గతంలో పద్మశ్రీ అన్నా, పద్మభూషణ్ అన్నా ఎంతో విలువ ఉండేది. సమాజానికి రకరకాల సేవలు చేసిన వారికి గుర్తింపుగా ఇచ్చేవారు. రానురాను ఆ పద్మాల వన్నె తరిగిపోతున్నట్లుగా భావించాల్సి వస్తున్నది. ఇపుడు కుల సంఘ నాయకులకు, ఆవారాలకు, మతోన్మాదులకు పద్మశ్రీలు ఇవ్వటం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఓట్ల కోసం పద్మశ్రీలు ఇస్తున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. 2006 ప్రాంతంలో అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో మాడుగుల నాగఫణి శర్మ అనే వ్యక్తి అక్కడి ఆడవారిచేత తన్నులు తిన్నాడు. అక్కడి మహిళలు ఆయన మీద కేసు పెట్టారు. నాగఫణి శర్మ ఇండియాకు వచ్చి తనపై కేసు పెట్టినవారిని శపిస్తానని ప్రకటన ఇచ్చాడు. ఇపుడు ఆయనకు పద్మశ్రీ ఇచ్చారు. ఈ పద్మశ్రీ ఎవరికోసం ఇచ్చినట్లు? ప్రజాధనం ఇలా వృధా చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? కనుక ఇలాంటి వ్యక్తికి ఇచ్చిన ‘పద్మశ్రీ’ ని రద్దుపరచాలి. అంతేకాక, ఈ ప్రభుత్వం భేతాళ మాంత్రికులకు, బాబాలకు, స్వాములకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. అశాస్త్రీయమైన పుష్కరాలకు ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తున్నది. ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ముందుకు పోతున్నది. కానీ మనము మాత్రం వళ్లంతా బూడిద పూసుకొని వికృతాకారంతో కనిపించే నగ సాధువులను అవతార పురుషుల్లా కీర్తించే స్థాయికి ఎగబాకుతున్నాం. ఇందుకు మనం సిగ్గుపడాలి.
– నార్నె వెంకట సుబ్బయ్య, భారత హేతువాద సంఘం అధ్యక్షుడు.