ఈ సంవత్సరం వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలకు అక్టోబర్ 7న ప్రకటించారు. విక్టర్ అంబ్రోస్ (యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్), గ్యారీ రూవ్‌కున్ (మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ అండ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్)లు మైక్రో ఆర్.ఎన్.ఏ లను ఆవిష్కరించినందుకు నోబెల్‌ను ప్రకటించారు. జన్యు వ్యక్తీకరణ అనే ఒక జీవ ప్రక్రియలో మైక్రో ఆర్.ఎన్.ఏ లు తీసుకునే కీలక పాత్రపై జరిగిన పరిశోధన ఇది. ఇందులో అనేక సంభావ్యతలు, భవిష్యత్ పరిశోధనావకాశాలు ఉన్నాయి. కానీ, ఈ పరిశోధన తక్షణ రోజువారీ ఉపయోగాల గురించి వెంటనే చెప్పలేము.
ప్రతి జీవకణ డి.ఎన్.ఏ లలో ఉండే క్రోమోజోములలో జన్యు సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. డి.ఎన్.ఏ ముక్కలే జీన్స్. ఈ జీన్స్ ఎం.ఆర్.ఎన్.ఏ లు (మెసెంజర్ ఆర్.ఎన్.ఏ)గా మారతాయి. అవి మళ్లీ, కణ ద్రవంలో ప్రోటీన్లను సంశ్లేషిస్తాయి. ఈ ప్రోటీన్లు కణంలో వివిధ పనులు నిర్వహించే పని వాళ్ళ లాంటివి. ప్రతి ప్రాణి జీవ కణంలోనూ క్రోమోజోములు, జన్యువులు ఒకే విధంగా ఉంటాయి. కానీ వివిధ జీవ కణాలు వివిధ రకాలైన పనులను చేయడం చూస్తాం. ఉదాహరణకు కండర కణజాలం వేరు, నాడీ కణజాలం వేరు. ఏయే ప్రోటీన్లు అవసరమో అవి మాత్రమే తయారయ్యేట్టు, జన్యు నియంత్రణ జరుగుతూ ఉంటుంది. శరీర అంత: పర్యావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా జీవకణాలు తగిన విధులను నిర్వహిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలకు విఘాతం కలిగినప్పుడు, క్యాన్సర్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ జబ్బులు రావడం చూస్తాం.
మైక్రో ఆర్.ఎన్.ఏ లు…
శాస్త్రవేత్తలు 1960లలో జీవకణాలలో కొన్ని కారకాలను (ట్రాన్స్‌క్రిప్షన్ ఫ్యాక్టర్లు)ను కనుగొన్నారు. ఇవి జీన్స్‌కు అతుక్కొని ఉండే ప్రోటీన్లు. ఏ జన్యువులు ఎం.ఆర్.ఎన్.ఏ లుగా మారాలో ఇవి నిర్దేశిస్తాయి. జన్యు నియంత్రణ జరిగే ప్రక్రియ ఇదే అనుకునేవారు. జన్యు నియంత్రణలపై 1980లలో రాబర్ట్ హోర్విట్జ్ ల్యాబ్‌లో అంబ్రోస్, గ్యారీ పనిచేశారు. రాబర్ట్ హోర్విట్జ్, 2002 నోబెల్ బహుమతి గ్రహీత. ఈయన ఏలిక పాముల (సి.లెగాన్స్ జాతి)పై పరిశోధన చేశాడు. వీటిలో కణాల మృతిపై జన్యు నియంత్రణ ఏ విధంగా ఉంది? అనే పరిశోధనకే నోబెల్ బహుమతి వచ్చింది. ఇప్పుడు ఏలిక పాములను, పరిశోధనలకు బాగా పనికి వచ్చే నమూనా జీవులుగా భావిస్తున్నారు. ఈ నెమటోడ్లలో ఉత్పరివర్తనాల వల్ల కొన్ని పొడవుగా, కొన్ని పొట్టిగా, ఉంటాయి. పొడవు రకాల ఏలిక పాముల జన్యువులు (లిన్-4), పొట్టి వాటిని (లిన్-14) అణచి ఉంచడం వల్ల, ఇది జరుగుతోందని అంబ్రోస్ కనుగొన్నాడు. అయితే ఇది ఏ విధంగా జరిగేదీ అప్పుడు తెలీదు.
అయితే తరువాత, అంబ్రోస్ హార్వర్డ్ యూనివర్సిటీలో, ఒక స్వతంత్ర పరిశోధకుడిగా తన పరిశోధన లిన్-4 జన్యువు డూప్లికేటింగ్‌పై కొనసాగించాడు. అయితే ఆయన సంగ్రహించిన ఆర్.ఎన్.ఏ మరీ చిన్నది కావడంతో పెద్దగా ఉపయోగపడలేదు. ఇదే సమయంలో, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ అండ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో రూవ్‌కున్ లిన్-14పై పరిశోధనలు చేశాడు. ఇద్దరూ, తమ పరిశోధన ఫలితాలను ఒకరికొకరు పంచుకున్నారు. లాభాపేక్ష కోసం రహస్యాలు పాటించడం కాకుండా, పరిశోధనా ప్రయోజనాల కోసం (ఓపెన్ సైన్స్/ప్రజాసైన్స్ కోసం) పంచుకున్నారు. లిన్-4 జన్యువు, లిన్-14ను అడ్డుకోవడం ద్వారా కాకుండా, ప్రోటీన్ ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా పనిచేస్తుందని, కురచ ఆర్.ఎన్.ఏ ల పాత్ర ఇందులో ఉందని వారిద్దరూ కనుగొన్నారు. జన్యు నియంత్రణకు సంబంధించిన ఇది ఒక సరికొత్త విషయం. ఈ అధ్యయనాలు, 1993లో ‘సెల్’ పత్రికలో ప్రచురింపబడ్డాయి. అంబ్రోస్ 2001లో ఈ కురచ ఆర్.ఎన్.ఏ లకే ‘మైక్రో ఆర్.ఎన్.ఏ’ అనే పేరు పెట్టాడు.
కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అంబ్రోస్ 1992లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి రాజీనామా చేశాడు (1984 నుండి అక్కడే పనిచేస్తున్న ఆయన, కొనసాగడానికై చేసుకున్న దరఖాస్తును తిరస్కరించడంతో ఆయన రాజీనామా చేశాడు). ఆ తర్వాత డార్ట్ మౌత్ కాలేజీలో, మసాచుసెట్స్ యూనివర్సిటీలో చేరి తన జీవితంలో తరువాత అధ్యాయాన్ని ప్రారంభించాడు. అంబ్రోస్ స్వయంగా ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపేవాడని ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు అంటారు. ముఖ్య శాస్త్రవేత్తలు సాధారణంగా పరిపాలనా అంశాల మీద, నిధుల మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు. కానీ అంబ్రోస్‌కు ప్రయోగశాలలో ప్రత్యక్షంగా ఉండి పని చేయడం మీద ఎక్కువ ఆసక్తి. పరిశోధనలను ఉమ్మడిగా అందరితో కలిసి పంచుకోవాలనే ఆయన స్వభావమే హార్వర్డులో చాలామందికి బహుశా సరిపడకపోయి ఉండవచ్చు. అందుకే ఆయన కొనసాగింపును తిరస్కరించి ఉంటారని చాలామంది భావిస్తారు.
కీలకంగా మారుతున్న జన్యు నియంత్రణలు
అంబ్రోస్, రూవ్‌కున్ లు తమ కొత్త ఆవిష్కరణలను వెల్లడించినప్పుడు చాలామంది అప్పట్లో పట్టించుకోలేదు. బహుశా అది ప్రత్యేక సందర్భంలో తప్ప, మిగిలిన సంక్లిష్ట జీవులకు అది వర్తించదని సి.ఎలిగాన్స్ అనుకున్నారు. 2000 సంవత్సరంలో రూవ్‌కున్ బృందం ఇంకో మైక్రో ఆర్.ఎన్.ఏ (లెట్ 7)ను కూడా కనుగొన్నది. అది జంతు ప్రపంచంలో విస్తతంగా వ్యాపించి ఉన్నట్టు కూడా కనుగొన్నారు. ఇప్పుడిక శాస్త్ర ప్రపంచంలో ఇది పెద్ద ఆసక్తిని రేకెత్తించింది. ఆ తర్వాతి సంవత్సరాలలో, వివిధ జంతు జాతుల్లో వందలాది రకాల మైక్రో ఆర్.ఎన్.ఏ లను కనుగొన్నారు.
మొదట్లో ఈ మైక్రో ఆర్.ఎన్.ఏ లు ప్రోటీన్ ఉత్పత్తి ప్రక్రియలను మాత్రమే నిరోధిస్తాయని, మెసెంజర్ ఆర్.ఎన్.ఏ ల స్థిరత్వానికి, పెద్దగా అడ్డంకి ఉండదని అనుకున్నారు. కానీ 2005లో, అమీ పాస్కినెల్లి ప్రయోగశాల ద్వారా ప్రచురింపబడిన ఒక ముఖ్య పరిశోధనా పత్రంలో కొన్ని మైక్రో ఆర్‌ఎన్‌ఏలు (లెట్ 7, లిన్ 4) మెసెంజర్ ఆర్.ఎన్.ఏ లను, త్వరితంగా బలహీన పరుస్తాయని వెల్లడయింది. ఈ విధంగా మైక్రో ఆర్.ఎన్.ఏ ల రెండు విధాలైన జన్యు వ్యక్తీకరణల (నిరోధించడం, బలహీన పరచడం), ద్వారా జీవకణంలో ప్రోటీన్ల ఉత్పత్తిని గట్టిగా నియంత్రిస్తాయని అర్థమైంది.
మైక్రో ఆర్‌ఎన్‌ఏలు జీవ సామ్రాజ్యంలోని అన్ని జంతువులలో, అన్ని వృక్షాలలో, వైరస్‌లలో ఉంటాయి. అవి వృక్షాల పెరుగుదలను, ఒత్తిళ్లకు అవి చూపే స్పందనలను నియంత్రిస్తూ ఉంటాయి. ఏబ్‌స్టన్ బార్ వైరస్ లాంటి వైరస్‌లు, రోగ నిరోధక శక్తిని వమ్ము చేయడానికి, జన్యు వ్యక్తీకరణల ప్రక్రియలనే వాడుకుంటాయి.
జంతువుల అభివృద్ధి క్రమాలను అధ్యయనం చేసే ఒక జీవశాస్త్ర విభాగం ఉంది. ఇందులో మైక్రో ఆర్.ఎన్.ఏ లు ఏ విధంగా నియంత్రిస్తాయి? అనే అంశానికంటే, నియంత్రణ ప్రక్రియలు ఏ సమయాలలో ముందుకు వస్తాయి? అనే ప్రశ్న కీలకం. ఒక రకం ఏలిక పాము (సి ఎలిగాన్స్)లో, పెరుగుదల సమయంలో ఈ మైక్రో ఆర్.ఎన్.ఏ లు పనిచేస్తాయి. క్షీరదాలలో కండరాలు రూపొందే సమయంలో కొన్ని రకాల మైక్రో ఆర్.ఎన్.ఏ లు (ఎమ్.ఐ.ఆర్ 1, ఎమ్.ఐ.ఆర్ 133), నాడీ కణజాలాలు ఏర్పడే సమయంలో మరికొన్ని మైక్రో ఆర్.ఎన్.ఏ లు (ఎమ్.ఐ.ఆర్ 9) పనిచేస్తాయి. తల్లి పాలలో కూడా ఈ మైక్రో ఆర్.ఎన్.ఏ లు ఉన్నాయి. ఎదుగుదల మార్పులలోనే కాకుండా, జీవ ప్రక్రియలలో కూడా మైక్రో ఆర్.ఎన్.ఏ ల పాత్ర ఉంది. జీవ కణాలకు దెబ్బ తగిలితే వచ్చే ఇన్ఫర్మేషన్ అనే ప్రక్రియలో, స్పందనలలో, వాటి నియంత్రణలో మైక్రో ఆర్.ఎన్.ఏ లు (ఎమ్.ఐ.ఆర్ 146ఎ, ఎమ్.ఐ.ఆర్ 155) ఉన్నాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించే మైక్రో ఆర్.ఎన్.ఏ (ఎమ్.ఐ.ఆర్ 33) మరొకటి ఉంది. అంటే దీని అర్థం ఏమిటంటే, మైక్రో ఆర్.ఎన్.ఏ లు సరిగా పని చేయకపోయినా, అసలు లోపించినా జీవుల ఎదుగుదలలో అనేక అపసవ్యతలు ఏర్పడతాయి. ఆటో ఇమ్యూన్ జబ్బులు, మెటబాలిక్ సిండ్రోమ్, గుండె జబ్బులకు కారణం కూడా ఇందులో ఉంది.
ప్రయోజనాలు – అవకాశాలు
ఈ పరిశోధనలన్నీ వైద్య, ఔషధ రంగాలలో మెరుగైన వైద్యాలపై ఎన్నో ఆశలు రేపుతున్నాయి. క్యాన్సరు, గుండె జబ్బులు, నరాల జబ్బులకు కొత్త వైద్యాలు ఆవిష్కృతం కానున్నాయి. జబ్బులకు కారణమయ్యే మైక్రో ఆర్.ఎన్.ఏ లను స్తంభింపచేయడం, మంచి మైక్రో ఆర్.ఎన్.ఏ లను స్థిరపరచడం లాంటి వ్యూహాలతో ఈ వైద్యాలు ఉండనున్నాయి. ఉదాహరణకు క్యాన్సర్ వైద్యంలో లెట్ 7 అనే మైక్రో ఆర్.ఎన్.ఏ నకలును ప్రవేశ పెడితే, అవి క్యాన్సర్ కణాలను అణిచివేస్తాయి. అలాగే కొన్ని క్యాన్సర్ ప్రేరేపక మైక్రో ఆర్.ఎన్.ఏ (ఎమ్.ఐ.ఆర్ 21) లను అడ్డుకుంటే కణితులు పెరగకుండా నిరోధించవచ్చు. కొన్ని మైక్రో ఆర్.ఎన్.ఏ లకు గుండె కండరాలను (ఎమ్.ఐ.ఆర్ 208ఎ, ఎమ్.ఐ.ఆర్1) నియంత్రించే శక్తి, తద్వారా హార్ట్ ఫెయిల్యూర్‌ను నియంత్రించే శక్తి ఉంటాయి. నాడులను చైతన్యవంతం చేసే కొన్ని మైక్రో ఆర్.ఎన్.ఏ లు, నాడులను చైతన్యవంతం చేసి, నాడీ వ్యవస్థ జబ్బులకు పరిష్కారం చూపగలుగుతాయి.
వైద్య పరీక్షలలో కూడా మైక్రో ఆర్.ఎన్.ఏ పాత్రపై పరిశోధనలు జరుగుతున్నాయి. రక్తం, మూత్రం లాంటి శరీర ద్రవాలలో ఉన్న మైక్రో ఆర్.ఎన్.ఏ లు, స్థిరత్వంతో ఉంటాయి. కాబట్టి తొలి దశలోనే జబ్బులను కనుక్కోవడానికి, ఉపయోగపడవచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్ (ఎమ్.ఐ.ఆర్ 141), లివర్‌లో జబ్బులు (ఎమ్.ఐ.ఆర్121) కనుక్కోవడానికి ఆ యా మైక్రో ఆర్.ఎన్.ఏ లలో వచ్చే మార్పులు ఉపయోగపడవచ్చు.
వివక్షల పట్ల ఆందోళన
మైక్రో ఆర్.ఎన్.ఏ పరిశోధనలలో, తగు పాత్ర వహించిన మరి కొందరు పరిశోధకులను నోబెల్ కమిటీ విస్మరించిందన వచ్చు. డేవిడ్ బౌల్ కొంబ్ పేరును నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ ప్రస్తావించాడు. వృక్షాలలో ఇటువంటి జన్యు పరిణామాలను (జీన్ సైలెన్సింగ్) మొట్టమొదట ప్రకటించింది బౌల్ కొంబ్ ప్రయోగశాలే. అంబ్రోస్, రూవ్‌కున్ లతో కలసి 2008 లస్కర్ అవార్డును బౌల్ కొంబ్ పంచుకున్నాడన్న విషయం గమనించదగ్గది. అమీ పాస్కినెల్లి 2005లో ప్రచురించిన పత్రం మైక్రో ఆర్.ఎన్.ఏ ల పాత్ర గురించిన అవగాహననే మార్చివేసింది. నోబెల్ అవార్డు ప్రకటనలో 1993లో ఆంబ్రోస్ రాసిన ఒక సైంటిఫిక్ పేపర్‌ను ఉటంకించారు. ఆ పేపర్ రచయితలలో ఉన్న మొదటి పేరు రోసాలిండ్ లీ. ఆమె అంబ్రోస్ భార్య కూడా. వీరందరూ, మైక్రో ఆర్.ఎన్.ఏ పరిశోధనలలో విడదీయరాని భాగస్వాములు. కానీ వీరినెవరినీ నోబెల్ కమిటీ గుర్తించలేదు.
చరిత్రలో మహిళా శాస్త్రవేత్తల కృషిని చాలా కాలంగా చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. ఉదాహరణకు డి.ఎన్.ఏ పరిశోధనలకు 1962లో వచ్చిన నోబెల్ బహుమతిలో రోసాలిన్ ఫ్రాంక్లిన్ పేరు లేదు. అలాగే వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి 1993లో జన్యు పరిశోధనలు (స్ప్లిట్ జీన్) చేసిన రిచర్డ్ రాబర్ట్స్, ఫిలిప్ షార్ప్ లకు ఇచ్చారు. కానీ వీరితో పాటుగా, కీలకమైన కృషి చేసిన లూయిస్ చౌ, సారా లావి అనే స్వతంత్ర శాస్త్రవేత్తలకు రావాల్సిన గుర్తింపు రాలేదు.
ఈ విధంగా మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులలో తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. 1901-2024 మధ్య 13 మంది మహిళా శాస్త్రవేత్తలకు మాత్రమే వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. విజ్ఞాన శాస్త్రాలలో మొత్తం 653 మందికి నోబెల్ బహుమతి వస్తే, అందులో మహిళలు 65 మంది మాత్రమే. శ్వేత జాతి పురుషుల పట్ల వ్యవస్థాపరంగానే ఉన్న మొగ్గు ఇందులో కనపడుతుంది. మరీ ముఖ్యంగా స్టెమ్ రంగాలలో ఇది స్పష్టం. ఈ అసమానతలను నోబెల్ కమిటీ కూడా పెంచి పోషిస్తున్నట్లు అవుతున్నది. అయితే ఈ స్పృహ పెరుగుతోంది. సైన్స్‌లో జెండర్, జాతి వివక్షలు వున్నాయని అందరూ గమనించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది
( స్వేచ్ఛానువాదం )
– ఎస్. కృష్ణస్వామి