‘నీట్‌’ మాయలు!

Jun 12,2024 03:45 #editpage

వైద్య కోర్సుల్లో ప్రవేశార్హతకు నిర్వహించే నీట్‌ పరీక్ష గతంలో ఎన్నడూ లేనివిధంగా అప్రతిష్ట పాలైంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్ష నిర్వహణలో కనీస జాగ్రత్తలు తీసుకున్నారా? ఎంతో చిత్తశుద్ధితో నిజాయితీగా నిర్వహించాల్సిన పరీక్షల్లో పారదర్శకతేదీ? అంటూ అంతటా చర్చ సాగుతోంది. పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ… ‘పరీక్షను రద్దు చేయడం అనుకున్నంత సులభం కాదు. అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయి. అందువల్ల ఈ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి. దీనిపై స్పందన తెలియజేయండి’ అంటూ పరీక్షలు నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ను ఆదేశించడం పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడిలో లోపాలకు ప్రాథమిక ప్రతిస్పందనగా భావించవచ్చు.
ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రీకృతం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వాలను పక్కనపెట్టడం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఈ అంశంపై ఇప్పటికే తమిళనాడు వంటి రాష్ట్రాలు పోరాడుతున్నాయి. నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)ను మనదేశంలో 2016లో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 180 ప్రశ్నలను 180 నిమిషాల్లో అంటే మూడు గంటల్లో విద్యార్థి రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 180 ప్రశ్నలకు 720 మార్కులు వస్తాయి. ప్రశ్నకు సమాధానం తప్పుగా పెడితే ఒక మార్కు మైనస్‌ అవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షకు ఈ ఏడాది 23 లక్షల 33 వేల 297 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో పాస్‌ చేయిస్తామంటూ రూ.10 లక్షల చొప్పున వసూలు చేశారంటూ పరీక్షకు ముందురోజే గుజరాత్‌లో ఇద్దరిని అరెస్టు చేశారు. పాట్నాలో పేపర్‌ లీక్‌ ఫిర్యాదులతో 13 మంది కటకటాల పాలయ్యారు. ప్రశ్నాపత్రం లీకైందంటూ కొన్ని ఫొటోలతో పరీక్ష జరిగిన మే 5నే సోషల్‌ మీడియా హోరెత్తింది. ఫలితాలు విడుదల చేయొద్దని, నీట్‌ మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు నాటి నుంచే ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టునుసైతం పిటిషనర్లు ఆశ్రయించారు. షెడ్యూల్‌ కంటే పది రోజుల ముందుగా జూన్‌ 4నే నీట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల నిర్వహణలో లోపాలను, పేపర్‌ లీకేజీని, అక్రమాలను ఎవరూ పట్టించుకోరనే ఎన్నికల ఫలితాల రోజున విడుదల చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితాలు కూడా పలు అనుమానాలను రేకెత్తించాయి. 2019, 20లో ఒక్కొక్కరు, 2021లో ముగ్గురు టాపర్లుగా నిలిస్తే ఈ ఏడాది 67 మంది టాపర్లుగా ఎలా ఎంపికయ్యారు? హర్యానాలో ఒకే పరీక్షా కేంద్రంలో ఒకే హాల్‌ టిక్కెట్‌ సిరీస్‌ ఉన్న ఎనిమిదిమంది ఎలా టాపర్లయ్యారు? విద్యార్థులకు 720 మార్కులు లేదా 716 లేదా 715 మార్కులు రావాలి కానీ, 717, 718, 719 చొప్పున మార్కులెలా వచ్చాయి? గత ఏడాదితో పోలిస్తే మూడు లక్షల మంది అధికంగా పరీక్ష రాయడం వల్ల టాపర్ల సంఖ్య పెరిగిందని ఎన్‌టిఎ చెబుతోంది. మిగిలిన వాటికీ ఇలాంటి సమాధానాలే!
ఇక మరోచోద్యమేమిటంటే చాలాచోట్ల ప్రశ్నాపత్రం ఇవ్వడం ఆలస్యమైంది. సమయాన్ని పెంచడానికి బదులుగా ఒక నిమిషానికి ఒక ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉన్నందున ఎన్ని నిమిషాలు ఆలస్యమైతే అన్ని నాలుగు మార్కుల చొప్పున కలిపారు. ఇలా మార్కులు కలపడం వల్ల 1500 మంది మార్కులలో మార్పులు వచ్చాయి. టాపర్స్‌గా నిలిచిన ఆరుగురు ఇలా కాంపన్సేటరీ మార్కులు పొందినవారే. ఈ గ్రేస్‌ మార్కులపై కలకత్తా, ఢిల్లీ హైకోర్టులతోపాటు సుప్రీంలోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఆరోపణలపై విచారణకు యుపిఎస్‌సి మాజీ ఛైర్మన్‌ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలి. విద్యార్థుల భవిష్యత్తుకు హాని కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి. వైద్య విద్యకు, వైద్య వృత్తికి నేడు సమాజంలో ఉన్న ప్రాధాన్యత రీత్యా ‘నీట్‌’ను లోపరహితంగా నిర్వహించాలి. ఈ ఏడాది పరీక్ష విషయంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించడం కేంద్రం బాధ్యత. అంతేగాక ఈ అంశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య విద్యనభ్యసించాలని ఆకాంక్షించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేయాలి.

➡️