జీవిత ఖైదీకి 14 సార్లు పెరోల్‌?

హత్యానేరం మీద, రేప్‌ కేసులో జీవిత శిక్ష పడిన డేరా బాబాను 14వ సారి పెరోల్‌ మీద విడుదల చేశారు. ప్రతిసారి ఏదోక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినపుడు ఈ నేరస్తుడిని బెయిల్‌ మీద రప్పించి, ఓటర్లను తనకు అనుకూలంగా మార్చుకొని, ఎన్నికలు అయిపోయిన తరువాత మరలా జైలుకి పంపడం ప్రభుత్వానికి రివాజు అయిపోయింది. హిమాచల్‌ పంచాయితీ ఎన్నికలప్పుడు కూడా ఇలాగే ఈ బాబాను బయటకు వదిలారు. అక్కడ అపుడు కాంగ్రెస్‌ గెలవాల్సింది. ఈ బేతాళ మాంత్రికుడు చేత బిజెపి వారి ప్రచారం చేయించుకున్నారు. అక్కడ బిజెపి గెలిచింది. ఈ బాబాను అరెస్ట్‌ చేసినపుడే నాలుగు రాష్ట్రాలలో భక్తులు హంగామా చెశారు. పైకి నీతివాక్యాలు పలికే బిజెపి వారు ఇలా ఎన్నికలలో దొంగ బాబాలను ఉపయోగించుకోవటం సిగ్గు చేటు. ఈ ఒక్కడే కాదు దొంగ బాబాలందరికి ప్రభుత్వం కొమ్ముకాస్తుంది. రవిశంకర్‌ అనే బాబా యమునా నదిని, అందులోని జల సంపదను, అటవీ సంపదను నాశనం చేస్తే, పర్యావరణ పరిరక్షణ సంస్థ వారు రూ.100 కోట్ల జరిమానా వేసింది. ఆయనను అరెస్టు చెయ్యలేదు. జరిమానా కట్టలేదు. అలాగె రామదేవ్‌ బాబా ఉత్పత్తులు ఎందుకూ పనికిరావని నేపాల్‌ ప్రభుత్వం నిషేధించింది. మన దేశంలో కూడా కొన్ని ఉత్పత్తులను నిషేధించారు. అయినా బాబాపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజకీయ నాయకులు జీవిత శిక్షలు పడిన, పడవలసిన బాబాల వద్దకు వెళ్లడం, వారిని పెరోల్‌ మీద విడుదల చెయ్యటం ప్రభుత్వాలకు, పాలకులకు తగని పని.

– నార్నె వెంకట సుబ్బయ్య

➡️