ఇనుప ముళ్ల కంచెకు
అటు, ఇటు నిస్త్రాణ విస్తీర్ణ
వ్యవసాయ క్షేత్రాలం మాటాడుకుంటే!
మానవీయ సిరలూ, ధమనులు మావి
మీ పహారా పాదాలకు తెలియకుండా
ప్రవహించుకుంటే!
మాకు సంబంధం లేని
మందు పాతరలు మీ
మనసుల్లో ఉన్నాయి.
లోయల్ని తొక్కేసి
శిఖరాలు ఎక్కేసే
లోహ పతాకాలు మీరే!
వ్యూహ కపోతాలూ మీరే!
యుద్ధం గురించి మేం
మాట్లాడుకోం..
అది మీ వాణిజ్యం.
మీ రాజపూజ్యం కూడా!
మీరు పెత్తనాల గురించి
పెద్దరిక యుద్ధాలు చేస్తున్నారు.
దయచేసి, ధ్వంసమైన క్షేత్రాలలో
మొలకెత్తే కొత్త తరం
విత్తనాల కోసం మమ్మల్ని
మాటాడుకునే వెసులుబాటు ఇవ్వండి.
మీ కవాతులకూ..కాల్పులకూ
జీతాలుంటారు!
భౌగోళికంగా విడిపోయినా
భూగోళమంత హృదయం మాది.
బతుకు పునాదులు..సమాధులు
బంకర్లలో ఉండవు.
మీరు పాతిన కాంక్రీటు కంచెలకు
అటు, ఇటు గాయపడుతూ
పండిన పంటల లోతైన నిండు గుండెల్లోనే!
శిధిలాల్లో విజయాలను చూసేవాళ్లని..మృత
దేహపేటికలు మోస్తూ,
మృదు దేశ భక్తి
పాటలు పాడేవారినీ..
చూసీ..చూసీ..విరక్తులయిపోయాం.
జయాపజయాల నెత్తుటి తెర
జారిన తరువాత,
మీరు మీ వైభవ శిబిరాల్లో విలసిస్తారు.
అన్ని యుద్ధ సంధ్యలనూ
అనుభవించే మమ్మల్ని
మీరు నిర్ణయించిన రాత్రి ముహూర్తాలకు ముందు,
మనసారా మాట్లాడి, ఏడ్చే
అవకాశం ఇవ్వండి.
మీరన్న మాటకు కట్టుబడి
యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడం.
శాంతి, వేదన, ఓదార్పు, కన్నీళ్ల
కౌగిళ్లు యుద్ధ నేరాలు కాదనే
నమ్మకంతోనే ఈ విన్నపం.
– నల్లి ధర్మారావు,
సెల్ : 76609 67313