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లూసియానాలోని ఒక నిర్బంధ శిబిరానికి తరలించి తన మానవత్వ ముఖాన్ని ప్రదర్శించు కుంది. ఈ ఉదంతం తరువాత గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన ఎవరూ అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు ఉన్నట్లు కాదని ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్ ప్రకటించాడు. అంటే ప్రభుత్వం తలచుకుంటే ఎప్పుడైనా రద్దు చేయవచ్చనే బెదిరింపు దీని వెనుక ఉంది. పాలస్తీనియన్లకు మద్దతుగా విద్యార్థులు ఆందోళనకు దిగినపుడు స్థానికులా, వలస వచ్చినవారా అనే తేడా లేకుండా అందరూ నిరసనల్లో పాల్గొన్నారు. దీన్ని నాటి బైడెన్ సర్కార్, నేటి ట్రంప్ జమానా కూడా సహించటం లేదు. గాజాలో మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌కు అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ నిస్సిగ్గుగా మద్దతు ఇస్తూ మానవ హక్కుల పరిరక్షణ గురించి ప్రపంచానికి సూక్తులు వల్లిస్తారు.
పాలస్తీనియన్లకు మద్దతు పలికిన మహమ్మద్ ఖలీల్ మీద 1952 నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టంలోని సెక్షన్లను మోపటాన్ని బట్టి ట్రంప్ అసలు రూపం వెల్లడైంది. వలస వచ్చే వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైనా లేదా అనుంబంధం ఉన్నప్పటికీ వీసాలను తిరస్కరించటానికి లేదా అనర్హులుగా ప్రకటింటానికి ఆ చట్టం వీలు కల్పిస్తుంది. ఒకవేళ అమెరికా వచ్చినప్పటికీ తిరిగి పంపే అధికారం ప్రభుత్వానికి ఉంది. కమ్యూనిజానికి సంబంధించిన సాహిత్యాన్ని రాసినా, ముద్రించినా, తెలిసి కూడా పంపిణీ చేసినప్పటికీ తిప్పి పంపే అధికారం ఉంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నప్పటికీ అలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఉదారవాదులనే పేరున్న ప్రతిపక్ష డెమోక్రాట్లలో కొందరు ఖలీల్ అరెస్టు, గ్రీన్‌కార్డు రద్దును మాట మాత్రంగా ఖండించినప్పటికీ తమ పాలిత న్యూయార్క్ రాష్ట్ర వాసి అరెస్టు గురించి నిరసన వ్యక్తం చేయలేదు. అమెరికాలో గాడిద పార్టీ, ఏనుగు పార్టీ ఏదైనా ఒక్కటే అనేందుకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు.కమ్యూనిస్టు వ్యతిరేకత, అమెరికా విదేశాంగ విధానాలపై విమర్శను రెండు పార్టీలూ సహించవు.
2023లో డోనాల్డ్ ట్రంప్ ఒక ప్రతిజ్ఞ చేశాడు. అదేమంటే అమెరికా విధానాలను విమర్శించే విదేశీయులు, క్రైస్తవులను ద్వేషించే కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, సోషలిస్టులు ఎవరినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వం. దీనికి గాను 1952 నాటి చట్టాన్ని వినియోగిస్తాం, దేశీయంగా పెరిగన కమ్యూనిస్టులు, మార్క్సిస్టులను అదుపు చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పాడు. ట్రంప్ తొలిసారి అధికారానికి వచ్చినపుడు అమెరికాను సోషలిస్టు దేశంగా మారనిచ్చే సమస్యే లేదని ప్రకటించటాన్ని అత్యధిక డెమోక్రాట్లు హర్షించారు. అయితే చరిత్రను చూస్తే కమ్యూనిస్టుల రాకను నిషేధించే చట్టం ఉన్నప్పటికీ పూర్తిగా నిరోధించటం గానీ, అమెరికాలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం గానీ చేయలేకపోయారన్నది వాస్తవం. మన దేశానికి చెందిన క్షమా సావంత్ వంటి వారు అనేక మంది అమెరికా వెళ్లి వామపక్ష వాదులుగా మారిన సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని అపేందుకు చూసిన ప్రబుద్ధుల సంగతి తెలిసిందే, భావజాలమూ అంతే. ఎవరూ ఆపలేరు, ఎంతగా అడ్డుకుంటే అంతే వేగంతో విస్తరిస్తుందన్నది చరిత్ర చెప్పిన సత్యం!
సత్య