16న దేశవ్యాప్త నిరసనలు – కార్మిక కర్షక ఐక్యత

Feb 13,2024 07:15 #Editorial

భారతదేశంలో గత పదేళ్ళ నుండి మతోన్మాద, కార్పొరేట్‌ అనుకూల విధానాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ”దేశం వెలిగిపోతున్నది”, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో వున్న నల్లధనాన్ని రప్పించి దేశంలో ప్రజలకు పంచడం, మేకిన్‌ ఇండియా, ఇటీవల అమృత కాల్‌ లాంటి వంద రకాల నినాదాలతో ఒకవైపు బిజెపి తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఇదంతా ప్రజలను మోసగించడానికి చేసే ప్రచార ఆర్భాటమే. మరోవైపు కార్పొరేట్లకు అనుకూలంగా అన్ని విధాలాదేశసంపదను దోచిపెడుతున్నది. ఇటీవల ప్రకటించిన ఆఖరి బడ్జెట్‌ కూడా కార్పొరేట్లకు పూర్తి అనుకూలంగా వుంది.

                దేశవ్యాప్తంగా 11 జాతీయ, కార్మిక సంఘాలు, 550 రైతు సంఘాలకు పాతినిధ్యం వహిస్తున్న కిసాన్‌ సంయుక్త మోర్చా, అఖిల భారత కిసాన్‌ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, కౌలుదారుల సంఘం ఫిబ్రవరి 16న జాతీయ సమ్మె, గ్రామీణ బంద్‌కు పిలుపు నిచ్చాయి. ఈ సమ్మెపై విస్తృత ప్రచారం జరగాలి. ప్రతి కార్మికుడు, వారి కుటుంబానికి, రైతాంగానికి మోడీ విధానాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేయాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఫిబ్రవరి 16న సమ్మె అనంతరం ర్యాలీలు, సభలు జరపాలని కోరుతున్నాం.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌కు ”భారత రత్న” బిరుదు ప్రకటించింది. కానీ ఆయన ప్రతిపాదించిన కనీస మద్దతు ధరను గత ప్రభుత్వాలు, నేటి బిజెపి ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించాయి. బిరుదులు ఇవ్వడం తేలిక కావచ్చు. కానీ రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. డా||స్వామినాథన్‌ రైతాంగానికి మేలు చేసే విధానాన్ని సమగ్రంగా అధ్యయం చేసి ప్రకటించారు. మద్దతు ధర అంటే రైతు పంటను పండించేదానికి అయ్యే ఖర్చు, రైతు కుటుంబం చేసే శ్రమకు అదనంగా 50 శాతం జోడించాలని వివరించారు. ఇది అమలు కానందునే వ్యవసాయం నేడు దివాలా తీసింది. నేటికి భారతదేశంలో ప్రజలు 65 శాతం వ్యవసాయంపైనే ఉపాధికి ఆధారపడి వున్నారు. ఇది అమెరికాలో 2 శాతం మాత్రమే. ఒక మహాకవి చెప్పినట్లు ప్రతి మెతుకులోనూ రైతు శ్రమ ఉంటుంది. రైతు శ్రమకు ప్రభుత్వ విధానాలు నేడు విలువ లేకుండా చేసాయి. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలి పొట్ట కోసం వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్ళవలసిన దుస్థితి ఏర్పడింది. సమాజంలో వ్యవసాయంపై ఆధారపడిన వ్యవసాయ కూలి, కౌలు రైతు, చిన్న, మధ్యతరగతి రైతులకు ప్రభుత్వం ఇటువంటి సహాయాన్ని అందించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన అమెరికా, జపాన్‌తో సహా అన్ని దేశాలలో రైతాంగానికి రాయితీలిస్తున్నారు. అయితే మన దేశంలో రైతాంగానికి నేడు ఆధారం లేకపోగా కనీస గౌరవం కూడా దక్కడం లేదని వాపోతున్నారు. వ్యవసాయంపై ఆధారపడిన యువకులకు ఉపాధి కరువైంది. రైతు యువకులను పెళ్ళి చేసుకోవడానికి ఆడపిల్లలు ఇష్టపడడం లేదు.

స్వాతంత్య్రానంతరం ఎన్నడూ జరగనంతగా 2021-22లో ఆ సేతుహిమాచలమూ 3 రైతు నల్లచట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతాంగం మహా ఉద్యమం నడిపారు. ఈ లోగా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రధానమంత్రి మోడీ దిగివచ్చి ”మాఫ్‌కీజియే” (క్షమించండి) అని రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు వెనక్కు తీసుకుంటామని, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని, రైతులపై కేసులు ఎత్తివేస్తామని చేసిన వాగ్దానాలు నేటికీ అమలు కాలేదు. రైతులపై 45 వేల పోలీసు కేసులున్నాయి. 742 మంది ఈ ఉద్యమంలో మరణించారు. అత్యంత కిరాతక పద్ధతుల్లో ఈ ఉద్యమాన్ని అణచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిన హామీలు నేటికీ అమలు చేయలేదు. పైగా దొడ్డిదారిన వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీ తదితర కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలు చేస్తోంది. అటవీ హక్కుల రక్షణ చట్టానికి సవరణలు చేసింది. దీని ప్రకారం గిరిజన భూములన్నీ కార్పొరేట్ల వశమవుతాయి. ప్రపంచ బ్యాంకు ఆదేశంతో కార్పోరేట్ల ప్రయోజనాల కోసం మోడల్‌ భూమి హక్కుల చట్టం రూపొందించింది (మన రాష్ట్ర ప్రభుత్వం దానిని చట్టం చేసింది. ఈ చట్టం అమలైతే రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది). ఆహార భద్రతా చట్టాన్ని నిర్వీర్యం చేస్తోంది. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీము తొలగించింది. ఈ కాలంలో బడ్జెట్‌లలో వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ.లక్ష కోట్లు వెనక్కి తీసుకుంది. ఫలితంగా రోజురోజుకూ సాగు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పెట్టుబడులు కూడా తిరిగిరాని రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఈ కాలంలో వారి ఆత్మహత్యలు 20 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ బంద్‌ జరుగుతున్నది.

భారతదేశంలో గత పదేళ్ళ నుండి మతోన్మాద కార్పొరేట్‌ అనుకూల విధానాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ”దేశం వెలిగిపోతున్నది”, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో వున్న నల్లధనాన్ని రప్పించి దేశంలో ప్రజలకు పంచడం, మేకిన్‌ ఇండియా, ఇటీవల అమృత కాల్‌ లాంటి వంద రకాల నినాదాలతో ఒకవైపు బిజెపి తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఇదంతా ప్రజలను మోసగించడానికి చేసే ప్రచార ఆర్భాటమే. మరోవైపు కార్పొరేట్లకు అనుకూలంగా అన్ని విధాలా దేశసంపదను దోచిపెడుతున్నది. ఇటీవల ప్రకటించిన ఆఖరి బడ్జెట్‌ కూడా కార్పొరేట్లకు పూర్తి అనుకూలంగా వుంది. ఉపాధి హామీ నిధులు పెంచలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎరువులపై…ప్రత్యేకంగా రైతులకు అవసరమైన యూరియాపై ఇచ్చే సబ్సిడీ రూ.62445 కోట్లు కోత విధించింది. ప్రజల ఆహార భద్రతకు కేటాయింపులో రూ.60470 కోట్లు కోత విధించింది. పేద ప్రజల కోసం నిర్దేశించిన ఉపాధి హామీ పథకానికి రూ.4806 కోట్లు కోత విధించింది. కేంద్ర ప్రభుత్వం గతంలోనే ధాన్య సేకరణను ఉపసంహరించింది. ఈ ఏడాది గోధుమ సేకరణకు కూడా కోత విధించింది. ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే ఎఫ్‌సిఐ తదితర గోదాములను 30 సంవత్సరాలకు అదానీ, అంబానీలకు లీజుకు కట్టబెట్టింది. రైల్వే ప్రైవేటీకరణకు పెద్ద పీట వేసింది. సామాన్య ప్రజల ఆశలు ఆడియాసలయ్యాయి. కనీసం పన్ను రాయితీలు వస్తామని ఆశించిన కార్మికులు నిరాశకు గురయ్యారు.

కార్మిక వర్గం స్వాతంత్య్రం ముందు నుండి సాధించుకున్న కార్మిక హక్కులపై కేంద్ర బిజెపి ప్రభుత్వం దాడి చేస్తున్నది. కేంద్ర బిజెపి విధానాలపై కార్మిక వర్గం పోరాడుతున్నది. అందుకే ముందుగా కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లుగా మార్చింది. కార్మిక చట్టాలోని సారాన్ని తీసివేసింది. సమ్మె హక్కును హరించింది. అయినా గత పదేళ్ళలో కార్మిక వర్గం అనేక అద్భుతమైన పోరాటాలు సాగించింది. దేశంలోనే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తాం లేదా మూసివేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో పదేపదే ప్రకటించారు. కార్మికవర్గ పోరాటాల ఫలితంగా ఒక్క భారీ ప్రభుత్వరంగ పరిశ్రమను కూడ అమ్మలేకపోయారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో గత 1100 రోజుల నుండి జరుగుతున్న నిరవధిక పోరాటం అందులో భాగమే. భారీ పరిశ్రమల పూర్తి వాటాలను అమ్మడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అందువలన పరిశ్రమలను ముక్కలుగా చేసి అమ్మడంలో భాగంగా జాతీయ హైవే రోడ్డులు, రైల్వేలు, విద్యుత్‌ రంగాలను ముక్కలు చేసి అమ్మాలని ప్రయత్నిస్తున్నది. దీనినే జాతీయ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ అని కేంద్ర ప్రభుత్వం నామకరణ చేసింది.

గత పది సంవత్సరాల మోడీ పాలన కాలంలో అత్యంత ధనవంతులైన కార్పొరేట్లకు రూ.15.32 లక్షల కోట్ల రుణ మాఫీ చేశారు. వి.పి.సింగ్‌ ప్రధానమంత్రిగా వుండగా రైతులకు దేశవ్యాప్తంగా కేవలం రూ.10 వేల కోట్లు రుణా మాఫీ చేసినందుకే ఆ నాడు బిజెపి గగ్గోలు పెట్టింది. ఆస్తుల దివాళా చట్టాన్ని తీసుకువచ్చి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న ధనవంతులకు అప్పులు చెల్లించకుండా ఎగ్గొట్టే అవకాశాలు కల్పించారు. ఈ చట్టం కింద దివాళా ప్రకటించిన 265 కంపెనీల నుంచి కేవలం 27 శాతం ఆస్తులు మాత్రమే రాబట్టారు. 73 శాతం అధికారికంగా చెల్లించకుండా అనుమతించారు. సామ్‌సంగ్‌, విస్ట్రాన్‌ లాంటి విదేశీ కంపెనీలకు 1.97 లక్షల కోట్ల రాయితీలిచ్చారు. ఇదంతా ప్రజల సొమ్ము. ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు ధనవంతులకు కట్టబెట్టే కుట్ర ఇది. ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాల అమ్మకంలో 2023లో 2.23 లక్షల స్క్వేర్‌ కి.మీటర్ల ఏరియాలోని 26 బ్లాక్‌లను ప్రైవేటు కంపెనీలకు కారుచౌకగా కేంద్ర ప్రభుత్వం అమ్మింది. భారతదేశంలోని ప్రతి 500 కి.మీటర్ల సముద్రతీరంలో ఒక పోర్టును అదానీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. మారక ద్రవ్యాల ఎగుమతి, దిగుమతులకు కేంద్రంగా వున్న ముంద్రాపోర్టు, ఆంధ్రప్రదేశ్‌ లోని క్రిష్టపట్నం, గంగవరం పోర్టులు ఈ కోవకు చెందినవే. కేంద్ర గనుల శాఖమంత్రి ప్రైవేటు కంపెనీలకు గనుల తవ్వకల్లో 25 శాతం ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, యజమానులు చెల్లించవలసిన 12 శాతం రాయల్టీని 3 శాతానికి తగ్గిస్తూ ప్రకటన చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కార్మికులు రైతులకు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోన్నది. వున్న హక్కులను కబళించే విధానాలు కొనసాగుతున్నాయి. మరోవైపున ప్రజలను మతం పేరుతో చీల్చే భావజాలన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. అయోధ్యలో నిర్మించిన రామమందిరంపై గత ఆరు మాసాలు చేసిన భారీ ప్రచారం ఇందులో భాగమే. మీడియా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నది. మతాన్ని రాజకీయాలకు జోడించి ప్రచారాన్ని సాగిస్తున్నది. జనవరి 22న అయోధ్య రామాలయంపై దేశమంతా ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా రామభజన చేయించింది. జనవరి 23న మోడీ దర్శనం కోసం రాజకీయ నాయకులంతా ఎదురు చూసే మోడీ భజన చేయించింది. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బారికేడ్ల వెనుక నుంచి మోడీ గారి దర్శనం కోసం ఎదురు చూశారు. గాజాపై దాడి చేసి 26 వేల మందిని ఊచకోత కోసిన ఇజ్రాయిల్‌… ఆ నరమేధాన్ని ఇంకా కొనసాగిస్తున్నది. కానీ భారత ప్రభుత్వం దీన్ని ముస్లిం వ్యతిరేక ప్రచారంగా మలచడం దారుణం. నూతన విద్యా విధానం పేరుతో చరిత్ర, సైన్స్‌ సిలబస్‌లో డ్వారిన్‌ సిద్ధాంతాన్ని తొలగించాలని చూడడం, మణిపూర్‌లో ఒక తెగకు వ్యతిరేకంగా మరో తెగను రెచ్చగొట్టి మారణహోమం సృష్టించడం బిజెపి మతోన్మాద కుట్రలకు మచ్చుతునకలు.

పదమూడు నెలలు పోరాడి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయించిన అనుభవం మన ముందున్నది. ఇటీవలే మన రాష్ట్రంలో అంగన్‌వాడీ మహిళలు నిర్బంధాలను లెక్క చేయకుండా పోరాడి తమ కోర్కెలు సాధించుకోవడం చూశాం. ఈ రెండు సందర్భాల్లోనూ రైతాంగానికి కార్మిక వర్గమూ…కార్మిక వర్గానికి రైతాంగమూ తోడుగా నిలబడింది. ఈ అనుభవాలతో గ్రామీణ ప్రజానీకాన్ని, కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి పోరాటం సాగించాల్సి ఉంది. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతున్నాము.

➡️