విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం ఆగి ఉన్న కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని కీలలు పుట్టి ఒక ఎ.సి. బోగీ పూర్తిగా, రెండు బోగీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో గండం గడిచింది. ప్రమాద సమయంలో రైలులో ఎవరూ లేని కారణంగా ప్రాణనష్టం సంభవించలేదు. జూన్‌లో పశ్చిమ బెంగాల్‌లో కాంచనగంగ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురి కావడంతో పది మంది మృత్యువాత పడగా 60 మంది వరకు క్షతగాత్రులయ్యారు. యుపిలో డిబ్రూగఢ్-చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురై నలుగురు చనిపోగా 32 మంది గాయపడ్డారు. జంషెడ్‌పూర్ వద్ద హౌరా-ముంబయి ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోగా 20 మంది గాయపడ్డారు. ఇవి కేంద్రంలో మోడీ నేతృత్వంలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరాక జరిగిన కొన్ని రైలు ప్రమాదాలు. ముందటేడాది ఒడిశాలో బహనాకా బజార్ స్టేషన్ వద్ద మూడు రైళ్లు ఢకొీని 300 మందిని బలిదీసుకున్న అత్యంత విషాదం స్వాతంత్య్రం వచ్చాక దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాల్లో మూడవది. వరుసగా చోటు చేసుకుంటున్న రైలు ప్రమాదాలను చూస్తుంటే గత పదేళ్లల్లో బిజెపి ప్రభుత్వ వైఫల్యం కళ్లకు కడుతుంది. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ రైల్వే పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి పెద్ద ఉదాహరణ. ఆర్థిక మంత్రి రైల్వే బడ్జెట్ గురించి కనీసం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించలేదంటే రైల్వేపైనా, ప్రయాణీకులపైనా బిజెపి సర్కారు ఎంత మాత్రం విలువ ఇస్తున్నదో అర్థమవుతుంది.
భారత రైల్వే ప్రపంచంలో అతిపెద్ద రైలు నెట్‌వర్క్ కలిగిన వ్యవస్థలలో నాల్గవది. ప్రతి రోజూ 22,500 రైళ్ల ద్వారా 2.40 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. అంతేకాకుండా 20.30 కోట్ల టన్నుల సరకును రావాణా చేస్తోంది. రైల్వే ద్వారా ఈ సంవత్సరం రూ.80 వేల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. రైల్వే బడ్జెట్ రూ.2.75 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. రైల్వే నుంచి పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జిస్తున్న ప్రభుత్వం భద్రతపై కనీస మాత్రం శ్రద్ధ పెట్టట్లేదనడానికి ఏళ్లుపూళ్లు సాగుతున్న ప్రాజెక్టులే నిలువెత్తు సాక్ష్యాలు. రైల్వేతో, దేశాభివృద్ధికి, ప్రజలకు ఉన్న అవినాభావ సంబంధం రీత్యానే గత ప్రభుత్వాలు రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా చూశాయి. మోడీ రాగానే సాధారణ బడ్జెట్‌లో ఒక పద్దు కింద విలీనం చేసి ఆ వ్యవస్థకు ప్రాధాన్యత లేకుండా చేశారు. రైల్వేలో దశాబ్దాల నుంచి పర్మినెంట్ సిబ్బంది నియామకాల్లేవు. రెండు లక్షలకుపైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌లో ప్రభుత్వమే ప్రకటించింది. తగినంత సిబ్బంది లేకుండా, ఉన్న వారిపై అదనపు భారం వేస్తూ రైల్వేని నడపడం శ్రేయస్కరమేనా? ఇప్పటికీ సిబ్బంది కాపలా లేని 559 లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నాయంటే ప్రజల భద్రత గాలిలో పెట్టిన దీపమేనని అర్థమవుతుంది.
దేశంలో ఏడాదికి సగటున 54 రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ మానవ తప్పిదాలుగానో, సాంకేతిక కారణాలుగానో, ఉగ్ర కోణంగానో పేర్కొని ఒకరిద్దరిపై చర్యలు తీసుకొని మమ అనిపించి ప్రభుత్వ వ్యవస్థాగత వైఫల్యాలను కప్పిపెట్టడం రివాజైంది. రైల్వే ప్రక్షాళనకు ఎన్నో అధ్యయనాలు, విచారణ నివేదికలు ఉన్నా ఆ వైపు చూడట్లేదు. రైల్వే భద్రత కోసం ఉన్న డిఆర్‌ఎఫ్, ఆర్‌ఎస్‌ఎఫ్, ఆర్‌ఆర్‌ఎస్‌కె నిధులు రావట్లేదని కాగ్ ఎత్తి చూపిందంటే మోడీ ప్రభుత్వానికి ప్రయాణీకుల ప్రాణాలంటే లెక్క లేదని తెలుస్తుంది. మోడీ సర్కారు రైల్వే ప్రైవేటీకరణ దిశగా దూసుకెళుతోంది. ప్రైవేటు రైళ్లకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లను, డిజిటలైజేషన్‌ను, రైల్వే భూములను, రైలు బోగీల నిర్మాణాలను, అదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్లకు అప్పగిస్తోంది. వందే భారత్, బుల్లెట్, మెట్రో ట్రైన్‌ల వంటివి అందులో భాగమే. జనరల్, స్లీపర్ కోచ్‌లను తగ్గించి, ఎ.సి. కోచ్‌లను పెంచి రైళ్లను సామాన్యులకు, పేదలకు దూరం చేస్తోంది. రోగులు, వృద్ధులు తదితర కేటగిరీలకు రాయితీలను ఎత్తేసింది. బెంబేలెత్తిస్తున్న రైలు ప్రమాదాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టాలి. ప్రజల బతుకులో అంతర్భాగమైన రైల్వే వ్యవస్థను కాపాడుకోడానికి ప్రజలూ కంకణధారులు కావాలి.
