బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం, అదే సమయంలో అరేబియా సముద్రంలో లేచిన తుపాన్ ప్రభావానికి కదులుతున్న రుతుపవన ద్రోణి రెండూ కలిసి తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన బీభత్సం మాటలకందనిది. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు జల ప్రళయం బారిన పడి చిగురుటాకులా వణుకుతున్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు నగరాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏకమయ్యాయి. జన జీవనం స్తంభించింది. రోడ్లకు, కాల్వలకు, చెరువులకు గండ్లు పడ్డాయి. హైవేలపైకి వరద నీరు ఉప్పొంగడంతో రవాణా నిలిచిపోయింది. రైళ్లు, బస్సులు, విమానాలు రద్దయ్యాయి. పలు నగరాలు, పట్టణాలు, పల్లెలు భయం గుప్పెట్లో గడుపుతున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. మరీ ముఖ్యంగా బెజవాడ బాధ ఎంత చెప్పినా తక్కువే. రహదారులు తటాకాలను తలపిస్తున్నాయి. మర పడవలే జనాలకు దిక్కయ్యాయి. ఆహారం అందక, తాగు నీరు దొరక్క, చివరికి పసిపిల్లలకు గుక్కెడు పాలు కరువై అలమటిస్తున్న హృదయ విదారక దృశ్యాలు ఎంతటి వారి మనసులైనా తరుక్కుపోతాయి. లక్షల మంది ప్రజలు ముంపులో చిక్కుకొని ఎటూ వెళ్లే దారి లేక తమను రక్షించే వారి కోసం గంటల కొలది ఎదురు చూస్తున్న దయనీయ పరిస్థితి.
భారీ వర్షాలు, వరదలకు ఇప్పటి వరకు 19 మంది మృత్యువాత పడ్డారన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక లెక్క. గల్లంతై ఆచూకీ దొరకని వారి సంఖ్య ఉండనే ఉంది. ఒక్క విజయవాడలోనే కొండ చరియలు విరిగిపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదం. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల సహాయంపై ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు కొంత ఎక్స్‌గ్రేషియో, ముంపు బాధితులకు కొద్దిపాటి నిత్యావసర వస్తువులు, దుస్తులు, ఆహార పొట్లాలు, నీటి ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ముంపులో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్లను, మర పడవలను వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విజయవాడలో వరద ప్రాంతాలను సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా కృష్ణానది పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజికి గరిష్టంగా 12 లక్షల క్యూసెక్కుల వరకు నీరు వస్తుందని అంచనా వేశారు. దాంతో నదికి అటూ ఇటూ ఉన్న ప్రజలు, లంక గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. వేలాది మంది ఇళ్లూ వాకిళ్లు వదిలేసి కట్టుబట్టలతో సహాయ శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. సెప్టెంబర్‌లో బంగాళాఖాతంలో మరిన్ని అల్ప పీడనాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు భీతిల్లుతున్నారు.
ప్రస్తుత విలయ తీవ్రత ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనిదిగా అనుభవజ్జుల, సీనియర్ సిటిజన్ల మాటలు ఆలోచింపదగినవి. వాతావరణ మార్పులు, విచ్చలవిడి ప్రకృతి విధ్వంసం, పర్యావరణ సమతుల్యం కాపాడటంపై పాలకులు దృష్టి నిలపాలని హెచ్చరిస్తున్నాయి. కొన్ని గంటల్లో 20, 30 సెంటీమీటర్ల వాన గతంలో ఎప్పుడూ ఎరగం. నీటి వనరుల నిర్వహణలో ప్రభుత్వాల వైఫల్యం ఆకస్మిక వరదలకు హేతువు. బెజవాడ ఇంతగా మునగడానికి బుడమేరు కారణం. బుడమేరు అంశం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇక్కడే కనిపిస్తుంది. పద్ధతీపాడూ లేని విశృంఖల పట్టణీకరణ, విచ్చలవిడి దురాక్రమణలు, రియల్ దందా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆగింది లేదు. వీటిని అరికడితేనే ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలకు రక్షణ. వరదలను జాతీయ విపత్తుగా సిఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రంతో మాట్లాడి జాతీయ విపత్తుగా ప్రకటింపజేయాలి. ప్రధాని సైతం మాటామంతితో సరిపెట్టకుండా రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులిచ్చి ఆదుకోవాలి. అప్పటిదాకా ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వరద బాధితులకు ఆపన్న హస్తం అందించాలి. వర్షాలు వరదల వరలన పంటలు నష్టపోయిన రైతులకు సముచిత స్థాయిలో నష్టపరిహారం అందించాలి. వరద బాధిత ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత పునరావాస చర్యలు చేపట్టాలి. విపత్తుల సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సబబు కాదు. అందరూ కలిసి ప్రజలు సాధారణ జీవనం సాగించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించి మానవత్వం చాటుకోవాలి.
