జవాబుదారీతనం కావాలి

ఢిల్లీ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ నివాసంలో కాలిన నోట్ల కట్టల ఉదంతం అవినీతిని మరోసారి చర్చనీయాంశం చేసింది. ఈ అంశం పార్లమెంట్‌నూ కుదిపేసింది. ఆయన నివాసంలో భారీ మొత్తంలో కాలిన కరెన్సీ కట్టల ఉదంతం వెలుగుచూసినప్పటి నుంచీ సుప్రీంకోర్టు చూపిన చొరవ, పారదర్శకంగా వ్యవహరిస్తూ త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ రాజ్యాంగంలోని అన్ని వ్యవస్థలనూ నీరుగార్చేందుకు, పరివార్‌ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బహిరంగ రహస్యమే. అందుకోసం ప్రలోభపెట్టడం, పదవీ విరమణ తరువాత కీలక పదవుల్లో నియమించడం తదితర అనేక టక్కుటమార విద్యలు ప్రదర్శించడంలో గత రికార్డులన్నింటినీ తిరగరాసింది. అందువల్లే అనేక వివాదాస్పద అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులొచ్చాయనే విమర్శలూ ఉన్నాయి. ఈ ఉదంతంతో తనకూ, తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, అప్రతిష్టపాలు చేసేందుకు చేసిన కుట్ర అని జస్టిస్‌ వర్మ చెబుతున్నారు. న్యాయమూర్తి లేని సమయంలో స్టోర్‌ రూమ్‌కు నిప్పుపెట్టి ఆయనను చిక్కుల్లో పడేసే కుట్ర అన్న దాంట్లో నిజమెంతున్నా, ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చింది? ఇందులో ఎవరెవరిది బాధ్యత అన్న అంశాలను తేల్చాలి. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు బయటపడినప్పటికీ… సిజెఐ, కొలీజియం స్పందించిన తీరు పారదర్శకంగానే ఉంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రాథమిక నివేదిక తెప్పించుకోవడంతోపాటు న్యాయపరమైన విధులన్నింటినీ నిలిపివేయాలని కొలీజియం నిర్ణయించింది. ఆయనను అలహాబాద్‌ హైకోర్టుకు తిప్పి పంపాలన్న ఆదేశం వివాదాస్పదమవుతోంది. అవినీతి పరులను పంపించడానికి తమ హైకోర్టు డంపింగ్‌ యార్డు కాదంటూ అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎహెచ్‌సిబిఎ) చేసిన వ్యాఖ్య తీవ్రమైనది. న్యాయవ్యవస్థ ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ వర్మ ఇచ్చిన అన్ని తీర్పులనూ సమీక్షించాలని ఎహెచ్‌సిబిఎ చేస్తున్న డిమాండ్‌నూ పరిగణనలోకి తీసుకోవాలి. సిఎఎ వ్యతిరేక నిరసనలు, మీడియా స్వేచ్ఛపై పరిమితులు, ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు, యుపిలో బిజెపి నేత అవినీతి తదితర అంశాల్లో నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా తీర్పులివ్వకుండా రాజకీయ ప్రభావంతో ప్రభుత్వ ఎజెండాకు అనుకూలంగా జస్టిస్‌ వర్మ తీర్పులిచ్చారనే విమర్శలున్నాయి. అయితే, ఇదే అదనుగా కేంద్రం, గోడీ మీడియా కొలీజియం వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసి, తాము అనుకున్న విధంగా నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌జెఎసి) ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే ప్రమాదముంది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం నుంచి చీఫ్‌ జస్టిస్‌ను తప్పించి, తను అనుకున్న వారిని నియమించుకున్నట్టుగానే న్యాయ వ్యవస్థను చెప్పుచేతల్లోకి తీసుకునే దుర్మార్గమిది. మోడీ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఇందుకు ప్రయత్నం జరగ్గా, దానిని కొట్టివేయడం ద్వారా సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను నిలబెట్టుకుంది. బిజెపి పెద్దలు, న్యాయశాఖ మంత్రులు, రాజ్యసభ ఛైర్మన్‌ ఇప్పటికీ పలు సందర్భాల్లో ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండేవిధంగా రూపొందించిన ఎన్‌జెఎసిని కీర్తిస్తుంటారు. తమకు నచ్చనివారిని కొలిజియం సిఫార్సు చేస్తే ఆ నియామకాలకు మోకాలడ్డుతున్న తీరును ఇప్పటికే చూస్తున్నాం. ఇక ఎన్‌జెఎసి గాని వస్తే పారదర్శకతకు పాతర వేసే ప్రమాదమే అధికం. నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని, జస్టిస్‌ వర్మను అభిశంసించాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. రాజ్యానికి సంబంధించిన ప్రధాన అంశాలనూ, పరిధులనూ నిర్ణయించే గొప్ప అధికారం రాజ్యాంగం ద్వారా సంతరించుకున్న న్యాయ వ్యవస్థ పూర్తి జవాబుదారీతనంగా, పారదర్శకంగా ఉండాల్సిందే. రాజ్యాంగ సంరక్షకుడిగా, ప్రాథమిక హక్కుల రక్షకుడిగా న్యాయ వ్యవస్థ ఉండాలన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ వ్యాఖ్యలు నిజమైనప్పుడే జ్యుడీషియరీపై ప్రజల్లో సడలుతున్న నమ్మకాన్ని పునరుద్ధరించడం సాధ్యమవుతుంది.

➡️