మోడీ బోధనలు !

ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఆస్ట్రియా రాజధాని వియన్నాను సందర్శించి, అక్కడి ప్రవాస భారతీయుల సమావేశంలో- భారత్‌ ప్రపంచానికి యుద్ధాన్ని కాదు; బౌద్ధాన్ని ఇచ్చిందని ఘనంగా ఉద్ఘాటించారు. ”భారత్‌ ఎప్పుడూ సర్వ మానవాళి శాంతి సామరస్యాలనే కోరుకొంది. 21వ శతాబ్దిలో ఆ బాధ్యతను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది.” అని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. మోడీ నోట బుద్ధుడి శాంతి సూత్రాన్ని, సామరస్య మంత్రాన్ని వినటం బహు బాగా ఉంది. ఆ బోధనల సారాంశాన్ని కాషాయదళం ఆచరణలో చూపగలిగితే మరింత బాగుంటుంది.
భారత సమాజపు భౌతిక పరిస్థితుల నుంచి, అంతర్మథనంలోంచి అనేక ఆచరణలు, అవలంబనలూ ఆవిర్భవించాయి. మనిషిని దుఃఖం నుంచి, రుగ్మతల నుంచి, ధనిక పేద వ్యత్యాసాల నుంచి బయటపడేయటానికి బుద్ధుడు అనేక పద్ధతులను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. దానికిముందు పేదరికాన్నీ, మరణాన్ని, అంతులేని దుఃఖాన్నీ స్వయంగా చూసి చలించిపోయాడు. రాత్రికి రాత్రే సర్వ సుఖాలను త్యజించి, రాజ్యాధికార అవకాశాన్ని వదులుకొని, సన్యాసిగా మారి రాజ్య పర్యటన చేశాడు. ప్రజల కష్టాలను కన్నీళ్లను స్వయంగా చూశాడు. వాటి నుంచి వారిని విముక్తం చేయటానికి కొన్ని సూత్రాలను ప్రతిపాదించి, విస్తృతంగా ప్రచారం చేశాడు. యుద్ధోన్మాదాన్ని, హింసను, రాజ్య విస్తరణ కాంక్షనూ నిర్ద్వంద్వంగా ఖండించాడు.
బుద్ధుడి శాంతిమార్గం గురించి మాటల్లో ఘనంగా ఉటంకించిన మోడీ ఆచరణ అందుకు భిన్నంగా ఉంది. ప్రజల కష్టాలకు చలించి వంశ పారంపర్యంగా వచ్చిన రాజ్యాధికారాన్ని వదులుకొని, బుద్ధుడు ప్రజల్లో కలిసిపోతే- తన అధికారం కోసం, ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రజలను తన చట్టాలతో, విధానాలతో అణచివేత చర్యలను అవలంబిస్తున్నారు మోడీ! 14 నెలల క్రితం మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ముష్కరమూక నగ్నంగా ఊరేగించి, తీవ్రంగా అవమానించినా మోడీ చలించలేదు. పెదవి విప్పి ఒక్కటంటే ఒక్క ఖండన వాక్యం పలకలేదు. ప్రపంచం మొత్తం చుట్టి వస్తున్నారు కానీ, దేశంలోనే ఉన్న మణిపూర్‌ని సందర్శించలేదు. నెలల తరబడి అమానుష కాండ కొనసాగుతున్నా – దాని నియంత్రణకు నిర్ధిష్టమైన చర్యలేవీ తీసుకోలేదు. ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు పదే పదే మణిపూర్‌ ఉదంతం గురించి ప్రస్తావిస్తే తప్ప మోడీ తన వ్యూహాత్మక మౌనం వీడలేదు. నోరు విప్పాక కూడా ఆ రాష్ట్రానికి భరోసానిచ్చేలా మాట్లాడలేదు. ”దీనిపై రాజకీయాలు వదిలేయండి. శాంతిని పునరుద్ధరించండి.” అని ప్రతిపక్షాలకు సుద్దులు చెప్పారు.
ఈ పదేళ్ల పాలనలో ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వ విధానాలను విమర్శించిన ప్రతి ఒక్కరిపైనా మోడీ ప్రభుత్వం తీవ్రమైన నిరంకుశ వైఖరినే ప్రదర్శించింది. నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తే- కనీవినీ ఎగరని నిర్బంధాన్ని ప్రయోగించింది. రైతులను టెర్రరిస్టులుగా అభివర్ణించింది. అన్నదాతలకు మద్దతుగా మాట్లాడినవారిపై దారుణమైన కేసులు బనాయించి, బెయిలు సైతం రాకుండా జైళ్లలో నిర్బంధించింది. పత్రికాస్వేచ్ఛను అత్యంత దారుణంగా హరించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణితమయ్యే భారత్‌లో పత్రికాస్వేచ్ఛ 180 ప్రపంచదేశాల్లో 159వ స్థానంలో ఉంది. ఇజ్రాయిల్‌ ఆక్రమిత పాలస్తీనాలో తుపాకీ మొనల మధ్య పత్రికాస్వేచ్ఛ (157వ స్థానం) ఎలా కునారిల్లుతుందో, మనదేశంలో అంతకన్నా దారుణంగా అఘోరిస్తోంది. ఈ విషయంలో పాకిస్తాన్‌ 152వ స్థానంతో మనకన్నా ముందుంది. బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భారత విదేశీ విధానానికి తూట్లు పొడిచింది. పేద, వర్ధమాన దేశాల హక్కుల గొంతుకు చేదోడుగా నిలిచిన మన పూర్వవైఖరికి భిన్నంగా యుద్ధోన్మాద అమెరికా చిత్తానికి అనుగుణంగా మసలుకోవడం మొదలు పెట్టింది. దేశంలో ఉదారవాద విధానాలతో కార్పొరేట్లకు దోచిపెడుతూ; మతోన్మాద, భావోద్వేగ రాజకీయాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తోంది. మోడీ బుద్ధుడి శాంతి సామరస్యాల గురించి మాట్లాడ్డం కాదు; వాటిని తన విధానాల్లో పాటించాలి. విద్వేష, విధ్వంస, వేధింపుల సంస్క ృతికి స్వస్తి చెప్పటమే 21వ శతాబ్దపు పాలకులకు విజ్ఞత, బాధ్యత!

➡️