కమ్యూనిస్టు వ్యతిరేకతకు కాలం చెల్లింది

ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాపితంగా ‘రెడ్‌ బుక్స్‌ డే’ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ వామపక్ష ప్రచురణాలయ సంస్థలు దీన్ని నిర్వహిస్తున్నాయి. 1848 ఫిబ్రవరి 21న మొదటిసారి ”కమ్యూనిస్టు ప్రణాళిక” విడుదలైన సందర్భంగా 2020 నుండి ప్రతి సంవత్సరం రెడ్‌ బుక్స్‌ డే నిర్వహిస్తున్నారు. మొదటి ఏడాది అనేకచోట్ల ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను బహిరంగంగా చదివారు. అధ్యయనం చేశారు. 2023 నుండి సిపిఐ(యం) శ్రేణులు కూడా ఇందులో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ప్రతి సంవత్సరం ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకొని ఈ సందర్భంగా ప్రాచుర్యం కల్పించడం, అధ్యయనం చేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం లెనిన్‌ రచించిన ”రాజ్యం-విప్లవం” అనే పుస్తకాన్ని రాష్ట్రంలో ఎంచుకున్నాము. 2024-25 లెనిన్‌ శత వర్థంతి ప్రపంచమంతా జరుపుతున్నారు. అందుకే ఈసారి లెనిన్‌ పుస్తకాన్ని ఎంపిక చేసుకున్నాము.

కమ్యూనిస్టు సాహిత్యానికి ప్రపంచవ్యాపితంగా తిరిగి ప్రాచుర్యం పెరుగుతోంది. కమ్యూనిజానికి కాలం చెల్లిందని దాదాపు గత మూడు దశాబ్దాలుగా పెట్టుబడిదారీ మేధావులు, మీడియా ఊదరగొట్టింది. యువతరాన్ని (మిలీనియల్స్‌) అంటే 2000 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు నిండినవారు ఇప్పటికి వారి వయస్సు 40-45 మధ్య ఉండే తరం దాదాపు కమ్యూనిజానికి, కమ్యూనిస్టు ఉద్యమాలకు దూరమైంది. కెరీర్‌పై వారి దృష్టిని కేంద్రీకరించారు. స్వీయ సమర్థతపై ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని, సంఘాలు, ఉద్యమాలు అవసరం లేదని, ఇజాలకు కాలం చెల్లిందని, టూరిజమ్‌ మిగిలిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు లాంటి వారు ఇంకా పట్టుకొని వేళ్లాడుతున్నారు. ఈ మధ్య ఢిల్లీ పర్యటనలో ఇదే బాణీలో మాట్లాడి మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ఆశీర్వాదం కోసం తాపత్రయ పడ్డారు. ప్రపంచమంతా మారుతోంది. కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న సిద్ధాంతానికి కాలం చెల్లిందని వారూ గుర్తించారు. తాజా ట్రంప్‌ ప్రకటనలే అందుకు నిదర్శనం.
సోవియట్‌ యూనియన్‌ కూలిపోయాక కమ్యూనిజం పాతాళానికి తొక్కబడిందని, అది ఇక తిరిగి లేవదని అమెరికా గర్వంగా ప్రకటించింది. ప్రపంచీకరణను మన లాంటి దేశాలపై రుద్దింది. మన తలుపులు బార్లా తెరిపించి పెట్టుబడులతో వచ్చి మన ప్రభుత్వ రంగాన్ని, ప్రకృతి వనరుల్ని, మన సంపదను దోచుకున్నారు. సంపద ఎక్కువై సంక్షోభంలో పడ్డారు. తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెట్టుబడిదారీ వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయి. 176 సంవత్సరాల క్రితం కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా మార్క్స్‌, ఎంగెల్స్‌లు అదే చెప్పారు. శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెంచే ఉత్పిత్తిని కొనే శక్తి ప్రజలకు సన్నగిల్లుతుందన్నారు. నేడదే జరుగుతోంది. తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, ఆర్థిక వ్యవస్థ మందగించిందని వాపోయారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజలు అదనపు భారాలు భరించే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఎట్టకేలకు వాస్తవాన్ని గుర్తించాల్సి వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ సంక్షోభం నుండి బయట పడాలంటే ప్రజల ఆదాయాలు పెంచాలని, కొనుగోలు శక్తిని పెంచి మార్కెట్‌లో డిమాండ్‌ సృష్టించాలని ప్రముఖ దినపత్రికలు ఎకనమిక్‌ టైమ్స్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, హిందూ, బిజినెస్‌లైన్‌, బిబిసి, బిజినెస్‌ స్టాండర్డ్‌ సంపాదకీయాలు, వ్యాసాలు ప్రచురించాయి. ఈ వాస్తవాన్ని మార్క్స్‌-ఎంగెల్స్‌ల సిద్ధాంతాలను మరింత బలంగా ధృవీకరిస్తున్నాయి. మార్కెట్‌ కుదించుకుపోవడంతో కాదేదీ మార్కెట్‌కు అనర్హమంటూ పెట్టుబడిదారులు దేవాలయ వ్యవస్థను కూడా వ్యాపారీకరించాలని ఇటీవల తిరుపతి ఐటిసి ఎక్స్‌పో పేరుతో అంతర్జాతీయ దేవాలయాల నిర్వహణ సదస్సును పెట్టారు. దేవాలయాల ద్వారా రూ.6.5 లక్షల కోట్లు టర్నోవర్‌ జరుగుతోందని లెక్కలు చెప్పారు. దేవాలయ భూముల్ని కౌలుకు చేసుకుంటున్న పేద కౌలుదార్లను వెళ్లగొట్టి కార్పొరేట్‌ కంపెనీలకు వాటిని అప్పగించి దేవాలయాల ఆదాయాలను పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నుండి గట్టెక్కడానికి దేవుళ్ళను, గుడులను, భక్తిని కూడా వ్యాపారంగా మార్చి వాడుకుంటున్నారని మరోసారి రుజువైంది. అందుకే మార్క్సిజం ఇప్పటికీ సజీవమైంది. అందుకే మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌, స్టాలిన్‌, మావో, హోచిమిన్‌, కాస్ట్రో, గ్రాంస్కీ, డిమిట్రోవ్‌ తదితర అంతర్జాతీయ విప్లవకారుల రచనలను, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, సుందరయ్య, భగత్‌ సింగ్‌ లాంటి యోధులు రాసిన పుస్తకాలను ఈ తరం అధ్యయనం చేస్తే వర్తమాన సమస్యలను శాస్త్రీయంగా అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటి వరకు సాగిన విద్యా విధానం విద్యార్థులకు సామాజిక స్పృహ నుండి దూరం చేసింది. రాజకీయాలు వద్దంటూ తమకు సేవ చేసే ఉద్యోగులుగా మార్చుకుంది. పెట్టుబడుల అంతర్జాతీయీకరణతో వచ్చిన నూతన అవకాశాలతో కొన్ని రంగాలలో ఉద్యోగాలు పెరిగాయి. ఐ.టి లాంటి పరిశ్రమలు విస్తరించాయి. ఇప్పుడు వాటి ప్రగతికి బ్రేక్‌ పడింది. వేతనాలు, సౌకర్యాలు తగ్గిపోతున్నాయి. ”అమెరికా ఫస్ట్‌” అంటూ ట్రంప్‌ భారతీయ విద్యార్థులను, ఉద్యోగులను చట్ట వ్యతిరేకులంటూ అవమానకరంగా సంకెళ్ళు వేసి వెనక్కి పంపిస్తున్నది. భారత మాత గురించి ఆకాశానికి ఎగిరి నినాదమిచ్చే మోడీ మౌనంగా అవమానాన్ని దిగమింగి భారతీయ ఆత్మ గౌరవాన్ని ట్రంప్‌కు తాకట్టు పెట్టారు. అదానీపై కేసు లేకుండా చేసుకోడానికి దేశ ప్రతిష్టను ఫణంగా పెట్టారు. యువతరం ఆశలు సన్నగిల్లుతున్నాయి. వారికి భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి సోషలిజం వైపు ఆలోచిస్తున్నారు. దాంతో నేడు పాలకులకు భయం పట్టుకుంది.

‘ప్రపంచాన్ని కమ్యూనిజమనే భూతం ఆవహించింద’ని ‘కమ్యూనిస్టు ప్రణాళిక’లో పెట్టుబడిదారులను ఉద్దేశించి మార్క్స్‌, ఎంగెల్స్‌ చెప్పారు. నేడదే ట్రంప్‌ మాటల్లో కనిపిస్తోంది. కమ్యూనిజాన్ని పాతాళానికి తొక్కామని సంబరపడుతున్న పాలకులు…తనకు కమ్యూనిజమే ప్రథమ శతృవని ట్రంప్‌ ప్రకటించడంతో ఉలిక్కిపడుతున్నారు. పాతాళానికి తొక్కబడిన కమ్యూనిజం లేచి తిరిగి పెట్టుబడిదారులకు నిద్ర లేకుండా చేసే శక్తిగా ఎలా ఎదిగింది? శ్రీలంక, నేపాల్‌, లాటిన్‌ అమెరికాలలో ఎలా నిలదొక్కుకుంది? ఇత్యాది ప్రశ్నలు పాలకులకు ప్రశ్నలుగానే మిగిలాయి.

దేశంలో ప్రజలు ముఖ్యంగా యువతరం ఆశలను నెరవేర్చడంలో విఫలమైన మోడీ వారి ఆలోచనలను మతం వైపు మళ్ళించి రాజకీయ పబ్బం గడుపుకోడానికి కుంభమేళా సహా అనేక అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు. 2014లో యువతకు మోడీ చేసిన వాగ్దానాలు పూర్తిగా భంగమయ్యాయి. అధికారాన్ని, కార్పొరేట్‌ లాభాలను, ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికే మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు. దీన్ని ప్రశ్నించిన భక్తులు, పురోహితులపై సైతం దాడులకు దిగుతున్నారు. వారికి హిందూ మతం మీదకన్నా హిందూత్వ పేరుతో మతోన్మాద రాజకీయాలు చేయడంపైనే ఆసక్తి ఎక్కువగా ఉంది.

మన రాష్ట్రంలో సైతం మతోన్మాద ప్రమాదం పెరిగింది. గుడుల చుట్టూ రాజకీయం మొదలైంది. దానికి ఆటంకంగా వచ్చే అభ్యుదయ సాహిత్యంపై మతోన్మాదులు దాడులు చేస్తున్నారు. ఇటీవల నెల్లూరులో సింహపురి పుస్తక మహోత్సవంపై దాడి చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడున్న ప్రజలే వారిని తిప్పికొట్టారు. తిరుపతి భారతీయ విద్యాభవన్‌ నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో విశాలాంధ్రపై దాడి చేశారు. తిరుపతిలోని పుస్తక ప్రియులంతా ఐక్యమై దాన్ని ఖండించారు. ఇలా పుస్తకాలపై దాడి కొత్త కాదు. 2015 ఫిబ్రవరి 20వ తేదీన పన్సారేను హత్య చేశారు. ఆయన రాసిన ”ఎవరీ శివాజీ?” పుస్తకమే వారి ఆగ్రహానికి కారణం. అలాగే గౌరీ లంకేశ్‌ లాంటి జర్నలిస్టును హత్య చేశారు. ఇవన్నీ అభ్యుదయంపై, పుస్తకంపై చేసిన దాడులే. సమాజాన్ని మార్చాలనుకునే శక్తులకు పుస్తకమే ఆయుధం. విజ్ఞానమే సాధనం. భూమి గుండ్రంగా వుందన్నందుకు కోపర్నిస్‌ లాంటి వారిని తగలబెట్టినా, డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని తిరస్కరించినా సైన్సు ఆగలేదు. శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం మానవాభ్యున్నతికి బాటలు వేస్తున్నది. సామాజిక రంగంలో శాస్త్రమే కమ్యూనిజం. దాని లక్ష్యం సోషలిజం సాధన. దాన్ని సాధించే దిశలో ఆయుధమే మార్క్సిస్టు సాహిత్యం. దాన్ని యువతరంలోకి తీసుకుపోయి వారికి దిక్సూచిలా మార్చడానికే ఫిబ్రవరి 21న రెడ్‌ బుక్స్‌ డే నిర్వహిస్తున్నారు. ఇది ఒక్కరోజు వ్యవహారం కాదు. ఈ స్ఫూర్తితో సంవత్సరం పొడవునా, ఇంకా చెప్పాలంటే జీవితాంతం అధ్యయనం చేయడానికి రెడ్‌ బుక్స్‌ డే స్ఫూర్తినిస్తుంది.

ఏ విప్లవకారుడైనా ప్రాథమికంగా చదవాల్సిన పుస్తకం లెనిన్‌ రచించిన ”రాజ్యం-విప్లవం”. అది బూర్జువా ప్రజాస్వామ్యం పట్ల వున్న భ్రమలను అద్భుతంగా ఎండగడుతుంది. రాజ్యం వర్గ పరిపాలనా సాధనమని తేటతెల్లం చేస్తుంది. దీన్ని లోతుగా అవగాహన చేసుకోకుండా శ్రామికవర్గ నియంతృత్వాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. – మావో, పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా నిర్మాత.

రాజ్యం పాలకవర్గానికి పనిముట్టుగా ఎలా ఉపయోగపడుతుందో అర్ధం చేసుకోవడానికి లెనిన్‌ మనకు అందించిన ”రాజ్యం-విప్లవం” పుస్తకం తప్పనిసరిగా చదవాలి. – ఫైడెల్‌ కాస్ట్రో, క్యూబా విప్లవకారుడు, క్యూబా పూర్వ అధ్యక్షుడు.

పాత రాజ్యాంగ యంత్రాంగాన్ని కార్మికవర్గం ఎందుకు కూలదోయాలనే విషయం మీద ఈ పుస్తకం నాకు అద్భుతమైన అవగాహనను కలిగించింది. ఈ పుస్తకంలో లెనిన్‌ చూపించిన స్పష్టత, విప్లవకర స్ఫూర్తి…విముక్తి కోసం మనం చేసే పోరాటానికి ఒక రూపాన్ని ఇచ్చాయి. – హోచిమిన్‌, వియత్నాం విప్లవ నేత, వియత్నాం పూర్వ అధ్యక్షుడు.

లెనిన్‌ ”రాజ్యం-విప్లవం విప్లవకారులందరికీ తప్పనిసరి పాఠ్యగ్రంథం. అది కేవలం బూర్జువా రాజ్యాన్ని కూలదోయవలసిన అవసరాన్ని మాత్రమే గాక…ప్రజల పునాదిగా రూపొందే నూతన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరాన్ని కూడా వివరిస్తుంది. – చే గువేరా, మార్క్సిస్టు విప్లవకారుడు.

లెనిన్‌ రాసిన ”రాజ్యం-విప్లవం” సోషలిస్టు తాత్వికతకు ఒక గొప్ప చేర్పు. అక్టోబర్‌ విప్లవ కాలంలోనూ, తదనంతర కాలంలోనూ సోషలిజాన్ని నిర్మించడంలో కార్మికవర్గ రాజ్యవు అవసరాన్ని ఆ పుస్తకం చూపించింది. – నికితా కృశ్చేవ్‌,సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ తొలి కార్యదర్శి.

బూర్జువా వ్యవస్థల ద్వారా సోషలిజాన్ని సాధించడం సాధ్యం కాదని లెనిన్‌ ఈ పుస్తకంలో బోధించారు. అది ఆచరణకు పిలుపునిచ్చిన పుస్తకం. పీడక యంత్రాంగాలను విప్లవం తప్పనిసరిగా కూలదోయాలని ఆ పుస్తకం మనకు గుర్తుచేస్తుంది. – హ్యూగో ఛావేజ్‌, వెనిజులా పూర్వ అధ్యక్షుడు.

 వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

➡️