కేంద్ర ప్రభుత్వం యు.పి.ఎస్ పథకం గురించిన వివరాలను కొద్దికొద్దిగా బయట పెడుతోంది. మొత్తం పథకం వివరాలు ప్రకటించినప్పుడు మాత్రమే అందులోని కుట్రను బహిర్గతం చేయగలం.యు.పి.ఎస్ పథకం 31.3.2025 తేదీన, ఆ తరువాత పదవీ విరమణ చేసే ఉద్యోగులకు వర్తిస్తుంది. 1.4.2025 నుండీ అమలు చేస్తారు. ఎన్.పి.ఎస్ పథకంలో సిబ్బంది వేతనం నుండీ 10 శాతం రికవరీ చేస్తారు. పెన్షన్ ఫండ్‌కు ప్రభుత్వం 14 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తం పెన్షన్ ఫండ్ షేర్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. అందులో వచ్చే లాభాలు కూడా పెన్షన్ ఫండ్‌కు జమ చేస్తారు. పదవీ విరమణ చేసే సమయంలో ఈ ఫండ్ నుండి ఉద్యోగి 60 శాతం తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి అందులో వచ్చే లాభాల్లో నుంచి పెన్షన్ ఇస్తారు. పెన్షనర్, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన తరువాత 40 శాతం పైకం వారసులకు చెల్లిస్తారు.
యు.పి.ఎస్ పథకంలో వేతనం నుండి 10 శాతం రికవరీ కొనసాగుతుంది. ప్రభుత్వం 18.5 శాతం చెల్లిస్తుంది. అంటే మొత్తం 28.5 శాతం పైకం పెన్షన్ ఫండ్‌కు జమ చేయాలి కదా. కానీ 10 ప్లస్ 10, 20 శాతం మాత్రమే ఫండ్‌కు జమ చేస్తారట. మిగిలిన 8.5 శాతంతో ప్రభుత్వం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేస్తుందట. మార్కెట్ పెట్టుబడుల్లో లాభాలు తగ్గితే అందులోంచి బదిలీ చేస్తారట. ఉద్యోగి పెన్షన్ ఫండ్ అకౌంట్‌లో ఉన్న మొత్తం పైకం ప్రభుత్వం తీసుకుని, పెన్షనర్‌కు గ్యారెంటీ పెన్షన్, అనంతరం జీవిత భాగస్వామికి గ్యారంటీ ఫ్యామిలీ పెన్షన్ అమలు చేస్తారట. ఇరువురి మరణం తరువాత మిగిలిన 40 శాతం వారసులకు ఇవ్వరట. ప్రభుత్వ ఖాతా లోకి వెళ్లిపోతుంది. ఉద్యోగికి 25 సంవత్సరాల సర్వీస్ వుంటే అతని పెన్షన్ ఫండ్‌లో వుండే మొత్తం సొమ్ము ప్రభుత్వం తీసుకోవడానికి అతడు అంగీకరిస్తే, అతడి పదవీ విరమణకు ముందు చివరి 12 నెలల సరాసరి బేసిక్ వేతనంలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్ ఇస్తారు. ఓ.పి.ఎస్ పథకంలో 10 సంవత్సరాల సర్వీస్ వుంటే చాలు. సర్వీస్ చివరి నెల మూల వేతనంలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్ అమలులో వుంది.
ఎన్.పి.ఎస్ పథకంలో రికవరీ చేసే 24 శాతంలో 60 శాతం పదవీ విరమణ సమయంలో తీసుకునే వెసులుబాటు ఉంది కదా. యు.పి.ఎస్ పథకంలో 20 శాతంలో మాత్రమే 60 శాతం పొందే వీలు వుంటుంది. అంటే ఫండ్ నుండి 60 శాతం తీసేసుకుంటే 40 శాతం మాత్రమే పెన్షన్ లభిస్తుంది. ఎన్.పి.ఎస్ పథకంలో 50 శాతం పెన్షన్ వుండదు. గ్యారెంటీ లేదు.
పాతిక సంవత్సరాల సర్వీస్ వుంటే 50 శాతం పెన్షన్ లభిస్తుంది. ఇరవై సంవత్సరాల సర్వీస్ వుంటే ఆ మేరకు పెన్షన్ తగ్గిస్తారు. అంటే 40 శాతం మాత్రమే పెన్షన్ వుంటుంది. పది సంవత్సరాల సర్వీస్ వుంటే మూల వేతనంలో 20 శాతం మాత్రమే పెన్షన్ వస్తుంది. కనీస పెన్షన్ 10 వేలు వుంటుంది. ఓ.పి.ఎస్ పథకంలో కనీస పెన్షన్ రూ.9000.
కుటుంబ పెన్షన్
యు.పి.ఎస్, ఎన్.పి.ఎస్ పథకంలో ఫ్యామిలీ పెన్షన్ జీవిత భాగస్వామి వరకే పరిమితం. పెన్షన్ పైకంలో 60 శాతం పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ కింద చెల్లిస్తారు. పెన్షన్ రూ.50,000 అయితే ఫ్యామిలీ పెన్షన్ రూ.50,000లో 60 శాతం రూ.30,000. పెన్షన్ రూ.10,000 అయితే కుటుంబ పెన్షన్ రూ.60 శాతం అంటే రూ.6000. కనీస పెన్షన్ రూ.10,000 కుటుంబ పెన్షన్‌కు వర్తించదు.
ఓ.పి.ఎస్ పథకంలో పెన్షనర్ మరణిస్తే పదవీ విరమణ చేసిన 7 సంవత్సరాలు లేక ఉద్యోగికి 67 సంవత్సరాలు వచ్చే వరకు, ఏది ముందయితే ఆ తేదీ వరకు, చివరి నెల వేతనంలో 50 శాతం పెన్షన్ చెల్లిస్తారు. ఆ తరువాత 30 శాతం కుటుంబ పెన్షన్ చెల్లించాలి.
కనీస కుటుంబ పెన్షన్ రూ.9000. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం లెక్కలు తీసుకుంటే 1.4.2025 నాటికి 57 శాతం కరువు భత్యం కలుపుకుంటే రూ.14,130 ఇవ్వవలసి వుంటుంది. పెన్షనర్, జీవిత భాగస్వామి కూడా మరణించిన పక్షంలో వారిపై ఆధారపడిన వితంతువు కుమార్తె, విడాకులు పొందిన కుమార్తె, వికలాంగుడైన కుమారుడు, వీరిలో ఒకరికి జీవితాంతం, కుమార్తె పునర్వివాహం వరకు కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు. యు.పి.ఎస్, ఎన్.పి.ఎస్ పథకాల్లో ఈ ప్రస్తావనే లేదు. భార్య, భర్తకే పరిమితం.
కరువు భత్యం
ఓ.పి.ఎస్ పథకంలో వుంది. ఎన్.పి.ఎస్ లో లేదు. యు.పి.ఎస్ పథకంలో చేర్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2016 నుండి ప్రస్తుత కరువు భత్యం లెక్కిస్తున్నారు. 1.4.2025 నాటికి 57 శాతం కరువు భత్యం పెన్షన్‌తో కలిపి ఇస్తారా అన్నది పెద్ద సందేహం. 1.4.2025 నాటికి డి.ఎ లెక్కలు తీయడానికి మరో కొత్త ప్రాతిపదిక తయారు చేసి జీరో నుండి డి.ఎ లెక్కలు ప్రారంభించే అపాయం పొంచి వుంది. లేకుంటే కనీస పెన్షన్ 9000 నుండి యు.పి.ఎస్ లో రూ.10,000 చేసే ప్రతిపాదన ఎలా వచ్చినట్టు? సోమనాథన్ కమిటీ కనికట్టు కాదు కదా! ఇదే జరిగితే 1.4.2025 నుండి అమలయ్యే యు.పి.ఎస్ పథకంలో కరువు భత్యం గురించిన ప్రస్తావన వుండకపోవచ్చు. పెన్షన్ మాత్రమే చెల్లించవచ్చు. మనం ఎదురు చూస్తున్న 57 శాతం కరువు భత్యం ఎండమావి అవుతుందా? కుటుంబ పెన్షన్ రూ.6000 మాత్రమే ఇస్తారా? అందుకనే యు.పి.ఎస్ వద్దు, ఎన్.పి.ఎస్ వద్దు. ఓ.పి.ఎస్ మాత్రమే కావాలి అంటున్నాం.
గ్రాట్యుటీ…
ఐదు సంవత్సరాల సర్వీస్ వున్న ప్రతి ఉద్యోగికి, ప్రతి ఏడాది సర్వీస్‌కు అర్ధ నెల మూల వేతనం, కరువు భత్యం కలిపి గ్రాట్యుటీ కింద ఇస్తారు. అత్యధికంగా 16.5 నెలల వేతనం ఇలా గ్రాట్యుటీ కింద ఇస్తారు. ఓ.పి.ఎస్ లో వున్న ఈ పథకం యు.పి.ఎస్ లో లేదు.
కముటేషన్
ఓ.పి.ఎస్ పథకంలో నెలసరి పెన్షన్‌లో 40 శాతం చొప్పున 12 సంవత్సరాలకు లెక్కించి మొత్తం పైకం పెన్షనర్‌కు పదవీ విరమణ చేసే సమయంలో ముందస్తుగా చెల్లిస్తారు. 15 సంవత్సరాల తరువాత ఆ 40 శాతం తిరిగి పెన్షన్లో కలిపి ఇస్తారు. ఈ 15 సంవత్సరాలకు కూడా మొత్తం పెన్షన్‌కు కరువు భత్యం వుంటుంది. అంటే ముందుగా తీసుకున్న 40 శాతానికి కూడా. ఈ సదుపాయం ఎన్.పి.ఎస్, యు.పి.ఎస్ పథకాల్లో లేదు.
అదనపు పెన్షన్
ఓ.పి.ఎస్ పథకంలో వయస్సును బట్టి అదనపు పెన్షన్ అందుతుంది. వయస్సు 80 దాటితే 20 శాతం అదనపు పెన్షన్ 85 దాటితే 30 శాతం, 90 దాటితే 40 శాతం, 95 దాటితే 50 శాతం, 100 దాటితే 100 శాతం అదనపు పెన్షన్ అమలులో వుంది. ఈ అదనపు పెన్షన్‌కు కరువు భత్యం వుంటుంది. ఎన్.పి.ఎస్, యు.పి.ఎస్ పథకాల్లో ఈ సదుపాయం లేదు.
పే కమిషన్
ఓ.పి.ఎస్ పథకంలో ప్రతి పే కమిషన్ సిఫార్సులు అమలు చేసే సమయంలో పెన్షన్, కనీస పెన్షన్ పెరుగుతుంది. యు.పి.ఎస్, ఎన్.పి.ఎస్ పథకంలో ఈ గ్యారెంటీ లేదు.ఎన్.పి.ఎస్, యు.పి.ఎస్ పథకాల్లో మన పెన్షన్ ఫండ్ పైకం షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పతనమైనా కనీస గ్యారెంటీ పెన్షన్ వుంటుందన్న ఊరట మాత్రమే యు.పి.ఎస్ లో వుంది. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించిన సదుపాయాలను యు.పి.ఎస్ పథకం అమలైతే మనం కోల్పోవడం తథ్యం. ఓ.పి.ఎస్ మాత్రమే న్యాయమైనది. ఇది ఉద్యోగుల అవసరాలు తీర్చగలిగింది. కరువు భత్యంతో లింక్ చేయబడింది. కుటుంబ పెన్షన్ వుంటుంది. వారసులకు సైతం వర్తిస్తుంది. కనీస పెన్షన్ గ్యారెంటీ కూడా వుంది. కమ్యుటేషన్ సౌకర్యం వుంది. వయసుతో పాటు పెన్షన్ పెరుగుతుంది. ముదిమి వయసులో ఆర్థిక ఆలంబన కల్పిస్తుంది. ప్రస్తుతం 99 లక్షల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై యు.పి.ఎస్ పడగ నీడ పడే ప్రమాదముంది.
షేర్ మార్కెట్ పెట్టుబడులు
ఈ 99 లక్షల మంది ఉద్యోగుల పెన్షన్ సొమ్ము రూ.10.50 లక్షల కోట్లు షేర్ మార్కెట్‌లో పెట్టుబడులుగా మారనున్నాయి. ఈ పెట్టుబడులు కార్పొరేట్ పెట్టుబడిదారులకు వరం, అవసరం. వారి సంపద పెంపు కోసం ఉద్యోగుల పొదుపు పైకం తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెన్షన్ గ్యారెంటీ అన్నది ఉద్యోగులను నమ్మించి నట్టేట ముంచే యత్నం. కార్మికుల పైకం మొత్తం తీసేసుకుని, పెన్షన్ ఇస్తారట. ఈ అమౌంట్ బ్యాంక్‌లో పెడితే వడ్డీ ఇస్తారుగా. ఈ నేపథ్యంలో ఓ.పి.ఎస్ పథకం పరిరక్షణ కోసం దేశ వ్యాప్త ఉద్యమం అవసరం. పంజాబ్, హర్యానా ఉద్యోగులు రంగంలోకి ఇప్పటికే వచ్చేశారు. కొన్ని రాష్ట్రాలు ఓ.పి.ఎస్ పథకం కొనసాగిస్తామని ప్రకటించాయి. తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో త్వరలో ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. పోరాడితే సాధించలేనిది ఏదీ లేదు. యు.పి.ఎస్ వరకు వచ్చిన ప్రభుత్వాన్ని ఓ.పి.ఎస్ వరకు తీసుకు వెళ్ళడం అసాధ్యమేమీ కాదు. సంఘటిత శక్తి ముందు తల వంచాల్సిందే.
ఆర్థిక లోటు
ప్రభుత్వం ఓ.పి.ఎస్ ను అమలు చేయలేని పరిస్థితిలో వుందని కొందరు కుహనా మేధావులు వాదిస్తున్నారు. ఆర్థిక లోటు 3 శాతం మించకూడదని నిర్ణయించినప్పుడు 5.9 శాతానికి పెంచింది ఎందుకు? ఎలా? కేంద్రం కార్పొరేట్ పన్నులు 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించింది. కొత్త పెట్టుబడిదారులకు 15 శాతానికి తగ్గించింది. ఏడాదికి 1.50 లక్షల కోట్లు ఆదాయం కోల్పోయింది. కార్పొరేట్ బకాయిలు రూ.17 లక్షల కోట్లు మాఫీ చేసింది. కార్పొరేట్ పెట్టుబడి దారులకు ఇన్సెంటివ్ రూపేణా రూ.2 లక్షల కోట్లు ఇచ్చింది. డబ్బు లేదు అనేది సమస్య కాదు. ఇది వర్గ సమస్య. కార్మికుల సొమ్ములు దోచి పెట్టుబడ ిదారులను సంతృప్తి పరచడం. మన హక్కుల కొనసాగింపు కోసం ఉద్యమం నిర్మించాల్సిన అవస రం ఆసన్నమైంది. ఉద్యమిస్తే విజయం మనదే.
వ్యాసకర్త దక్షిణ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకుడు ఆర్. ఇలాంగోవన్