పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోడీ, బిజెపి ఆశలను వమ్ము చేశాయి. అయితే, ఫలితం వెలువడిన కొద్ది గంటల్లోనే ‘ఎన్‌డిఎకు చారిత్రాత్మక మూడో మలుపు’ అన్న మోడీ ప్రకటన వెలువడింది. 2019లో తనకున్న 303 సీట్ల నుంచి 63 స్థానాలు కోల్పోయిన బిజెపి 240 సీట్లకు పరిమితమైంది. అయితే ప్రభుత్వానికి మునుపటిలాగే బలముందని, తీర్పును అంగీకరించడానికి సిద్ధంగా లేదని మోడీ స్పష్టం చేశారు. తన నేతృత్వంలోని మూడో సంకీర్ణ ప్రభుత్వం…2014, 2019లో మాదిరిగానే పని చేస్తుందని తొలి నాళ్లలో మోడీ ముద్ర వేశారు. ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ నియామకం, స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి నియామకం, గత మంత్రివర్గంలో హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రులుగా పనిచేసిన వారిని తిరిగి అవే శాఖల్లో కొనసాగించడం, అజిత్ దోవల్‌కు రెండో పర్యాయం జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం ద్వారా…మొదటి, రెండవ మోడీ ప్రభుత్వాలకు మూడవ ప్రభుత్వానికి రూపంలో కానీ సారంలో కానీ ఎలాంటి తేడా వుండదని చెప్పడమే.
కానీ మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజులు కూడా గడవక ముందే ఒక వాస్తవాన్ని అంగీకరించవలసి వచ్చింది. అత్యధిక స్థానాలు పొందడంతో ఏర్పడిన మోడీ మొదటి, రెండవ ప్రభుత్వాలు… మోడీ నేతృత్వంలోని మూడవ సంకీర్ణ ప్రభుత్వం రూపం, సారంలో భిన్నంగా ఉంటుందని అంగీకరించవలసి వచ్చింది. బిజెపికి సొంతంగా మెజారిటీ లేకపోవడంతో టిడిపి, జెడియు కీలక మద్దతుతో ప్రభుత్వం నడుస్తోంది. మరే సంకీర్ణ ప్రభుత్వం ఎదుర్కోని బలమైన ప్రతిపక్షాన్ని ఈ సారి మోడీ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రజలు బలమైన ప్రతిపక్షానికి అనుకూలంగా ఓటు వేశారు.
అత్యధిక స్థానాలు కలిగిన పార్టీగా మోడీ, అమిత్ షా లు పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలను అదే రీతిలో అమలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తొలగించడమే కాకుండా, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదింపచేసుకొన్నారు. అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నీరుగార్చేలా నాలుగు కోడ్‌లు ఆమోదింపచేసుకున్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే మూడు బిల్లులు ఎలాంటి చర్చ లేకుండానే తీసుకొచ్చుకున్నారు. అయితే ఏడాది పైగా జరిగిన చారిత్రాత్మక రైతాంగ పోరాటం తర్వాత వాటిని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. మోడీ 3.0 ప్రభుత్వం స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పరచలేకపోవడానికి, మెజారిటీ కోల్పోవడానికి రైతుల ఆగ్రహమే ప్రధాన కారణం.
ఏది ఏమైనా మోడీ 3.0 ప్రభుత్వం తన ఒక్కో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసి వస్తున్నది. వెనక్కి తీసుకోవలసి వచ్చిన వాటిలో మూడు కీలక నిర్ణయాలున్నాయి. 45 మందిని లేటరల్ ఎంట్రీ ద్వారా తీసుకోవాలనే నిర్ణయాన్ని మూడు రోజుల్లోనే విరమించుకున్నారు. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల తర్వాత వక్ఫ్ సవరణ చట్టం ఆమోదాన్ని పొందడంలో విఫలమైంది. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి పంపాల్సి వచ్చింది. యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లు, యాంకర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు ఆమోదంలో జాప్యం జరిగింది.
ఆగస్టు 17న ప్రముఖ వార్తాపత్రికల్లో లేటరల్ ఎంట్రీ ప్రకటన కనిపించింది. 24 మంత్రిత్వ శాఖల్లో 45 పోస్టులకు ప్రత్యక్ష నియామకం అంటూ ప్రకటన వెలువడింది. వాటిలో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ పోస్టుల నియామకాలున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభావంతుల సేవలను వినియోగించుకోవడమే లేటరల్ ఎంట్రీ వెనుక లక్ష్యం అన్న వివరణ వెలువడింది. అలాంటప్పుడు వారిని సలహాదారులుగానో, మరో విధంగానో నియమిస్తే సరిపోతుందా అన్న ప్రశ్న వెలువడింది. ప్రత్యక్ష నియామకం అంటే రిజర్వేషన్‌ను తొలగించడమే కదా అనే అంశాన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా లేవనెత్తాయి. లేటరల్ ఎంట్రీ కారణంగా పదోన్నతి ద్వారా ఈ పోస్టులకు చేరే అవకాశం తగ్గడమేగాక, రిజర్వేషన్ అవకాశం కూడా కనుమరుగవుతుంది. ఆర్.ఎస్.ఎస్, బిజెపిలు రిజర్వేషన్‌ను సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని అమలు చేయడానికి వేసిన పెద్ద ప్రణాళికలో భాగమే ఇదంతా.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్.ఎస్.ఎస్ కార్యకలాపాలలో పాల్గొనడంపై 58 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన కొద్ది రోజులకే లేటరల్ ఎంట్రీ రిక్రూట్‌మెంట్ ప్రకటన వెలువడింది. అంటే రెండు కేటగిరీల అభ్యర్థులు ప్రధానంగా లేటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ చేయబడతారు. ఒకటి ఆర్‌ఎస్‌ఎస్, రెండోది కార్పొరేట్ ప్రతినిధులు. బ్యూరోక్రసీని నేరపూరితం చేయడంతోపాటు కార్పొరేటీ కరించడం కూడా వారి లక్ష్యమని అర్థమవుతోంది. ఈ లేటరల్ రిక్రూట్‌మెంట్ ఆలోచన సివిల్ సర్వీస్ అభ్యర్థుల కలలను ఛిన్నాభిన్నం చేసింది. దాంతో సహజంగానే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఎన్డీయే మిత్రపక్షాలైన జె.డి.యు, ఎల్.జె.పి సైతం నిరసించడంతో మరో గత్యంతరం లేక మోడీ ప్రభుత్వం మూడో రోజున ఈ చర్యను విరమించుకోవలసి వచ్చింది.
వక్ఫ్ బోర్డు విషయంలోనూ ప్రభుత్వం అవమానకరమైన రీతిలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించేందుకు వక్ఫ్ చట్టాన్ని సవరించి, తద్వారా మతతత్వ రాజకీయాలకు మరింత పదును పెట్టాలని చూసింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చింది. ప్రజా ప్రతినిధులు మొదలైనవారు ముస్లింలే ఉండాలనే నిబంధనను తొలగించింది. దేవాలయాలు హిందువులకే అని నినాదాలు చేసేవారు వక్ఫ్ బోర్డులను ముస్లిమేతరులతో నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే, కొత్త సవరణ చట్టం ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది.
సెక్షన్ 40ని రద్దు చేయడం ద్వారా ఏదైనా ఆస్తి, వక్ఫ్ ఆస్తి అవునా కాదా అని నిర్ణయించే అధికారాన్ని కూడా వక్ఫ్ బోర్డు పరిధి నుంచి తొలగించేసింది. ఏ కోణంలో చూసినా, కొత్త సవరణ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకోవడమే కాకుండా వాటిని కాపాడకుండా వుండేందుకు లొసుగులేమైనా వున్నాయా అనేది వెతుకుతున్నారు. బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు, ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. బిజెపి మిత్రపక్షాలైన టిడిపి, ఎల్.జె.పి లు బిల్లుకు మద్దతు ఇవ్వలేమని సంకేతాలు ఇచ్చాయి. బిల్లు పాస్ కావడం కష్టమని గ్రహించి జె.పి.సి కి నివేదించారు.
పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ‘చార్ సౌ పర్’ లక్ష్యాన్ని ఓడించడంలో కొన్ని యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లు, కొందరు యూట్యూబర్లు కీలక పాత్ర పోషించారు. ధృవ్ రాఠీ, రవీష్ కుమార్‌లతో కూడిన ఈ మీడియా గ్రూపులు, కోట్లాది మంది అనుసరించే మోడీ పాలనలోని భయానక పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. వాటిని నియంత్రిం చేందుకు గత నవంబర్‌లో బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్ (నియంత్రణ) బిల్లును తీసుకొచ్చి చివరి సెషన్‌లో ఆమోదిం చేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున నిరసనలు తెలపడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అక్టోబర్ 15 వరకు బిల్లుపై స్పందనలు సమర్పించవచ్చని, వాటిని పరిగణనలోకి తీసుకుని సమగ్ర చట్టం చేస్తామని వార్తా, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలియజేశారు.
ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్న కుల గణనను చేపట్టేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోందని ‘ది హిందూ’ పత్రిక ఆగస్టు 22న పేర్కొంది. కోవిడ్‌ని సాకుగా చూపి 2021 జనాభా లెక్కల సేకరణ నుండి వెనక్కి తగ్గినందుకు ప్రభుత్వాన్ని ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించింది. వాస్తవాలు, గణాంకాలకు ఈ ప్రభుత్వం భయపడుతోందనేది తరచుగా వస్తున్న ఆరోరణ. సామాజిక న్యాయం జరిగేలా కుల గణన నిర్వహించాలని ప్రతిపక్షం గట్టిగా డిమాండ్ చేసింది. ఈ రెండు డిమాండ్లను ఇంతవరకు మొండిగా తిరస్కరిస్తూ వచ్చిన ప్రభుత్వం…ఇప్పుడు వాటి నిర్వహణకు సిద్ధమంటూనే దానిని ఒక తంతుగా మార్చాలని చూస్తోంది.
ఏదేమైనప్పటికీ తాము సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నానని, గత పదేళ్ల పాలనలో మాదిరిగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని మోడీకి ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. మోడీ, సంఫ్‌ు పరివార్‌లు భారత ప్రజాస్వామ్య బలాన్ని మెల్లగానైనా అంగీకరించాల్సి వస్తోంది.
వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.వి. గోవిందన్