ప్రపంచాన్ని వణికించిన అణుబాంబుదాడి జరిగి 79 సంవత్సరాలు గడిచాయి. 1945 ఆగస్టు ఆరున హిరోషిమా, తొమ్మిదిన నాగసాకిలలో చోటుచేసుకున్న అణువిస్పోటన ప్రభావం మానవాళిని ఇంకా వెంటాడుతూనే ఉంది. పోయిన ప్రాణాలకు, తెగిపడిన శరీర అవయవాలకు లెక్కేలేదు. ప్రాణాలతో బయటపడిన వారిని అణుధార్మిక శక్తి జీవఛ్చవాలుగా మార్చివేసింది. ఇప్పుడు పుడుతున్న చిన్నారులనుసైతం ఆ రక్కసి వెంటాడుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ బాంబు దాడితో ప్రపంచాన్ని అణుప్రమాదం ముప్పు ముందుకు సామ్రాజ్యవాద అమెరికా తోసింది. అప్పుడు ప్రారంభమైన అణ్వాయుధ పోటీ ఇప్పటికీ కొనసాగుతోంది. అణుబాంబు సృష్టించే వినాశనం తెలిసినిప్పటికీ ఆత్మరక్షణ కోసం ఆ బాటనే నడవక తప్పని స్థితి అనేక దేశాలదీ! కొన్నిదేశాలు చెప్పి అణు ప్రయోగాలు చేస్తున్నాయి. మరికొన్ని చెప్పకుండా ఆ పనికానిస్తున్నాయి. అధికారికంగా అణ్వాయుధ దేశాలుగా కొన్ని గుర్తింపు పొందితే, ఆ గుర్తింపు కోసం తహతహలాడుతున్న దేశాలు మరికొన్ని! గుర్తింపు ఉన్నా, లేకపోయినా అ ఆయుధం తమ చెంత ఉంటే చాలనుకునే దేశాలు ఇంకొన్ని..! తన స్వార్ధం కోసం, ప్రపంచ ఆధిపత్యంకోసం మొత్తం భూగోళాన్ని అశాంతిలోకి… ఉద్రిక్తతల్లోకి తోసివేసిన అమెరికా వైఖరిలో ఇప్పటికీ మార్పు లేకపోవడమే ఆందోళనకరం! ఇప్పటికీ అణుకుంపటిని రగిలిస్తూ, యుద్దాలు రెచ్చగొడుతూ, దేశాల మధ్య కుట్రలు చేస్తూ ఆయుధ వ్యాపారాన్ని విచ్చల విడిగా ఆ దేశం చేస్తూనే ఉంది. కళ్లముందు కనపడుతున్న ఇజ్రాయిల్ అమానుష దాడితో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రగిలిస్తున్న ఉద్రిక్తతలే దీనికి నిదర్శనం. ఈ పరిస్థితుల్లో అణ్వాయుధ రహిత ప్రపంచ లక్ష్య సాధన సాధ్యమవుతుంది… ఆ దారిలో ఉన్న ఆటంకాలేవి? 2013వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం హిరోషిమాలో ‘హిరోషిమా రౌండ్ టేబుల్ సమావేశం’ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పరిమితసంఖ్యలో అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణు శాస్త్రవేత్తలు, అణు వ్యూహ నిపుణులు హాజరవుతారు. అణుఆయుధాలను నిర్మూలించడం ద్వారా హిరోషిమా ప్రపంచ శాంతి ప్రణాళికకు మద్దతు ఇవ్వడం ఈ రౌండ్‌టేబుల్ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం. దీనిలో భాగంగా ‘హిరోషిమా వాచ్ -2024’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రస్తుత ప్రపంచంలో చోటుచేసుకుంటున్న అణ్వాయుధ పోటీ గురించి, వివిధ దేశాల వైఖరి గురించి అనేక అంశాలను వివరించింది.
చైనా మార్గం..!
ఎటువంటి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను మొదటగా తాము ప్రయోగించేది లేదని చైనా ప్రకటించింది. తమ దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఎదురైన పరిస్థితుల్లోనూ సాంప్రదాయ ఆయుధాల మీదనే ఆధారపడతామని, తమంతట తాముగా మొట్ట మొదట అణు ఆయుధాలను ప్రయోగించమని ( నో ఫస్ట్ యూజ్) ఆ దేశం స్పష్టం చేసింది. అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి) ప్రకారం అణు ఆయుధ దేశాలుగా అధికారికంగా గుర్తింపు పొందిన ఐదు దేశాల్లో ‘ నో ఫస్ట్ యూజ్’ ప్రకటన చేసింది చైనా ఒక్కటనేనని ‘హిరోషిమా వాచ్ -2024’ లో పేర్కొన్నారు. అమెరికాతో పాటు, ఈ జాబితాలో ఉన్న బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ దేశాలు ఈ తరహా ప్రకటన చేయడానికి నిరాకరిస్తున్నాయి. ‘ అణు యుద్ధం ఎప్పటికీ గెలవదు. ఆ యుద్దాన్ని ఎన్నడూ చేయకూడదు’ అంటూ సంతకాలు చేసిన ఈ దేశాలు ‘నో ఫస్ట్ యూజ్’ ప్రకటన చేయడానికి మాత్రం నిరాకరిస్తుండటం గమనార్హం. తమ మీద దాడి జరిగినప్పుడు ఏ రకంగానైనా తిప్పి కొట్టే హక్కు తమకు ఉంటుందని ఆ దేశాలు చెబుతున్నాయి. చైనా మాత్రం దీనికి భిన్నమైన వైఖరి తీసుకుంది. అటువంటి సందర్భంలోనూ తమంతట తాముగా మొట్టమొదట అణు ఆయుధాలను ప్రయోగించేది లేదని స్పష్టం చేసింది. ఇటీవలే రష్యా అణు ఆయుధాల వినియోగంపై తమ వైఖరిని మార్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ‘అణు వ్యూహాన్ని పున:పరిశీలిస్తాం… ఆ దిశలో చర్యలు చేపడతాం.’ అని రష్యా ప్రకటించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అణు ఆయుధ పోటీకి మూల కారణమైన అమెరికా మాత్రం ఈ దిశలో ‘హిరోషిమా శాంతి ప్రణాళిక’ చేసిన విజ్ఞప్తిని బేఖాతరు చేసింది. అణు ఆయుధ దేశాలన్నీ ఎస్‌పిటిలో భాగమైనా, కాకపోయినా ‘నో ఫస్ట్ యూజ్ ‘ ప్రకటన చేయాలని, అణు ఆయుధాల తయారీని, వాటిపై ఆధారపడటాన్ని నిలిపివేయాలని హిరోషిమా రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. వివిధ దేశాలు తమ అణు వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటుండటం, ‘వ్యూహాత్మకం’ పేరిట ఆణు ఆయుధాల తయారీని కొనసాగిస్తుండటం పట్ల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న నిపుణులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
పెరుగుతున్న ముప్పు!
మరోవైపు అణుముప్పు పెరుగుతోంది. స్టాకహేోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి ఇన్‌స్టిటట్యూట్ (ఎస్‌ఐపిఆర్‌ఐ) తాజా నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అణు ఆయుధాల తయారీ, వాటి మొహరింపు పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణు ఆయధాలు పోగుపడ్డాయి. అణు పోటీకి కారమైన అమెరికా అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 5,044 అణు ఆయుధాలను కలిగి ఉంది. రష్యా వద్ద 5,580 అణు ఆయుధాలు ఉన్నాయి. పాలస్తీనాపై యుద్దం చేస్తున్న ఇజ్రాయిల్ వద్ద 90 అణు ఆయుధాలు ఉన్నాయి. చైనాలో 500, భారతదేశంలో 172, పాకిస్తాన్‌లో 170 అణు ఆయుధాలు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. అణు ఆయుధాల మొహరించడం ద్వారా ప్రపంచానికి అణుముప్పును తీవ్రం చేయడంలోనూ అమెరికానే ముందంజలో ఉంది. నాటోలోని అన్ని నాన్ న్యూక్లియర్ దేశాల్లోనూ ఆమెరికా అణు ఆయుధాలను మొహరిస్తోంది. బ్రిటన్‌లో కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తోంది. అదే సమయంలో నూతన వ్యూహత్మక న్యూక్లియర్ ఆర్మ్‌డ్ సీ లాంచ్‌డ్ క్రుసైల్ మిసైల్ (ఎస్‌ఎల్‌సిఎం-ఎన్) అమెరికా తాజాగా రూపొందిస్తోంది. . దీనిని పసిఫిక్ రీజియన్‌లో ఆదేశం వినియోగించనుంది. అదే జరిగితే 1991 తరువాత పసిఫిక్ ప్రాంతంలో ఇది మొదటి అణు మొహరింపు అవుతుంది. అమెరికా చేపడుతున్న ఈ చర్యలు రష్యాపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఫలితంగా కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బాన్ ట్రీటీ (సిటిబిటి) నుడి బయటకు వస్తున్టన్లు రష్యా ప్రకటించింది. ఈ ప్రకటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తంకావడంతో నూతన వ్యూహాత్మక ఆయుధాల కుదింపు ఒప్పందం ( ది న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ – న్యూ స్టార్ట్)కు కట్టుబడి ఉంటామని రష్యా తెలిపింది. అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలు ప్రపంచవ్యాప్తంగా అణు ఉద్రిక్తతలు పెంచడానికి కారణమౌతోందన్న ఆందోళనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అణు ఆయుధాలను తయారు చేయడం, మొహరించడాన్ని తక్షణం మానుకోవాలని, అమెరికా-రష్యా దేశాలు ‘న్యూ స్టార్ట్’ కు కట్టుబడి ఉండాలన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అణుఆయుధాల నిషేధ ఒప్పందం (టిపిఎన్‌డబ్ల్యు)ను 2017లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2021 నుండి అ ఒప్పందం అమలులో ఉంది. అయితే, అణ్వాయుధ దేశాల ఆచరణ మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఎప్పటికప్పుడు ఈ దేశాలు, ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఈ ఒప్పందానికి ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ తూట్లు పొడుస్తూనే ఉన్నాయి. అణ్వాయుధ రహిత ప్రపంచపు స్వప్నం నెరవేరాలన్నా, దేశాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోయి శాంతి నెలకొల్పాలన్న ఆ దేశాల వైఖరి మారాలి. ప్రపంచవ్యాప్త్తంగా ఉన్న ప్రజాస్వామ్య శక్తులు ఆ దేశాలపై ఒత్తిడి తీసుకురావడమే దీనికి మార్గం.
– పొగడ దొరువు