‘పరివార్‌’ పాఠాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారంపై రాష్ట్రంలో అధికార టిడిపి, జనసేన, బిజెపి కూటమి, ప్రతిపక్ష వైసిపి తీసుకున్న వైఖరులు, పోటాపోటీ కార్యక్రమాలు, నేతల మధ్య పరస్పర దూషణలు ఆందోళనకరం. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్ర సీమలో మత భావనలు, ఉద్రిక్తతలు విస్తరించడానికి పై పార్టీలు దోహదం చేయడం లౌకిక, ప్రజాస్వామ్యవాదులను కలవరపెడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధిపతి పవన్‌ కళ్యాణ్‌ గురువారం తిరుపతిలో వారాహి డిక్లరేషన్‌ పేరిట నిర్వహించిన సభ, ఆయన చేసిన ప్రసంగం పరాకాష్ట. తాను డిప్యూటీ సిఎంనని, బాధ్యతాయుత పదవిలో, ప్రభుత్వంలో ఉన్నానన్న స్పృహ పవన్‌ కళ్యాణ్‌కు లేదా అని ఆయన ప్రసంగం ఆలకించిన వారికి అనిపిస్తుంది. బజరంగ్‌దళ్‌, విహెచ్‌పి, పరివార్‌కు వకాల్తా పుచ్చుకున్నట్లు పవన్‌ మాట్లాడారు. లడ్డూ తయారీలో కల్తీ కాస్తా సనాతన ధర్మ పరిరక్షణా ఉద్యమం వరకు పవన్‌ తీసుకెళ్లడం వెనుక బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం తప్పకుండా ఉంటుంది. లేకపోతే మత వైషమ్యాలను అంతగా రెచ్చగొట్టాల్సిన అవసరం జనసేనానికి ఏం ఉంటుందన్నది ప్రజల ధర్మ సందేహం.
టిటిడి చేసే కొనుగోళ్లలో, దర్శన టిక్కెట్ల అమ్మకాల్లో, పూజా కైంకర్యాలలో, అన్నింటిలోనూ ఎన్నో ఏళ్లుగా అవినీతి పాతుకుపోయిందన్నది వాస్తవం. సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టి బాధ్యులను శిక్షించి కోట్లాది మంది భక్తుల్లో విశ్వాసం కలిగించడం ప్రభుత్వ బాధ్యత. కూటమి ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సిఎం పవన్‌ ఆ పని చేయకుండా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, పరివారం దేశ వ్యాప్తంగా ఎత్తుకున్న ‘సనాతన ధర్మ’ సిద్ధాంతాన్ని రాష్ట్రంలోనూ వ్యాపింపజేసేందుకు కొత్త కొత్త అవతారాలెత్తడం దేనికి? ప్రభుత్వంలో ఉండి ప్రాయిశ్చిత్త దీక్ష చేపట్టి, తిరుమల కొండకు కాలినడకన వెళ్లి, దీక్ష విరమణ సందర్భంగా వారాహి సభ నిర్వహించడం బిజెపి, సంఫ్‌ు రోడ్‌మ్యాప్‌లో భాగమేననుకోవలసి వస్తుంది. తాను సనాతన హిందువునని, సనాతన ధర్మాన్ని కాపాడటానికి ప్రాణాలైనా అడ్డు పెడతాననడం రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవిలోకొచ్చిన వ్యక్తి సదరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. లౌకిక రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునే వారిని సూడో సెక్యులరిస్టులనడం, న్యాయస్థానాలకు ఉద్దేశాలు ఆపాదించడం సంఫ్‌ు, బిజెపి కార్యశాల నుంచి పవన్‌ అరువు తెచ్చుకున్న పాఠాలే. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన తమిళనాడు డిప్యూటి సిఎం ఉదయనిధి స్టాలిన్‌ను, అయోధ్య క్రతువుకు హాజరు కాబోనన్న ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై విమర్శల్లో బిజెపికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు మౌత్‌పీస్‌ అనిపించుకునేందుకు పవన్‌ పడ్డ తహతహ కనిపిస్తుంది. అన్నింటికీ మించి సనాతన ధర్మ పరిరక్షణకు దేశ వ్యాప్తంగా చట్టం తేవాలన్న పవన్‌ డిమాండ్‌ లౌకిక దేశంగా పేర్కొనే రాజ్యాంగ పీఠికకు గొడ్డలిపెట్టు. సనాతన ధర్మం అంటే మనుధర్మమని, చాతుర్వర్ణ వ్యవస్థ, కుల, లింగ వివక్ష అని పవన్‌కు తెలుసా? ఆ ధర్మమే ఆయన కోరుకుంటున్నారా?
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో నడిచిన వాదోపవాదాలు అంతిమంగా కేంద్రం పెత్తనానికి దారులు వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌నే కొనసాగించాలా లేదంటే వేరే స్వతంత్ర దర్యాప్తు అవసరమా అని కోర్టు సొలిసిటర్‌ జనరల్‌ను అడిగింది. సొలిసిటర్‌ జనరల్‌ అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. ఆయన చెప్పేది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్నే. రాష్ట్ర సర్కారు వేసిన సిట్‌పై అభ్యంతరం లేదంటూనే పిటిషన్‌దారుల కోరిక మేరకు స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు. సిబిఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ నుంచి, ఇద్దరు రాష్ట్రం నుంచి, ఒకరు ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ నుంచి సభ్యులుండాలని సుప్రీం సూచించింది. సిబిఐని పంజరంలో చిలుక అని మొన్ననే ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ బెయిల్‌ విషయంలో సుప్రీం వ్యాఖ్యానించింది. సిబిఐపై కేంద్రం ఒత్తిడి ఎంతగా ఉందో సుప్రీం వ్యాఖ్యతో బోధ పడుతుంది. లడ్డూ కల్తీపై అలాంటి సిబిఐ చేపట్టే విచారణ ఎలా ఉంటుందన్నది ప్రశ్న. సుప్రీం వేసిన సిట్‌ దర్యాప్తు పూర్తయ్యేవరకైనా రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. కనీసం దేవుడ్నైనా రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం చేసిన సూచనకు పార్టీలు విలువివ్వాలి.

➡️