అనాగరికా…

అమెరికా అధ్యక్షుడి ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు అనాగరికంగా తయారవుతున్నాయి. అవి ఆ దేశాన్ని గొప్పగా మారుస్తాయో లేదో గానీ ఇతర దేశాలకు తలనొప్పిని తెస్తున్నాయి. రాజకీయ, ఆర్థిక, భౌగోళిక స్థితుల్ని తలకిందులు చేసేవిగా ఉన్నాయి. అక్రమంగా వచ్చిన వాళ్ళని ఆపడం, వెనక్కి పంపించడంలో ఎవరికీ ఆక్షేపణ, అభ్యంతరం ఉండనక్కర లేదు. కానీ వారిని గొలుసులతో బంధించి, అమానవీయంగా సైనిక విమానాల్లో తరలించడం ఒకింత అతి. తాము కఠినంగా ఉన్నాం అని చెప్పుకోడానికి ఇంత తీవ్రంగా వ్యవహరించ నక్కరలేదు. మన దేశం ఈ విషయమై అభ్యంతరం వెలిబుచ్చి, వారిని ఉన్నంతలో మర్యాదగా తీసుకురావడానికి కృషి చెయ్యాల్సింది. మానవ గౌరవం కాపాడడం కనీసపు హక్కు. నాగరిక చర్య కాబట్టి. ఇక రెండోది గాజా భూభాగాన్ని ఖాళీ చేసి అక్కడ నివాసముంటున్న పాలస్తానీయుల్ని వేరే చోటకు తరలిస్తాడట అమెరికా అధ్యక్షుడు. అలా చెయ్యడానికి అదేమైనా అమెరికా స్వంతమా? ఒక సార్వభౌమిక దేశం. ఇజ్రాయిల్‌ దాడిలో నష్టపోతూ, లక్షలాది మంది అన్యాయంగా నిరాశ్రయులైన దేశం. వీలైతే యుద్ధాన్ని ఆపి, అక్కడి ప్రజలకు స్వాంతన కలిగించాలి. అలా కాకుండా అక్కడున్న స్థానిక ప్రజలందరినీ కట్టగట్టి ఎక్కడికో పంపించేస్తాననడం దురహంకారం. ఇలాంటి చర్యల వల్ల, ఆలోచనల వల్లనే తీవ్రవాదం, ఫాసిజం లాంటివి పెరిగి ప్రపంచం నష్టపోతుంది. అన్ని దేశాలూ ముక్త కంఠంతో ఖండించాల్సిన వ్యాఖ్యలివి.

– డా.డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, విజయనగరం.

➡️