ఎన్నికల బాండ్ల వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు బిజెపి జాతీయ, కర్ణాటక రాష్ట్ర సీనియర్ నేతలపై బెంగళూరులో శనివారం నమోదైన కేసు బిజెపి వ్యవస్థీకృత అవినీతికి మచ్చుతునక. నిర్మలమ్మ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.)తో పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపికి నిధులు సమకూర్చారన్నది అభియోగం. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసు నమోదు వెనుక జనధికార సంఘర్ష పరిషత్‌కు చెందిన ఆదర్శ్ ఆర్ అయ్యర్ మడమ తిప్పని పోరాటం చెప్పుకోతగ్గది. ఈ ఏడాది మార్చి 30న తిలక్‌నగర్ పోలీసులను ఆయన ఆశ్రయించగా పట్టించుకోలేదు. బెంగళూరు సౌత్ డిసిపి దగ్గరకెళ్లినా ఫలితం లేదు. దాంతో ఎంపిలు, ఎంఎల్‌ఎలపై క్రిమినల్ కేసుల కోసం కర్ణాటకలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో ఏప్రిల్‌లో ఫిర్యాదు చేయగా విచారణ జరిపి ఎఫ్‌ఐఆర్ నమోదుకు కోర్టు శుక్రవారం ఆదేశించిచడంతో అదే తిలక్‌నగర్ పోలీసులు శనివారం కేసు నమోదు చేయాల్సి వచ్చింది. కేసులో మొదటి నిందితులు (ఎ1) నిర్మలా సీతారామన్ కాగా ఎ2 ఇ.డి., ఎ3 బిజెపి కేంద్ర పదాధికారులు, ఎ4 బిజెపి కర్ణాటక రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, ఎ5 ప్రస్తుత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర, ఎ6 రాష్ట్ర బిజెపి పదాధికారులు. నిందితుల జాబితాలో కేంద్ర మంత్రి జెపి నడ్డా పేరు కూడా ఉందని బయటికొచ్చింది.
కేంద్రంలో బిజెపి పాలనలోకొచ్చాక కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయాలకు ఎంతగా బరితెగించి వాడుకుంటున్నారో చూస్తున్నాం. సిబిఐ, ఇడి వంటి వాటిని ప్రయోగించి ప్రత్యర్ధి పార్టీల కీలక నాయకులను భయపెట్టి లొంగదీసుకునేందుకు ప్రయత్నించడం, దారికి రాని వారిపై కక్ష కట్టి మరీ వేధించడం, అక్రమ కేసులకు, అరెస్టులకు పాల్పడటం మోడీ ప్రభుత్వానికి నిత్యకృత్యమైపోయింది. అలాంటి నీతిబాహ్యమైన చర్యలతో పార్టీ నిధులనూ పోగేసుకుంటున్నారని తాజాగా బెంగళూరు కేసుతో ధ్రువపడింది. పారిశ్రామికవేత్తలపైనా, కార్పొరేట్ కంపెనీల అధిపతులపైనా, సిఇఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై ఇ.డి.తో దాడులు చేయించి, ఆస్తులు స్వాధీనం చేసుకొని, వివిధ పద్ధతుల్లో బెదిరించి, పార్టీ పేరిట ఎలక్టోరల్ బాండ్లను కొనిపించి రూ.8 వేల కోట్లకుపైన లూటీ చేశారన్న ఫిర్యాదుదారుని అభియోగాలను చూస్తే బిజెపి నైజమేంటో బోధ పడుతుంది. ఈ దోపిడీకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇ.డి.ని సాధనంగా ఉపయోగించారు. ఇది అధికార దుర్వినియోగం, క్విడ్‌ప్రోకో, రాజకీయ అవినీతి కాక ఇంకేమిటి?
బిజెపి ప్రభుత్వం 2017లో ఎలక్టోరల్ బాండ్స్ స్కీం తెచ్చినప్పుడే విపక్షాలు సందేహించాయి. సిపిఎం, మరికొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, సమాచార హక్కు చట్ట ఉల్లంఘనేనని, క్విడ్‌ప్రోకోకు దారి తీస్తుందని సుప్రీం కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఆ స్కీంను రద్దు పర్చింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ప్రజలకు బహిర్గతం చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు వివరాలు బయట పెట్టకుండా ఉండేందుకు ఎస్‌బిఐని, ఇ.సిని మోడీ సర్కారు ఎంతగా ప్రభావితం చేసిందో యావత్ దేశం గమనించింది. బెంగళూరు కేసుతో ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు, ప్రతిపక్షాలు వ్యక్తపర్చిన భయాందోళనలు వాస్తవమేనని రూఢ అయింది. ఎస్‌బిఐ, ఇసి వివరాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాల ద్వారా రూ.16 వేల కోట్ల విరాళాలు పార్టీలకు అందితే వాటిలో సింహభాగం బిజెపి గల్లాలో పడ్డాయి. దీన్నిబట్టే ఎలక్టోరల్ బాండ్లు ఎవరికి ఉపయోగపడ్డాయో అర్ధమవుతుంది. పార్టీ నిధుల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం స్వతంత్ర భారత దేశంలో మోడీ ప్రభుత్వంలోనే చోటు చేసుకుంది. తమది నిఖార్సయిన అవినీతి రహిత సచ్ఛీల పార్టీ, ప్రభుత్వం అని డబ్బా కొట్టుకొనే బిజెపి నేతలకు, మోడీకి బెంగళూరు కేసు తిరుగులేని సవాల్. ఎఫ్‌ఐఆర్‌తోనే అంతా అయిపోలేదు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికితీసి అసలైన దోషులకు శిక్ష పడితేనే ప్రజాస్వామ్యానికి మనుగడ.