గుజరాత్‌ అభివృద్ధిపై ‘నమో’ నోటికి తాళం?

Apr 9,2024 06:10 #artical, #edit page, #Gujarat, #modi

పదేళ్ల క్రితం గుజరాత్‌ తరహా అభివృద్ధిని దేశమంతటా అమలు జరుపుతామని ఎన్నికల సందర్భంగా మోడీ జనానికి ఇచ్చిన గ్యారంటీ గురించి ఎక్కడా ప్రస్తావించటం లేదు. గుజరాత్‌ విజయ గీతాలాపన లేదు. ఎందుకు? నరేంద్రమోడీ ప్రధానిగా అధికారంలోకి రాగానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నివేదికలను రూపొందించటం, సిఫార్సులు చేయటం తప్ప వాటికి ఎలాంటి గ్యారంటీ లేని నీతి ఆయోగ్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. సదరు సంస్థ వెల్లడించిన సమాచారం 2019-21 సంవత్సరాలలో బహుముఖ దారిద్య్ర సూచికలో గుజరాత్‌ రాష్ట్రం 16వ స్థానంలో ఉంది. దశాబ్దాల తరబడి బిజెపి ఏలుబడిలో ఉన్న గుజరాత్‌ దారిద్య్ర నిర్మూలనలో వెనుకబడింది.
ఇక్కడ అభివృద్ధి అంటే పరిశ్రమల గురించి చెబుతారు. నరేంద్ర మోడీ సిఎంగా అధికారానికి రాక ముందే ఉమ్మడి బొంబాయి ప్రోవిన్స్‌లో నేటి గుజరాత్‌ ప్రాంతాలు పారిశ్రామికంగా ముందున్నాయి. పరిశ్రమలు ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందినట్లు కాదు. అలాగైతే అమెరికాలో ఇప్పటికీ మన ఉచిత బియ్యం పథకం మాదిరి ఉచిత ఆహార కూపన్లు ఉండేవి కాదు. గుజరాత్‌లో పరిశ్రమల వృద్ధికి అక్కడి భౌతిక పరిస్థితులే కారణం తప్ప మోడీ గొప్పతనం కాదు. రాష్ట్ర విస్తీర్ణంలో దాదాపు సగం ఎడారి ప్రాంతం గనుక అక్కడ వ్యవసాయానికి తావుండదు. మన దేశంలో ఇప్పటికీ ఉపాధి వ్యవసాయ రంగంలోనే ఉంది, అలాంటి అవకాశం అక్కడ ఉండదు. వాణిజ్య రంగంలో గుజరాతీల వలసలకు అదొక ప్రధాన కారణం. కచ్‌ ప్రాంతంలో ఉప్పు పండిస్తారు, అది ఏడాది మొత్తం ఉండదు. అందుకే గుజరాత్‌ ప్రాంతంలో స్వాతంత్య్రానికి ముందు, తరువాత కూడా పరిశ్రమలు, వాణిజ్యం మీద కేంద్రీకరించారు. రేవులు ఒక పెద్ద వనరుగా ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ దారిద్య్రంతో సహా అనేక అభివృద్ధి సూచికల్లో గుజరాత్‌ వెనుకబడి ఉంది. సృష్టించిన సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నది తప్ప జనానికి చేరటం లేదు. గతంలో దారిద్య్ర నిర్మూలనలో గుజరాత్‌ కొన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో దిగజారుతున్నది.
రాజకీయ నేతలు అధికార పార్టీల ప్రాపకం కోసం పాకులాడినట్లే కొందరు మేథావులు కూడా అదేమాదిరి ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన ప్రొఫెసర్‌ వివేక్‌ దేవరారు బుర్ర నుంచి పుట్టిందే ”గుజరాత్‌ తరహా అభివృద్ధి నినాదం”. మోడీ గుజరాత్‌ సి.ఎంగా నాలుగు వేల రోజుల పదవీకాలం పూర్తి కానుండగా తదుపరి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ”వృద్ధి, అభివృద్ధికి గుజరాత్‌ పాలన” అనే పుస్తకాన్ని రాశారు. తరువాత 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ దాన్ని ఒక నినాదంగా తీసుకొని తాను అధికారంలోకి వస్తే దేశమంతటా అదే విధానాన్ని అమలు చేస్తానని నమ్మబలికారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా భక్తులకు తెలియదు. అదే మాదిరి గుజరాత్‌ గురించి తెలిసిన మోడీ ప్రధాని పీఠం అలంకరించిన తరువాత ఎక్కడా దాని ప్రస్తావన తేవటం లేదు. ప్రతి రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నపుడు ఒక రాష్ట్ర నమూనా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తామని చెప్పటమే పెద్ద మోసం. పదేళ్ల నాటి అంకెలను తీసుకొని వివేక్‌ దేవరారు గుజరాత్‌ పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం భారీగా తగ్గిందని చెప్పారు. ఊట మాదిరి అభివృద్ధి ఫలాలు కిందికి దిగినట్లు సూత్రీకరించారు. పాత లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్నపుడు దేశంలో ఏడవ స్థానంలో ఉన్న గుజరాత్‌ తరువాత కాలంలో దిగజారింది. దీన్ని బట్టి పరిశ్రమల వృద్ధి దారిద్య్ర నిర్మూలనకు దోహదం చేయదని కొందరు ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు. ఆర్థిక స్వేచ్ఛలో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉందని దేవరారు చెప్పారు. అలాంటి రాష్ట్రం తాజా నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం దారిద్య్ర నిర్మూలనలో 16వ స్థానానికి ఎందుకు దిగజారిట్లు ?
గుజరాత్‌లో ఎవరు అధికారంలో ఉన్నా కార్పొరేట్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇచ్చారు. వాటిలో పని చేసే కార్మికులకు వేతనాలు తక్కువగా నిర్ణయిస్తున్నారు. ఉదాహరణకు బాగా వెనుకబడిన చత్తీస్‌గఢ్‌లో 2023 అక్టోబరు ఒకటి నాటికి అమల్లో ఉన్నట్లు ప్రకటించిన వేతనాల ప్రకారం నైపుణ్యం లేని కార్మికుడికి నెలకు రూ.12,623, నైపుణ్యం ఉన్నవారికి రూ.13,698 కాగా అభివృద్ధి చెందిన గుజరాత్‌ రెండింజన్ల పాలనలో రూ.12,012 నుంచి 12,298, నిపుణులైన వారికి రూ.12,558 నుంచి రూ.12,870 వరకు నిర్ణయించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఊడ్చి, శుభ్రం చేసే కార్మికులకు కనీస వేతనం ఏ జోన్‌లో రూ.19,136, బి జోన్లో రూ.16,016, సి జోన్లో రూ.12,844గా 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు జరుపుతున్నట్లు ప్రకటించింది. ఇదీ గుజరాత్‌ ఆదర్శం, నరేంద్ర మోడీ గారి అచ్చేదిన్‌. అందుకే గుజరాత్‌ కార్పొరేట్లు బలిశారు తప్ప కార్మికులు, ఇతరుల పరిస్థితి దిగజారుతోంది. మానవాభివృద్ధి సూచికలే దానికి పక్కా నిదర్శనం. కొన్ని వివరాలు (పట్టిక) ఎలా ఉన్నదీ చూద్దాం.వీటికి ఆధారం గ్లోబల్‌ డాటా లాబ్‌ వెబ్‌సైట్‌.
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు పారిశ్రామికంగా, వ్యవసాయకంగా వెనుకబడిన కేరళలో మానవాభివృద్ధి సూచికల కంటే పారిశ్రామికంగా వృద్ధి చెందిన గుజరాత్‌, మహారాష్ట్ర వెనుకబడి ఉన్నాయి.దీర్ఘకాలంగా బిజెపి ఏలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్‌ స్థితినీ చూడవచ్చు.
సంక్షేమ పథకాలను అమలు జరిపితే రాష్ట్రాలు అప్పుల పాలవుతాయని నరేంద్రమోడీ పదే పదే వ్యతిరేకతను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే గుజరాత్‌లో అరవై ఏళ్లు దాటిన వారికి నెలకు వెయ్యి, 80 దాటితే రూ.1,250 మాత్రమే ఇస్తున్నారు.పోనీ గుజరాత్‌కు అప్పులు లేవా? 2024-25కు బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.4.26 లక్షల కోట్లకు, మరుసటి ఏడాది ఐదు లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు.1995లో బిజెపి పాలన పది వేల కోట్ల అప్పుతో ప్రారంభమై ఈ స్థాయికి పెరిగింది. నరేంద్ర మోడీ సి.ఎంగా అధికారానికి వచ్చే నాటికి రూ.45,301 కోట్లు ఉండగా దిగిపోయే నాటికి రూ.2.21 లక్షల కోట్లకు పెరిగింది. 2016 నుంచి 2021 వరకు వార్షిక జిడిపి వృద్ధి రేటు కంటే రుణాల పెరుగుదల రేటు ఎక్కువగా ఉందని కాగ్‌ నివేదిక చెప్పింది. రెండు సంవత్సరాలకు ఒకసారి గుజరాత్‌ ప్రభుత్వం ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహిస్తున్నది. ఈ సదస్సులను నరేంద్ర మోడీ ప్రతిష్ట పెంచేందుకు ఉపయోగించారు. ఆహా..ఓహో…అన్నట్లుగా పెట్టుబడులు వచ్చినట్లు ఊదరగొట్టారు. గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటా అమలు జరుపుతానని చెప్పేందుకు ఇది కూడా కారణమైంది. మోడీ ఏలుబడిలో 2003 నుంచి 2015 వరకు ఏడు సదస్సులు జరగ్గా 84 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేశారు. 2017 సదస్సు సందర్భంగా నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెఎన్‌ సింగ్‌ అప్పటి వరకు 61 వాస్తవ రూపం దాల్చినట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖ నివేదిక ప్రకారం 2003-11 మధ్య కేవలం ఎనిమిది శాతమే అమల్లోకి వచ్చాయి. 2000 నుంచి 2016 వరకు మహారాష్ట్రలో 30 శాతం, గుజరాత్‌లో 10 శాతం మాత్రమే వాగ్దానాల్లో అమల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడులు మోడీ హయాంలోనే గుజరాత్‌కు తగ్గాయి. మూడు దశాబ్దాల బిజెపి, దానిలో 13 సంవత్సరాల నరేంద్ర మోడీ ఏలుబడిలో ఆరోగ్య తలసరి ఖర్చు దిగజారింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం 2020లో వేయి మందికి దేశంలో 0.55 ఆసుపత్రి పడకలుంటే గుజరాత్‌లో 0.33 ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బీహార్‌ కంటే తక్కువ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరించారు.
నెలవారీ తలసరి వినియోగ ఖర్చు ఆ యా రాష్ట్రాల్లో జనం ఉన్న స్థితిని అంచనా వేసుకొనేందుకు ఒక అంశంగా తీసుకోవచ్చు. నరేంద్ర మోడీ గుజరాత్‌ సి.ఎంగా ఉన్న సమయంలో దేశ సగటులో ఉన్న వృద్ధి కంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కూడా గుజరాత్‌ వెనుకబడింది. పదేళ్ల రెండింజన్ల వృద్ధిని చూస్తే దేశ సగటుకు దగ్గరగా మాత్రమే ఉంది.
2003 నుంచి 2011-12 సంవత్సరాలలో దేశంలో సగటున వినియోగ ఖర్చు గ్రామీణ ప్రాంతాలలో 158, పట్టణ ప్రాంతాలలో 157 శాతం పెరిగింది. గుజరాత్‌లో 145, 146 శాతాలుగా ఉన్నాయి. కేరళ 2003లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రథమ స్థానంలో ఉంది. 2011-12లో పట్టణాలలో హర్యానా ముందుండగా కేరళ రెండవదిగా ఉంది. 2022-23లో సర్వే ఫలితాలను బట్టి రెండింజన్ల పాలనలో ఉన్నవి లేని రాష్ట్రాల తీరు తెన్నులు పైవిధంగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఉన్న ప్రధాన రాష్ట్రాల వివరాలను ఎగువున చూశాము. ఎందుకని రెండింజన్ల పాలిత రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి? బిజెపి చెప్పే మాటలు బూటకం, అభివృద్ధి నాటకం తప్ప వాస్తవం కాదని స్పష్టం కావటం లేదా ?

సత్య

➡️