రాష్ట్రంలో సుమారు 13,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో పారిశుధ్యం, మంచినీరు, విద్యుత్, బిల్ కలెక్టర్ తదితర విధులు నిర్వహించేవారు 28 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ‘స్వచ్ఛ భారత్’ పథకం పేరుతో తొలుత 32 వేల మందిని నెలకు రూ.6000 వేతనం కింద నియమించారు. ప్రస్తుతం వీరి సంఖ్య సగానికి తగ్గిపోయింది. వీరుకాక మరో 700 మంది ఎన్‌ఎంఆర్ కార్మికులు పంచాయతీలలో ప్రజలకు సేవలందిస్తున్నారు.
నెలల తరబడి జీతాలు పెండింగ్
పంచాయతీ కార్మికులందరూ ఒకే విధమైన చాకిరి చేస్తున్నారు. కానీ వీరికి జీతాలు మాత్రం ఒకే రీతిగా చెల్లించడంలేదు. నెలకు రూ.5 వేల నుండి రూ.12 వేలు చెల్లిస్తున్నారు. 12 వేల రూపాయలు పొందేవారు నూటికి ముగ్గురు నలుగురు కూడా ఉండరు. అత్యధిక మందికి రూ.7 వేల నుండి రూ.9 వేల మధ్య చెల్లిస్తున్నారు. ఈ జీతాలు కూడా ప్రతి నెలా చెల్లించరు. 4 నుండి 18 నెలలు బకాయిలు పెడుతున్నారు. జీతాలు సకాలంలో రాక, కొత్త అప్పులు పుట్టక… కిరాణా షాపు యజమానుల ఒత్తిళ్లు, వడ్డీ వ్యాపారుల వేధింపులతో పంచాయతీ కార్మికులు అవస్థలు పడుతున్నారు. బకాయి జీతాలు అడిగితే ”మేము ఇచ్చినప్పుడు తీసుకో”, ”అట్లా ఇష్టమైతే పని చెయ్యి. లేకపోతే మానుకో” అంటూ బెదిరింపులు నిత్యకృత్యం.
1999లో జారీ చేసిన జీవో నేటికీ అతీగతీ లేదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ కార్మికుల పోరాట ఫలితంగా 1999లో 551 జీవోను నాటి ప్రభుత్వం జారీ చేసింది. అందులో పంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డులు, కనీస వేతనాలు, ఇపిఎఫ్, ఇఎస్‌ఐ తోపాటు ప్రతి ఏటా టెండర్ల ద్వారా నియామకాలు జరపాలని వుంది. వీటితో కేవలం టెండర్ల విధానం మాత్రం ఆ నాటి నుండి పక్కాగా అమలు చేస్తున్నారు. మిగిలిన ఏ ఒక్కటీ అమలు చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2017, 2018 సంవత్సరాలలో జరిగిన పోరాటాల ఫలితంగా 132 జీవో జారీ చేశారు. దీనికీ అదే గతి పట్టించారు. గ్రీన్ అంబాసిడర్లకు 2020 జనవరి నుండి నెలకు రూ.10,000 చెల్లిస్తామంటూ 2019 అక్టోబర్‌లో 680 జీవో జారీ చేశారు. ప్రస్తుతం ఆ జీవో వెబ్‌సైట్‌లో కనిపించడంలేదు. ఎన్‌ఎంఆర్ లకు టైంస్కేల్, జీతం చెల్లిస్తామంటూ 142 జీవో జారీచేశారు. కానీ ప్రభుత్వం జీతాలు చెల్లించకుండా పంచాయతీల మీదకు నెట్టేసింది.
గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా పంచాయతీ కార్మికులను ‘మల్టీ పర్పస్ వర్కర్లు’గా కొత్త నామకరణం అయితే చేసింది. ప్రతి కార్మికుడికి నెలకు రూ.10,000 తక్కువ కాకుండా జీతం చెల్లించాలని 2019 ఫిబ్రవరి 13న జీవో నెం.57 జారీ చేసింది. గత వైసిపి ప్రభుత్వం పంచాయతీ కార్మికుల జీతభత్యాల గురించి పట్టించుకోలేదు. కార్మికుల జీతాలు పెంచాలని, జీవోలు అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసనలు నిర్వహిస్తే అక్రమ అరెస్టులు, కేసులు బనాయించి నిరంకుశంగా వ్యవహరించింది.
కోర్టు తీర్పులు బేఖాతరు
ఎవరు తక్కువ వేతనాలకు టెండర్ వేస్తే వారికి పని దొరకడం వల్ల వేతనాలు పెరగకపోగా నానాటికీ దిగజారి పోయి కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా దివాళా తీయడం, కార్మికుల మధ్య పోటీ పెట్టి అధికార యంత్రాంగం, దళారీలు కార్మికులను దోచుకు తినడంతో, ఉమ్మడి చిత్తూరు జిల్లా యూనియన్ నాయకత్వం 2015లో హైకోర్టును ఆశ్రయించింది. ”గతం నుండి విధులు నిర్వహిస్తున్న వారికి కొత్తగా టెండర్లు అవసరం లేదు. విధుల్లో కొనసాగించాలి. అంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీటి అమలుకు రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులను బాధ్యులుగా చేశారు.
అయినా హైకోర్టు తీర్పును అధికార యంత్రాంగం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 2023లో కంటెమ్ట్ ఆఫ్ కోర్ట్ ద్వారా మరలా కేసు వేస్తే హైకోర్టు పాత ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పింది. అయినా నేటికీ అమలుకు నోచుకోలేదు.
కోతలే-చేతల్లేవు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తోంది. దేశంలో, రాష్ట్రంలో పాలకులు మారుతున్నారు కానీ పంచాయతీ కార్మికుల జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వున్నాయి. తాము అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికులను అందలమెక్కిస్తామని వాగ్ధానాలు కురిపించడం, తీరా గద్దెనెక్కాక మొండి చెయ్యి చూపడం రివాజుగా మారింది. పంచాయతీ కార్మికుల జీతాలు, పి.ఎఫ్, ఇఎస్‌ఐ గురించి అడిగినప్పుడు పాలకవర్గాలు, అధికారులు పంచాయతీ కార్మికులకు ఇవన్నీ ఎట్లా అమలవుతాయి? ”పంచాయతీల దగ్గర నిధులెక్కడున్నాయి”? అంటూ ఎదురు దాడి చేయటం పరిపాటిగా మారింది. గ్రామ పంచాయతీ కార్మికుల్లో చదువు తక్కువుగా ఉండటం, రాజ్యాంగ హక్కులను అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం పాలక వర్గాలకు అనుకూలంగా మారడం, పంచాయతీలపై ఆధిపత్య కులాలవారి పెత్తనం కొనసాగడంతోపాటు, కార్మికులలో అత్యధికులు ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాలకు చెందిన పేదవారు కావడం వల్ల వీరు తిండికి కూడా గతి లేక పస్తులతో కాలం గడపాల్సి వస్తున్నది.
ప్రతి ఐదేళ్ళకోసారి ఎన్నికలు జరిగి పాలకులు మారినప్పుడల్లా వందలాది మంది గ్రామ పంచాయతీ కార్మికులను అక్రమంగా ఉద్యోగాల నుండి తొలగించి కార్మికుల కుటుంబాలకు రోడ్డున పడేస్తున్నారు. అక్రమంగా తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టులు ఉత్తర్వులిచ్చినా వాటిని కూడా బుట్ట దాఖలు చేస్తున్నారు.
‘స్వచ్ఛ’ నినాదాలు ఎవరి కోసం?
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అంటే, రాష్ట్రంలో నిన్నటిదాకా ఉన్న వైసిపి, నేడు టిడిపి కూటమి ప్రభుత్వాలు ”స్వచ్ఛాంధ్ర” నినాదాన్ని మోత మోగిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కల్యాణ్ ”పచ్చదనం పరిశుభ్రత” గురించి గొప్పలు చెప్తున్నారు కానీ, వీటన్నింటికీ మూలమైన పంచాయతీ కార్మికుల వెతల గురించి పట్టించుకోవడం లేదు. గత ఏడు నెలలుగా మంత్రిగారు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదు. గత పదేళ్ళుగా జీతాలు పెరగలేదు. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ చార్జీల భారాలతో పంచాయతీ కార్మికుల జీవితాలు కునారిల్లిపోతున్నాయి.
కూటమి ప్రభుత్వమైనా ఆలకిస్తుందా?
రాష్ట్రంలో 9 నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మా కష్టాలు తీర్చకపోతుందా? అని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. శాసన సభలో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రన్న ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక్క పైసా కూడా విదల్చలేదు.
ఈ నేపథ్యంలో తమ శ్రమను గుర్తించాలని, పోరాడి సాధించుకున్న 551, 132, 142, 680 జీవోలను అమలు చేయాలని, జీతాలు పెంచాలని, ప్రతి నెలా జీతాలు చెల్లించాలని, అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఎ.పి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో 2025 మార్చి 17న విజయవాడలో మహా ధర్నాను నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వీరి గురించి స్పందిస్తాయో లేదో వేచి చూడాలి.
వ్యాసకర్త : కె. ఉమామహేశ్వరరావు,
ఎ.పి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు (సిఐటియు)