నేడు బ్లాక్ ఫ్రైడే. 1992 డిసెంబర్ 6 బిజెపి ప్రేరేపిత కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అదొక చీకటిరోజు. అందుకే దాన్ని బ్లాక్ ఫ్రైడే అన్నారు. ఆ దురంతాన్ని ప్రజల దృష్టి నుండి తొలగించడానికా అన్నట్టు ఇప్పుడు అనేక బ్లాక్ ఫ్రైడేలు పుట్టుకొచ్చాయి. తాను రాజకీయంగా ఎదగడానికి నాడు బ్రాబీ మసీదును కేంద్రంగా చేసుకొని విద్వేష ప్రచారం చేసింది. మసీదును కూల్చింది. ఆ హింసాకాండను సోపానంగా చేసుకొని బిజెపి కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారం దక్కించుకొంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అధికార బిజెపికి ఎదురుగాలి వీచింది. దాంతో రానున్న శాసన సభ ఎన్నికల్లో గెలవడానికి ఆ పార్టీ మళ్లీ మత విద్వేష పూరిత వాతావరణం సృష్టించడానికి పూనుకొంది. ఆ ప్రయత్నంలో భాగంగా సంభాల్ పట్టణంలోని మసీదుపై వివాదం లేవనెత్తింది. మొఘల్ పాలనలో 16వ శతాబ్దిలో సంభాల్ పట్టణంలోని కల్కి భగవాన్ గుడిని తొలగించి మసీదును కట్టారంటూ కొందరు స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు.
ఆ మసీదును సర్వే చేయాల్సిందిగా కోర్టు ఒక అడ్వకేట్‌ను కమిషనర్‌గా నియమించింది. ఆ అడ్వకేట్ నవంబర్ 19న మొదటి సారి సర్వే కోసం అక్కడికి వెళ్లారు. రెండవసారి నవంబర్ 24 అక్కడికి వెళ్లినప్పుడు ముస్లింలు అభ్యంతరం చెప్పారు. ఆ సందర్భగా జరిగిన గొడవ పోలీసుల కాల్పుల వరకు వెళ్లింది. కాల్పుల్లో నల్గురు చనిపోయారు. 19 మంది గాయపడ్డారు. ఆ ఘటనపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అవతలి పక్షం వాదన వినకుండా కింది కోర్టు ఏకపక్ష నిర్ణయం చేసినట్లు సుప్రీం కోర్టు గమనించింది. మసీదు కమిటీ తాను చెప్పదల్చుకొన్న విషయాలను అలహాబాదు హైకోర్టు ముందు చెప్పుకోవాలని, ఆలోగా ఎలాంటి తదుపరి చర్యకు పూనుకోరాదని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచి ట్రయల్ కోర్టును ఆదేశించింది. కేసును తదుపరి విచారణ కోసం 1925 జనవరి 6కు వాయిదా వేసింది.
సంభాల్ లోని బాధితులను కలుసుకోవడానికి లోక్‌సభ లోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ ఢిల్లీ నుండి బయల్దేరగా వారిని యుపి పోలీసులు మధ్యలోనే ఆపేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుంది కనుక వారిని అనుమతించడం లేదని చెప్పారు. కొన్నేళ్ల క్రితం హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన హత్యాచారం సందర్భంగా కూడా యుపి పోలీసులు అదే పని చేశారు. ఉనా ఉదంతం కూడా అలాంటిదే. యోగి ప్రభుత్వానికి ఇదో అలవాటుగా మారింది.
మన రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ డిసెంబర్ 6 నే మరణించారు. సరిగ్గా అదే తేదీన రాజ్యాంగంలోని లౌకిక విలువలను మంటగలుపుతూ బిజెపి అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేసింది. మసీదు కూల్చివేతకు ముందు పి.వి ప్రభుత్వం జరిపిన జాతీయ సమగ్రతా మండలి (నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్-ఎన్‌ఐసి) సమావేశంలో బిజెపి నాయకులు అటల్ బిహారి వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ, తాము బాబ్రీ మసీదును కూల్చబోమని దేశానికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను కూడా వమ్ముచేశారు. బయటికి కన్పించే ఏనుగు దంతాలు వేరు, ఆహారం నమిలే దంతాలు వేరు (హాథీ కా దాంత్ దిఖానే కా అలగ్, ఖానేకా అలగ్) అన్నట్లు బిజెపికి కడుపులో ఒక ఉద్దేశం ఉంటుంది. బయటికి మరొకటి చెప్తుంది. బిజెపికి దాని మూల విరాట్ ఆర్‌ఎస్‌ఎస్‌కు అది వెన్నతో పెట్టిన విద్య. చిత్తశుద్ధిగల రాజకీయ పరిశీలకులెవరూ బిజెపి మాటలను నమ్మలేరు. ఎన్‌ఐసి సమావేశాన్ని ఏర్పాటు చేసిన పివి నరసింహారావు చిత్తశుద్ధి కూడా ఏ పాటిదో అనంతర పరిణామాలు తేటతెల్లం చేశాయి. పి.వి కాంగ్రెస్ నాయకుడిగా ప్రధాని పీఠాన్ని అధిష్టించినా ఆయన మత రాజకీయాలకు ఊతమిచ్చారు. పివి దగ్గర కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి పివిఆర్ కె.ప్రసాద్ తన ఆత్మకథలో ఆ నాటి సంగతులను నెమరేస్తూ పి.వి ఆనాడు బాబ్రీ స్థలంలో రాముని గుడి రావాలి. ఆ కీర్తి కాంగ్రెస్‌కే దక్కాలి అన్న భావనతో ఉండేవారని చెప్పారు. పి.వి అపర చాణక్యం మత శక్తులకే ఊతమిచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత తదనంతరం దేశంలో ప్రజ్వరిల్లిన హింసాకాండను ప్రాణ, ఆస్తి నష్టాలను కూడా పివి నివారించలేక పోయారు. ఆ సమయంలో దేశమంతటా రెచ్చగొట్టిన మత విద్వేష వాతావరణం వల్ల బిజెపి బలపడింది. కాంగ్రెస్ రెంటికి చెడ్డ రేవడైంది. లౌకిక విలువలపై కాంగ్రెస్‌లో ఒకనాటి చిత్తశుద్ధి లోపమే దానికి ప్రాణాంతకమైంది.
ఈ ఏడాది నవంబర్ 26న భారత రాజ్యాంగ 75వ దినోత్సవం సందర్భంగా బిజెపి నాయకులు చేసిన ప్రసంగాలకు వారి అంతరంగానికి సంబంధమే లేదు. భారత రాజ్యాంగాన్ని, దాని విలువలను వేనోళ్ల పొగిడారు. రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ ప్రవేశ పెట్టిన రాజ్యాంగాన్ని ప్రజల ఎన్నుకొన్న భారత రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26 న ఆమోదించింది. కాగా మూడు రోజుల్లోనే అంటే నవంబర్ 30న తన అధికార పత్రిక అర్గనైజర్ ఆర్‌ఎస్‌ఎస్‌లో రాజ్యాంగం పట్ల తీవ్ర అభ్యంతరం చెప్తూ ‘మనుస్మృతి’ మన రాజ్యాంగం కావాలని నిస్సిగ్గుగా చెప్పింది. ఆ నాటికి రెండేళ్ల ముందే మహద్ చెరువు సత్యాగ్రహం సందర్భంగా అంబేద్కర్ మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టారు. వర్ణాశ్రమ ధర్మాన్ని, స్త్రీల అణిచివేతను సమర్థించే ధర్మ గ్రంథం మనుస్మృతి. అది చట్టం కూడా అందుకే దాన్ని స్మృతి అన్నారు. అశాస్త్రీయ నమ్మకాలకు అది ఆలవాలం. శాస్త్ర విజ్ఞానం వడివడిగా అడుగు మందుకేస్తున్న దశలోను ఆర్‌ఎస్‌ఎస్ మనుస్మృతే మన రాజ్యాంగం కావాలంది. ఒక నేరానికి ఒకే శిక్షను రాజ్యాంగం నిర్ధారించింది. నేరం ఒకటే అయినా వర్ణం ప్రకారం శిక్ష వేయాలని చెప్తుంది మనుస్మృతి. నేరం ఒకటే అయినా బ్రాహ్మణుడికి తక్కువ శిక్ష వేయాలి. శూద్రునికి కఠినమైన శిక్ష వేయమంటుంది. మనుస్మృతి స్తీకి స్వాతంత్య్రం ఉండరాదనీ చాటుతుంది. అలాంటి దర్మార్గపు మనుస్మృతికి వ్యతిరేకంగా బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏనాడూ పల్లెత్తు మాట కూడా అనలేదు.
మన రాజ్యాంగం ప్రతిపాదించిన విలువల్లో లౌకికతత్వం, సమానత్వం అతి ముఖ్యమైనవి. వీటి పట్ల బిజెపికి తీవ్ర అభ్యంతరాలున్నాయి. రాజ్యాంగ ప్రవేశికలో సమానత్వం, లౌకికతత్వం అన్న మాటలను ప్రధాని ఇందిరా గాంధీ తన రాజకీయ అవసరాల కోసం చేర్చారు కనుక ఆ మాటలను తొలగించాలని బిజెపి నాయకులు మొదటి నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం భారత సుప్రీం కోర్టు ఆ వివాదంపై బిజెపికి దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. రాజ్యాంగ ప్రవేశికలోని ”లౌకిక” అన్న పదానికి అర్థం అన్ని మతాలను సమానంగా గౌరవించడం కనుక ఆ పదాన్ని ప్రవేశిక నుండి తొలగించనవసరం లేదని కరాఖండిగా చెప్పేసింది. అలాగే సోషలిస్టు అన్న పదాన్ని కూడా తొలగించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సోషలిస్టు అన్న పదానికి అర్థం సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లోని అసమానతలను తొలగించడం కనుక ఆ పదాన్ని కూడా ప్రవేశిక నుండి తొలగించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజరు కుమార్‌తో కూడిన బెంచ్ తేల్చిచెప్పింది. ఈ రెండు పదాలను తొలగించాలంటూ న్యాయస్థానం ఆదేశించాలని పట్టుబట్టిన వారిలో బిజెపి ప్రముఖ నాయకుడు సుబ్రమణ్య స్వామి కూడా ఉన్నారు. ‘సెక్యులర్’ ‘సోషలిస్టు’ అన్న పదాలను రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన 44 ఏళ్ల తర్వాత వాటిని తొలగించాలంటూ కోర్టుకు రావడంలో పిటిషనర్ల ఉద్దేశాలు ఏమిటో అర్థమవుతున్నాయని కూడా బెంచ్ ఘాటుగా వ్యాఖ్యానించింది.
అటల్ బిహరీ వాజ్‌పేయి ప్రభుత్వం 1998లో రాజ్యాంగాన్ని సమీక్షించేందుకు వెంకట చెల్లయ్య కమిషన్‌ను వేసింది. తీవ్ర వ్యతిరేకత రాగా వాజ్‌పేయి తన ప్రయత్నం నుండి వెనకంజ వేయక తప్పలేదు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రకారం భారత రాజ్యాంగం పాశ్చాత్య విలువలపై ఆధారపడి రూపొందింది. బ్రిటిష్ ప్రభుత్వం 1935లో చేసిన చట్టంపై ఆధారపడి మన రాజ్యాంగాన్ని రాశారని, అందులో భారతీయ విలువలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ చెప్తుంది. మూడేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరమే రాజ్యాంగ రచనా సంఘం రాజ్యాంగాన్ని ఆమోదించిన విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు గుర్తించవు. రాజ్యాంగ సభలోని సభ్యులంతా ప్రజల నుండి ఎన్నికై వచ్చిన వారే. అందరూ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వారే. ఆ విలువలే రాజ్యాంగంలో ప్రతిబింబించాయి. ఆ విలువల్లో ప్రధానమైంది లౌకికవాదం.
సావర్కర్ సిద్ధాంతాన్ని అనుసరించి భారతదేశం హిందువులది మాత్రమే. ఇక్కడ హైందవేతరులు ఉండాల్సి వస్తే వారు రెండవ తరగతి పౌరులుగా జీవించాలి. లేదా భారతదేశం వదలి వెళ్లాలి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు కూడా అదే వాదనను తలకెత్తున్నాయి. ఎన్‌ఆర్‌సి, సిఏఏ మొదలైన చట్టాలు, అస్సాంలో నడిపిన శిబిరాలు కూడా రెండు జాతుల సిద్ధాంతం యొక్క పర్యవసానాలే.
మెజారిటీ ప్రజల శ్రమను దోచుకొని వారిపై పెత్తనం చేయడానికి మనుస్మృతి పనికొచ్చింది. ఇస్లాం, క్రైస్తవం మనుస్మృతికి లోబడి ఉండవు కనుక అవి విదేశీ మతాలన్న సాకుతో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు ఆ మతాల్లోని ప్రజలందరి పట్ల శత్రు భావంతో వ్యవహరిస్తాయి. బౌద్ధం మన దేశంలో పుట్టిందే అయినా దాన్ని కూడా మనువాదులు వ్యతిరేకిస్తారు. అందుకు కారణం మనుస్మృతి ప్రవచించే వర్ణ వ్యవస్థను, బౌద్ధం నిరాకరిస్తుంది కనుక.
మనుస్మృతి మహిళలను పురుషులతో సమానంగా చూడదు. మహిళలపై అనేక ఆంక్షలు విధించింది. భారత రాజ్యాంగం దానికి భిన్నం. అది స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పిస్తోంది. స్త్రీలు ఇంటికి పరిమితం కావాలని చెప్పదు. వారికి ఆస్తి హక్కుపై అవకాశం కల్పించింది. పౌరులందరికీ ఒకే విలువగల ఓటు హక్కును, మత స్వేచ్ఛను కల్పించింది. బారత పౌరుడు ఏ మతాన్నయినా ఆచరించవచ్చు. ఏ మతాన్ని ఆచరించకుండా కూడా భారత చట్టాలకు లోబడి స్వేచ్ఛగా బతకొచ్చు. భగత్‌సింగ్ చెప్పిన విశ్వమానవ సౌభ్రాతృత్వ విలువలు బిజెపికి గిట్టవు. దానిది సంకుచిత దృష్టి. ఆ దృష్టితోనే అది బాబ్రీ మసీదును వివాదగ్రస్తం చేసి 1992 డిసెంబర్ 6న కూల్చేసింది. ఇప్పుడు సంభాల్ మసీదును వివాదాస్పదం చేసి రక్తం పారించింది. రేపు జ్ఞానవాపి మసీదు వివాదాన్ని మందుకు తోస్తుంది. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని ఆ కలుషిత వాతావరణంలో అధికార పీఠాలను అధిష్టించడమే దాని లక్ష్యం. ఈ స్థితిలో మత విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల ను చేయడానికి పూనుకోవడమే మనం బాబా సాహెబ్‌కు అర్పించగల అసలు నివాళి.
వ్యాసకర్త – ఎస్. వినయకుమార్ ‘ప్రజాశక్తి’ పూర్వ సంపాదకులు, సెల్ : 9989716311