మణిపూర్‌లో కొనసాగుతున్న హింసలో తాజాగా మరో ఏడుగురు మృతి చెందడమే కాకుండా పరిస్థితి మరింత దిగజారింది. ఇటీవలి కాలంలో, కేంద్ర భద్రతా బలగాలు 11 మంది కుకీలను కాల్చి చంపినందుకు ప్రతీకారంగా జిరిబామ్ నుండి ఎనిమిది నెలల వయసున్న చిన్నారులు, రెండున్నరేళ్ల పిల్లలతో సహా ఆరుగురు మెయితీలను అపహరించారు. పోలీసుల కాల్పుల్లో మరో మెయితీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒకవైపు హత్యల పరంపర కొనసాగుతుండగానే మంత్రులు, రాజకీయ పార్టీల నేతల ఇళ్లు, కార్యాలయాలు తగలబడుతున్నాయి. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కుటుంబ సభ్యుల నివాసంపైనా దాడి జరిగింది. క్యాబినెట్ మంత్రులు తొంగం బిశ్వజిత్, గోబిందాస్ ఇళ్లకు నిప్పుపెట్టారు. తొమ్మిది మంది బిజెపి ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే సహా 14 మంది ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి జరిగింది. ఇంఫాల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ల బిల్‌బోర్డ్‌లను కూడా మూకలు ధ్వంసం చేశాయి. జిరిబామ్‌లో సి.ఆర్.పి.ఎఫ్ కాల్పుల్లో 11 మంది కుకీలు మరణించిన విషయాన్ని పోలీసులు దాచిపెట్టాలని చూశారు. కానీ పోస్టుమార్టం నివేదిక వాస్తవాన్ని బట్టబయలు చేసింది.
రాష్ట్రంలో దాడులు, కాల్పులు నిరంతరం జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం కూడా శరవేగంగా దిగజారిపోతోంది. మెయితీ నాయకుడిలా పూర్తిగా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పట్ల మిత్రపక్షాలు, సొంత ఎమ్మెల్యేలు సైతం విశ్వాసం కోల్పోయే పరిస్థితి నెలకొంది. బిజెపి తర్వాత ఫ్రంట్‌లో అతి పెద్ద భాగస్వామిగా వున్న ‘నేషనల్ పీపుల్స్ పార్టీ’ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ… ఏడుగురు ఎమ్మెల్యేలతో కూడిన ఎన్‌పిపి తన మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వానికి ముప్పు లేకపోయినప్పటికీ బీరేన్ సింగ్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ రోజురోజుకు తగ్గుతోందని తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు వున్న ‘కుకీ పీపుల్స్ ఫ్రంట్’ మద్దతు ఉపసంహరించుకున్న ఏడాది తర్వాత మరో పార్టీ కూడా అదే బాటలో నడిచింది. ఇదిలా వుండగా ఎన్‌పిపి నేత, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మణిపూర్ ముఖ్యమంత్రిని మార్చాలని పట్టుబడుతున్నారు. మణిపూర్ ఘటనను ఈశాన్య రాష్ట్రాలు ఎలా చూస్తున్నాయనడానికిదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ జిరిబామ్ నియోజకవర్గ బిజెపి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో సహా ఎనిమిది మంది రాజీనామా చేశారు. గత నెలలో స్పీకర్ సత్యవ్రత్ సింగ్, విద్యాశాఖ మంత్రి విశ్వజిత్ సింగ్ సహా 19 మంది బిజెపి ఎమ్మెల్యేలు బీరేన్ సింగ్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఇంఫాల్‌లో సాధారణ పరిస్థితులు వున్నాయో లేవో నిర్ధారించుకోవడానికి మంగళవారం తన నివాసంలో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఎన్‌డిఎ సమావేశం నుండి 11 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. వీరిలో ఏడుగురు బిజెపికి చెందిన వారు. ఇదంతా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం, బిజెపి రక్షణగా ఉన్న బీరేన్ సింగ్ కు మద్దతు తగ్గుముఖం పడుతోందన్న విషయం స్పష్టమౌతోంది. ఇదిలా వుండగా గవర్నర్ నివేదిక కోసం ఎదురు చూడకుండా శాంతిభద్రతలు దిగజారడానికి కారణమైన బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేయాలని ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే డిమాండ్ చేశారు. (‘ది హిందూ’ కథనం). కాబట్టి ముఖ్యమంత్రిని మార్చేందుకు కేంద్రం, బిజెపి సిద్ధంగా ఉండాలి.
మణిపూర్ తగలబడిపోతున్నప్పుడు కూడా దాన్ని ఏమాత్రం సమస్యగా భావించని హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల పర్యటనలో ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో అమిత్ షా ప్రచారానికి స్వస్తి చెప్పి ఢిల్లీకి హుటాహుటిన వెళ్లాల్సి వచ్చింది. అమిత్ షా రెండు రోజుల పాటు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి 50 కంపెనీల కేంద్ర పోలీసు బలగాలను మణిపూర్ పంపాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా వుంది. ముందుగా ఈ విషయాన్ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియచేయాలి. అందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. సైనిక చర్యతో సమస్య పరిష్కారం కాదన్న విషయాన్ని మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వివాదం ప్రారంభమై ఏడాదిన్నర గడిచినా ప్రధాని రాష్ట్ర పర్యటనకు రాకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమే. వివిధ వర్గాల ప్రజలను విశ్వాసంలోకి తీసుకునే ప్రయత్నాలు వేగంగా ప్రారంభించాలి. కాశ్మీర్, పంజాబ్, బాబ్రీ మసీదు సమస్యలు తలెత్తినప్పుడు జాతీయ సమైక్యత కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అయితే మోడీ ప్రభుత్వం వచ్చాక జాతీయ సమైక్యత కమిటీ గత చరిత్రగా మారింది. పదకొండేళ్లలో ఎన్నో సమస్యలున్నా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు.
అధికార బిజెపి, ప్రధాని మోడీ జాతీయ సమైక్యత, దేశ సమగ్రత, ఐక్యత గురించి పైకి చిలక పలుకులు పలుకుతుంటారు. కానీ ఆచరణలో మాత్రం వారు విభజించి పాలించాలన్న వలస పాలకుల వ్యూహాన్ని అనుసరిస్తుంటారు. కేంద్రంలోను, రాష్ట్రాలలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు మతం, కులం, జాతి, భాష, ఆహారం ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారు. యు.పిలో యోగి ఆదిత్యనాథ్ ఆ నినాదంతోనే రాష్ట్ర ప్రజలను మత ప్రాతిపదికన చీలుస్తున్నారు. మొదట వారిని విభజిస్తారు. దాంతో వారు వినాశనం అంచుకు చేరుకుంటారు. సరిగ్గా మణిపూర్‌లో జరుగుతున్నది ఇదే.
ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు, క్రిస్టియన్లపై హిందువులు కాలు దువ్వేలా చేస్తున్నది. హిందీ మాట్లాడే వారిని ఇతర భాషలు మాట్లాడే వారిపైకి, శాకాహారులను మాంసాహారారుల పైకి ఎగదోస్తోంది. హర్యానాలో జాట్‌లకు వ్యతిరేకంగా ఇతర జాతులవారిని, బీహార్, యు.పి లో అత్యంత వెనుకబడిన కులాల వారిపైకి యాదవులను ఎగదోయడం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. హిందూత్వ వాదులు రాజ్యాంగంగా భావించే మనుస్మృతి ప్రజలను కులాల వారీగా విభజిస్తున్నది.
బిజెపి అనుసరిస్తున్న విభజన విధానమే ఈశాన్య రాష్ట్రాలను, ముఖ్యంగా మణిపూర్‌ను అశాంతికి గురిచేస్తున్నది. సంఘ పరివార్ క్రమంగా మెయితీలను వైష్ణవిజం వైపు తిప్పుకుంది. తరువాత సనాతన వాదాన్ని విశ్వసించే హిందూత్వ జాతీయవాదులుగా మార్చింది. తర్వాత క్రైస్తవ కుకీలకు వ్యతిరేకంగా వారిని సమీకరించింది. అరంభీలను సమీకరించి కుకీలపై దాడులకు థెమ్‌కాల్ అనే సాయుధ సమూహాన్ని ప్రోత్సహిస్తోంది.
మెజారిటీ మెయితీల మద్దతుతో శాశ్వతంగా అధికారంలో తిష్ట వేయాలన్న ఆలోచనతో బిజెపి ఈ వివాదాన్ని రేపింది. ఇది నేడు దేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీసే స్థాయికి వెళ్లింది. అందువల్లనే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి చేతుల్లో దేశం ఏమాత్రం సురక్షితంగా లేదని సిపిఎం ఎప్పటి నుంచో చెబుతున్నది. సంఫ్‌ు పరివార్ సమాజంలోని ఒక సెక్షన్‌ను శత్రువుల పక్షాన నిలిపి ఐక్యత కోసం పిలుపునిస్తుంది. అంతిమంగా అది విభజనకు, అంతులేని సంఘర్షణకు దారితీస్తుంది. మణిపూర్ ప్రారంభం మాత్రమే. మిజోరంలోని మెయితీలు భయం అంచున జీవనం సాగిస్తున్నారు. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనూ బిజెపి ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. మిజోరాం, నాగాలాండ్, జార్ఖండ్ లలో క్రైస్తవులను దువ్వి బంగ్లాదేశ్ ముస్లింలపైకి ఎగదోసేందుకు సంఫ్‌ు పరివార్ ప్రయత్నిస్తోంది. ఇటువంటి విచ్ఛిన్నకర ఎజెండాను ఒకవైపు అమలు చేస్తూ మరోవైపు ఈశాన్య రాష్ట్రాల సంబంధాలను మెరుగుపరిచామని మోడీ గొప్పలు చెప్పుకుంటున్నారు. మొత్తంమీద మోడీ పాలన ఈశాన్య రాష్ట్రాలలో రోసిపోయింది.
వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.వి. గోవిందన్